కృష్ణరాయా, క్షమించు

తెగులదేల యన్న దేశమ్ము తెగులు

ఏను తెగులు జనకుండ తెగులొ‌, చండ

ఎల్ల జనులు నరుక, నెరుగవే తూలనాడి

దేశభాషలందు తెగులు తుస్సు

శాస్త్రవేత్త కొలత

భౌతికశాస్త్రంలో నోబెల్ విజేత, రాయల్ అకాడెమీ అధ్యక్షుడిగా పని చేసిన సర్ ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్ ఒకసారి నిజంగా జరిగిన ఓ కథ చెప్పారు.

కొన్నాళ్ళ క్రితం నాకొక సహోద్యోగి నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఓ చిత్రమైన సమస్యలో ఇరుక్కున్నాడు. ఒక ప్రశ్నకి ఒక విద్యార్ధి రాసిన జవాబుకు ఆయన సున్నా మార్కులు ఇద్దామనుకుంటున్నాడు. అదే సమయంలో ఆ విద్యార్ధి తన జవాబుకు పూర్తి మార్కులు ఇచ్చి తీరాల్సిందేనని భావిస్తున్నాడు. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. తటస్థంగా వ్యవహరించే మూడో వ్యక్తితో ఆ ప్రశ్నకు మార్కులు ఇప్పించాలన్నదే ఆ ఒప్పందం. వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు.

ముందుగా నేను ప్రశ్నాపత్రం చూశాను. ‘‘ఒక పొడవైన భవనం ఎత్తును భారమితి సహాయంతో కొలవడం ఎలా?’’ దానికి ఆ విద్యార్థి ఇలా జవాబిచ్చాడు. ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. దానికి ఓ పొడవాటి తాడు కట్టాలి. దాన్ని రోడ్డు మీద వరకూ వదలాలి. ఆ తర్వాత తాడును పైకి లాగాలి. దాని పొడవు కొలవాలి. ఆ తాడు పొడవు భవనం పొడవుకు సమానం.’’

ఆ విద్యార్ధి జవాబులో తప్పేమీ లేదు. అతను పూర్తిగా వివరించాడు, సరైన సమాధానం ఇచ్చాడు. కాబట్టి అతనికి పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. కానీ సమస్యేంటంటే… పూర్తి మార్కులు ఇచ్చేస్తే అతనికి ఫిజిక్స్ లో మంచి గ్రేడ్ వస్తుంది, అంటే భౌతికశాస్త్రంలో అతను సమర్ధుడు అని నిర్ధారించినట్టవుతుంది. కానీ అతని జవాబు అలాంటి నిర్ధారణకు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను ఆ విద్యార్ధికి ఒక సలహా ఇచ్చాను. అదే ప్రశ్నకు మరొకసారి భౌతికశాస్త్రం ప్రకారం జవాబు ఇవ్వాలని హెచ్చరించాను. దానికి ఆరు నిమిషాల వ్యవధి ఇచ్చాను.

ఐదు నిమిషాలు గడిచిపోయాయి, కానీ అతను ఏమీ రాయలేదు. దాంతో ఈ పరీక్షను వదిలేసుకుంటున్నావా అని అతన్ని అడిగాను. దానికి అతని జవాబు నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ సమస్యకు అతని దగ్గర చాలా జవాబులు ఉన్నాయట. వాటిలో ఏది అత్యుత్తమమైన జవాబు కాగలదో ఆలోచిస్తున్నాను అని చెప్పాడా విద్యార్ధి. అతని సమయం వృధా చేసినందుకు క్షమాపణలు కోరాను. మిగిలిన ఒక్క నిమిషంలోనూ జవాబు రాయమని అతనికి చెప్పాను.

మరునిమిషంలోనే అతను తన ఆన్సర్ షీట్ ఇచ్చేశాడు. అందులో ఇలా రాసివుంది ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. భవనం పై అంచు దగ్గర వంగి నిలబడండి. భారమితిని పైనుంచి వదిలేయండి. అది కిందకు పడడానికి పడిన సమయాన్ని స్టాప్ వాచ్ తో కొలవండి.

అప్పుడు x = 0.5 X aXt^2 అనే సూత్రం ఆధారంగా భవనం ఎత్తును కొలవవచ్చు’’ అని చెప్పాడు.

ఆ సమయంలో నేను నా మిత్రుణ్ణి పిలిచాను. విద్యార్ధికి మార్కులు ఇస్తావా అని అడిగాను. సరే అంటూ అతను ఆ విద్యార్ధికి పూర్తి మార్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నేను అక్కడినుంచి వెళ్ళిపోడానికి సిద్ధపడుతున్నాను. ఆ సమయంలో అదే ప్రశ్నకు మరిన్ని జవాబులున్నాయని అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవేంటో చెప్పమని అతన్ని అడిగాను.

‘‘ఒక భవనం ఎత్తును భారమితితో కొలవాలంటే చాలా పద్ధతులున్నాయి. మచ్చుకి, ఎండగా ఉన్న ఒకానొక రోజు భవనం దగ్గరకు భారమితి తీసుకువెళ్ళాలి. భారమితి నీడ పొడవు కొలవాలి. అలాగే భవనం నీడ పొడవు కొలవాలి. ఆ రెండింటి నిష్పత్తిని బట్టి భవనం ఎత్తు కనుక్కోవచ్చు.’’

‘‘బావుంది. మరి మిగతా పద్ధతులేంటి?’’

‘‘మీకు నచ్చే అత్యంత మౌలికమైన పద్ధతి ఒకటుంది. ఆ పద్ధతిలో… మీరు భారమితిని చేతిలో పట్టుకుని మెట్లు ఎక్కండి. పైకి ఎక్కేకొద్దీ గోడ వెంబడి భారమితి పొడవు దగ్గర గుర్తులు పెట్టుకుంటూ పైదాకా వెళ్ళండి. పూర్తిగా పైదాకా ఎక్కేయండి. భారమితి గుర్తులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టండి. ఆ సంఖ్యతో భారమితి పొడవును గుణించండి. భవనం ఎత్తు ఎంతో తెలిసిపోతుంది.’’

‘‘మరీ ప్రత్యక్ష పద్ధతి.’’

‘‘నిజమే. మీకు మరింత నాజూకైన పద్ధతి కావాలంటే… భారమితిని ఒక తాడు చివర కట్టండి. దాన్ని పెండ్యులంలా ఊపండి. ఆ పద్ధతిలో భవనం మొదలు దగ్గరా, భవనం చివరా గురుత్వాకర్షణ శక్తి ‘g’ విలువ లెక్కకట్టండి. ఆ రెండు విలువల మధ్య తేడాను బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

ఈ ప్రయోగాన్నే కొద్దిగా మార్చి మరోలా చేయవచ్చు. భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. పొడవాటి తాడుకు దాన్ని తగిలించాలి. అప్పుడు దాన్ని భవనం కింద వరకూ వేలాడదీసి, పెండ్యులంలా ఊపాలి. అప్పుడు అప్పుడు ప్రెసిషన్ పిరియడ్ బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

‘‘చెప్పాలంటే ఇలా చాలా పద్ధతులున్నాయి.’’ అన్నాడా యువకుడు. ‘‘బహుశా, వాటన్నిటిలో ఉత్తమమైనది ఇలా ఉండవచ్చు. భారమితిని తీసుకుని భవనం బేస్మెంట్ లో ఉన్న సూపరింటెండెంట్ ఇంటికి నేరుగా వెళ్ళాలి. ఆయన తలుపు తీశాక ‘సూపరింటెండెంట్ గారూ, నా దగ్గరో మంచి విలువైన భారమితి ఉంది. ఈ భవనం ఎత్తు ఎంతో చెప్పారంటే దీన్ని మీకు ఇచ్చేస్తాను’ అని ఆయనకు చెప్పవచ్చు.’’

ఆ దశకు వచ్చేసరికి అసలు ఆ అబ్బాయికి ఆ ప్రశ్నకు సాధారణ సంప్రదాయిక పద్ధతిలో జవాబు తెలుసా అని అడిగాను. తనకు తెలుసని చెప్పాడా అబ్బాయి. అయితే హైస్కూల్ లోనూ, కాలేజీ లోనూ ఉపాధ్యాయులు అతనికి ఆలోచించడం పదేపదే చెబుతూనే ఉండడం తనను పూర్తిగా విసిగించేసిందని చెప్పాడతను.

ఆ విద్యార్ధి పేరు ‘‘నీల్స్ బోర్’’. అతను 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కార విజేత.

జాత్యహంకారి దొరికాడు… కుమ్మేద్దాం పదండి

వెయ్యి మంచిపనులు చేసి ఉండవచ్చు గాక… ఒక్క హత్య చేస్తే చాలు… అంతా పోయినట్టే..!
తరుణ్‌ విజయ్‌ జాత్యహంకారి అంటూ జరుగుతున్న రచ్చలో కనబడిన ఓ వ్యాఖ్య అది.

నిజానికి ఈ వ్యవహారంలో ఒక సామెత వాడవచ్చునా లేదా అని ఆలోచిస్తున్నాను. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయింది’ అన్న సామెత అది. పోలికలో తేడా గురించి కాదు, ఆ సామెతను వాడితే అది అపసవ్యమైన ఇంటర్‌ప్రిటేషన్స్‌కు దారి తీస్తుందన్నది భయం. సరే, ఇప్పుడు ఆ మొదటి వ్యాఖ్యను తీసుకోవచ్చు.

తరుణ్‌ విజయ్ జాత్యహంకారి, మనువాది, ఆరెస్సెస్‌ ఫాసిస్టు, బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసేస్తున్న వారిలో అందరూ మాటల శూరులే అని అర్ధమవుతోంది కానీ చేతల వీరులు ఎవరైనా ఉన్నారా అంటే అనుమానమే.

తరుణ్‌ విజయ్ వ్యాఖ్యలు సరైనవి అని సమర్ధించబోవడం లేదు. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు సందర్భం ఏంటి, అతనేం మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. ఆ మాటలు స్లిప్ ఆఫ్‌ టంగా, లేక అతనికి మాలాఫైడ్ ఇంటెన్షన్‌ ఉందా, అసలు అతని ట్రాక్‌ రికార్డ్ ఏంటి… అన్నవి చూడాలి కదా.

భారతదేశంలోని ఆఫ్రికా ఖండవాసులు అందరిపైనా దాడులు జరుగుతున్నాయి… అవన్నీ జాత్యహంకార దాడులే… అన్న పాయింట్‌ మీద అల్‌జజీరా ఛానెల్ చర్చాగోష్టి నిర్వహించింది. ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌, కొందరు ఆఫ్రికన్‌ విద్యార్థులతో పాటు బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ (ఇండియా ఆఫ్రికా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ ఛైర్మన్) పాల్గొన్నాడు. ఆఫ్రికన్లపై జరిగే అన్ని దాడులనూ రేసిస్టు దాడులుగా పరిగణించడం సరికాదని ఆయన చెప్పాడు. భారతీయులు దేవుడిగా కొలిచే కృష్ణుడి పేరుకు అర్ధమే నల్లనయ్య అయినప్పుడు రంగు ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం సరికాదన్నాడు. ఐతే… భారతదేశం మొత్తం రేసిస్టుల మయం అన్న సాధారణీకరించేసిన ఇతర ప్యానెలిస్టులతో మాట్లాడే సందర్భంలో నోరు జారాడు. భారతీయులు జాత్యహంకారులైతే దక్షిణాది రాష్ట్రాలతో ఎలా కలిసుంటారని వ్యాఖ్యానించాడు. అక్కడే తరుణ్‌ విజయ్‌ అడుసులో కాలేశాడు. తర్వాత ట్విట్టర్‌ ద్వారా తను సరిగ్గా మాట్లాడలేదని ఒప్పుకున్నారు. తన భావానికీ పదప్రయోగానికీ పొంతన లేకుండా పోయిందంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకేం, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతిపక్షాల వారందరూ తరుణ్‌ను ఏకిపారేశారు. సోషల్‌ మీడియా ట్రాలింగూ పెరిగిపోయింది.

ఇంతకీ దక్షిణాది అంటే తరుణ్‌విజయ్‌కి నిజంగా చిన్నచూపేనా? అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కొన్ని ఘటనలు చూద్దాం…

— తమిళనాడు హైకోర్టులో తమిళాన్ని వాడుకభాష చేయాలంటూ ఉద్యమించాడు.

— తమిళం, తిరుక్కురళ్‌ లేకుండా భారతదేశమే లేదని వ్యాఖ్యానించాడు.
TV 2

— తిరువళ్ళువర్‌ జీవిత చరిత్రను విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశాడు.

— తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తిరువళ్ళువర్‌ విగ్రహం కట్టించాడు.

TV 1

— అగ్ర, నిమ్న వర్ణాల సమన్వయం కోసం కృషి చేశాడు, ఆ క్రమంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు.

— దళితులకు ఆలయ ప్రవేశం చేయిస్తూ సోకాల్డ్ అగ్రవర్ణస్తుల చేత రాళ్ళదెబ్బలు తిన్నాడు.

— కర్ణాటక కోలార్‌ జిల్లా కగ్గనహళ్ళి గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఎదుర్కొన్న ఎస్సీ మహిళ రాధమ్మకు అండగా నిలబడ్డాడు. మూడురోజులు ఆ గ్రామంలో ఉండి ఆమె చేతి వంట తిన్నాడు. ఆమె బాధను పార్లమెంటులో వినిపించాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌కి తమిళ భాష గురించో, కన్నడ ఎస్సీ మహిళ గురించో కష్టపడాల్సిన పనేంటి? తరుణ్‌ విజయ్‌ను మీడియాలో, సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్న వారిలో ఎవరైనా అతని ఆచరణలో వెయ్యోవంతైనా ఆచరించగలరా? కానీ మనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందిగా. వాడేసుకుంటే పోలా. పైగా తప్పు చేశాడు, చేశానని ఒప్పుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి జాత్యహంకారిని కుమ్మేద్దాం పదండి.

గుర్‌మెహర్‌… యుద్ధానికీ పాకిస్తాన్‌కీ తేడా తెలుసా!

ప్రియమైన గుర్‌మెహర్‌… సత్‌శ్రీ అకాల్‌. నువ్వు బాగున్నావని తలుస్తాను.

ఢిల్లీ రాంజస్‌ కాలేజీలో ‘ఆజాదీ’ [(భారతదేశం నుంచి) స్వేచ్ఛ] అనుకూల నిరసనల గురించిన నీ వైఖరి తెలిసింది. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అన్న నీ ట్వీట్ ప్రకటనా చూశాను.

ఇవాళ నేను బతికి ఉంటే నాకు 40 ఏళ్ళుండేవి. కాబట్టి నువ్వు నన్ను అన్నయ్యా అని పిలిచినా, అంకుల్ అన్నా… ఇంకెలా పిలిచినా పర్వాలేదు.

గుర్‌మెహర్‌, నేను నీకొక విషయం స్పష్టంగా చెబుదామనుకుంటున్నాను. ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి రెండు విషయాలు స్పష్టంగా తెలిసి ఉంటాయి. ఒకటి అతని కోరిక, రెండవది వాస్తవం. యుద్ధం చెడ్డది, అది జరగకూడదు — అనేది కోరిక. మన మీద యుద్ధం ప్రకటించబడింది — అనేది ప్రస్తుత వాస్తవం. జీవితంలో రెండూ ప్రధానమైనవే. మంచి సైనికుడు ఎప్పుడూ తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తాడు, వాస్తవాన్ని గుర్తించి కార్యాచరణ అమలు చేస్తాడు. ఆ రెండింటినీ కలగలిపేసేవారికి మిగిలేది ఓటమి మాత్రమే.

పాకిస్తాన్ మనకు మిత్రదేశంగా ఉండాలని మన కోరిక. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ కోరిక ఆధారంగా మన వ్యూహాలు రూపొందించుకుంటామా? లేదు. చరిత్ర గురించి, వర్తమానం గురించి ఏ కొంచెం తెలిసిన వారయినా — ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచన ఆధారంగా పాకిస్తాన్‌ ఏర్పడిందన్న విషయం అర్ధం చేసుకోగలరు. ‘పాక్’ అంటే ‘పవిత్రమైనది’… ‘పాకిస్తాన్‌’ అంటే ‘పవిత్ర భూమి’. తమ భూభాగం తప్ప… మిగతాదంతా (ప్రత్యేకించి భారతదేశం) అపవిత్రమైనది అన్న ఆలోచన మీద పాకిస్తాన్‌ ఏర్పాటైంది. పాకిస్తాన్‌ ఏర్పాటు, దాని ఉనికి… ఆ రెండూ ముస్లిములు హిందువులతో కలిసి బతకలేరన్న భావనకు నిదర్శనాలు.

పాకిస్తాన్‌కు మద్దతు పలకడం లేదా ఆ దేశంతో స్నేహం చేయడమంటే ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచనను ఆమోదించడమే. మనం నిజమైన లౌకికవాదులమే అయి, పై వాదనకు మద్దతు పలికే వారిమి కాకపోతే పాకిస్తాన్‌ అన్న ఆలోచనను, ఆ దేశాన్నీ మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తాం.

ఇంక నీ వ్యాఖ్య దగ్గరకు వద్దాం. ఏమన్నావ్‌ నువ్వు…. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అనా…!

saurabha-kalia

మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన మీ నాన్నకు సెల్యూట్‌. నేను కూడా అలా నా ప్రాణాలను ఇచ్చేసిన వాడినే. నిజానికి ఆ (కార్గిల్) యుద్ధం కనీసం ప్రాథమిక దశకైనా చేరక ముందే ఆ పోరులోకి అడుగు పెట్టిన మొదటి వ్యక్తిని నేను. నీ నుంచి నీ తండ్రినీ, నా పిల్లల నుంచి నన్నూ దూరం చేసిన ఆ యుద్ధాన్ని మొట్టమొదట గుర్తించిన వాణ్ణి, దానిగురించి ప్రపంచానికి చెప్పిన వాణ్ణీ… నేను.

గుర్‌మెహర్‌, నేను యుద్ధంలో చంపబడలేదు. నన్ను ఎలా చంపేరో కొద్దిగా చెబుతాను నా మాట వింటావా… అవాళ 1999 మే 15. మరో ఐదుగురు సహచరులతో కలిసి నా దేశపు భూభాగంలోనే గస్తీ తిరుగుతున్నాను. అప్పటికే మన భూభాగంలోకి చొరబడి వచ్చిన పాకిస్తాన్‌ సైనికులు (యుద్ధం చేస్తున్న సైనికులు కాదు) మా గస్తీ బృఃదాన్ని దొంగదెబ్బ తీశారు. మమ్మల్ని నిర్బంధించారు. పాకిస్తాన్‌ గడ్డ మీదకు తీసుకుపోయారు (యుద్ధభూమిలోకి కాదు).

ఆ శాంతి సమయంలో వారు మమ్మల్ని రోజుల తరబడి చిత్రహింసలుపెట్టారు. సిగరెట్లతో మా శరీరాల మీద వాతలు పెట్టారు. ఎర్రగా కాల్చిన ఇనపచువ్వలతో మా చెవి గూబలు తూట్లు పొడిచారు. మా కనుగుడ్లను పొడిచేసి ఆ తర్వాత వాటిని పీకేశారు. మా నోళ్ళల్లోని పళ్ళు, ఒళ్ళల్లోని ఎముకలు విరగ్గొట్టి చూర్ణం చేసేశారు. మా పుర్రెలు పగలగొట్టారు, పెదాలు కత్తిరించారు, ముక్కుదూలాలు విరగ్గొట్టారు, కీళ్ళు విరిచేశారు. మర్మాంగాలను కోసేశారు. ఇంకా మరెన్నో రకాలుగా శారీరక, మానసిక చిత్రహింసలకు గురి చేశారు.

ఇదంతా ఒక్కరోజు కథ కాదు. 22 రోజుల పాటు చిత్రవధల పాలుచేశారు. చివరికి ఒకరోజు మమ్మల్ని కాల్చి చంపేశారు. అది యుద్ధ సమయం కాదు… శాంతి సమయంలోనే. మా కళేబరాలను మా తల్లిదండ్రులకు అప్పగించారు… శాంతి సమయంలోనే.

మమ్మల్ని చంపింది యుద్ధం కాదు… పాకిస్తాన్‌.

ఇప్పుడు నేను దిగంతాల నుంచి దిగువన మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ భరించలేని ఆవేదనతో రోదిస్తున్నాను. వేలాది విద్యార్ధులు భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ చేస్తున్న డిమాండ్లను గమనిస్తున్నాను. వారు నా దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్నారు.

నేను నా తల్లి కోసం… భారతమాత కోసం ప్రాణాలిచ్చాను. భారతదేశం సమైక్యంగా ఉండడం కోసం నన్ను ముక్కలుగా నరుకుతున్నా భరించాను. పదునైన కత్తులతో వాళ్ళు నన్ను నిలువునా చీలుస్తున్నా ఏ ఒక్కక్షణమూ నొప్పితో ఏడవలేదు. కానీ ఇవాళ, ఈ క్షణం నేను మోసపోయినట్టు అర్ధం చేసుకున్నాను. ఏమాత్రం కృతజ్ఞత లేని ద్రోహుల కోసం చనిపోయినందుకు సిగ్గుపడుతున్నాను.

తమకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందంటున్నారు వారు. నాకు లేదా ఆ స్వేచ్ఛ? రణరంగం నుంచి తప్పుకుని వెనుదిరిగే స్వేచ్ఛ నాకు లేదా?? 22 రోజుల పాటు అనుభవించిన చిత్రహింసల నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా??? నా శరీరాంగాలు 22 రోజుల పాటు ముక్కలు ముక్కలుగా నరికివేయబడడం నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా???? ‘ఆజాదీ’ కావాలని కోరుతున్న వారిలో, వారికి మద్దతిస్తున్న నీలాంటి వారిలో కనీసం ఒక్కరైనా నా దగ్గరకు రాలేదు, గస్తీ తిరగొద్దంటూ వెనక్కి పిలవలేదు. అత్యంత కిరాతకమైన, నరహంతక జిహాదీలకు ఎదురొడ్డి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడకుండా ఉండగల అవకాశమూ స్వేచ్ఛా నాకూ ఉన్నాయి కదా.

వాళ్ళు మీ కాలేజీకి షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌లను అతిథులుగా పిలిచారు. ఎవరీ షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌? కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలి, కశ్మీరీ వేర్పాటువాదులకు ఆజాదీ డిమాండ్ చేసే హక్కు కావాలీ అని వాదించే వాళ్ళే కదా. మా శరీరాలను అంగుళం అంగుళం చొప్పున రోజుల తరబడి కత్తిరించిన వాళ్ళు ప్రతీరోజూ మాకు ఏం చెప్పేవారో తెలుసా — ఈ ఆజాదీయే. మాకు ఆజాదీ కావాలి. కశ్మీర్‌కు భారత్‌ నుంచి స్వేచ్ఛ కావాలి. కశ్మీర్‌ను పాకిస్తాన్‌గా మారుస్తాం. పాకిస్తాన్‌ అంటే అర్ధం తెలుసా, అదొక్కటే పవిత్ర భూమి… ఇదిగో సరిగ్గా ఇవే వాదనలు.

రాంజస్‌ కాలేజ్‌ లేదా జేఎన్‌యూ లేదా మరి ఏ ఇతర ప్రదేశంలోనైనా ఆజాదీ పేరిట చేసే నినాదాలు… మా శరీరాలను తునాతునకలు చేసిన ఘటనలను, ఆ చేదు జ్ఞాపకాలనూ పదేపదే గుర్తుచేస్తాయి. భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ మీరు గొంతెత్తి అరిచే ప్రతీసారీ… మీరెప్పుడూ అనుభవించని, ఎంతమాత్రం అనుభవించకూడని భయంకరమైన ఆ సందర్భాలు కళ్ళకు కట్టి వెన్ను జలదరిస్తుంది.

విద్యార్ధుల తప్పేముంది? అని మీరు అడగవచ్చు. ఏ విద్యార్ధి తప్పూ లేదు. కానీ ఆజాదీ నినాదాలు, ప్రదర్శనలతో సంబంధం ఉన్నవారు… జిహాదీల బూట్లు నాకే తొత్తులను లెక్చర్లిమ్మంటూ ఆహ్వానించేవారూ… చేస్తున్న పనులు కచ్చితంగా తప్పే. ఈ ఆజాదీ నినాదాలతో వారు మా త్యాగాలను అవమానిస్తుంటే…. నా ప్రజలు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. నా ప్రజలు నా గౌరవం కోసం పోరాడాలని కోరుకుంటున్నాను.

అలాంటి నిరసనలు, ప్రదర్శనలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్‌ అన్న ఆలోచనకు మద్దతిస్తాయని తెలిసినా, వాటిలో భాగం కావడం ఏం తెలివైన పని? మీరు భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఉద్యమిద్దామనుకుంటున్నారా? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడండి. ఉగ్రవాదంపైనా, ఉగ్రవాదులపైనా మీ భావాలు స్వేచ్ఛగా ప్రకటించండి. అష్టకష్టాలూ పడుతున్న మహిళలకు బాసటగా ఉద్యమించండి. బహుభార్యాత్వం, తలాఖ్‌ పద్ధతులకు వ్యతిరేకంగా నడుం కట్టండి. గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయండి. పాకిస్తాన్‌కు, ఆ దేశపు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళమెత్తండి.’అపవిత్రమైన’ జాతికి చెందిన వాడన్నకారణంగా ఒక వ్యక్తి శరీర భాగాలను నరికి పోగులు పెట్టే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడండి. గురు తేగ్ బహదూర్‌ తల నరికిన సిద్ధాంతానికి, నలుగురు రాకుమారులను సజీవ సమాధి చేసిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడండి. 1947 వరకూ లక్షల మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండి. కశ్మీర్‌ లోయలో కశ్మీరీ హిందూ పండిట్ల జాతిని ఊచకోత కోసిన వారిపై ఉద్యమించండి.

మీ ధైర్యానికి, సాహసానికి, ఉద్వేగానికి నిజమైన పరీక్ష… మీరు ఎంచుకునే కారణంలోనే ఉంటుంది. తమ అనుకూలతలను బట్టి కారణాన్ని ఎంచుకునేవారు పిరికిగొడ్డులు. నిజమైన వీరులు తమ ప్రాథమ్యాలను బట్టి కారణాలను ఎంచుకుంటారు.

ప్రియమైన గుర్‌మెహర్‌, చాలామంది తాకడానికి సైతం భయపడే నిజమైన అంశాలను గుర్తించి వాటి తరఫున పోరాడతావని ఆశిస్తున్నాను. నీ తండ్రి లాంటి, నాలాంటి వారిని గర్వపడేలా చేయి. దేవుడు నీకు మేలు చేయుగాక.

— స్వర్గీయ కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా.

[కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్‌ మన్‌జీత్‌ సింగ్‌ కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌… పాక్‌ అనుకూల వామపక్ష విద్యార్ధి సంస్థల తరఫున వకాల్తా పుచ్చుకుని ఉద్యమిస్తున్న నేపథ్యంలో… కార్గిల్ యుద్ధాన్ని ముందుగా గుర్తించి పాక్‌ దుండగీడుల చేతిలో హతమైన సౌరభ్‌ కాలియా ఆమెకు హితవు పలుకుతున్నట్టుగా రాసిన బహిరంగలేఖ ఇది. ఈ లేఖ రాసినవారు కాన్పూర్ ఐఐటీ సైంటిస్ట్ డాక్టర్ వశీ శర్మ. డాక్టర్ వశీ శర్మ బోంబే ఐఐటీ నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ఆయన పేరొందిన శాస్త్రవేత్త. ఇస్లామిక్ ఉగ్రవాదం, డీ-ర్యాడికలైజేషన్‌ అంశాల్లో నిపుణుడు కావడం ఆసక్తికరం.]

వాళ్ళు రాసిందే చరిత్ర మరి…!

ఏరా అబ్బాయ్‌… ‘పర్వ’ గురించి ఇంక ప్రయత్నించకు. దొరికింది.
ఎలా దొరికింది నాన్నగారూ…
సెంట్రల్‌ యూనివర్సిటీలో మా ఫ్రెండున్నాడు కదా… బెంగళూరులో ఓ ప్రొఫెసర్‌ గారి నుంచి సంపాదించాడు… ఆ రోహిత్ వేముల గొడవల కారణంగా పంపడం ఆలస్యమైందట.. ఇప్పుడు పంపించాడు… ఇవాళే వచ్చింది…
అసలది మనకి నచ్చుతుందో లేదో…
వాడు కూడా అదే మాట అడిగాడురా…! ‘మీ రైటిస్టులకి ఈ పుస్తకం నచ్చదేమో’ అంటూనే ఇచ్చారట ఆ బెంగళూరు ప్రొఫెసర్‌గారు. ప్రారంభమూ అలాగే ఉంది…
ఇంతకీ మీకు బైరప్ప పర్వ చదవాలని ఇప్పుడెందుకు అనిపించింది?
మా స్టూడెంట్‌ గోవాలో ఉజ్యోగం చేస్తున్నవాడు ఒకడున్నాళ్ళే… అప్పుడప్పుడూ వాడు మనింటికి వస్తుంటాడు… నువ్వు చూళ్ళేదు… కొన్నాళ్ళ క్రితం వాడు మనింటికి వచ్చినప్పుడు ఆవరణ నవల గురించి, ఆ సమయంలో జరిగిన వివాదాల గురించీ చెప్పాడు. ఆ సందర్భంలోనే పర్వ గురించి చెప్పాను. సరే ఓసారి చదువుదామని ప్రయత్నించాను…
ఆవరణ విడుదల సమయంలోనే అనుకుంటా గిరీష్‌ కర్నాడ్‌ బైరప్పనీ వంశవృక్షనీ చెడతిట్టాడు… అప్పుడు ఈ భైరప్ప రైటిస్టా లెఫ్టిస్టా అన్న అనుమానం వచ్చింది.
రెండూ కాకుండా సెంటరిస్టేమో అనిపిస్తోంది.
ఏమో… పర్వలో మాత్రం కృష్ణుడు తప్ప దాదాపు అందరినీ స్వార్థపరులుగా చిత్రీకరించడం చూసి అలా అనిపించింది. ఐతే కర్నాడాదులకు రైటిస్టు అనీ… బెంగళూరు అభ్యుదయవాద ప్రొఫెసరు గారికి లెఫ్టిస్టు అనీ… అనిపించడం చిత్రమే.
మొత్తం మీద ఆయనది ఆసక్తికరమైన వ్యక్తిత్వమన్న మాట.

*****     *****     *****     *****

సుమారు రెండేళ్ళ నాటి ఆ సంభాషణ తర్వాత భైరప్ప గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2007లో ‘ఆవరణ’ ప్రచురణకు ముందు ఆయన ‘చారిత్రక అసత్యాలతో జాతీయత ఎన్నటికీ బలపడదు’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కన్నడ సాహిత్య ప్రపంచంలో తీవ్ర స్థాయి వాద ప్రతివాదాలకు దారి తీసింది. వాటికి జవాబు అన్నట్టుగా 2012లో ఆయన ‘చరిత్రకారుడు నవలాకారుడిలా సృజనాత్మకత పేరిట స్వేచ్ఛ తీసుకుంటే అసలు సత్యం పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ మరో వ్యాసం రాశారు. అది ఈ మధ్య అంతర్జాలంలో విస్త్రతంగా ప్రచారం అవుతోంది. దాని తెలుగు సేత ఇదిగో ఇదీ….

*****     *****     *****     *****

అది 1969-70 నాటి మాట. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయమది. నాటి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆప్తుడైన దౌత్యాధికారి జి పార్థసారథి ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లక్ష్యం… విద్య ద్వారా దేశాన్ని ఏకం చేయడం. నన్ను సదరు కమిటీలో ఒక సభ్యుడిగా ఎంపిక చేశారు. నేనప్పట్లో ఎన్‌సీఈఆర్‌టీలో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ రీడర్‌గా పనిచేస్తుండే వాణ్ణి. మా మొదటి సమావేశానికి పార్థసారథి కమిటీ ఛైర్మన్‌ హోదాలో వచ్చారు. కమిటీ సాధించవలసిన ప్రయోజనాల గురించి తనదైన మర్యాదాపూర్వక పరిభాషలో వాక్రుచ్చారు : “ఎదిగే పిల్లల మనసుల్లో విషబీజాలు నాటకుండా ఉండడం మన విధి. ఎందుకంటే అలా జరిగితే జాతీయ సమైక్యత అన్న భావనకు వారు అడ్డంకులుగా మారతారు. సాధారణంగా అలాంటి విషబీజాలు చరిత్ర క్రమంలోనే ఎక్కువగా ఉంటాయి. సోషల్ సైన్సెస్, భాషాశాస్త్రాల్లో కూడా అప్పుడప్పుడూ అలాంటి అభ్యంతరకర అంశాలు కనిపించడం పరిపాటి. అలాంటి అంశాలన్నింటినీ మనం ముందుగానే ఏరి పారేయాలి. మన చిన్నారుల మనసుల్లో జాతీయ సమైక్యత గురించిన భావనలు మాత్రమే మొలకెత్తించగల ఆలోచనలనే ప్రోది చేయాలి. ఆ గురుతర బాధ్యతను మన కమిటీ భుజాలకెత్తుకుంది.”

మిగతా నలుగురు సభ్యులూ గౌరవ పురస్సరంగా తలలూచారు. కానీ నేనలా చేయలేకపోయాను. “సర్! మీ మాటలు నాకు అర్ధం కాలేదు. కొన్ని ఉదాహరణలతో వివరించగలరా?” అని నేరుగా అడిగేశాను. ఆయన జవాబిచ్చారు. “సోమనాథ్‌ దేవాలయాన్ని గజనీ మహమ్మద్‌ దోచుకున్నాడు. కాశీ మథురల్లో దేవళాలను కూలగొట్టి ఔరంగజేబు మసీదులు కట్టాడు, జిజియా పన్నులు వసూలు చేశాడు — ఇలాంటి పనికిమాలిన వాస్తవాలను బోధిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశాన్ని బలోపేతం చేయడం సాధ్యమేనంటారా? అలాంటి నిజాలు ద్వేషాన్ని రగల్చడం తప్ప ఏ విధంగా మేలు చేయగలవు?”

“కానీ అవన్నీ చారిత్రక సత్యాలు కదా!” నేను రెట్టించి అడిగాను.

“అరే, మనకు నిజాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా అని అన్నింటినీ చెప్పేస్తామా ఏమిటి? నిజాలను తగుమాత్రంగా ఉపయోగించడమే చరిత్ర బోధించడానికి తెలివైన పద్ధతి” అన్నారాయన. ‘ఔనౌను’ అన్నట్టుగా మిగతా నలుగురు సభ్యులూ తలలు ఊపారు. కానీ నేను అలా ఒప్పేసుకోడానికి సిద్ధంగా లేను.

“మీరే కాశీ, మథుర వంటి ఉదాహరణలు చెప్పారు. ఇప్పటికీ దేశం నలుమూలల నుంచి ఆయా క్షేత్రాలకు ప్రతీ యేటా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఆయా దేవాలయాలను శిథిలం చేసి, వాటికి చెందిన గోడలు, స్తంభాల ఆధారంగా నిర్మించిన భారీ మసీదులు అందరి కళ్ళకూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే మసీదు వెనక చిన్న పాకలా వేసుకుని అందులో ఆలయం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి నిర్మాణాలను చూస్తున్న భక్తుల ఆవేదనకు అంతే లేదు. తమ ప్రీతిపాత్రమైన దైవపు మందిరం దుస్థితి గురించి తమ బంధువులకు చెప్పుకుని వాపోతున్నారు. అలాంటి పరిస్థితులు జాతీయ సమైక్యతను సృష్టించగలవా? అలాంటి చరిత్రను మీరు పాఠ్యపుస్తకాల్లో చేర్చకుండా దాచగలరు. కానీ ఆ పిల్లలు విహారయాత్రలకు వెళ్ళినపుడు తమ కళ్ళతో ఆ నిజాలను చూసి తెలుసుకున్నప్పుడు ఆ చరిత్రను దాచడం సాధ్యమా? పరిశోధకుల అంచనాల ప్రకారం భారతదేశం మొత్తం మీద అలా ధ్వంసం చేసిన మందిరాలు 30వేలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు దాచిపెట్టగలరా?”

పార్థసారథి నా మాటలను అడ్డుకున్నారు : “మీరు తత్వశాస్త్ర ప్రాచార్యులు కదా, చరిత్ర ప్రయోజనం ఏమిటో కొంచెం వివరిస్తారా?”

“చరిత్ర ప్రయోజనాన్ని ఎవరూ నిర్వచించలేరు. భవిష్యత్తులో సైన్స్‌, టెక్నాలజీల అభివృద్ధి కారణంగా పరిస్థితులు ఎలా ఉండబోతాయన్నది మనకు తెలీదు. కొందరు పాశ్చాత్య ఆలోచనాపరులు దీన్ని ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ అంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఆలోచనల వల్ల ప్రయోజనం శూన్యం. మన చర్చ ఏంటి — చరిత్ర బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని కదా. చరిత్ర అంటే మన గతకాలపు సంఘటనల గురించి నిజాలు తెలుసుకోవడం, మానవ జీవితాల గురించి నేర్చుకోవడం. దానికోసం శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ఇతరత్రా రికార్డులు, సాహితీ గ్రంథాలు, పురాతన అవశేషాలు, కళాఖండాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు చేసిన తప్పులు చేయకుండా ఉండడమూ నేర్చుకోవాలి. వాళ్ళు ఆచరించిన సద్గుణాలను మనం అనుసరించాలి. వాటన్నింటినీ నేర్చుకోడానికి చారిత్రక వాస్తవాలు మనకు సహాయం చేస్తాయి.”

“సత్యం గురించిన అన్వేషణ మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తే ఏం చేయాలి? సమాజాన్ని మనం విభజించవచ్చా? మనం విషబీజాలు నాటవచ్చా?” అని అడుగుతూ ఆయన నన్ను ఆపడానికి ప్రయత్నించారు.

“సర్‌, మెజారిటీ, మైనారిటీ అంటూ కేటగిరీలు చేస్తున్నామంటేనే ఈ సమాజాన్ని విభజిస్తున్నామని… కనీసం విభజన దిశగా అడుగులు వేస్తున్నామని అర్ధం. అసలీ ‘విషబీజాలు’ అన్న ఆలోచనే పక్షపాత ధోరణికి నిదర్శనం. గజినీ మహమ్మద్‌ లేదా ఔరంగజేబు తమ సొంత మనుషులు, హీరోలు అని మైనారిటీలు ఎందుకు అనుకోవాలి? మొగల్‌ సామ్రాజ్యం నశించిపోడానికి కారణం ఔరంగజేబ్‌ మతోన్మాదం. అక్బర్‌ కాలంలో అతను పరమత సహనం అనే విధానాన్ని అనుసరించాడు కాబట్టి మతపరంగానూ సామాజికంగానూ మిత్రత్వం సాధ్యమైంది. చారిత్రక వాస్తవాలను దెబ్బతీయకుండా పిల్లలకు అలాంటి పాఠాలు చెప్పలేమా? చరిత్ర నుంచి నేర్చుకోవలసిన పాఠాలు బోధించడానికి ముందు చారిత్రక వాస్తవాలను తెలియజెప్పాల్సిన పని లేదా? నిజమైన చరిత్రను దాచడం అనేది రాజకీయాల కోసం చేసే పని. ఈ ట్రెండ్ ఎక్కువకాలం కొనసాగదు. మైనారిటీలు కానివ్వండి, మెజారిటీలు కానివ్వండి… ఉద్వేగాలను నియంత్రించుకునే పరిపక్వతతో సత్యాన్ని ఎదుర్కొనే శీలాన్ని విద్యార్ధులకు ఇవ్వలేని విద్య అర్ధరహితం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా.” అని చెప్పాను.

నా మాటలతో పార్థసారథి ఏకీభవించారు. నా పాండిత్యాన్ని, స్పష్టంగా ఆలోచించగల సామర్థ్యాన్నీ ప్రశంసించారు. భోజన విరామ సమయంలో ఆయన నన్ను ఓ పక్కకి పిలిచారు. నాకు ఎంతో సన్నిహితుడిలా నా భుజాలపై చేతులు వేసి, విజయం సాధించినట్టు నవ్వుతూ నాతో ఇలా చెప్పారు : “మీరు ఇప్పటివరకూ చెప్పిందంతా అకడమిక్‌గా కరెక్టే. మీరు చెప్పిన అంశాలతో ఓ మంచి వ్యాసం రాసుకోండి. కానీ ప్రభుత్వం దేశం మొత్తానికీ ఒక విధానాన్ని తయారు చేసేటప్పుడు, అది అందరు ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. మేథోపరంగా స్వచ్ఛమైన నియమాలు ఎలాంటి ప్రయోజనాన్నీ అందీయలేవు.”

మరునాడు మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా నేను నా వాదనకే కట్టుబడి ఉండిపోయాను. సత్యం ఆధారంగా లేని చరిత్ర నిష్ప్రయోజనకరము, ప్రమాదకరమూ అని నిష్కర్షగా తేల్చిచెప్పాను. పార్థసారథి తన ఆగ్రహాన్ని ముఖం ద్వారా ప్రకటించినప్పటికీ నేను నా వాదన నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఆ ఉదయం సమావేశం ఎలాంటి ఫలితమూ తేలకుండానే ముగిసిపోయింది.

ఆ తర్వాత పార్థసారథి నాతో మాట్లాడలేదు. మేం మళ్ళీ ఒక పక్షం రోజుల తర్వాత సమావేశమయ్యాం. అప్పటికి కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు. అందులో నేను లేను. నా స్థానంలో మరో కొత్త వ్యక్తి ఉన్నారు. వామపక్ష భావజాలం కలిగిన ఆ హిస్టరీ లెక్చరర్‌ పేరు అర్జున్ దేవ్‌. ఆ తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన కొత్త సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ టెక్స్ట్‌ పుస్తకాలు, వాటిలో పొందుపరిచిన కొత్త పాఠాలూ అన్నీ ఆయన మార్గదర్శకత్వంలో రాయబడినవే. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో ఆ పుస్తకాలనే పాఠ్యపుస్తకాలుగా పెట్టుకోవడం కానీ లేదా వాటి ఆధారంగా పాఠ్యపుస్తకాలు రాయడం కానీ జరిగింది.

చాలా కాలం తర్వాత అంటే 2005 అక్టోబర్‌లో ఒక ప్రసంగంలో ఆనాటి విషయం గురించి నేనిలా వ్యాఖ్యానించాను :
11వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ‘ప్రాచీన భారతదేశం’ అన్న పాఠ్యభాగాన్ని రాసింది మార్క్సిస్టు చరిత్రకారుడు ఆర్‌.ఎస్ శర్మ. మధ్యయుగాల నాటి భారతదేశం అన్న భాగాన్ని రాసిన సతీష్‌ చంద్ర కూడా మార్క్సిస్టే. వాటిని నిశితంగా పరిశీలించి పరీక్షించినప్పుడు… ఆ వర్గానికి చెందిన వారు ఎదుగుతున్న పిల్లల మనసులను బ్రెయిన్‌వాష్‌ చేయాలన్న దురుద్దేశంతో కుటిల వ్యూహాలు అమలు చేసిన తీరును గమనించవచ్చు. ఆ చరిత్రకారుల రాతల ప్రకారం… “సహనం అనే లక్షణపు గొప్పదనాన్ని వివరిస్తూ అశోకుడు భ్రాహ్మణులను ‘కూడా’ గౌరవించాలని బోధించే వాడు. అశోకుడు తన రాజ్యంలో పశువులు పక్షులను బలి ఇచ్చే ఆచారాలపై నిషేధం విధించాడు. దానివల్ల యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. దాంతో బ్రాహ్మణులకు దక్షిణలు నిలిచిపోయి, వారి జీవిక ఆగిపోయింది. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. అందులోని పలుభాగాలు బ్రాహ్మణుల పాలనలోకి వెళ్ళిపోయాయి. ఆ బ్రాహ్మణులే బౌద్ధమతం అంతరించిపోవడానికి కారకులయ్యారు..” భారతదేశంలో మాత్రమే కాక చుట్టుపక్కల దేశాలకు సైతం వ్యాపించిన, దేశంలో అత్యంత ప్రభావశీలంగా నిలిచిన మతం — తమ దక్షిణలు కోల్పోయామనే అసంతృప్తితో ఉన్నబ్రాహ్మణుల వల్ల అణిగిపోయిందనడం — ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా!

ఎర్రకళ్ళ చరిత్రకారులు చేసిన మరో ప్రచారం — ముస్లిములు తమ దండయాత్రల్లో దేవాలయాలను విధ్వంసం చేయడానికి కారణం ఆ మందిరాల్లో పోగుపడివున్న సంపదను దోచుకోవడం కోసమే అనే విషయం. ముస్లిముల దండయాత్రలను హేతుబద్ధీకరించడమే ఈ వివరణ లక్ష్యం. మరికొన్ని సందర్భాల్లో… అలాంటి దోపిడీలు షరియా చట్టం పరిధిలోకి వస్తాయని కూడా వారు వాదిస్తారు. ఆ దాడులు, దోపిడీలకు చట్టబద్ధత కల్పిస్తున్నారన్న మాట.

నిజానికి బౌద్ధం భారతదేశంలోనుంచి మాయమైపోయింది అశోకుడి తర్వాత కానే కాదు. అసలు నిజాన్ని స్వయంగా బౌద్ధమతావలంబి అయిన డాక్టర్ బీ ఆర్‌ అంబేడ్కర్‌ — బౌద్ధం పతనం, నాశనం అనే వ్యాసంలో (అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు మూడవ సంపుటం, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ, 1987) — స్పష్టంగా చెప్పారు. భారతదేశంలోకి చొరబడిన ముస్లిం దురాక్రమణదారులు నలంద, విక్రమశీల, జగద్దళ, ఓదాంతపుర విశ్వవిద్యాలయాలను సమూలంగా ధ్వంసం చేశారు. బౌద్ధ సాధువులను ఊచకోత కోశారు. బతికి బట్టకట్టిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేపాల్, టిబెట్‌ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు. అంబేడ్కర్‌ మాటల్లో “బౌద్ధమతం వేళ్ళను సమూలంగా నరికేశారు. భారతదేశంలో బౌద్ధానికి పట్టిన అత్యంత ఘోరమైన దుర్గతి అదే.” ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు హిందూమతాన్ని దూషించాలనుకునే ప్రతీసారీ… దయ్యాలు వేదాలు వల్లించినట్టు… అంబేడ్కర్‌ను ఉటంకిస్తారు. అదేసమయంలో “ముస్లిముల బీభత్స భయానక కృత్యాల కారణంగానే భారతదేశంలో బౌద్ధం అంతరించిపోయింది” అని అంబేడ్కర్‌ చెప్పిన మాటల్ని మాత్రం… తమకు అనుకూలంగా లేనందున విస్మరిస్తారు.

ఎన్‌సీఈఆర్‌టీ కోసం రాసిన ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’లో ఆర్‌ఎస్‌శర్మ ఇలా అంటారు : “సుసంపన్నమైన బౌద్ధ విహారాలు భారతదేశంపై దండయాత్రకు వచ్చిన తురుష్కులను ఆకర్షించాయి. చొరబాటుదారులకు అవి ప్రత్యేకమైన లక్ష్యాలుగా నిలిచాయి. బౌద్ధ భిక్షువులు ఎందరినో తురుష్కులు హతమార్చారు. అప్పటికీ మరెంతో మంది బౌద్ధులు తప్పించుకుని నేపాల్, టిబెట్‌లకు పారిపోగలిగారు.” ఆ తురుష్కులు ఎవరు — హిందువులా? మహా మేధావి అయిన మార్క్సిస్టు శర్మ గారు సరిగ్గా ఇక్కడే నిఖార్సైన నిజాలు దాచేశారు.. తురుష్కులు (టర్కీ దేశస్తులు) ముస్లిములు. తమ షరియా లా — ఇస్లామిక్‌ న్యాయం ప్రకారమే వారు భారతదేశంలో మందిరాలను కూల్చేశారు. ఆ నిజాన్ని దాచడం కోసమే ఆర్‌ఎస్‌ శర్మ టర్కీ దేశపు ముస్లిములను వారి జాతినామంతో తురుష్కులని ప్రస్తావించారు. ఆ సమయంలోనే ఆయన తోటి చరిత్రకారులు ‘అశోకుడి పాలనలో దక్షిణలు కోల్పోయిన బ్రాహ్మణుల వల్లనే బౌద్ధమతం పతనం అయిపోయింది’ అని తప్పుడు ప్రచారం చేశారు. తురుష్కులు ముస్లిములు అనే నిజాన్ని దాచిపెట్టడం, బ్రాహ్మణుల వల్లే బౌద్ధం పతనమైందని అబద్ధాలు చెప్పడం — ఎంత గొప్పగా చేశారో! అలాంటి ఎత్తుగడల గురించి లాటిన్‌లో ఓ మాట ఉంది ‘సప్రెసియో వెరి – సజెస్టియో ఫాల్సి’. దాన్ని మనం తెలుగులో ‘నిజాల్ని తొక్కెయ్‌ – అబద్ధాలాడెయ్‌’ అనుకోవచ్చు.

*****     *****     *****     *****

అదండీ భైరప్ప గారి వాదన. మరి ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు పర్వని పొగిడి, ఈ వ్యాసాలను తెగ తిట్టారేమో నాకు తెలీదు. తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి. ఇప్పటికైనా ఓపిక చేసుకుని వచ్చి రచ్చ చేస్తారు.

సింధు నాగరికతలో కుల పిచ్చి కహానీ

మన దేశంలో కులానికి అనుకూలంగా మాట్లాడడం అంటే మహా నేరం అన్న పరిస్థితి వచ్చేసి కనీసం ఓ రెండు దశాబ్దాలు అయి ఉంటుంది. రకరకాల వాదులు అందరూ కులం ప్రస్తావన వస్తే ఒంటికాలి మీద లేచి గొంతులు ఓ చించేసుకునే వారే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన దేశంలో కులం అనే అస్తిత్వం ఇంకా అమల్లో ఉంది. ప్రభుత్వాలే దాన్ని ఏ దశలోనూ తొలగించడం లేదు. కానీ సోకాల్డ్ అభ్యుదయ వాదులు, కులనిర్మూలన వాదులు, ఉదారవాదులు, లౌకిక వాదులు… ఇంకా రకరకాల వారంతా కులం అన్న పదాన్ని ఓ మహా భూతంలా… దానికి అనుకూలంగా నోరెత్తే ప్రతీ ఒక్కడినీ భయంకరమైన విలన్‌లా చిత్రీకరిస్తున్నారు. తాజాగా… ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు విషయంలోనూ అదే జరిగింది.

Sindhu

సింధు దేశం పరువు నిలబెట్టిన వేళ లక్షలాది మంది ఆమె కులం ఏమిటో తెలుసుకోవాలనే కుల గజ్జితో గింజుకుపోయారంటూ న్యూస్‌మినిట్ అనే వెబ్ సైట్ ఓ కథనాన్ని వండి వార్చేసింది. దాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైంస్ ఆఫ్ ఇండియా పత్రికలు క్యారీ చేసేసాయి. ఇంక సోషల్ మీడియాలో విమర్శకుల నోళ్ళన్నీ కేకలు వేయడం మొదలెట్టాయి. అయితే ఇంతకీ అది నిజమేనా? సింధు కులం గురించి లక్షల మంది వెతికారా? ఆ విషయంలోని నిజానిజాలను ఇండియాఫ్యాక్ట్స్ వెబ్‌సైట్‌లో సంక్రాంత్ సనూ అనే రచయిత బైటపెట్టాడు. అతని వ్యాసానికిది స్వేచ్చానువాదం.

ఒలింపిక్స్‌లో పీవీ సింధు వెండి పతకం గెలవగానే… దాని గురించి ‘దేశం’ కోణం లోనుంచి రాయాలని చాలా మంది మీడియా జనాలు ప్రయత్నించారు. ఇండియా అంతే కులాల కుమ్ములాటలే అన్నది మన మీడియాలో చాలా మంది భావన. ఆందుకే న్యూస్‌మినిట్ వాళ్ళు ఓ వ్యాసానికి శిర్షిక ఇలా పెట్టారు “పతకం కోసం సింధు శ్రమిస్తున్న వేళ ఎందరో భారతీయులు ఆమె కులం గురించి గూగుల్‌లో వెతికారు”. ఆ వ్యాసం కోసం ఎంతో సమాచారం సేకరించారు. “21వ శతాబ్దంలోనూ భారతీయులు తమ కులం అంటే పిచ్చెక్కి పోతుండడం శొచనీయం, దేశంలోని నికృష్ట పరిస్థితికి ఇది నిదర్శనం” లాంటి పడికట్టు రాళ్ళకు లెక్కే లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ వ్యాసంలో “కులం” పేరిట చేసిన ఆరోపణలు తప్పు. ఆ పత్రిక సిబ్బందికి “రిలేటివ్”కీ “యాబ్సొల్యూట్”కీ తేడా తెలీదు. ఇంక “గూగుల్ ట్రెండ్స్” లేదా “యాడ్‌వర్డ్స్” ఎలా పనిచేస్తాయో తెలీదు. కానీ భారతదేశంలో కులం అన్న పదం ముందు పెట్టుకుని ఏమైనా రాసేయవచ్చు కదా. ఇంక సహజంగానే ఆ కథనాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైంస్ ఆఫ్ ఇండియా పత్రికలు (నిర్ధారించుకోకుండానే) అందేసుకున్నాయి. ఇంక సొషల్ మీడియా సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేస్తారు. ఆ వ్యాసంలోని వాక్యాలు ఇలా ఉన్నాయి : “పీవీ సింధు తీవ్రంగా పరిశ్రమిస్తూ రియో ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టాలని ప్రయత్నిస్తున్న వేళ, ఆమె కులం గురించి వేల మంది వెతుకుతున్నారు. ఆ విషయం గూగుల్ స్టాట్స్ ద్వారా తెలిసింది. దాని ఫలితాలు ఆశ్చర్యకరం కాదు బాధాకరం”.

తమ కథనాన్ని సమర్ధించుకునేందుకు న్యూస్ మినిట్ వాళ్ళు సింధు గతం తవ్వుతూ తమకు అనుకూలంగా కనిపించిన గూగుల్ ట్రెండ్స్ గ్రాఫ్స్ ప్రచురించారు. వాటిని ఒకసారి చూద్దాం.

న్యూస్ మినిట్ వాళ్ళ ప్రకారం సింధు కులం గురించిన వెతుకులాట జూలైతో పోలిస్తే ఆగస్టులో కనీసం 10 రెట్లు పెరిగింది. కాబట్టి ఇప్పటివరకూ లక్షలాది భారతీయులు ఆమె కులం గురించి వెతికారన్న మాట.

SC 1

మధ్యలో ఈ లక్షలాది మంది ఎక్కడి నుంచి వచ్చారు? తమది కచ్చితమైన సమాచారం అనుకుంటున్న వారు గూగుల్ ట్రెండ్స్ సాపేక్షమని గుర్తించాలి. (గ్రాఫ్ పై భాగంలోని విలువ 100). సింధు కులం గురించిన సెర్చ్‌లు ఎందుకు ఒక్కసారిగా పెరిగాయి? ఆసలు, సింధు గురించిన అన్ని సెర్చ్‌లూ విపరీతంగా పెరిగాయి. కావాలంటే సింధు తల్లి అన్న పెరామీటర్‌కి కూడా అలానే పెరిగి కనిపిస్తాయి.

SC 2

అలా సింధు తల్లి గురించిన వెతుకులాటలో కూడా గతం కంటె గణనీయంగా పెరిగిన గణాంకాలు న్యూస్ మినిట్ వాళ్ళకి “కలచివేసేవి”గానో, “హృదయ విదారకం”గానో ఎందుకు కనిపించలేదో మరి.

ఇంక “లక్షలు” అన్న సంఖ్య గురించి వారేం చెబుతున్నారో చూద్దాం. “మరి కచ్చితమైన గణాంకాల మాటేమిటి? “సింధు కులం” అన్న సెర్చ్ టెరంతో 2016 మే, జూన్, జులై నెలల్లో నమోదైన అంకెలనే మేము చూపుతున్నాం.” అంటూ ఈ ఇమేజ్ చూపిస్తున్నారు.

SC 3

“సింధు కులం గురించి జూన్‌లో లక్షా 50వేల మంది వెతికారు, ఇక జులైలో 90వేల మంది వెతికారు”. ఇదీ వాళ్ళు చెప్పిన మాటలు.

ఇక్కడ న్యూస్ మినిట్ వాళ్ళు గూగుల్ యాడ్‌వర్డ్స్ కీ వర్డ్స్ ప్లానర్ టూల్ వాడారు. ఐతే దాన్ని ఎలా వాడాలో వాళ్ళకి సరిగ్గా తెలియలేదు. ఆ టూల్ మీ సెర్చ్ టెరంలోని అన్ని పదాల గురించీ వెతికేస్తుంది. ఆంటే పైన చెప్పిన లక్షల సెర్చ్‌లు “సింధు కులం” గురించి కాకుండా ఉత్త “సింధు” అన్న పదం గురించిన వెతుకులాటలను కూడా ప్రస్తావిస్తున్నాయన్న మాట.

మరైతే, కచ్చితంగా “సింధు కులం” గురించే సెర్చ్ చేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ సంఖ్య ఇదిగో ఇక్కడ చూడండి.

SC 4

అంటే సింధు కులం గురించి సగటున ఒక నెలలో జరిగిన సెర్చ్‌లు 210 మాత్రమే. గూగుల్ ట్రెండ్స్ రిలెటివ్ రేషియోని పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య 10 రెట్లు పెరిగి 2100 అవుతుంది. అంతే తప్ప లక్షలకు లక్షలు కాదు. మరి ఇంతకీ ఆ సంఖ్య ఎక్కడిది? అది పీవీ సింధు అనే కీ వర్డ్ ఉన్న అన్ని సెర్చ్‌ల సంఖ్య.

మరో విషయం, సింధు కులం గురించి సెర్చ్‌లు పెరగలేదా అంటే.. పెరిగాయనే చెప్పుకోవాలి. ఆ పెరుగుదల ఎంతో తెలుసా? జూన్ నుంచి ఆగస్ట్ నాటికి సింధు కులం గురించిన అన్వేషణలో పెరుగుదల 0.14 శాతం మాత్రమే.

కులం గురించి గొంతులు చించుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే దేనికి వ్యతిరేకంగా అరుస్తున్నారో, దేనికి అనుకూలంగా చేతులు ఎత్తుతున్నారో తేడా తెలీనంత. దీనికి కారణం ఏంటి?

తాను తెప్పున్న ఎగసింది గోదావరీ

ఉప్పొంగిపోయింది గోదావరీ…. 

ఉప్పొంగిపోయింది గోదావరీ...

గోదావరి తల్లికి కోటి దండాలు 

G (3)

అద్గద్గో అక్కడ… గేటు కింద ఆ స్తంభం దగ్గర అలా అలా సుడి తిరిగీ…

G (9)

అదేనా జనార్దనస్వామి గుడీ!

G (11)

వర్రె.. ఈ కాకి ఏకాకి కాదు.. దీనిలాగే ఆడుతున్న కాకులెన్నో…

G (22)

ఇంకొక్క రెండడుగులు పెరిగితే… ఏమవుతుందో… 

G (31)

దోబూచులాటేలరా…

G (33)

ఎర్ర నీరంటే ఇదేనా…

G (35)

మంచు కురిసే వేళ కాదే…

G (37)

ద గ్రేట్ గ్రాండ్ వాటర్ కేన్యన్

G (43)

నడుమొంపులు ఇక్కడా… వడ్డాణాలు అవుటాఫ్ ఫోకస్‌లోనూ…

G (41)

పులస వొలకి సిక్కినాదా… యేటీ, యింకా నేదా…

G (49)

తమ్ముడూ… గోదావరంటే ఇదే…

G (58)

తాను తెప్పున్న యెగసింది గోదావరీ…

G (68)

గోదావరీ పావనోదార వాఃపూర మఖిల భారతము మాదే కదా మరి…!

ప్రణయ దిగంతాలకు…

నా కలల నిండా నువ్వే

నువ్వు కూడా కలలు కంటూ

ఆ కలలలో నేను పరుచుకుని వుంటాను

నీవు లేక నేనెక్కడికి పోను

నేనీ ప్రపంచంలోకి వచ్చిందే నీకోసం

నా ఆలోచనల నుంచి అడుగుల వరకూ

అన్నీ నీ వైపే వున్నాయి

ఆ మోము మీంచి ముంగురులని తప్పించలేను

ఈ మనసులోంచి నీ ముద్రల్ని తప్పించలేను

నా జీవితంలోకి పూల దారి పరిచాను

దాని మీదుగా నువ్వు నడిచివస్తే

నన్ను మించిన అదృష్టవంతుడెవరు

నా హృదయానికి నీ మనసులో ఒకింత చోటిస్తావా …!

నీ చిరునవ్వుల్ని నా కోసం కొద్దిగా వొలికిస్తావా …!

నా గాలిపాటకి నీ పలుకులతో తళుకులని అద్దుతావా …!

                        (जनम जनम का साथ है అన్న హస్రత్, రఫీ, శంకర్ జైకిషన్ఏమైపోయారు మీరంతా)

అభిజ్ఞాన కుంతలం

నువ్వు నన్ను గుర్తు తెచ్చుకుంటావు

ఓ మంచి పాట నీ వెంట పడ్డపుడు

ఓ వెన్నెల రాత్రి, ఓ వసంతం

మన ప్రేమని జ్ఞాపకం చేస్తుంటే

నా అరచేతిలో నీ ముద్దు ముద్రలేస్తుంటే

కాలం గరిపొడిచిన ఆ క్షణాలని

నువ్వెలా మరిచిపోగలవు

హంసగీతి

మది తలపుల సొగసు కవితవి

అలతి బరువు పూల వన లతవి

మదిని స్పృశించిన వలపు గీతివి

మధుర స్మృతుల మదన పరీమళానివి

నిను మరిచానా నా అస్తిత్వమే శూన్యం

నీ తలపులతో మృత్యువుకి మృదువుగా ఆహ్వానం

Previous Older Entries

%d bloggers like this: