కరిగిన (స్వాతి)కిరణం

స్వార్థం ఎటునుంచి ముంచుకొచ్చి కాటువేస్తుందో కానీ మనిషిని కాల్చిపారేస్తుంది. అహంతో కూడిన అసూయకూ నిజం తెలిసిన నైతికతకూ మధ్య రాపిడి జీవితాన్ని శ్రుతి తప్పిస్తుంది. సంగీత సాహిత్య సమలంకృత సైతం వీడిపోతుంది. బిగించిన పిడికిట బందీ చేయాలనుకుంటే కళ మనసుపొరలను కలచివేస్తుంది. ఒక శిష్యుడి ఆత్మత్యాగపు స్వాతికిరణమే ఆ స్వార్థపు పొగమంచును కరిగించగలుగుతుంది.

ప్రేక్షకాభిరుచిని వాణిజ్య విలువలు నిర్దేశించడం పాతుకుపోయిన తెలుగు పరిశ్రమలో ఇలాంటి సంక్లిష్టమైన ఇతివృత్తంతో సినిమా తీయడం దుస్సాహసమే. ఆ పని చేయగలిగిన వాడు, చేసినవాడు కాశీనాథుని విశ్వనాథ్.

తెలుగు సినీ పరిశ్రమలో మహానుభావులైన దిగ్దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ ఆ చలనచిత్రాలకు ఒక చిత్రమైన నడక నేర్పినవాడు విశ్వనాథ్. లలితకళలకు నాయక స్థాయినిచ్చి సినిమాలు తీసి జనరంజకం చేసినవాడు ఆయనే. శాస్త్రీయ సంగీత, సాహిత్య, నృత్యాల పట్ల ప్రేక్షకులకు ఆదరాభిమానాలు కలిగేలా చేసిన ఘనత ఆయనదే. అదే సమయంలో సాంఘికాల్లోనూ తన ముద్ర బలీయం. తెలుగు, కాదు కాదు, భారతీయ సినిమా చరిత్రలో శంకరాభరణ శకం ఆయనదే.

విశ్వనాథ్ సినిమాల్లో తను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పడంలో నాటకీయత పాళ్ళు ఎక్కువ అయిన సందర్భాలు కొన్ని ఉండి ఉండొచ్చు. అది, తన కథని సామాన్య ప్రేక్షకుడికి సైతం చేరవేయడానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చునేమో. కానీ క్లుప్తత విషయంలో కొన్ని సినిమాల్లో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. శంకరాభరణం శంకరశాస్త్రి, సప్తపది హేమ, శ్రుతిలయలు సీత, స్వాతికిరణం అనంతరామశర్మ… నోటిమాటతో కంటె కంటిచూపుతోనే కదిలించివేస్తారు.

భారత చలనచిత్ర చరిత్ర ప్రధాన స్రవంతిలో ఏ దశలోనూ ఒక గుడ్డి పాటగాడు, మూగ చిత్రకారిణి ముఖ్య పాత్రలుగా సినిమా నాకు తెలిసి లేదు. నైరూప్య కళకు చలనచిత్ర రూపం ఇచ్చే ప్రయోగం నాకు తెలిసి ఎవరూ చేయలేదు.

వామపక్ష భావజాలంతో నిండిఉండే సమాంతర సినిమాలు మాత్రమే కళాత్మక చిత్రాలుగా పరిగణించబడే గడ్డ మీద సంప్రదాయికత అభ్యుదయానికి వ్యతిరేకం కాదంటూ, దేశీయ కళలకు ప్రతినిథిగా జెండా ఎగరేసిన సినీ మానిసి ఆయన. ఇజాల ప్రిజాలూ, సైద్ధాంతిక రాద్ధాంతాల నడుమ తెనుగుదనాన్ని, భారతీయతను చాటిచెప్పినవాడాయన.

పండిత పామర జనరంజకమైన పాటలు, హాస్యం విశ్వనాథ్ సినిమాల్లో పడుగుపేకలు. ఉదాత్తత, ఔచిత్యం చెడకుండా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన ఘనాపాఠి. స్త్రీ పాత్రల రూపకల్పనలో ఆయనది అందెవేసిన చేయి. ఆయన సినీగీతాల్లో సంగీత సాహిత్యాల గురించి చర్చించుకోడానికి రోజులు సరిపోవు. వేటూరి, సిరివెన్నెల ఇత్యాదుల రచనలు అన్నిచోట్లా బాగానే ఉండవచ్చు గాక, విశ్వనాథ్ సినిమాల్లో వాటి స్థాయి వేరే.

వ్యక్తిత్వంతో కానీ, రాజకీయంగా కానీ భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గాక… కమలహాసన్ నటన, అందునా విశ్వనాథ్ సినిమాల్లో నటన ఉత్కృష్ట స్థాయిలో ఉంటుంది. సాగరసంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం లాంటి చిత్రాల్లోని పాత్రల సృష్టి అనితరసాధ్యం. సిసలైన నటుడి ప్రతిభకి పూర్తిస్థాయి పరీక్ష పెట్టి, ప్రేక్షకుడికి స్వాదిష్ట భోజనం వడ్డించడంలో వారిద్దరి జోడీ అద్భుతం.

జంధ్యాల వెళ్ళిపోయారు. బాపూరమణలు వెళ్ళిపోయారు. ఇప్పుడు విశ్వనాథ్ వెళ్ళిపోయారు. సింగీతం శ్రీనివాసరావుగారు ఉన్నారు. ఆ తర్వాత తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోడానికి ఇంకేమీ ఉండదేమో.

Leave a comment