శ్యామలాదండకం కాళిదాస కృతం కాదా?

ఉత్పల వేంకట నరసింహాచార్యులు గారు టీకా తాత్పర్యాలతో శ్యామలాదండకాన్ని ప్రచురిస్తూ దానికి రాసిన ముందుమాటలో అసలీ దండకాన్ని కాళిదాసు రాయలేదని వివరించారు. 1918 నాటి ఆ వ్యాసం అవధరించండి..

***************

శ్యామలాదండక మనగా మాతంగీ దేవతను వర్ణించు దండక మని యర్థము. మాతంగీ దేవతకు ‘‘శ్యామలా దేవి’’ యనునది నామాంతరమే కాని వేఱు దేవత గాదు. ఈ విషయము మంత్ర రత్నాకరమున బాలా లఘుశ్యామలా మంత్ర కథన తరంగమునందిట్లు చెప్పబడియున్నది:

‘‘న్యాసానేవం విధాన్ కృత్వా మాతంగీ మాసనే స్మరేత్

 సుధార్ణవాంతరీపస్థ రత్నమందిర మధ్యగే’’

ధ్యానమ్:

                   ‘‘మాణిక్యాభరణాన్వితాం స్మితముఖీమ్ నీలోత్పలాభాంబరాం

                     రమ్యాలక్తకలిప్త పాదకమలాం నేత్రత్రయోల్లాసినీం

                     వీణావాదనతత్పరాం సురనతాం కీరచ్ఛదశ్యామలాం

                     మాతంగీం శశిశేఖరా మనుభజేత్తాంబూలపూర్ణాననామ్’’

                   ‘‘లక్షం జపేన్మధూకోక్తే ర్జుహుయాదయుతం శుభై:

                     మాతంగీప్రోదితే పీఠే లఘుశ్యామాం ప్రపూజయేత్’’

ఇక్కడ ‘‘కీరచ్ఛదశ్యామలాం = చిలుక ఱెక్కల వలె పచ్చని వర్ణము గలది’’ యని చెప్పుట వలన శ్యామల యనియు, ఆ యర్థమే శ్యామా పదము సైతము దెల్పుచున్నదనియు నేర్పడుటయే కాక, ‘‘మాతంగీప్రోదితే పీఠే లఘుశ్యామాం ప్రపూజయేత్’’ ‘మాతంగికిఁ జెప్పబడిన పీఠమున లఘుశ్యామను బూజింపవలెను’ అని విధించుట వలనను, మఱియు:

          ‘‘వాణీ శుకప్రియా జంతా విద్మహే మీనకేతన:

            కామేశ్వరీధీమహీతి త న్నః శ్యామా ప్రచోదయాత్’’

అను మాతంగీ గాయత్రి యందు మాతంగికి శ్యామా పదము పర్యాయపదముగఁ బ్రయోగించి పిదప దానిని (శ్యామాపదఘటితమును) ‘ఏషోదితా తు మాతంగీ గాయత్రీ సర్వసిద్ధిదా’ అని మాతంగ గాయత్రిగ జెప్పుట వలనను, మాతంగీ శ్యామల లొక్కరని చెప్పుటయే యుక్తమని తోఁచుచున్నది. కాఁబట్టియే దండకమునందును కవి ‘శ్యామలే’ అనియు, ‘మత్తమాతంగ కన్యా సమూహాన్వితే’ అనియు శ్యామలామాతంగులకు నైక్యమునే వక్కాణించెను.

ఈ దండకమును రఘువంశశాకుంతలాది కావ్యత్రయనాటకత్రయకర్త యగు మహాకవి కాళిదాసు రచించెనని కొందఱనుచున్నారు; కాని యది విశ్వసనీయము గాదని నా యభిప్రాయము. ఏలయన కవితాశైలిని బట్టియు, వర్ణనా సందర్భమును బట్టియు, ఉచితపదార్థాలంకారాదిసంఘటనముంబట్టియు సూక్ష్మదృష్టిని విమర్శించితిమేనిఁ గాళిదాసుని శైలిలో మిళితము గాలేదు. మఱియు సర్వసామాన్యములగు స్వభావోక్తి వర్ణనలు దక్క సహృదయహృదయంగమములగు వర్ణనలేవియుఁ గనబడవు. సంబోధనాంతములయందుఁ దఱుచుగ రెంటికి రెంటికి నంత్యనియమము గలిగియున్నందున వినుట కింపుగ నున్నను విశేషించి చూచిన నందర్థపుష్టి విశేషముగఁ దోఁచుట లేదు. ఇయ్యది దండకము మొదటనుండి యర్థముఁ జేసికొనుచుఁ జదివి చూచినఁ దెలియును గాన నుదాహరింప ననవసరము. ఇంతమాత్రమున నస్మదాదులకు బొత్తిగ దీసివేఁత కవిత్వము గాదు గాని కాళిదాసాదుల కట్టిదే యనుట సాహసము గాదు.

మఱియు నీ దండకమును గాళిదాసు రచించిన సందర్భమున నొక కట్టుకత కలదు:

          కాళిదాసు బ్రాహ్మణ కులమునఁ బుట్టియు బాల్యముననే యే కారణముననో యెఱుకువాండ్రలోఁ గలిసి చదువుసంధ్యలు లేక తెలివిమాలినవాడై తిరుగుచుండెనఁట. ఆ కాలమున నొక రాజకుమారిక యొక యాస్థాన పండితుని యొద్ద విద్యాభ్యాసమొనర్చి విద్య ముగిసిన పిదప గురుదక్షిణ నీయరాఁగా గురువామె సౌందర్యమునకు మోహించి తన్నుఁ జేపట్టుమని నిర్బంధించెనఁట. రాజకన్నియ బుద్ధిమతి గాన నందుల కొప్పకున్న నతఁడు కోపించి ‘‘పండితునిఁ జేపట్టని నిన్ను పరమమూర్ఖునకుఁ బెండ్లి చేయించెదఁ జూడు నా దెబ్బ!’’ యని బెదరించి పోయెనఁట. అంతఁ గొన్నినాళ్ళకు కన్నియతండ్రి దైవవశమున నీ పండితునే వరాన్వేషణమున నియమింప నతఁడు పూర్వవృత్తము స్మరించి పరమమూర్ఖుని వెదకుచు నొకయడవిలో నీ యెఱుకువానిని (కాళిదాసుని) జిక్కించుకొని పండితవేషము వేసి యెల్లర మోసగించి రాచకన్నియకుఁ బెండ్లి చేసెనట. ఆమె తన పడకటింటిలో నతని మూర్ఖతకు రోసి యిది తన గురువు చేసిన యన్యాయ్యమని యెంచి వరుని సంబోధించి కాళీమంత్రము నుపదేశించి కాళికాలయమునకుఁ బంపెనఁట. అతఁడందుఁ దదేకనిష్ఠతోఁ దపము చేయ గాళి ప్రత్యక్షమై కటాక్షింప నప్పుడతడు విద్యావంతుఁడై యామె నీ దండకముతో స్తుతించెనట!

ఈ కథ నిజముగ జరుగుటయు, జరిగిన నీ దండక కర్తకు సంబంధించి యుండుటయు నెంతవఱకు విశ్వసనీయమోఁ చెప్పఁజాలము. కాళిదాసు కాళీదేవిని గుఱించి స్తుతి చేయునపుడు కాళిని స్తుతింపక మాతంగిని, లేక శ్యామలను ఏల స్తుతించును? శ్యామలా దండకమని పేరేల పెట్టును? కాళికయే మాతంగి యని కాని శ్యామల యని కాని యెచ్చట నైనఁ గలదా? ఒకవేళ గౌణముగఁ గాళికాపరముగ నన్వయింతు మనిన, కవి యట్లు గౌణముగఁ జెప్పుటకు కారణమేమి? దండకములో ‘కాళికే’ యను పద మిముడదా? వేయేల? ఈ దండకము కాళిని గుఱించినది గాదు, కాళిదాసు చేసినదియుఁ గాదు. దండకము మొదటఁ గాని, కడపటఁ గాని గ్రంథకర్త పేరే లేనందున గాళిదాసని చెప్పుటకు నాధారములేదు. ఇఁకనేమన: మాతంగిని (శ్యామలను) ఉపాసించు నెవఁడో యొక కవి రచించి యుండును. ఒకవేళఁ గాళిదాసే యనిన భోజరాజు కాలముననో మఱియు నిటీవలనో యుండిన కాళిదాస కవి యగు నన్న మాత్రాన నాగ్రహము లేదు.

గ్రంథకర్త యెవరైననేమి? ఇది మొత్తము మీద కూడినంతవఱకు రసవంతముగను, చదువునప్పు డుత్సాహకరముగను నున్నదనుటకు సందియము లేదు. దీనిని దఱుచుగ భారతీయులందఱు చదువుదురు గానఁ దెలుగు టీకను వ్రాసి ప్రచురించిన బాగుండునని వివరణము వ్రాసితిని. చదివి యానందింతురు గాక!

1.10.18

చెన్నపురి                                                              ఉత్పల వేంకట నరసింహాచార్యులు

Leave a comment