స్వామి వివేకానంద దృష్టిలో గౌతమ బుద్ధుడు

రచన : పురాణపండ రాఘవరావు

భగవద్గీతలో నిష్కామ కర్మయోగమును గూర్చి విపులంగా బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ కర్మయోగం గురించి మరింత వివరముగా వివేకానంద స్వామి ప్రవచించారు. సనాతన ధర్మ వైశిష్ట్యము గురించి ప్రపంచవ్యాప్తముగా ప్రవచించిన మహాత్ముడు స్వామి వివేకానంద. ఆయన దృష్టిలో నిష్కామ కర్మయోగమును మనసా వాచా కర్మణా అనుష్టించి చూపిన మహనీయుడు గౌతమబుద్ధుడు. అంతేగాక కర్మయోగమును సంపూర్ణముగ ఆచరణలో చూపినవాడు బుద్ధుడు మాత్రమేయని నొక్కి వక్కాణించారు స్వామి. ప్రపంచమున బుద్ధుడు వినా యితర ప్రవక్తలందరూ తమను తాము స్వార్ధరహిత కర్మాచరణమునకు పురికొల్పుటకు బాహ్యాశయములను కలిగియుండిన వారు. బుద్ధుని మినహాయించి మిగిలిన ప్రవక్తలను రెండు తరగతులుగా విభజించవచ్చును. మొదటి తరగతి వారు తాము భగవంతుని అవతారములని పేర్కొన్నారు. రెండవ తరగతి వారు తమలను కేవలం భగవంతుని దూతలు (కుమారులు)గా చెప్పియున్నారు. వారి భావములు ఎంతటి పరమార్థ భావము కలిగియున్నను ఉభయపక్షముల వారు కర్మాచరణమునకు బాహ్యము నుండియే ప్రేరణ పొందియున్నారు. బాహ్యలోకముల నుండి ఫలములను ఆశించిరి.

కాని సిద్ధార్ధుడు మాత్రమే యీ రీతిగా వక్కాణించినాడు. పలు విధములైన మీ సిద్ధాంతములతో నాకు పని లేదు. ఆత్మను గూర్చిన సిద్ధాంత రాద్ధాంతములు చేయుట వలన ఏమాత్రమును ప్రయోజనము లేదు. సత్కర్మలను చేయుచూ సజ్జనులుగా జీవించండి. మంచి పనులు చేయుచూ సజ్జనులుగా జీవించినచో మీరు మోక్షమును పొందగలరు అని బుద్ధుడు బోధించిన విషయములను మనము గుర్తించాలి.

బుద్ధుని జీవితాన్ని పరిశీలించి చూచినచో ఎటువంటి స్వార్థచింతనయు కనబడదు. లోకహితము కొరకు గౌతమ బుద్ధుని కంటె ఎవరును ఎక్కువ కృషి చేయలేదని వివేకానందులు నొక్కి చెప్పారు. తాను బోధించిన అంశములను ఆచరణలో చూపిన సిద్ధార్ధుని మించిన సచ్చరిత్రుని మానవకోటి చరిత్రలో వేరొకరిని చూపగలమా? అని స్వామి సూటిగా ప్రశ్నించారు. గౌతముని వలె సమస్త జీవులను ఆదరించిన, అఖండ సానుభూతిని చూపిన సచ్చరిత్రుడు విశ్వచరిత్రలో ఇంతవరకు వేరొకరు పుట్టలేదని వివేకానంద పేర్కొన్నారు.

మహోన్నత తత్త్వమును బోధించిన తత్త్వజ్ఞ శిఖామణియగు గౌతమ బుద్ధుడు, పరమ నికృష్ట జీవులను కూడా కరుణామయుడై ప్రేమించినాడు. ఎంత మహత్కార్యములు చేసినను తనను గురించి ఎక్కడను ఎప్పుడును చెప్పుకొనని మహనీయుడు గౌతముడు. స్వార్ధరహితుడై జీవించిన బుద్ధుడు ‘‘ఆదర్శ కర్మయోగి’’ అనుట ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అఖండ ధీశక్తితో, అపార ఔదార్యముతో, అనంతాత్మ ప్రభావ భాస్కరునిగా వెలుగొందిన బుద్ధుడు అనుపమాన మహనీయుడు గాదా! మానవ చరిత్రలో అతనికి సాటియగు వారు వేరొకరు లేరు. ప్రపంచ మహా సంస్కర్తలలో అతడే అగ్రగణ్యుడు.

బుద్ధుడు ఇలా ప్రవచించాడు. ఏవో కొన్ని ప్రాచీన వ్రాత ప్రతులలో ఉన్నంత మాత్రాన, ఒక విషయమును యదార్థమని నమ్మకుడు. పరంపరాగతమని కూడా దేనిని సత్యమని నమ్మవలదు. దేశాచారమని కూడా వాస్తవమని నమ్మకండి. ఏ విషయమైనను సంపూర్ణముగా పరిశీలించి, కార్యకారణములను సమగ్రముగా విమర్శించిన తరువాత మాత్రమే, సమస్త మానవ శ్రేయస్కరమని మీకు విశ్వాసము కలిగిన తరువాత మాత్రమే ఏ విషయమునైనను నమ్మగలరు. నమ్మిన దానికి అనుగుణముగా నడుచుకొనగలరు. ఇతరులు మంచి విషయములను అనుసరించునట్లుగా మీరు తోడ్పడండి. ధనమును గాని, పేరు ప్రతిష్ఠలను గాని వాంఛించక, స్వార్ధరహిత కర్మపరాయణుడైన వాడు మాత్రమే మహోత్తమ కర్మయోగి కాగలడు అని గౌతముడు బోధించినాడు. పైరీతిగా ఆచరించు మానవుడు ‘‘అపర బుద్ధునిగా ప్రకాశించగలడని’’ గౌతమ బుద్ధుని గొప్పదనమును గూర్చి స్వామి వివేకానంద పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గన్న స్వామి వివేకానంద సిద్ధార్ధ గౌతముని ‘‘నిష్కామ కర్మయోగము’’ను ప్రశంసించినారు.  

=========  

వైశాఖ పౌర్ణమి బుద్ధపూర్ణిమ సందర్భంగా మిసిమి మాసపత్రిక మే 2023 సంచికలో మా నాన్నగారి ఈ వ్యాసం ప్రచురితమైంది. చిత్రమేంటంటే, ఆ సంచికలో ఈ వ్యాసానికి ముందు, డా. దేవరాజు మహారాజు గారు బుద్ధుడి మాటు నుంచి హిందూ ధర్మం మీద దాడి చేస్తూ రాసిన వ్యాసం ముద్రించారు. దానికి ప్రతిస్పందనగా మా నాన్నగారు మరో వ్యాసం రాసారు. అదింకా ప్రచురితం కాలేదు. ఈలోగా ఈ రెండు నెలల్లో దేవరాజు మహారాజు పలు పత్రికల్లో బుద్ధుడిని అడ్డం పెట్టుకుని హిందూమతం మీద బోలెడన్ని అబద్ధాలు గుప్పిస్తూ పుంఖానుపుంఖాలుగా రాసిపడేసారు. మా నాన్నగారి రెండో వ్యాసాన్ని ‘మిసిమి’ ప్రచురించిన తర్వాత ఇక్కడ పంచుకుంటాను.

=========  

Leave a comment