అభిజ్ఞాన కుంతలం

నువ్వు నన్ను గుర్తు తెచ్చుకుంటావు

ఓ మంచి పాట నీ వెంట పడ్డపుడు

ఓ వెన్నెల రాత్రి, ఓ వసంతం

మన ప్రేమని జ్ఞాపకం చేస్తుంటే

నా అరచేతిలో నీ ముద్దు ముద్రలేస్తుంటే

కాలం గరిపొడిచిన ఆ క్షణాలని

నువ్వెలా మరిచిపోగలవు

Advertisements

హంసగీతి

మది తలపుల సొగసు కవితవి

అలతి బరువు పూల వన లతవి

మదిని స్పృశించిన వలపు గీతివి

మధుర స్మృతుల మదన పరీమళానివి

నిను మరిచానా నా అస్తిత్వమే శూన్యం

నీ తలపులతో మృత్యువుకి మృదువుగా ఆహ్వానం

మది – యెద

వలదన్న వినదీ మనసు

ముగుదమీద మనసాయెనంటోంది

కెమ్మోవి కొరకమని కోరుతోంది

అస్తిత్వం కోల్పోయేంత గాఢంగా

కౌగిట పట్టమంటోంది

సౌకుమార్యానికి కర్కశత్వంతో

జత కలపమంటోంది

అందుకే గుండె చీల్చి

మనసుని పూడ్చేసాను

… … …

… … …

గుండె పోటు

వియోగ వహ్ని

కోయిల పాటలో చేదు

యెర్ర గులాబుల కఠిన స్పర్శ

పచ్చటి అడవిలో దావానలం

మంద్రంగా రోదిస్తున్న వీణ తంత్రి

సన్నజాజుల దుర్గంధం

అంటుకున్న మంచు మంట

స్వప్నసీమలకావల…

నీలి నీలి కంట

కన్నీటి నీటి మంట

జ్ఞాపకాల జ్వాల

రగులుతున్న వేళ

రక్తం మరిగి ఆవిరౌతుంటే

నీ మంచు మాటల సోన వాన

నేనిక్కడే ఉండిపోయాను

నువ్వలా కలగా కరిగిపోయావు

అంతర్జ్వాల

నిజం ఎంత నెప్పి పెడుతుంది

ఎన్ని ఊసుల ఊహల్ని

గుండెలో నింపుకుని తెచ్చి

నీ దోసిట్లో పోద్దామనుకున్నాను

నువ్వెదుటపడేసరికవి

రెక్కలొచ్చిన పక్షులై ఎగిరిపోయాయి

సౌందర్యం మరుగున పడి

కర్తవ్యం కనుల ముందు కదలాడుతుంది

నీతో మాట్లాడుతుంటూనే ఉంటాను కానీ

అవన్నీ వాడిపోయిన పూలు, అలిసిపోయిన పిట్టలు

ఎంతో కృత్రిమంగా పెదాల చివర అతికించుకున్న

నవ్వుల మాటు నుంచి వచ్చే

ఆ అబద్ధాలు విని సుకుమారంగా నవ్వి

సుతారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు

తిరిగి ఊహల గులాబులు విచ్చుకోబోతుంటే

నేను చెప్పాలనుకున్నదేదీ

చెప్పలేకపోయాననే నిజం ముల్లు

నెప్పెట్టేలా గుచ్చుకుంటూంటుంది

నిజం ఎంత నెప్పి పెడుతుంది

ప్రణయాభాస

మెలికల ముగ్గు సొంపులా నీ తనూ సౌదామని

నీల నేత్రాకాశంలో తళుక్‌మని మాయమైనా

శిలా సదృశ మనంలో శాశ్వత ముద్ర వడింది

యెడారి గుండెలో

తొలకరి వానజల్లు కురిపించిన

మబ్బుతునకవే నువ్వు

ఆ అంగుళులేమి ఆ కాకలి స్వరమేమి

మంజీర పరీవృత పదయుగళమేమి

అబ్బా …!

నీ పారదర్శ కంఠసీమలో నా రాతి మనసు కరిగి

మృదుస్తనమండల్యాంతరనాళకుహరంలోకి ప్రవహిస్తుంటే

… … …

… … …

ఒద్దు

లావణ్యలత పరివేష్టించడానికి

విద్యుదాఘాతాన్ని చేరొద్దు

Previous Older Entries Next Newer Entries

%d bloggers like this: