జమ్మూకశ్మీర్ సంకల్ప్ దివస్ : మన భూమి మనదే

1948లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశ్మీర్‌లోని భారత భూభాగాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం ప్రతీయేడాదీ ఫిబ్రవరి 22ను జమ్మూకశ్మీర్ సంకల్ప్ దివస్‌గా జరుపుకుంటోంది.

1994 ఫిబ్రవరి 22 భారత చరిత్రలో కీలకమైన రోజు. ఆరోజు భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్ ఆక్రమించడం భారత్‌కు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు అని ఆ తీర్మానం సారాంశం. పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది అని పార్లమెంటు ఉభయ సభల సభ్యులూ నిశ్చితంగా ప్రకటించారు. పాకిస్తాన్, తను ఆక్రమించిన ప్రదేశాలను ఉగ్రవాదుల శిక్షణా స్థావరాలుగా మార్చి, భారతదేశానికి హాని కలిగించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు. అలాంటి దుర్మార్గమైన చర్యలకు పాకిస్తాన్ అండగా నిలవడం మానుకోవాలంటూ పిలుపునిచ్చారు.

ఆ తీర్మానం ప్రధానంగా, జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని తేల్చిచెప్పింది. పాకిస్తానీ సైనిక బలగాలు తాము ఆక్రమించుకున్న భారత భూభాగాల నుంచి తక్షణం వైదొలగాలని డిమాండ్ చేసింది. 1971 యుద్ధంలో భారతదేశం చేతిలో ఓడిపోయాక తూర్పు బెంగాల్‌లో ఉన్న తమ 92వేలమంది సైనికులు భారత్‌కు లొంగిపోయినప్పుడు చేసుకున్న సిమ్లా ఒడంబడికకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.    

ఆ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పుడు చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం మానుకోవాలి. అన్ని సమస్యలనూ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. సిమ్లా ఒప్పందం మరో రెండు అంశాల మీద కూడా చూపు సారించింది. మొదటిది – పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భాగంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక రెండవది – పీఓకేలోని ప్రాంతాల్లో ప్రజల దుర్భరమైన జీవన ప్రమాణాలను బహిర్గతం చేసింది.

మొత్తం మీద, సంకల్ప్ దివస్ సారాంశం ఏంటంటే… భారతదేశం తన సార్వభౌమ భౌగోళిక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని రక్షించుకోవాలన్న దృఢసంకల్పం చేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో ఆక్రమించుకున్న భూభాగాల విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని ఆ దేశాన్ని కోరింది.

నేపథ్యం

భారతదేశానికి స్వతంత్రం, బ్రిటిష్ ఆక్రమిత భారతదేశ విభజన తర్వాత అప్పటికి దేశంలో ఉన్న రాజసంస్థానాలకు అవకాశం ఇచ్చారు. తాము భారతదేశంలో విలీనం అవాలా, లేక పాకిస్తాన్‌లో చేరాలా అన్నదే ఆ అవకాశం. దాన్ని బట్టి వివిధ రాజసంస్థానాలు తమ నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రాథమిక నియమానికి 1947 అక్టోబర్ 22,23 తేదీల మధ్య రాత్రి విఘాతం కలిగింది. ఆ రాత్రి పాకిస్తాన్ సైన్యం, తమ ప్రాంతపు గిరిజన తెగలవారితో కలిసి జమ్మూకశ్మీర్ రాజసంస్థానం మీద బలవంతపు దాడికి పాల్పడ్డాయి. ఆ వెంటనే అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరిసింగ్ తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసాడు. తద్వారా భారతదేశం తన సైన్యాన్ని మోహరించడానికి మార్గం సుగమం చేసాడు. అప్పటి భారత ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ఆక్రమణ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్ళాడు, ఆ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరాడు. దాంతో పాకిస్తానీ బలగాలతో యుద్ధం కొనసాగుతుండగా, ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 1949 జనవరి 1 వరకూ యుద్ధవిరమణ ప్రకటించింది. అయితే ఐక్యరాజ్యసమితి తీర్మానాలను, అంతర్జాతీయ చట్టాలనూ ఎంతమాత్రం పట్టించుకోని పాకిస్తాన్, అక్రమ ఆక్రమణలను కొనసాగించింది.

జమ్మూకశ్మీర్‌లోని మీర్‌పుర్-ముజఫరాబాద్ ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. ఆ ప్రాంతం విస్తీర్ణం దాదాపు 14వేల చదరపు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ అంటున్నాము. పాకిస్తాన్ మాత్రం ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ అంటోంది. గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆ ప్రాంతం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని అంతర్భాగంగా ఉంది. పాకిస్తాన్ ఆక్రమణ అక్కడితో ఆగలేదు, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని సుమారు 75వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సైతం ఆక్రమించింది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనదేశం లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం చేసింది. ఇంకా, తూర్పు లద్దాఖ్‌లో మరో భూ ఆక్రమణ చోటు చేసుకుంది. 1962 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకూ జరిగిన చైనా-భారత్ యుద్ధం తర్వాత ఆ దేశం సుమారు 35వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించింది. దాన్నే అక్సాయ్ చిన్ ప్రాంతం అంటారు. అంతేకాదు, 1963 మార్చిలో పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ షాక్స్‌గామ్‌ లోయ వద్ద సుమారు 5100 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు కట్టబెట్టేసింది. భారతదేశానికి చెందిన ఆ భూభాగాలు ఇప్పటికీ పాకిస్తాన్, చైనా అధీనంలోనే ఉన్నాయి. అందువల్ల, భారతదేశం ఆయా ప్రాంతాలపై తన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడమూ, భారతదేశపు భూభాగాన్ని రక్షించుకోవడమూ తప్పనిసరి అయింది.

తీర్మానానికి సందర్భం

1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు చేసిన తీర్మానానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఆ తీర్మానాన్ని చట్టం చేయడానికి కావలసిన నేపథ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ఆ తీర్మానానికి మూలాలు 1984 నుంచీ జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న దుర్మార్గపు సంఘటనల్లో ఉన్నాయి. అప్పుడే కశ్మీర్‌లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి, ఆ ప్రాంతపు స్థానికులైన కశ్మీరీ హిందూ పండితులు అక్కణ్ణుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.  

ఆ తరుణంలో పాకిస్తాన్‌ అమెరికాకు కీలక భాగస్వామిగా ఉంది. ఆప్ఘనిస్తాన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా చేరదీసింది. అలా తనకు అందివచ్చిన భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యతతో పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై రచ్చ చేయడం మొదలుపెట్టింది. జమ్మూకశ్మీర్‌లో ప్లెబిసైట్ అనబడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ పదేపదే గొడవ చేయసాగింది. నిజానికి భారత భూభాగాలలోనుంచి (అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ – గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల నుంచి)ఆ దేశం ఉపసంహరించుంటే తప్ప అక్కడ, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణా చేపట్టే యోచన చేయరాదని ఐక్యరాజ్యసమితి తీర్మానం స్పష్టంగా చెబుతోంది. దాన్ని కూడా పాకిస్తాన్ విస్మరించి, ప్లెబిసైట్ కోసం మొండివాదనలు చేయసాగింది.

1990లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని తిరస్కరిస్తూ, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ – బేనజీర్ భుట్టో నేతృత్వంలో – ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమయంలో జమ్మూకశ్మీర్ విషయంలో అమెరికా పాకిస్తాన్ అనుకూల వైఖరిని అనుసరిస్తోంది. అగ్రరాజ్యం అండ ఉందన్న ధైర్యంతోనే పాకిస్తాన్ ఆ తీర్మానం చేయగలిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, భారతదేశంలో సంస్థానాల విలీనం అనేది బ్రిటిష్ పార్లమెంటు చేసిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనే చట్టం ప్రకారం జరిగిన ప్రక్రియ. ఆ చట్టం ప్రకారమే జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. అందువల్ల ఆ అంశం అంతర్జాతీయ పరిధిలోకి రాదు.

ఆ పరిణామాల మధ్య, పాకిస్తాన్‌కు అమెరికా అండదండలు ఉండడం, భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 1994 మార్చిలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని పాకిస్తాన్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.  జమ్మూకశ్మీర్‌లో భారతదేశం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పాకిస్తాన్ ఒక వాదాన్ని నిర్మించింది. ఆ తీర్మానం కనుక ఆమోదం పొందితే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారతదేశంపై ఆంక్షలు విధించడానికి, భారతదేశం విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోడానికీ మార్గం సుగమం అవుతుంది. అయితే 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అమెరికా పన్నిన కుట్రకు దీటైన స్పందనని వెలువరించింది. ఆ తీర్మానం పాకిస్తాన్ వాదనలను ప్రభావవంతంగా తిప్పికొట్టింది. మొత్తం జమ్మూకశ్మీర్ ప్రాంతం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది. జెనీవా సదస్సులో పాకిస్తాన్ ప్రతిపాదించిన అన్యాయమైన తీర్మానాన్ని తిప్పికొట్టడానికి భారతదేశం ఒక బృందాన్ని పంపించింది. అప్పుడు భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆ బృందానికి నాయకత్వం వహించారు. వారి ప్రయత్నాల ఫలితంగా పాకిస్తాన్‌కు ఇచ్చిన మద్దతును ఇరాన్ వెనక్కు తీసుకుంది. 1994 మార్చి 7న భారత దౌత్యబృందం సాధించిన ఘన విజయమది. ఫలితంగా, జెనీవా సదస్సులో పాకిస్తాన్ తన తీర్మానాన్ని మార్చి 9న ఉపసంహరించుకుంది.

2016 ఆగస్టులో 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు, అప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎర్రకోట సందేశంలో ప్రస్తావన ద్వారా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అంశం పైకి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు. 2019 ఆగస్లు 5న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణానికి సవరణ చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేసారు. గమనించవలసిన విషయం ఏంటంటే 2019 ఆగస్టు 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 1994 నాటి పార్లమెంటు తీర్మానాన్ని మరొక్కసారి ప్రస్తావించి, జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్న విషయాన్ని గుర్తు చేసారు. పాక్ ఆక్రమిత ప్రాంతాలను, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్‌చిన్‌నూ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించారు.

2019 పరిణామాల తర్వాత, భారతదేశపు హోంశాఖ, రక్షణశాఖలు 1994 నాటి పార్లమెంటు తీర్మానాన్ని సందర్భానుసారం ఉటంకించసాగాయి. పాకిస్తాన్‌ తాను ఆక్రమించిన భారత భూభాగాలను వదిలిపెట్టిన తర్వాతనే ఆ దేశంతో ఎలాంటి చర్చలైనా జరుగుతాయని నిస్సందేహంగా ప్రకటించాయి. 2022 అక్టోబర్ 27న శౌర్యదివస్ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను మళ్ళీ స్వాధీనం చేసుకోడానికి భారతదేశం ఏమాత్రం తొణకని కృతనిశ్చయంతో ఉందని, 1994 ఫిబ్రవరి 22 భారత పార్లమెంటు ఏకగ్రీవతీర్మానానికి అనుగుణంగానే ఏ చర్య అయినా తీసుకుంటుందనీ పునరుద్ఘాటించారు. దానికి కొనసాగింపుగా, భారత సైన్యం అధిపతి ముకుంద్ నరవణే కూడా పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి భారత సైన్యం సర్వదా సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఆ విషయంలో భారతదేశం వైఖరి ఏకగ్రీవంగా ఉందని, 1994 ఫిబ్రవరి 22నాటి పార్లమెంటు తీర్మానానికి దేశం మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. ఆ విధంగా 1994 ఫిబ్రవరి 22నాటి పార్లమెంటరీ తీర్మానం భారతదేశ చరిత్రలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందనే విధానానికి పునాదిగా నిలిచింది. అంతేకాదు… జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని పాక్ ఆక్రమిత భూభాగాల్లోని దుర్భరమైన పరిస్థితులను బహిర్గతం చేసి ప్రపంచం దృష్టికి తీసుకునివెళ్ళడం ద్వారా, జమ్మూకశ్మీర్‌లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మనదేశం సమర్థంగా తిప్పికొట్టింది.

మరీ ముఖ్యంగా, 1994 ఫిబ్రవరి 22నాటి తీర్మానం రాజసంస్థానాల విలీన విధానపు చట్టబద్ధతపై పాకిస్తాన్ దురుద్దేశపూర్వకంగా రేపుతున్న అనుమానాలను కచ్చితంగా, నిర్దిష్టంగా, నిస్సందేహంగా తుడిచిపెట్టేలా స్పష్టతనిచ్చింది. ఆ తీర్మానానికి సిమ్లా ఒప్పందంలోని నియమాలే మౌలిక ప్రాతిపదిక అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ పునర్విభజన తర్వాత భారతదేశం మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత భారత భూభాగాలను జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు మ్యాప్‌లో మీర్‌పుర్, ముజఫరాబాద్ జిల్లాలుగా అధికారికంగా ప్రకటించింది. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కూడా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లెహ్ జిల్లాలో భాగంగా, 1901కి ముందున్న సరిహద్దులతో సహా, ప్రకటించింది. అంతేకాదు, న్యాయబద్ధమైన దౌత్యమార్గాల ద్వారా భారత భూభాగాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి భారతదేశపు నిబద్ధతను నిష్కర్షగా ప్రకటించింది. ఈ రకమైన స్పష్టతనివ్వడం భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇదే మొదటిసారి కావడం విశేషం.

Leave a comment