రేపే భారత్ మొదటి ప్రైవేట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ ప్రయోగం

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీ ‘అగ్నికుల్ కాస్మోస్’, అగ్నిబాణ్ అనే రాకెట్‌ను శ్రీహరికోట నుంచి రోదసిలోకి మార్చి 22న ప్రయోగించనుంది.

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష పరిశోధనల అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తమ మొట్టమొదటి రాకెట్ ‘అగ్నిబాణ్’ సబ్-ఆర్బిటల్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకుంటోంది.

ఈ ‘అగ్నిబాణ్’కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్. భారతదేశంలో మొదటిసారి సెమీ-క్రయోజెనిక్ ఇంజన్‌తో లాంచ్ అవుతున్న రాకెట్ ఇది. అంతేకాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్‌పీస్-త్రీడీ ప్రింటెడ్-ఇంజన్‌ను దేశీయంగా డిజైన్ చేసి, తయారుచేసి ఈ రాకెట్‌ ప్రయోగంలో వాడుతున్నారు. 

అగ్నికుల్ కాస్మోస్ సంస్థను శ్రీనాథ్ రవిచంద్రన్, మొయిన్ ఎస్‌పిఎం, సత్య చక్రవర్తి కలిసి 2017లో ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ఇస్రో అనుభవాన్నీ, ఇస్రోలోని మౌలిక సదుపాయాలనూ ఉపయోగించుకుంటూ ప్రైవేటు రంగంలో రాకెట్ తయారీకి ఇస్రోతో డిసెంబర్ 2020లో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి దేశీయ కంపెనీ ఇదే.

అగ్నికుల్ కాస్మోస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఐఐటీ మద్రాస్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ అయిన సత్య చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ గురించి ‘‘ఇది భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ ఆక్సిజన్ కిరోసిన్ రాకెట్ ఫ్లైట్, మన దేశంలో ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేసిన మొదటి రాకెట్ ఫ్లైట్ కూడా ఇదే’’ అని చెప్పారు.

‘‘మరీ ముఖ్యంగా, మేము పేటెంట్ చేసుకున్న ‘సింగిల్ పీస్ త్రీడీ  ప్రింటెడ్ రాకెట్’ను ప్రయోగించనున్నాం. ఇది మౌలికంగా ఒక సబ్-ఆర్బిటల్ ఫ్లైట్. అయితే ఇది సౌండింగ్ రాకెట్ మాత్రం కాదు. కొన్ని వేల సిమ్యులేషన్స్ చేసి, లాంచ్‌ప్యాడ్‌ నుంచి సేఫ్టీ రేడియస్‌ను లెక్కగట్టాం. మనదేశంలో ఫ్లైట్ టెర్మినేషన్ సిస్టం కావలసిన మొదటి ప్రైవేట్ స్పేస్ లాంచ్ ఇదే’’ అని సత్య చక్రవర్తి చెప్పారు. ఈ ప్రయోగం తర్వాత పోస్ట్ ఫ్లైట్ అనాలసిస్ ఉంటుందని, ప్రాజెక్టులోని అన్ని సబ్-సిస్టమ్‌ల పనితీరునూ విశ్లేషిస్తామనీ వివరించారు. ఆ తర్వాత ఆర్బిటల్ ఫ్లైట్‌కు సిద్ధమవడమే భవిష్యత్ ప్రణాళిక అని చెప్పారు.

అగ్నిబాణ్ నిజానికి భారతదేశంలో అభివృద్ధి చేసిన రెండవ ప్రైవేట్ రాకెట్. 2022లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్‌ను శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ నుంచి ప్రయోగించారు. కానీ, ‘ప్రారంభ్’ అనే పేరుతో చేపట్టిన ఆ మిషన్ విఫలమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ ఆ 6 మీటర్ల పొడవైన రాకెట్‌ను డెవలప్  చేసింది. ప్రయోగ సమయంలో విక్రమ్-ఎస్ 89.5 కిలోమీటర్ల పీక్ ఆల్టిట్యూడ్‌కు చేరుకుని, లాంచ్ చేసిన 5 నిమిషాల్లోనే బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది.

జమ్మూకశ్మీర్ సంకల్ప్ దివస్ : మన భూమి మనదే

1948లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశ్మీర్‌లోని భారత భూభాగాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం ప్రతీయేడాదీ ఫిబ్రవరి 22ను జమ్మూకశ్మీర్ సంకల్ప్ దివస్‌గా జరుపుకుంటోంది.

1994 ఫిబ్రవరి 22 భారత చరిత్రలో కీలకమైన రోజు. ఆరోజు భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్ ఆక్రమించడం భారత్‌కు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు అని ఆ తీర్మానం సారాంశం. పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది అని పార్లమెంటు ఉభయ సభల సభ్యులూ నిశ్చితంగా ప్రకటించారు. పాకిస్తాన్, తను ఆక్రమించిన ప్రదేశాలను ఉగ్రవాదుల శిక్షణా స్థావరాలుగా మార్చి, భారతదేశానికి హాని కలిగించడాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు. అలాంటి దుర్మార్గమైన చర్యలకు పాకిస్తాన్ అండగా నిలవడం మానుకోవాలంటూ పిలుపునిచ్చారు.

ఆ తీర్మానం ప్రధానంగా, జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని తేల్చిచెప్పింది. పాకిస్తానీ సైనిక బలగాలు తాము ఆక్రమించుకున్న భారత భూభాగాల నుంచి తక్షణం వైదొలగాలని డిమాండ్ చేసింది. 1971 యుద్ధంలో భారతదేశం చేతిలో ఓడిపోయాక తూర్పు బెంగాల్‌లో ఉన్న తమ 92వేలమంది సైనికులు భారత్‌కు లొంగిపోయినప్పుడు చేసుకున్న సిమ్లా ఒడంబడికకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.    

ఆ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పుడు చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం మానుకోవాలి. అన్ని సమస్యలనూ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. సిమ్లా ఒప్పందం మరో రెండు అంశాల మీద కూడా చూపు సారించింది. మొదటిది – పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భాగంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక రెండవది – పీఓకేలోని ప్రాంతాల్లో ప్రజల దుర్భరమైన జీవన ప్రమాణాలను బహిర్గతం చేసింది.

మొత్తం మీద, సంకల్ప్ దివస్ సారాంశం ఏంటంటే… భారతదేశం తన సార్వభౌమ భౌగోళిక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని రక్షించుకోవాలన్న దృఢసంకల్పం చేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో ఆక్రమించుకున్న భూభాగాల విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని ఆ దేశాన్ని కోరింది.

నేపథ్యం

భారతదేశానికి స్వతంత్రం, బ్రిటిష్ ఆక్రమిత భారతదేశ విభజన తర్వాత అప్పటికి దేశంలో ఉన్న రాజసంస్థానాలకు అవకాశం ఇచ్చారు. తాము భారతదేశంలో విలీనం అవాలా, లేక పాకిస్తాన్‌లో చేరాలా అన్నదే ఆ అవకాశం. దాన్ని బట్టి వివిధ రాజసంస్థానాలు తమ నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రాథమిక నియమానికి 1947 అక్టోబర్ 22,23 తేదీల మధ్య రాత్రి విఘాతం కలిగింది. ఆ రాత్రి పాకిస్తాన్ సైన్యం, తమ ప్రాంతపు గిరిజన తెగలవారితో కలిసి జమ్మూకశ్మీర్ రాజసంస్థానం మీద బలవంతపు దాడికి పాల్పడ్డాయి. ఆ వెంటనే అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరిసింగ్ తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసాడు. తద్వారా భారతదేశం తన సైన్యాన్ని మోహరించడానికి మార్గం సుగమం చేసాడు. అప్పటి భారత ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ఆక్రమణ విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్ళాడు, ఆ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరాడు. దాంతో పాకిస్తానీ బలగాలతో యుద్ధం కొనసాగుతుండగా, ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి 1949 జనవరి 1 వరకూ యుద్ధవిరమణ ప్రకటించింది. అయితే ఐక్యరాజ్యసమితి తీర్మానాలను, అంతర్జాతీయ చట్టాలనూ ఎంతమాత్రం పట్టించుకోని పాకిస్తాన్, అక్రమ ఆక్రమణలను కొనసాగించింది.

జమ్మూకశ్మీర్‌లోని మీర్‌పుర్-ముజఫరాబాద్ ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. ఆ ప్రాంతం విస్తీర్ణం దాదాపు 14వేల చదరపు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ అంటున్నాము. పాకిస్తాన్ మాత్రం ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ అంటోంది. గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆ ప్రాంతం ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలోని అంతర్భాగంగా ఉంది. పాకిస్తాన్ ఆక్రమణ అక్కడితో ఆగలేదు, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని సుమారు 75వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సైతం ఆక్రమించింది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనదేశం లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగం చేసింది. ఇంకా, తూర్పు లద్దాఖ్‌లో మరో భూ ఆక్రమణ చోటు చేసుకుంది. 1962 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకూ జరిగిన చైనా-భారత్ యుద్ధం తర్వాత ఆ దేశం సుమారు 35వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించింది. దాన్నే అక్సాయ్ చిన్ ప్రాంతం అంటారు. అంతేకాదు, 1963 మార్చిలో పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ షాక్స్‌గామ్‌ లోయ వద్ద సుమారు 5100 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు కట్టబెట్టేసింది. భారతదేశానికి చెందిన ఆ భూభాగాలు ఇప్పటికీ పాకిస్తాన్, చైనా అధీనంలోనే ఉన్నాయి. అందువల్ల, భారతదేశం ఆయా ప్రాంతాలపై తన చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడమూ, భారతదేశపు భూభాగాన్ని రక్షించుకోవడమూ తప్పనిసరి అయింది.

తీర్మానానికి సందర్భం

1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు చేసిన తీర్మానానికి భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఆ తీర్మానాన్ని చట్టం చేయడానికి కావలసిన నేపథ్యాన్ని అర్ధం చేసుకోవాలి. ఆ తీర్మానానికి మూలాలు 1984 నుంచీ జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న దుర్మార్గపు సంఘటనల్లో ఉన్నాయి. అప్పుడే కశ్మీర్‌లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయి, ఆ ప్రాంతపు స్థానికులైన కశ్మీరీ హిందూ పండితులు అక్కణ్ణుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.  

ఆ తరుణంలో పాకిస్తాన్‌ అమెరికాకు కీలక భాగస్వామిగా ఉంది. ఆప్ఘనిస్తాన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, పాకిస్తాన్‌ను వ్యూహాత్మకంగా చేరదీసింది. అలా తనకు అందివచ్చిన భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యతతో పాకిస్తాన్ జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై రచ్చ చేయడం మొదలుపెట్టింది. జమ్మూకశ్మీర్‌లో ప్లెబిసైట్ అనబడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటూ పదేపదే గొడవ చేయసాగింది. నిజానికి భారత భూభాగాలలోనుంచి (అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ – గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల నుంచి)ఆ దేశం ఉపసంహరించుంటే తప్ప అక్కడ, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణా చేపట్టే యోచన చేయరాదని ఐక్యరాజ్యసమితి తీర్మానం స్పష్టంగా చెబుతోంది. దాన్ని కూడా పాకిస్తాన్ విస్మరించి, ప్లెబిసైట్ కోసం మొండివాదనలు చేయసాగింది.

1990లో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని తిరస్కరిస్తూ, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ – బేనజీర్ భుట్టో నేతృత్వంలో – ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమయంలో జమ్మూకశ్మీర్ విషయంలో అమెరికా పాకిస్తాన్ అనుకూల వైఖరిని అనుసరిస్తోంది. అగ్రరాజ్యం అండ ఉందన్న ధైర్యంతోనే పాకిస్తాన్ ఆ తీర్మానం చేయగలిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, భారతదేశంలో సంస్థానాల విలీనం అనేది బ్రిటిష్ పార్లమెంటు చేసిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనే చట్టం ప్రకారం జరిగిన ప్రక్రియ. ఆ చట్టం ప్రకారమే జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. అందువల్ల ఆ అంశం అంతర్జాతీయ పరిధిలోకి రాదు.

ఆ పరిణామాల మధ్య, పాకిస్తాన్‌కు అమెరికా అండదండలు ఉండడం, భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 1994 మార్చిలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని పాకిస్తాన్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.  జమ్మూకశ్మీర్‌లో భారతదేశం మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పాకిస్తాన్ ఒక వాదాన్ని నిర్మించింది. ఆ తీర్మానం కనుక ఆమోదం పొందితే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారతదేశంపై ఆంక్షలు విధించడానికి, భారతదేశం విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోడానికీ మార్గం సుగమం అవుతుంది. అయితే 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అమెరికా పన్నిన కుట్రకు దీటైన స్పందనని వెలువరించింది. ఆ తీర్మానం పాకిస్తాన్ వాదనలను ప్రభావవంతంగా తిప్పికొట్టింది. మొత్తం జమ్మూకశ్మీర్ ప్రాంతం మీద భారతదేశానికి ఉన్న తిరుగులేని చట్టబద్ధమైన న్యాయబద్ధమైన సార్వభౌమాధికారాన్ని పునరుద్ఘాటించింది. జెనీవా సదస్సులో పాకిస్తాన్ ప్రతిపాదించిన అన్యాయమైన తీర్మానాన్ని తిప్పికొట్టడానికి భారతదేశం ఒక బృందాన్ని పంపించింది. అప్పుడు భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆ బృందానికి నాయకత్వం వహించారు. వారి ప్రయత్నాల ఫలితంగా పాకిస్తాన్‌కు ఇచ్చిన మద్దతును ఇరాన్ వెనక్కు తీసుకుంది. 1994 మార్చి 7న భారత దౌత్యబృందం సాధించిన ఘన విజయమది. ఫలితంగా, జెనీవా సదస్సులో పాకిస్తాన్ తన తీర్మానాన్ని మార్చి 9న ఉపసంహరించుకుంది.

2016 ఆగస్టులో 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు, అప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎర్రకోట సందేశంలో ప్రస్తావన ద్వారా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అంశం పైకి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు. 2019 ఆగస్లు 5న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణానికి సవరణ చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేసారు. గమనించవలసిన విషయం ఏంటంటే 2019 ఆగస్టు 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 1994 నాటి పార్లమెంటు తీర్మానాన్ని మరొక్కసారి ప్రస్తావించి, జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్న విషయాన్ని గుర్తు చేసారు. పాక్ ఆక్రమిత ప్రాంతాలను, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్‌చిన్‌నూ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించారు.

2019 పరిణామాల తర్వాత, భారతదేశపు హోంశాఖ, రక్షణశాఖలు 1994 నాటి పార్లమెంటు తీర్మానాన్ని సందర్భానుసారం ఉటంకించసాగాయి. పాకిస్తాన్‌ తాను ఆక్రమించిన భారత భూభాగాలను వదిలిపెట్టిన తర్వాతనే ఆ దేశంతో ఎలాంటి చర్చలైనా జరుగుతాయని నిస్సందేహంగా ప్రకటించాయి. 2022 అక్టోబర్ 27న శౌర్యదివస్ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలను మళ్ళీ స్వాధీనం చేసుకోడానికి భారతదేశం ఏమాత్రం తొణకని కృతనిశ్చయంతో ఉందని, 1994 ఫిబ్రవరి 22 భారత పార్లమెంటు ఏకగ్రీవతీర్మానానికి అనుగుణంగానే ఏ చర్య అయినా తీసుకుంటుందనీ పునరుద్ఘాటించారు. దానికి కొనసాగింపుగా, భారత సైన్యం అధిపతి ముకుంద్ నరవణే కూడా పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోడానికి భారత సైన్యం సర్వదా సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఆ విషయంలో భారతదేశం వైఖరి ఏకగ్రీవంగా ఉందని, 1994 ఫిబ్రవరి 22నాటి పార్లమెంటు తీర్మానానికి దేశం మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. ఆ విధంగా 1994 ఫిబ్రవరి 22నాటి పార్లమెంటరీ తీర్మానం భారతదేశ చరిత్రలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందనే విధానానికి పునాదిగా నిలిచింది. అంతేకాదు… జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని పాక్ ఆక్రమిత భూభాగాల్లోని దుర్భరమైన పరిస్థితులను బహిర్గతం చేసి ప్రపంచం దృష్టికి తీసుకునివెళ్ళడం ద్వారా, జమ్మూకశ్మీర్‌లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మనదేశం సమర్థంగా తిప్పికొట్టింది.

మరీ ముఖ్యంగా, 1994 ఫిబ్రవరి 22నాటి తీర్మానం రాజసంస్థానాల విలీన విధానపు చట్టబద్ధతపై పాకిస్తాన్ దురుద్దేశపూర్వకంగా రేపుతున్న అనుమానాలను కచ్చితంగా, నిర్దిష్టంగా, నిస్సందేహంగా తుడిచిపెట్టేలా స్పష్టతనిచ్చింది. ఆ తీర్మానానికి సిమ్లా ఒప్పందంలోని నియమాలే మౌలిక ప్రాతిపదిక అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ పునర్విభజన తర్వాత భారతదేశం మొట్టమొదటిసారి పాక్ ఆక్రమిత భారత భూభాగాలను జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు మ్యాప్‌లో మీర్‌పుర్, ముజఫరాబాద్ జిల్లాలుగా అధికారికంగా ప్రకటించింది. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని కూడా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని లెహ్ జిల్లాలో భాగంగా, 1901కి ముందున్న సరిహద్దులతో సహా, ప్రకటించింది. అంతేకాదు, న్యాయబద్ధమైన దౌత్యమార్గాల ద్వారా భారత భూభాగాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికి భారతదేశపు నిబద్ధతను నిష్కర్షగా ప్రకటించింది. ఈ రకమైన స్పష్టతనివ్వడం భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇదే మొదటిసారి కావడం విశేషం.

అక్సాయ్ చిన్‌లో చైనా అరాచకాలు

లద్దాఖ్ ఉత్తరభాగంలోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున 60 కిలోమీటర్ల ఎగువన కొండ ప్రాంతంలో చైనా సైన్యాలు సొరంగాలు తవ్వుతున్నాయి. అక్కడ తమ సైన్యం కోసం, ఆయుధాలు నిల్వ చేయడం కోసం చైనా బంకర్లు, షెల్టర్లు నిర్మిస్తోంది.

చైనా నిర్మాణాలు చేపట్టిన భూభాగం వాస్తవాధీన రేఖకు తూర్పుదిక్కున అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం చారిత్రకంగా భారత్ అంతర్భాగమే అయినప్పటికీ చైనా తమ భూభాగంగా చెప్పుకుంటోంది.  

అమెరికాకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాల సంస్థ మాక్సార్ తీసిన చిత్రాలు చైనా అరాచకాన్ని బహిర్గతం చేసాయి. అక్కడ నదీలోయకు రెండువైపులా ఉన్న పర్వత ప్రాంతాల్లో కనీసం 11చోట్ల నిర్మాణాలు చేపట్టడం ఆ చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోంది. భారీ నిర్మాణాలకు ఉపయోగించే ఎర్త్ మూవింగ్ మెషీన్స్ పెద్దసంఖ్యలో తిరుగుతుండడం కూడా ఆ చిత్రాల ద్వారా వెల్లడయింది.

ప్రాదేశికంగా భారత్‌కున్న అనుకూలతను మార్చలేని నిరాశతోనే చైనా అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘‘అక్సాయ్ చిన్‌లో భారత వైమానిక దళానికి పట్టు ఉంది. దాన్ని అధిగమించడానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దులకు అత్యంత చేరువలో భూగర్భ సొరంగాలు తవ్వడం, భూమి మీద భారీ నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యల ద్వారా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది’’ అని ఇంటెల్ ల్యాబ్‌కు చెందిన డామియెన్ సైమన్ వ్యాఖ్యానించారు.

‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం తన బలాన్ని సమర్థంగా పెంచుకుంది. ప్రత్యేకించి లాంగ్ రేంజ్ ట్యూబ్ అండ్ రాకెట్ ఆర్టిలరీని బలోపేతం చేసుకుంది. దాన్ని తప్పించుకోడానికే పర్వత ప్రాంతాల్లో భూగర్భ సొరంగాలు తవ్వుతున్నారు. టిబెట్‌లో చైనా చొరబాటును అడ్డుకునేలా భారత సైన్యం ప్రమాదకరంగా మారడంతో ఆ ముప్పును తప్పించుకునేందుకే పటిష్టమైన షెల్టర్లు, బంకర్లు, సొరంగాలు భారీ ఎత్తున నిర్మించడం, రహదారులను వెడల్పు చేయడం వంటి పనులు చేస్తోంది’’ అని, భారతదేశానికి చెందిన ప్రముఖ డ్రోన్ కంపెనీ న్యూ స్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్ సీఈఓ సమీర్ జోషి వివరించారు.

లద్దాఖ్ ప్రాంతంలో భారత వైమానిక దళం పలు ఎయిర్‌బేస్‌లను నిర్వహిస్తోంది. శ్రీనగర్, అవంతిపురా ఎప్పటినుంచో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఫైటర్‌బేస్‌లుగా ఉన్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో న్యోమా దగ్గర ఎయిర్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్ ఉంది. అక్కడి రన్‌వేని మరింత విస్తరించడానికి భారత వైమానిక దళం సిద్ధంగా ఉంది. అది పూర్తయితే చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు కేవలం 50 కిలోమీటర్ల కంటె తక్కువ దూరంలోనుంచే ఫైటర్ విమానాలను ప్రయోగించగల సామర్థ్యం భారత్‌కు కలుగుతుంది.

‘‘ఒకవేళ పూర్తిస్థాయి సైనికచర్య లాంటి పరిస్థితి తలెత్తితే సైనిక, వైమానిక దాడులు చేయడానికి వీలుగా లద్దాఖ్‌లో తన బలాన్ని పెంచుకోడానికే చైనా ఈ నిర్మాణాలు చేస్తోందన్న సంగతి స్పష్టమవుతోంది. అక్కడ భూగర్భంలో గోదాములు, ఉపరితలంపైన కమాండ్ పొజిషన్లు నిర్మిస్తుండడం కనిపిస్తోంది. దానివల్ల చైనా తమ కార్యకలాపాలను విస్తరించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో సాయుధ ఘర్షణ తలెత్తితే భారత సైనికులు అక్కడికి చేరకుండా నిలువరించగలదు’’ అని ‘ఫోర్స్ అనాలసిస్’లో చీఫ్ మిలటరీ ఎనలిస్ట్ అయిన సిమ్ టాక్ విశ్లేషించారు.

డిసెంబర్ 2021లో ఇదే స్థలంలో నదీపరీవాహక ప్రాంతం వెంబడి పెద్దసంఖ్యలో గట్లు, రివెట్‌మెంట్‌లు నిర్మించడాన్ని గుర్తు చేసుకుంటే, లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత చైనా దేశాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు చైనా బలగాలు భారత్‌లోకి చొచ్చుకుని రావడానికి ఈ ప్రాంతమే కీలకమైన స్టేజింగ్ పాయింట్‌గా నిలిచింది. సరిగ్గా అదే ప్రాంతంలో ఇప్పుడు చైనా భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతోంది.

ఇక్కడ కడుతున్న బంకర్లను పరిశీలిస్తే, వాటిని కొండప్రాంతంలో పటిష్టంగా నిర్మిస్తున్నారు. అంతే కాదు, దాడి జరిగినప్పుడు దాని ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాలను డిజైన్ చేసారు.   

ఆగస్టు 18 నాటి తాజా చిత్రాలను చూస్తే, లోయప్రాంతాన్ని ఆనుకుని 4 రీఇన్‌ఫోర్స్‌డ్‌ పెర్సొనెల్ బంకర్లు, 3 సొరంగాలు, నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ ఒక్కొక్క ప్రదేశంలో కొండ మీదకు 2 నుంచి 5 మార్గాలు నిర్మిస్తున్నారు. చాలా ప్రదేశాల్లో భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు కనిపిస్తున్నాయి. లోయ మీదుగా వెళ్ళే రహదారిని భారీ వాహనాలు వెళ్ళడానికి వీలుగా వెడల్పు చేసారు. అలాగే, బంకర్ల మీద నేరుగా దాడి చేసినా ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేందుకు వాటి చుట్టూ ఉన్న భూభాగాన్ని మెరక చేసారు. ఒకవేళ దాడి జరిగితే దాని ప్రభావం లేకుండా తప్పించుకోడానికి వీలుగా ఎంట్రీ, ఎగ్జిట్ ఏరియాస్‌ని ప్రత్యేకమైన ఫోర్క్ డిజైన్‌లో నిర్మించారు.

‘‘వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా శాశ్వత ప్రాతిపదికన బంకర్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం వారి మొండివైఖరికి నిదర్శనం. భారత్‌తో సైనిక ఘర్షణ వైఖరిని ముగించాలన్న ఉద్దేశం చైనాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. నిజానికి అక్సాయ్ చిన్‌లో ఈ నిర్మాణాలు తూర్పు లద్దాఖ్ నుంచి అరుణాచల్-టిబెట్ సరిహద్దు వరకూ ఉన్న ఇతర సరిహద్దు ప్రాంతాల్లోకి విస్తరించేలా కొత్త శాశ్వత సైనిక నిర్మాణాలు చేపడుతోందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి’’ అని, చైనా వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ విశ్లేషించారు.

అక్సాయ్ చిన్‌లోని నదీలోయ ప్రాంతంలో డిసెంబర్ 2021 నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే, అప్పట్లో ఆ ప్రాంతంలో పెద్దగా నిర్మాణాలేమీ లేవు. కానీ ఆగస్టు 2023 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

నిజానికి వాస్తవాధీన రేఖ వెంబడి సంక్షోభాన్ని నివారించడానికి భారత్ చైనాలు నో పెట్రోల్ జోన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఎత్తయిన ప్రదేశంలో ఉన్న దెప్సాంగ్ మైదానంలో 2020 కంటె ముందే ఉన్న మన పెట్రోలింగ్ జోన్స్‌లోకి సైతం వెళ్ళకుండా చైనా నిలువరిస్తూండడం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇరు సైన్యాల మధ్యా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, వాస్తవాధీన రేఖకు అత్యంత చేరువలో సంక్లిష్టమైన మిలటరీ కాంప్లెక్స్‌లు నిర్మించడానికి చైనా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండడాన్ని గమనిస్తే, దాని దురుద్దేశాలు ఇట్టే సుస్పష్టమవుతున్నాయి.  

మే 2020లో ఈశాన్య లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో చైనా సైనికులు చొరబడడానికి ప్రయత్నించారు. వారిని భారత సైనికులు ప్రతిఘటించారు. 1962 యుద్ధం తర్వాత భారత్ మీద చైనా చేసిన అత్యంత భయంకరమైన దాడులు అవే. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో బాహాబాహీ ఘర్షణల్లో భారతదేశానికి చెందిన 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైనికులు కనీసం 38మంది చైనా సైనికులను హతమార్చారు. అయితే చైనా అధికారికంగా తమ సైనికులు నలుగురు మాత్రమే చనిపోయారని ప్రకటించింది.

చంద్రయాన్‌పై కుళ్ళుజోకును సమర్ధించుకుంటున్న ప్రకాష్‌రాజ్‌

చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు మొట్టమొదటిసారి అడుగుపెడుతున్న ఘనతను సాధించడానికి భారత్ ఇంకొక్కరోజు దూరంలో ఉంది. దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు సైతం భారత్ ప్రయోగించిన చంద్రయాన్3 సాఫల్యం కోసం ఎదురు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన లూనా 25 కూలిపోయిన తర్వాత ఉత్కంఠ మరీ పెరిగిపోయింది. అగ్రరాజ్యాలు సైతం సాహసించని కొత్త ప్రదేశంలో భారత శాస్త్రవేత్తలు ప్రయోగించిన ల్యాండర్ అడుగు పెట్టబోతోంది.

ఇలాంటి సమయంలో ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్ దేశప్రజలకు చిర్రెక్కించింది. రోదసీ ప్రయోగాలను అపహాస్యం చేస్తూ కుళ్ళు జోకు వేసిన ప్రకాష్‌రాజ్…. దాని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే… దాన్ని కూడా సహించలేక తన జోకును సమర్ధించుకుంటున్నాడు. పైగా తాను పాత మళయాళం జోకును గుర్తు చేసానే తప్ప ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదంటూ సమర్ధించుకుంటున్నాడు. సమాజంలో ఒక ఉన్నత స్థాయిలోనూ, ఒక వర్గం ప్రజలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలోనూ ఉన్నవాడు చేయకూడని పని చేసి పైగా ఎదుటివాళ్ళకు హాస్యాన్ని ఆస్వాదించడం చేతకాదంటూ వెటకరిస్తున్నాడు.

జస్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్‌తో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా గత నాలుగేళ్ళలోనూ ఎన్నో ట్వీట్లు పెట్టిన ప్రకాష్‌రాజ్ తాజాగా ఆదివారం నాడు, చంద్రయాన్3 ప్రయోగాన్ని అపహాస్యం చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. ‘‘విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద తీసిన మొదటి పిక్చర్’’ అన్న క్యాప్షన్‌తో ఒక కేరళ చాయ్‌వాలా బొమ్మని ట్వీట్ చేసాడు. దాన్ని బ్రేకింగ్ న్యూస్ అని చెబుతూ దానికి జస్ట్ ఆస్కింగ్ అన్న ట్యాగ్ కూడా తగిలించాడు.

అయితే ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌ను ప్రజలు సహించలేకపోయారు. ఒకపక్క భారతదేశం గర్వించదగిన ప్రయోగ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే, దాన్ని అపహాస్యం చేస్తూ వెటకారపు పోస్ట్ పెట్టడాన్ని నెటిజన్లు దుయ్యబట్టారు. ఆ పోస్ట్ సున్నితమైన హాస్యం కాదనీ, తోలుమందపు పరుష వ్యాఖ్య మాత్రమేనని మండిపడ్డారు. దేశ వైజ్ఞానికులను అపహాస్యం చేస్తూ అవమానించేలా ఉందనీ విరుచుకుపడ్డారు. మూన్ మిషన్‌ను విజయవంతం చేస్తున్న శాస్త్రవేత్తల పట్ల కొద్దిగానైనా గౌరవం ఉంచమని కోరారు.

‘‘రాజకీయ దృక్పథం ఏదైనా కావచ్చు, కానీ చంద్రయాన్3 ప్రయోగాన్ని చూసి దేశమంతా గర్వించాలి. రాజకీయానికీ, జాతీయతా దృక్పథానికీ తేడా తెలుసుకోవాలి’’ అని ఒక నెటిజెన్ వ్యాఖ్యానించాడు.

‘‘ఒక వ్యక్తిని ద్వేషించడం వేరు, నీ దేశాన్నే ద్వేషించడం వేరు. నీ ఈ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది’’ అంటూ మరొక నెటిజెన్ స్పందించాడు.

ఇలాంటి విమర్శలు దేశమంతా వెల్లువెత్తుతుండడంతో ప్రకాష్‌రాజ్‌ ప్లేటు మార్చాడు. తాను చేసిన సిగ్గుమాలిన పనికి మౌనంగా ఊరుకోవడమో లేక క్షమాపణలు చెప్పుకోవడమో చేయకుండా, తన వాదనను సమర్థించుకున్నాడు. తనను విమర్శించే ప్రజలందరి మీదా ద్వేషులు అని ముద్ర వేసేసాడు.

ఆదివారం ట్విట్టర్‌లో ప్రకాష్‌రాజ్‌ తన తాజా వాదనను ఇలా వినిపించాడు. ‘‘ద్వేషం కేవలం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది. నేను ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి కేరళ చాయ్‌వాలా జోక్‌ని గుర్తు చేసాను, అంతే. నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఏ చాయ్‌వాలా అనుకున్నారో మరి. ఒక జోక్ అర్ధం కాకపోతే, అది మీ మీద వేసిన జోకే అయి ఉంటుంది. ఎదగండి’’ అని ట్వీట్ చేసాడు.

అయితే ప్రకాష్‌రాజ్‌ ఉద్దేశం సుస్పష్టం. జస్ట్ ఆస్కింగ్ అన్న ట్యాగ్‌తో ఇన్నాళ్ళూ ప్రకాష్‌రాజ్‌ ఎవరిని లక్ష్యం చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల తన వ్యతిరేకతను ప్రకాష్‌రాజ్‌ ఏనాడూ దాచుకోలేదు. ఇప్పుడు చంద్రయాన్ సందర్భంగా కేరళ చాయ్‌వాలాను సాకుగా పెట్టుకుని కుళ్ళుజోకు వేసాడు. దాన్ని సమర్ధించుకుంటున్నాడు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కాలం నాటి మళయాళీ జోకును గుర్తు చేసానని చెబుతున్నాడు. తన సంస్కారాన్ని మరోసారి బైటపెట్టుకున్నాడు. ఒకటి మాత్రం నిజం. ప్రకాష్‌రాజ్‌ చెప్పినట్టు ద్వేషం అన్నిటిలోనూ ద్వేషాన్నే చూస్తుంది. నరేంద్ర మోదీ మీద తన ద్వేషం కారణంగా చంద్రయాన్ ప్రయోగంలో సైతం ప్రకాష్‌రాజ్‌ అదే ద్వేషాన్ని, ఓర్వలేనితనాన్నీ చూపుతున్నాడు.

సంఘమే నా ఆత్మ: అటల్ బిహారీ వాజ్‌పేయీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో నాకు పరిచయం 1939లో ఏర్పడింది. అప్పట్లో గ్వాలియర్‌లో ఆర్యసమాజానికి చెందిన యువజన విభాగం ఆర్యకుమార్ సభ ద్వారా సంఘ్ గురించి తెలిసింది. మాది అత్యంత సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబం. కానీ నేను ఆర్యకుమార్ సభ వారం వారం నిర్వహించే సత్సంగానికి హాజరవుతుండే వాడిని. ఆ సభలో సీనియర్ కార్యకర్త, గొప్ప ఆలోచనాపరుడు అయిన భూదేవ్ శాస్త్రి గారు ఒకసారి మమ్మల్ని ‘‘సాయంత్రం సమయాల్లో మీరేం చేస్తుంటారు’’ అని అడిగారు. ఆర్యకుమార్ సభ కార్యక్రమాలు ప్రతీ ఆదివారం ఉదయం జరుగుతుండేవి. అందువల్ల సాయంకాలాలు మేము ఖాళీగానే ఉండేవాళ్ళం. అదే విషయాన్ని ఆయనకు చెప్పాము. అప్పుడాయన మమ్మల్ని సంఘ శాఖకు వెళ్ళమని సూచించారు.  అలా నేను గ్వాలియర్‌లో శాఖకు వెళ్ళడం మొదలు పెట్టాను. ఆర్ఎస్ఎస్‌తో అదీ నా మొదటి అనుబంధం. అవి గ్వాలియర్‌లో శాఖ ప్రారంభమైన తొలిరోజులు. అందులో దాదాపు అందరూ మహారాష్ట్ర పిల్లలే ఉండేవారు. దాంతో సహజంగా స్వయంసేవకులందరూ మరాఠీ మాట్లాడుతుండేవారు. నేను శాఖకు క్రమం తప్పకుండా వెళ్ళడం మొదలుపెట్టాను. శాఖలో ఆటలు ఆడుకోవడం, ప్రతీవారం జరిగే బౌద్ధిక్ సమావేశాలూ నాకు నచ్చాయి.

గ్వాలియర్‌లో శాఖ ప్రారంభించడానికి నాగపూర్‌ నుంచి శ్రీ నారాయణరావు తార్తే అనే ప్రచారక్ వచ్చారు. ఆయన చాలా గొప్ప మనిషి. నిరాడంబరమైన వారు, గొప్ప మేధావి, నిపుణుడైన నిర్వాహకుడు. నేనివాళ ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. ఆ తర్వాత నాకు స్ఫూరి కలిగించినది దీనదయాళ్ ఉపాధ్యాయ, భావూరావు దేవరస్. అప్పటికి గ్వాలియర్ భావూరావు గారి కార్యక్షేత్ర పరిధిలో లేదు. కానీ ఒకసారి అప్పటి బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ బాలాసాహెబ్ ఆప్టే గారితో కలిసి శ్రీ భావూరావు గ్వాలియర్ వచ్చారు. ఆప్టేజీ చాలా మృదువుగా మాట్లాడతారు. మేం చాలా త్వరగా ఆయన పట్ల ఆకర్షితులమయ్యాము. ఆయనతో నేను కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడాను. కానీ అదే యేడాది (1940) నేను ఆఫీసర్స్ ట్రయినింగ్ క్యాంప్ (ఓటీసీ) చూడడానికి వెళ్ళినపుడు ఆయనతో అనుబంధం పెరిగింది. అప్పుడు నేను అక్కడికి శిక్షణ తీసుకోడానికి వెళ్ళలేదు. ముగింపు వేడుకకు మాత్రం హాజరయ్యాను. అప్పుడే డాక్టర్ హెడ్గేవార్ కూడా అక్కడికి వచ్చి కొద్దిసేపు ఉన్నారు. ఆయనను నేను చూడడం అదే మొదటిసారి. డాక్టర్జీకి అనారోగ్యంగా ఉందని తెలిసి చూడడానికి వెళ్ళాను. 1941లో నేను ఉన్నత పాఠశాలలో చదువుకునేటపుడే నేను ఓటీసీ మొదటి సంవత్సరం పూర్తి చేసాను. 1942లో ఇంటర్మీడియెట్‌లో ఉండగా ఓటీసీ రెండో ఏడాది, అలాగే  1944లో బీఏ చదువుతున్నప్పుడు ఓటీసీ మూడో యేడాదీ పూర్తి చేసాను.

నేను ‘హిందూ తన్ మన్, హిందూ జీవన్’ రాసేనాటికి నేను పదోతరగతి విద్యార్ధిని. తర్వాత గ్వాలియర్‌లో డిగ్రీ పూర్తిచేసాను. అక్కడ పీజీ కాలేజీ లేకపోవడంతో, కాన్పూర్ డీఏవీ కళాశాలలో ఎంఏ చేసాను. అప్పట్లో నాకు ప్రభుత్వపు ఉపకారవేతనం కూడా వచ్చింది. దేశ విభజన కారణంగా నేను ‘లా’ పూర్తి చేయలేకపోయాను. 1947లో ఇంక పూర్తిస్థాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడం కోసం చదువును వదిలిపెట్టేసాను. 1947 వరకూ నేను చదువుకుంటూనే శాఖ స్థాయిలో సంఘంపని చేసాను. 1942లో నేను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాను, జైలుశిక్ష కూడా అనుభవించాను. అప్పుడు నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. నా వయసు 16 ఏళ్ళు. ఆగ్రా జిల్లాలోని మా స్వగ్రామం భతేశ్వర్‌లో నన్ను అరెస్ట్ చేసారు.

మా నాన్నగారికి ఆర్ఎస్ఎస్‌తో సంబంధం లేదు, కానీ మా అన్నయ్యకు ఉంది. అతను శాఖకు వెడుతుండేవాడు. ఒకసారి తను శీతాకాలం క్యాంప్‌కు వెళ్ళాడు. అక్కడ ఓ సమస్య సృష్టించాడు. ‘‘నేను మిగతా స్వయంసేవకులతో కలిసి ఆహారం తీసుకోలేను, నా వంట నేనే చేసుకుంటాను’’ అని చెప్పాడు. ఆ పరిస్థితిని సంఘం ఎంత చక్కగా ఎదుర్కొందో చూడండి. క్యాంపు సర్వాధికారి మా అన్నయ్య విజ్ఞప్తిని మన్నించారు, తనకు వంట చేసుకోడానికి కావలసిన పదార్ధాలన్నీ సమకూర్చారు. మా అన్నయ్య స్నానం, సంధ్యావందనం అన్నీ చేసుకుని వంట చేసుకున్నాడు. మొదటిరోజు తన ఒక్కడికే వంట చేసుకున్నాడు. ఆ మరునాడు తను ఆ పని చేయలేకపోయాడు. అందరు స్వయంసేవకులతో పాటు వరుసలో నిలబడి వారు వడ్డించిన ఆహారమే తిన్నాడు. కేవలం 44 గంటల్లో తను మారిపోయాడు. సంఘం కేవలం వ్యక్తులను మార్చదు. అది సమష్టి ఆలోచనాధోరణిలో మార్పులు తెస్తుంది. అదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పాటించే నైతిక విలువల సౌందర్యం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక వ్యక్తి ఎంత ఎత్తుకైనా ఎదగగలడు. సరైన సాధన చేస్తే స్వీయ జ్ఞానం కూడా సాధ్యమే. అంతేకాదు, నిర్వాణ స్థితిని కూడా పొందవచ్చు. కానీ, సమాజం సంగతేమిటి? ఏ ఒక్కరూ కూడా సాధారణంగా సమాజం పట్ల తమ బాధ్యత గురించి ఆలోచించరు. దానిగురించి మొట్టమొదటిసారి ఆలోచించినది ఆర్ఎస్ఎస్సే. వ్యక్తుల్లో పరివర్తన తేవడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చునని సంఘం నిశ్చయించింది. మా అన్నయ్యను సంఘ క్యాంపులో సర్వాధికారి తిట్టి ఉండవచ్చు, తన ఆధ్యాత్మిక సాధన కోసం తన వంట తనే చేసుకుంటానన్నప్పుడు దాన్ని అనుమతించకుండా ఉండి ఉండవచ్చు. కానీ ఆయన మా అన్నయ్యలో కేవలం 44 గంటల్లో పరివర్తన తీసుకువచ్చారు. సంఘం ‘రహస్య విధానం’  అదే. సమాజంలో మార్పు వచ్చేది అలాగే. అది సుదీర్ఘమైన ప్రక్రియ అన్న మాట నిజమే కానీ, పరివర్తనకు దగ్గరి దారులు ఉండవు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో అస్పృశ్యత లేకపోవడాన్ని గమనించిన గాంధీజీ సంఘాన్ని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ మాత్రమే సమాజాన్ని నిర్వహిస్తుంది. మిగతా సంస్థలన్నీ తమదైన ‘ప్రత్యేక ఉనికి’, ‘ప్రత్యేక ఆసక్తులు’, ‘ప్రత్యేక హోదా’ వంటి అంశాలను గుణాలుగా చెప్పుకుంటాయి. ఆ సోకాల్డ్ అంటరానివారికి వారి ‘ప్రత్యేకత’ను అడుగడుగునా గుర్తుచేస్తూ అంటరానితనాన్ని మరింత ప్రోత్సహిస్తారు. మీకు సమాజంలో చోటు లేదంటూ తరచు అవమానిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ ముందు రెండంచెల లక్ష్యం ఉంది. మొదటిది హిందువులను వ్యవస్థీకరించడం. కులాల వంటి కృత్రిమ భేదాలకు అతీతంగా బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడం. కొన్ని తేడాలు ఉంటూనే ఉంటాయి, కానీ వైవిధ్యమే జీవితపు బలిమి కదా. మచ్చుకి, మనకు భాషా భేదాలున్నాయి. ఆ వైవిధ్యాన్ని ధ్వంసం చేయాలని సంఘం అనుకోదు. ఇక ఆర్ఎస్ఎస్ రెండో లక్ష్యం హైందవేతరులను, అంటే ముస్లిములు, క్రైస్తవుల వంటివారిని ప్రధాన స్రవంతిలోకి సమ్మిళితం చేయడం. వారు తమ విశ్వాసానికి తగిన మతాన్ని అనుసరించవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం పెట్టరు. మనం చెట్లను, జంతువులను, రాళ్ళను, ఇంకా సృష్టిలో ఉన్న ప్రతీదాన్నీ పూజిస్తాము. భగవంతుణ్ణి ఆరాధించడానికి మనకు వందల రకాల మార్గాలున్నాయి. ఎవరికి ఏది నచ్చితే ఆ దారిలో వెళ్ళవచ్చు. కానీ ఈ దేశాన్ని వారు తమ మాతృభూమిగా భావించాలి. ఈ గడ్డ పట్ల దేశభక్తి కలిగి ఉండాలి. అయితే, ఇస్లాం ఈ ప్రపంచాన్ని దారుల్ హరబ్, దారుల్ ఇస్లామ్ గా విభజిస్తుంది. అది ఈ లక్ష్యానికి అడ్డుగా నిలుస్తుంది. ముస్లిములు మైనారిటీగా ఉన్న దేశంలో స్థానికులతో కలిసి జీవించి అభివృద్ధి చెందే కళను ఇస్లాం ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. వాళ్ళు మొత్తం దేశాన్ని ఇస్లాంలోకి మతాంతరీకరణ చేయలేరు. వాళ్ళు ఈ దేశంలో జీవించాలంటే ఈ వాస్తవాన్ని గుర్తించాలి. ఇవాళ ముస్లిం దేశాల్లో ఇదో పెద్ద ఎడతెగని ఆలోచన అయిపోయింది. ఈ విషయంలో కురాన్ ఎలాంటి మార్గదర్శనమూ చేయలేదు. అది కేవలం కాఫిర్లను చంపడం, లేదా వారిని ఇస్లాంలోకి మార్చేయడం గురించి మాత్రమే చెబుతుంది. కానీ వారు ఆ పని ప్రతీసారీ, ప్రతీచోటా చేయలేరు. తాము తక్కువ సంఖ్యలో ఉన్నచోట వారు అలా ఎలా చేయగలరు? అటువంటి ప్రయత్నమే కనుక చేస్తే అది పెద్ద గొడవలకి దారి తీస్తుంది. ఆ పరిస్థితిని మార్చుకోవలసింది ముస్లిములే. మనం వారికోసం మార్చిపెట్టలేం.

ముస్లిముల సమస్యను కాంగ్రెస్ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. వాళ్ళు ముస్లిములను బుజ్జగించే వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ దాని ప్రభావమేంటి? ఈ దేశపు ముస్లిములతో మూడు రకాలుగా వ్యవహరించవచ్చు. మొదటిది ‘తిరస్కారం’. వాళ్ళు తమను తాము మార్చుకోకపోతే వారిని అలా విడిచిపెట్టేయడమే. రెండవది ‘పురస్కారం’. అదే సంతుష్టీకరణ లేదా బుజ్జగింపు. అంటే మీరెలాగైనా ప్రవర్తించండి అంటూ వారికి లంచమివ్వడమే. కాంగ్రెస్, దానిలాంటి ఇతర సంస్థలూ ఇప్పుడు చేస్తున్న పని అదే. ఇక మూడవ పద్ధతి ‘పరిష్కారం’. వారిలో మార్పు తీసుకురావడం. వారికి సంస్కారాలు అలవరచి, ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములను చేయడం. వారికి సరైన సంస్కారాలు అందించడం ద్వారా వారిలో మార్పు తేవాలని మన భావన. వారి మతం మారదు. వారు తమ సొంత మతాన్ని అనుసరిస్తూనే ఉండవచ్చు. వారికి మక్కా పవిత్రస్థలంగానే ఉంటుంది. అయితే, భారతదేశం వారికి పవిత్ర స్థలానికి మించిన పవిత్ర స్థలంగా ఉండాలి. వారు మసీదుకు వెళ్ళి నమాజు చేయవచ్చు, రోజా ఉండవచ్చు. మాకు ఏ సమస్యా లేదు. కానీ, వారు మక్కా లేదా ఇస్లాం కానీ భారతదేశం కానీ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటే వారు భారతదేశాన్నే ఎంచుకోవాలి. దేశంలోని ముస్లిమలందరూ తాము ఈ దేశం కోసమే నివసిస్తాం, మరణిస్తామన్న భావన వారిలో జాగృతం కావాలి.  

నేను పదో తరగతిలో ఉండగా ‘హిందూ తన్ మన్ హిందూ జీవన్’’ అనే గేయం రాసాను. అందులో ‘కోయీ బతలాయే కాబూల్ మే జాకర్ కితనీ మస్జిదే తోడిన్’… ‘కాబూల్ వెళ్ళి అక్కడ ఎన్ని మసీదులు కూలాయో ఎవరైనా చెప్పండి’ అని రాసాను. నేటికీ నేనా మాటలకు కట్టుబడి ఉన్నాను. కానీ, మనం హిందువులం, అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణాన్ని కూలగొట్టాం. నిజానికి అది ముస్లిం ఓటుబ్యాంకుకు ప్రతిస్పందన మాత్రమే. మనం ఆ సమస్యను చర్చలు, చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలనే కోరుకున్నాం. కానీ చెడుకు ‘పురస్కారం’ ఉండదు. దాన్ని ‘పరిష్కారం’తోనే మార్చుకోవాలి. ఇప్పుడు హిందూ సమాజం పునరుద్భవించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన లక్ష్యం అదే కదా. హిందువులు గతంలో దురాక్రమణదారుల ముందు తలొగ్గి, వంగి ఉండేవారు. కానీ ఇంక అలా ఉండబోరు. హిందూసమాజంలో వచ్చిన ఈ మార్పు స్వాగతించదగిన పరిణామం. హిందువులు స్వీయ అస్తిత్వాన్ని గుర్తించే క్రమంలో వచ్చిన మార్పు ఇది. స్వీయ సంరక్షణకు చెందిన ప్రశ్న ఇది. హిందూ సమాజం తనను తాను విస్తరించుకోకపోతే, దాని ఉనికే, దాని మనుగడే ప్రమాదంలో పడుతుంది. మనను మనం విస్తరించుకోవాలి. మనతో పాటు ఇతరులనూ తీసుకుని నడవాలి.  ఇప్పుడు యాదవులు, హరిజనులని పిలవబడేవారు మనతో వస్తున్నారు. ఆఖరికి మనమంతా హిందువులుగానే జీవించాలి. ఒకసారి ఒక యాదవ నాయకుడు నా దగ్గరకు వచ్చాడు. ‘‘యాదవులు అందరినీ వ్యతిరేకించకండి. యాదవులందరూ ములాయంసింగ్, లాలూ ప్రసాద్‌లతోనే లేరు. ఒక సంస్కరించబడిన యాదవుడు వారిని ఇష్టపడడు. రాజపుత్రులు, కుర్మీలు, గుజ్జర్లలో ముస్లిములు ఉండవచ్చు. కానీ యాదవ ముస్లిములు ఎక్కడా లేరు. యాదవులు ఇస్లాంను ఎప్పుడూ ఒప్పుకోలేదు. ముస్లిం యాదవ ఐక్యత ఎంవై కార్డ్ అనేది కేవలం ఓట్ల కోసం చేసే ఓటి నినాదం మాత్రమే’’ అని చెప్పాడు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో నా సుదీర్ఘ అనుబంధానికి కారణం చాలా సరళమైనది. సంఘం అంటే నాకు ఇష్టం. దాని సిద్ధాంతాలంటే నాకు  ఇష్టం. అన్నిటికంటె ముఖ్యంగా… ప్రజల పట్ల సంఘం వైఖరి చాలా ఇష్టం. అది కేవలం సంఘంలో మాత్రమే కనిపిస్తుంది. నేను లక్నోలో ఉన్నప్పటి ఒక సంఘటన నాకు బాగా గుర్తు. అప్పుడు సోషలిస్టు ఉద్యమం ఉచ్చస్థితిలో ఉంది. ఒక సీనియర్ కార్యకర్త ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. తన ఇంట్లో ఒంటరిగా పడి ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కోడానికి ఎవరూ వెళ్ళలేదు. ఆ సమయంలో అతని గురించి ఆచార్య నరేంద్రదేవ్‌కి తెలిసింది. ఆయన అతన్ని చూడడానికి వెళ్ళారు. ‘‘సోషలిస్టు పార్టీలో ఇదేం పద్ధతి? నిన్ను చూడడానికి ఒక్కరైనా రాలేదు. సంఘంలో అలా ఎప్పటికీ జరగదు. ఎవరైనా స్వయంసేవక్ ఒక్కరోజు శాఖకు వెళ్ళకపోతే, శాఖలోని మిగతా స్నేహితులు అతనికి ఎలా ఉందో కనుక్కోడానికి అతని ఇంటికి వెంటనే వెడతారు’’ అని చెప్పారు.

ఎమర్జెన్సీ సమయంలో ఒకసారి  నా ఆరోగ్యం బాగోలేదు. నన్ను చూడడానికి నా కుటుంబ సభ్యులు కూడా రాలేదు. నా దగ్గరకు వస్తే అరెస్ట్ అవుతామని వాళ్ళు భయపడ్డారు. ఆ సమయంలో నాకు సాయం చేసింది సంఘ కార్యకర్తలే. అదీ సంఘంలో ఉండే మానవీయ సంబంధం. ‘మన’ అనే బంధం. నిజానికి సంఘమే మన కుటుంబం. మనమంతా ఒక్కటే.మొదట్లో మనం మన పనిని సమాజంలోని అన్ని వర్గాలలోకీ తీసుకువెళ్ళలేకపోయాం. కారణం మనకు తగినంత మంది కార్యకర్తలు లేకపోవడమే. మానవ నిర్మాణం ఆరెస్సెస్ మౌలిక లక్ష్యం. ఇప్పుడు మనకు పుష్కలంగా కార్యకర్తలు ఉన్నందున, మనం సమాజంలోని అన్ని వర్గాల వారినీ చేరగలుగుతున్నాం. అన్ని రంగాలలోనూ మార్పులు వస్తున్నాయి. కానీ మానవ నిర్మాణ కార్యక్రమం ఆగకూడదు, అది కొనసాగుతుంది, కొనసాగి తీరాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటే అదే.

స్వామి వివేకానంద దృష్టిలో గౌతమ బుద్ధుడు

రచన : పురాణపండ రాఘవరావు

భగవద్గీతలో నిష్కామ కర్మయోగమును గూర్చి విపులంగా బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ కర్మయోగం గురించి మరింత వివరముగా వివేకానంద స్వామి ప్రవచించారు. సనాతన ధర్మ వైశిష్ట్యము గురించి ప్రపంచవ్యాప్తముగా ప్రవచించిన మహాత్ముడు స్వామి వివేకానంద. ఆయన దృష్టిలో నిష్కామ కర్మయోగమును మనసా వాచా కర్మణా అనుష్టించి చూపిన మహనీయుడు గౌతమబుద్ధుడు. అంతేగాక కర్మయోగమును సంపూర్ణముగ ఆచరణలో చూపినవాడు బుద్ధుడు మాత్రమేయని నొక్కి వక్కాణించారు స్వామి. ప్రపంచమున బుద్ధుడు వినా యితర ప్రవక్తలందరూ తమను తాము స్వార్ధరహిత కర్మాచరణమునకు పురికొల్పుటకు బాహ్యాశయములను కలిగియుండిన వారు. బుద్ధుని మినహాయించి మిగిలిన ప్రవక్తలను రెండు తరగతులుగా విభజించవచ్చును. మొదటి తరగతి వారు తాము భగవంతుని అవతారములని పేర్కొన్నారు. రెండవ తరగతి వారు తమలను కేవలం భగవంతుని దూతలు (కుమారులు)గా చెప్పియున్నారు. వారి భావములు ఎంతటి పరమార్థ భావము కలిగియున్నను ఉభయపక్షముల వారు కర్మాచరణమునకు బాహ్యము నుండియే ప్రేరణ పొందియున్నారు. బాహ్యలోకముల నుండి ఫలములను ఆశించిరి.

కాని సిద్ధార్ధుడు మాత్రమే యీ రీతిగా వక్కాణించినాడు. పలు విధములైన మీ సిద్ధాంతములతో నాకు పని లేదు. ఆత్మను గూర్చిన సిద్ధాంత రాద్ధాంతములు చేయుట వలన ఏమాత్రమును ప్రయోజనము లేదు. సత్కర్మలను చేయుచూ సజ్జనులుగా జీవించండి. మంచి పనులు చేయుచూ సజ్జనులుగా జీవించినచో మీరు మోక్షమును పొందగలరు అని బుద్ధుడు బోధించిన విషయములను మనము గుర్తించాలి.

బుద్ధుని జీవితాన్ని పరిశీలించి చూచినచో ఎటువంటి స్వార్థచింతనయు కనబడదు. లోకహితము కొరకు గౌతమ బుద్ధుని కంటె ఎవరును ఎక్కువ కృషి చేయలేదని వివేకానందులు నొక్కి చెప్పారు. తాను బోధించిన అంశములను ఆచరణలో చూపిన సిద్ధార్ధుని మించిన సచ్చరిత్రుని మానవకోటి చరిత్రలో వేరొకరిని చూపగలమా? అని స్వామి సూటిగా ప్రశ్నించారు. గౌతముని వలె సమస్త జీవులను ఆదరించిన, అఖండ సానుభూతిని చూపిన సచ్చరిత్రుడు విశ్వచరిత్రలో ఇంతవరకు వేరొకరు పుట్టలేదని వివేకానంద పేర్కొన్నారు.

మహోన్నత తత్త్వమును బోధించిన తత్త్వజ్ఞ శిఖామణియగు గౌతమ బుద్ధుడు, పరమ నికృష్ట జీవులను కూడా కరుణామయుడై ప్రేమించినాడు. ఎంత మహత్కార్యములు చేసినను తనను గురించి ఎక్కడను ఎప్పుడును చెప్పుకొనని మహనీయుడు గౌతముడు. స్వార్ధరహితుడై జీవించిన బుద్ధుడు ‘‘ఆదర్శ కర్మయోగి’’ అనుట ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అఖండ ధీశక్తితో, అపార ఔదార్యముతో, అనంతాత్మ ప్రభావ భాస్కరునిగా వెలుగొందిన బుద్ధుడు అనుపమాన మహనీయుడు గాదా! మానవ చరిత్రలో అతనికి సాటియగు వారు వేరొకరు లేరు. ప్రపంచ మహా సంస్కర్తలలో అతడే అగ్రగణ్యుడు.

బుద్ధుడు ఇలా ప్రవచించాడు. ఏవో కొన్ని ప్రాచీన వ్రాత ప్రతులలో ఉన్నంత మాత్రాన, ఒక విషయమును యదార్థమని నమ్మకుడు. పరంపరాగతమని కూడా దేనిని సత్యమని నమ్మవలదు. దేశాచారమని కూడా వాస్తవమని నమ్మకండి. ఏ విషయమైనను సంపూర్ణముగా పరిశీలించి, కార్యకారణములను సమగ్రముగా విమర్శించిన తరువాత మాత్రమే, సమస్త మానవ శ్రేయస్కరమని మీకు విశ్వాసము కలిగిన తరువాత మాత్రమే ఏ విషయమునైనను నమ్మగలరు. నమ్మిన దానికి అనుగుణముగా నడుచుకొనగలరు. ఇతరులు మంచి విషయములను అనుసరించునట్లుగా మీరు తోడ్పడండి. ధనమును గాని, పేరు ప్రతిష్ఠలను గాని వాంఛించక, స్వార్ధరహిత కర్మపరాయణుడైన వాడు మాత్రమే మహోత్తమ కర్మయోగి కాగలడు అని గౌతముడు బోధించినాడు. పైరీతిగా ఆచరించు మానవుడు ‘‘అపర బుద్ధునిగా ప్రకాశించగలడని’’ గౌతమ బుద్ధుని గొప్పదనమును గూర్చి స్వామి వివేకానంద పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గన్న స్వామి వివేకానంద సిద్ధార్ధ గౌతముని ‘‘నిష్కామ కర్మయోగము’’ను ప్రశంసించినారు.  

=========  

వైశాఖ పౌర్ణమి బుద్ధపూర్ణిమ సందర్భంగా మిసిమి మాసపత్రిక మే 2023 సంచికలో మా నాన్నగారి ఈ వ్యాసం ప్రచురితమైంది. చిత్రమేంటంటే, ఆ సంచికలో ఈ వ్యాసానికి ముందు, డా. దేవరాజు మహారాజు గారు బుద్ధుడి మాటు నుంచి హిందూ ధర్మం మీద దాడి చేస్తూ రాసిన వ్యాసం ముద్రించారు. దానికి ప్రతిస్పందనగా మా నాన్నగారు మరో వ్యాసం రాసారు. అదింకా ప్రచురితం కాలేదు. ఈలోగా ఈ రెండు నెలల్లో దేవరాజు మహారాజు పలు పత్రికల్లో బుద్ధుడిని అడ్డం పెట్టుకుని హిందూమతం మీద బోలెడన్ని అబద్ధాలు గుప్పిస్తూ పుంఖానుపుంఖాలుగా రాసిపడేసారు. మా నాన్నగారి రెండో వ్యాసాన్ని ‘మిసిమి’ ప్రచురించిన తర్వాత ఇక్కడ పంచుకుంటాను.

=========  

శ్యామలాదండకం కాళిదాస కృతం కాదా?

ఉత్పల వేంకట నరసింహాచార్యులు గారు టీకా తాత్పర్యాలతో శ్యామలాదండకాన్ని ప్రచురిస్తూ దానికి రాసిన ముందుమాటలో అసలీ దండకాన్ని కాళిదాసు రాయలేదని వివరించారు. 1918 నాటి ఆ వ్యాసం అవధరించండి..

***************

శ్యామలాదండక మనగా మాతంగీ దేవతను వర్ణించు దండక మని యర్థము. మాతంగీ దేవతకు ‘‘శ్యామలా దేవి’’ యనునది నామాంతరమే కాని వేఱు దేవత గాదు. ఈ విషయము మంత్ర రత్నాకరమున బాలా లఘుశ్యామలా మంత్ర కథన తరంగమునందిట్లు చెప్పబడియున్నది:

‘‘న్యాసానేవం విధాన్ కృత్వా మాతంగీ మాసనే స్మరేత్

 సుధార్ణవాంతరీపస్థ రత్నమందిర మధ్యగే’’

ధ్యానమ్:

                   ‘‘మాణిక్యాభరణాన్వితాం స్మితముఖీమ్ నీలోత్పలాభాంబరాం

                     రమ్యాలక్తకలిప్త పాదకమలాం నేత్రత్రయోల్లాసినీం

                     వీణావాదనతత్పరాం సురనతాం కీరచ్ఛదశ్యామలాం

                     మాతంగీం శశిశేఖరా మనుభజేత్తాంబూలపూర్ణాననామ్’’

                   ‘‘లక్షం జపేన్మధూకోక్తే ర్జుహుయాదయుతం శుభై:

                     మాతంగీప్రోదితే పీఠే లఘుశ్యామాం ప్రపూజయేత్’’

ఇక్కడ ‘‘కీరచ్ఛదశ్యామలాం = చిలుక ఱెక్కల వలె పచ్చని వర్ణము గలది’’ యని చెప్పుట వలన శ్యామల యనియు, ఆ యర్థమే శ్యామా పదము సైతము దెల్పుచున్నదనియు నేర్పడుటయే కాక, ‘‘మాతంగీప్రోదితే పీఠే లఘుశ్యామాం ప్రపూజయేత్’’ ‘మాతంగికిఁ జెప్పబడిన పీఠమున లఘుశ్యామను బూజింపవలెను’ అని విధించుట వలనను, మఱియు:

          ‘‘వాణీ శుకప్రియా జంతా విద్మహే మీనకేతన:

            కామేశ్వరీధీమహీతి త న్నః శ్యామా ప్రచోదయాత్’’

అను మాతంగీ గాయత్రి యందు మాతంగికి శ్యామా పదము పర్యాయపదముగఁ బ్రయోగించి పిదప దానిని (శ్యామాపదఘటితమును) ‘ఏషోదితా తు మాతంగీ గాయత్రీ సర్వసిద్ధిదా’ అని మాతంగ గాయత్రిగ జెప్పుట వలనను, మాతంగీ శ్యామల లొక్కరని చెప్పుటయే యుక్తమని తోఁచుచున్నది. కాఁబట్టియే దండకమునందును కవి ‘శ్యామలే’ అనియు, ‘మత్తమాతంగ కన్యా సమూహాన్వితే’ అనియు శ్యామలామాతంగులకు నైక్యమునే వక్కాణించెను.

ఈ దండకమును రఘువంశశాకుంతలాది కావ్యత్రయనాటకత్రయకర్త యగు మహాకవి కాళిదాసు రచించెనని కొందఱనుచున్నారు; కాని యది విశ్వసనీయము గాదని నా యభిప్రాయము. ఏలయన కవితాశైలిని బట్టియు, వర్ణనా సందర్భమును బట్టియు, ఉచితపదార్థాలంకారాదిసంఘటనముంబట్టియు సూక్ష్మదృష్టిని విమర్శించితిమేనిఁ గాళిదాసుని శైలిలో మిళితము గాలేదు. మఱియు సర్వసామాన్యములగు స్వభావోక్తి వర్ణనలు దక్క సహృదయహృదయంగమములగు వర్ణనలేవియుఁ గనబడవు. సంబోధనాంతములయందుఁ దఱుచుగ రెంటికి రెంటికి నంత్యనియమము గలిగియున్నందున వినుట కింపుగ నున్నను విశేషించి చూచిన నందర్థపుష్టి విశేషముగఁ దోఁచుట లేదు. ఇయ్యది దండకము మొదటనుండి యర్థముఁ జేసికొనుచుఁ జదివి చూచినఁ దెలియును గాన నుదాహరింప ననవసరము. ఇంతమాత్రమున నస్మదాదులకు బొత్తిగ దీసివేఁత కవిత్వము గాదు గాని కాళిదాసాదుల కట్టిదే యనుట సాహసము గాదు.

మఱియు నీ దండకమును గాళిదాసు రచించిన సందర్భమున నొక కట్టుకత కలదు:

          కాళిదాసు బ్రాహ్మణ కులమునఁ బుట్టియు బాల్యముననే యే కారణముననో యెఱుకువాండ్రలోఁ గలిసి చదువుసంధ్యలు లేక తెలివిమాలినవాడై తిరుగుచుండెనఁట. ఆ కాలమున నొక రాజకుమారిక యొక యాస్థాన పండితుని యొద్ద విద్యాభ్యాసమొనర్చి విద్య ముగిసిన పిదప గురుదక్షిణ నీయరాఁగా గురువామె సౌందర్యమునకు మోహించి తన్నుఁ జేపట్టుమని నిర్బంధించెనఁట. రాజకన్నియ బుద్ధిమతి గాన నందుల కొప్పకున్న నతఁడు కోపించి ‘‘పండితునిఁ జేపట్టని నిన్ను పరమమూర్ఖునకుఁ బెండ్లి చేయించెదఁ జూడు నా దెబ్బ!’’ యని బెదరించి పోయెనఁట. అంతఁ గొన్నినాళ్ళకు కన్నియతండ్రి దైవవశమున నీ పండితునే వరాన్వేషణమున నియమింప నతఁడు పూర్వవృత్తము స్మరించి పరమమూర్ఖుని వెదకుచు నొకయడవిలో నీ యెఱుకువానిని (కాళిదాసుని) జిక్కించుకొని పండితవేషము వేసి యెల్లర మోసగించి రాచకన్నియకుఁ బెండ్లి చేసెనట. ఆమె తన పడకటింటిలో నతని మూర్ఖతకు రోసి యిది తన గురువు చేసిన యన్యాయ్యమని యెంచి వరుని సంబోధించి కాళీమంత్రము నుపదేశించి కాళికాలయమునకుఁ బంపెనఁట. అతఁడందుఁ దదేకనిష్ఠతోఁ దపము చేయ గాళి ప్రత్యక్షమై కటాక్షింప నప్పుడతడు విద్యావంతుఁడై యామె నీ దండకముతో స్తుతించెనట!

ఈ కథ నిజముగ జరుగుటయు, జరిగిన నీ దండక కర్తకు సంబంధించి యుండుటయు నెంతవఱకు విశ్వసనీయమోఁ చెప్పఁజాలము. కాళిదాసు కాళీదేవిని గుఱించి స్తుతి చేయునపుడు కాళిని స్తుతింపక మాతంగిని, లేక శ్యామలను ఏల స్తుతించును? శ్యామలా దండకమని పేరేల పెట్టును? కాళికయే మాతంగి యని కాని శ్యామల యని కాని యెచ్చట నైనఁ గలదా? ఒకవేళ గౌణముగఁ గాళికాపరముగ నన్వయింతు మనిన, కవి యట్లు గౌణముగఁ జెప్పుటకు కారణమేమి? దండకములో ‘కాళికే’ యను పద మిముడదా? వేయేల? ఈ దండకము కాళిని గుఱించినది గాదు, కాళిదాసు చేసినదియుఁ గాదు. దండకము మొదటఁ గాని, కడపటఁ గాని గ్రంథకర్త పేరే లేనందున గాళిదాసని చెప్పుటకు నాధారములేదు. ఇఁకనేమన: మాతంగిని (శ్యామలను) ఉపాసించు నెవఁడో యొక కవి రచించి యుండును. ఒకవేళఁ గాళిదాసే యనిన భోజరాజు కాలముననో మఱియు నిటీవలనో యుండిన కాళిదాస కవి యగు నన్న మాత్రాన నాగ్రహము లేదు.

గ్రంథకర్త యెవరైననేమి? ఇది మొత్తము మీద కూడినంతవఱకు రసవంతముగను, చదువునప్పు డుత్సాహకరముగను నున్నదనుటకు సందియము లేదు. దీనిని దఱుచుగ భారతీయులందఱు చదువుదురు గానఁ దెలుగు టీకను వ్రాసి ప్రచురించిన బాగుండునని వివరణము వ్రాసితిని. చదివి యానందింతురు గాక!

1.10.18

చెన్నపురి                                                              ఉత్పల వేంకట నరసింహాచార్యులు

శంకరా… నాద శరీరా పరా…!

సుమారు 20 ఏళ్ళ క్రితం… 2004 ఏప్రిల్…

జర్నలిజంలో అడుగుపెట్టిన తొలినాళ్ళు…

ఈటీవీ నెట్వర్క్ ఛానెల్స్ లో ఇంటర్నల్ షేరింగ్ కోసం రాష్ట్రాల్లోని జాతీయ ప్రాధాన్యమున్న వార్తలు ఆంగ్లంలో రాసే నేషనల్ కోర్ డెస్క్ లో ఉద్యోగించే రోజులు…

షిఫ్ట్ కి వచ్చి సీట్లో కుదురుకుని అప్పటివరకూ వచ్చిన తెలుగు వార్తలను సింహావలోకనం చేస్తున్నాను..

జేవీ సోమయాజులు గారు కాలం చేసారన్న వార్త కనిపించింది.

వార్తకు సపోర్ట్ గా ‘శంకరాభరణం’ సినిమాలో విజువల్స్ కొన్ని ఉన్నాయి. బహుశా ఏదో పాట…

సోమయాజులు మరణం తెలుగు ఛానెల్ కి వార్త అవుతుంది కానీ తెలుగేతరులకు వార్త కాదు కదా అనుకున్నాను.

అప్పటికి నేనా సినిమా చూడలేదు. (ఇప్పటికీ పూర్తిగా చూడలేదనుకోండి.) దాంతో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్లే చేసుకుని చూస్తున్నాను.

ఏదో అడగడానికి నా దగ్గరకు వచ్చిన మరాఠీ సహచరుడు ఆ విజువల్స్ చూసి… ‘యే తో శంకర్ శాస్త్రీ హై నా… క్యా హువా?’ అని అడిగారు. ఇదీ విషయం అని చెప్పాను.

ఇంతలో బెంగాలీ మిత్రుడు కూడా కలిసారు. ‘అరే, యే తో విశ్వనాథ్ జీ కా ఫిలిమ్ హై నా…’ అంటూ మాటలు కలిపారు. ఆయన రిత్విక్ ఘటక్ స్నేహితులలో ఒకడు.

హిందీ భాషీయుడైన ఓ సీనియర్ జర్నలిస్టు… ఈ వార్త త్వరగా ఇవ్వు… ఇంకో ఐదు నిమిషాల్లో మా ఛానెల్లో బులెటిన్ ఉంది… అందులో వేయిద్దాం… అని ఆదరాబాదరాగా నాకు పురమాయించి, యూపీ ఛానెల్ డెస్క్ లోకి వెళ్ళి వాళ్ళకు విషయం వివరించారు.

వెంటనే హడావుడిగా ఓ నాలుగైదు వాక్యాలు రాసి ముందు వార్త సర్క్యులేట్ చేసేసాను.

ఒక తెలుగు సినిమా నటుడు, అది కూడా కథానాయకుడేమీ కాదు, ఓ సాదాసీదా కారెక్టర్ ఆర్టిస్టు, చనిపోతే ఇంత హడావుడి అవసరమా అనుకున్నాను.

అంతలోనే నాలుగైదు పరభాషా ఛానెల్స్ డెస్కుల నుంచి కాల్స్ వచ్చాయి, అప్ డేటెడ్ వివరాల కోసం.

ఈలోగా బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఆ సినిమా గుణగణాలను విశ్లేషించడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత మరాఠీ మిత్రుడు ‘శంకరాభరణం’ సినిమా విశిష్టత నాకు వివరించి చెప్పారు.

మన దేశం నుంచి ఏటా వందలాది సినిమాలు వస్తాయి. కానీ దేశీయమైన సంస్కృతిని ఇతర దేశీయులకు పరిచయం చేయగలిగిన సినిమాలు చాలా కొద్ది.

మన దేశపు విశేషాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపే విదేశీ ప్రేక్షకుడికి మనం చూపించేవి ఏంటి… అవే హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టి తీసే నకిలీ సినిమాలా? అందుకే వారికి, ఐదు పాటలూ ఆరు ఫైట్లతో తీసే రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాల్లో తెలుసుకోడానికి ఏముంటుందిలే అని, మన చలనచిత్ర రంగం పట్ల తూష్ణీంభావం.

ఆ మూసని బ్రేక్ చేసి, భారతీయమైన కళలనూ, భారతీయమైన సమాజాన్నీ చూపించగలిగింది శంకరాభరణం. అందుకే అది కేవలం ఒక తెలుగు సినిమాయో, ఒక ఇండియన్ సినిమాయో మాత్రమే కాదు. శంకరాభరణం ఒక గ్లోబల్ సినిమా. దానికి సంబంధించిన ఏ విషయమైనా జాతీయ స్థాయి వార్తే.

ఆ వివరణ విన్నాక ‘శంకరాభరణం’ ఆసేతు శీతాచలం వినిపించిన రాగం ఎలా అయిందో అర్థమయింది.

కరిగిన (స్వాతి)కిరణం

స్వార్థం ఎటునుంచి ముంచుకొచ్చి కాటువేస్తుందో కానీ మనిషిని కాల్చిపారేస్తుంది. అహంతో కూడిన అసూయకూ నిజం తెలిసిన నైతికతకూ మధ్య రాపిడి జీవితాన్ని శ్రుతి తప్పిస్తుంది. సంగీత సాహిత్య సమలంకృత సైతం వీడిపోతుంది. బిగించిన పిడికిట బందీ చేయాలనుకుంటే కళ మనసుపొరలను కలచివేస్తుంది. ఒక శిష్యుడి ఆత్మత్యాగపు స్వాతికిరణమే ఆ స్వార్థపు పొగమంచును కరిగించగలుగుతుంది.

ప్రేక్షకాభిరుచిని వాణిజ్య విలువలు నిర్దేశించడం పాతుకుపోయిన తెలుగు పరిశ్రమలో ఇలాంటి సంక్లిష్టమైన ఇతివృత్తంతో సినిమా తీయడం దుస్సాహసమే. ఆ పని చేయగలిగిన వాడు, చేసినవాడు కాశీనాథుని విశ్వనాథ్.

తెలుగు సినీ పరిశ్రమలో మహానుభావులైన దిగ్దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ ఆ చలనచిత్రాలకు ఒక చిత్రమైన నడక నేర్పినవాడు విశ్వనాథ్. లలితకళలకు నాయక స్థాయినిచ్చి సినిమాలు తీసి జనరంజకం చేసినవాడు ఆయనే. శాస్త్రీయ సంగీత, సాహిత్య, నృత్యాల పట్ల ప్రేక్షకులకు ఆదరాభిమానాలు కలిగేలా చేసిన ఘనత ఆయనదే. అదే సమయంలో సాంఘికాల్లోనూ తన ముద్ర బలీయం. తెలుగు, కాదు కాదు, భారతీయ సినిమా చరిత్రలో శంకరాభరణ శకం ఆయనదే.

విశ్వనాథ్ సినిమాల్లో తను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పడంలో నాటకీయత పాళ్ళు ఎక్కువ అయిన సందర్భాలు కొన్ని ఉండి ఉండొచ్చు. అది, తన కథని సామాన్య ప్రేక్షకుడికి సైతం చేరవేయడానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చునేమో. కానీ క్లుప్తత విషయంలో కొన్ని సినిమాల్లో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. శంకరాభరణం శంకరశాస్త్రి, సప్తపది హేమ, శ్రుతిలయలు సీత, స్వాతికిరణం అనంతరామశర్మ… నోటిమాటతో కంటె కంటిచూపుతోనే కదిలించివేస్తారు.

భారత చలనచిత్ర చరిత్ర ప్రధాన స్రవంతిలో ఏ దశలోనూ ఒక గుడ్డి పాటగాడు, మూగ చిత్రకారిణి ముఖ్య పాత్రలుగా సినిమా నాకు తెలిసి లేదు. నైరూప్య కళకు చలనచిత్ర రూపం ఇచ్చే ప్రయోగం నాకు తెలిసి ఎవరూ చేయలేదు.

వామపక్ష భావజాలంతో నిండిఉండే సమాంతర సినిమాలు మాత్రమే కళాత్మక చిత్రాలుగా పరిగణించబడే గడ్డ మీద సంప్రదాయికత అభ్యుదయానికి వ్యతిరేకం కాదంటూ, దేశీయ కళలకు ప్రతినిథిగా జెండా ఎగరేసిన సినీ మానిసి ఆయన. ఇజాల ప్రిజాలూ, సైద్ధాంతిక రాద్ధాంతాల నడుమ తెనుగుదనాన్ని, భారతీయతను చాటిచెప్పినవాడాయన.

పండిత పామర జనరంజకమైన పాటలు, హాస్యం విశ్వనాథ్ సినిమాల్లో పడుగుపేకలు. ఉదాత్తత, ఔచిత్యం చెడకుండా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన ఘనాపాఠి. స్త్రీ పాత్రల రూపకల్పనలో ఆయనది అందెవేసిన చేయి. ఆయన సినీగీతాల్లో సంగీత సాహిత్యాల గురించి చర్చించుకోడానికి రోజులు సరిపోవు. వేటూరి, సిరివెన్నెల ఇత్యాదుల రచనలు అన్నిచోట్లా బాగానే ఉండవచ్చు గాక, విశ్వనాథ్ సినిమాల్లో వాటి స్థాయి వేరే.

వ్యక్తిత్వంతో కానీ, రాజకీయంగా కానీ భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు గాక… కమలహాసన్ నటన, అందునా విశ్వనాథ్ సినిమాల్లో నటన ఉత్కృష్ట స్థాయిలో ఉంటుంది. సాగరసంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం లాంటి చిత్రాల్లోని పాత్రల సృష్టి అనితరసాధ్యం. సిసలైన నటుడి ప్రతిభకి పూర్తిస్థాయి పరీక్ష పెట్టి, ప్రేక్షకుడికి స్వాదిష్ట భోజనం వడ్డించడంలో వారిద్దరి జోడీ అద్భుతం.

జంధ్యాల వెళ్ళిపోయారు. బాపూరమణలు వెళ్ళిపోయారు. ఇప్పుడు విశ్వనాథ్ వెళ్ళిపోయారు. సింగీతం శ్రీనివాసరావుగారు ఉన్నారు. ఆ తర్వాత తెలుగు సినిమాల గురించి మాట్లాడుకోడానికి ఇంకేమీ ఉండదేమో.

కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఇళ్ళపై మువ్వన్నెల రెపరెపలు

కశ్మీర్ చరిత్రలో ఇది నిజంగా కొత్త అధ్యాయం. స్వతంత్ర భారతి అమృతోత్సవాల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ … ‘దేశంలోని ప్రతీ యింటికీ త్రివర్ణ పతాకం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నినాదం స్థాయిని దాటి, వాస్తవిక కార్యాచరణకు చేరడంలో సఫలమైందని నిరూపించే ఘట్టమిది. లష్కర్ ఎ తయ్యబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల్లో ఇంకా క్రియాశీలంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల నివాసాలపై వారి కుటుంబ సభ్యులు లేదా ఆ ఇళ్ళలో నివసిస్తున్న వారు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్య చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టం.

(భారత బలగాలు మట్టుపెట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రనేత రయాజ్ నాయకూ తండ్రి, పుల్వామా జిల్లా బేగ్ పురా గ్రామంలోని తమ ఇంటిపై ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఎగరేసిన మువ్వన్నెల పతాకం)

జమ్మూకశ్మీర్ అనే పేరుతో రాష్ట్రం ఉనికిలో ఉండేటప్పుడు, రాజధాని శ్రీనగర్ లో భారత జాతీయ పతాకం ఎగిరిన దాఖలాలు అత్యంత అరుదు. ప్రత్యేకించి స్వతంత్ర, గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో పోలీసుల పహరాయే తప్ప త్రివర్ణ పతాక ఛాయ కనబడేది కాదు. ఇది ఎన్నో యుగాల నాటి మాట కాదు. దాదాపు పది పదిహేనేళ్ళ క్రితం వరకూ అదే పరిస్థితి. ఏ యేడాదైనా బీజేపీ లేదా ఆరెస్సెస్ వారే కశ్మీర్ లో జెండా అని గగ్గోలు పెట్టడం తప్ప అది మిగతా ఎవరికీ పట్టని సంగతిగానే ఉండేది. ఆగస్టు 15, జనవరి 26కు వారం రోజుల ముందు నుంచీ, శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గర పటిష్ట భద్రత మోహరింపు, ఉద్రిక్త పరిస్థితులు అనే వార్తలు రాసీ రాసీ వేళ్ళు నొప్పిపెట్టేవి. అలాంటిది ఇలాంటి వార్త చూస్తానని కలలో కూడా అనుకోలేదు.

నా చిన్ని జర్నలిజ జీవితపు కాంస్యయుగ దినాల్లో ఓ ప్రముఖ ఎరుపు ప్లస్ నీలం ప్లస్ ఆకుపచ్చ మేధావి వాక్రుచ్చిన ఒక మాట వినాల్సి వచ్చింది. ఆయన దేనికో శ్రీనగర్ వెళ్ళొచ్చిన తర్వాత డెస్కులో మాట్లాడుతూ ‘కశ్మీర్ భారతదేశానిదీ అని ఇక్కడ చెప్పుకోవడమే కానీ అక్కడ అంతా పాకిస్తానే. వాళ్ళు ఇండియా గురించి, తమని ఆక్రమించిన పొరుగుదేశం అనే భావిస్తారు’ అని ఎంతో తన్మయత్వంతో చెప్పారాయన. అంతకు కొన్నేళ్ళ ముందు అనగా స్వర్ణయుగంలో, జర్నలిస్టు ముసుగు కప్పుకున్న వేర్పాటువాది అయిన ఓ కశ్మీరీ సహోద్యోగితోనూ, అహింసే తమ నిస్సహాయత అయిన కశ్మీరీ పండిత వర్గానికి చెందిన మరో సహోద్యోగితోనూ నెలల తరబడి చేసిన వాదనలు మనసులో మెదిలాయి. ఆ మల్టీకలర్ వ్యాఖ్యానం విన్న కొన్నేళ్ళకు మోదీ సర్కారు లెహ్, శ్రీనగర్, జమ్మూలను వేరు చేసింది. 370వ అధికరణం రద్దు తర్వాత మోదీ సర్కారు తమ(వారి) వాక్ స్వతంత్రాన్ని హరించివేసిందంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చాలామందే చిందులు వేసారు. ఏదేమైనా బీజేపీ మౌలిక ఎజెండా అయిన అయోధ్య రామమందిరం, 370 అధికరణం తొలగింపు, ఉమ్మడి పౌర స్మృతి సాధించే దిశగా మోదీ అడుగులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్న ఆసక్తి ఉండేది. హద్దులకు ఆవల కొద్దో గొప్పో ఏదో సాధిస్తున్నాడు అనుకున్నప్పటికీ, మన గీత లోపల ఇంత సాధిస్తాడని ఏనాడూ అనుకోలేదు. 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ వార్త చదివి మనసు పులకరించిపోయింది.

పుల్వామా జిల్లా త్రాల్ తాలూకాలో  హర్దుమిర్ గ్రామంలో ఉగ్రవాది గౌహర్ మంజూర్ మీర్ ఇంటిపైన, అదే తాలూకా మొంగామా గ్రామంలో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బడ్గాం జిల్లాలోని సరాయ్ చదూరా గ్రామంలో లష్కరే తయ్యబా ఉగ్రవాది అకీబ్ నజీర్ షెర్గోజ్రీ ఇంటిమీద త్రివర్ణ పతాకం ఎగిరింది.

అనంతనాగ్ జిల్లా శ్రీగుఫ్వారాలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు జాఫర్ హుసేన్ భట్, ఆమిర్ ఖాన్ (లాల్ సింగ్ చడ్డా కాదు) ఇళ్ళపైన మువ్వన్నెలు మెరిసి మురిసాయి.

పుల్వామా జిల్లా బేగ్ పూరా గ్రామంలో, భారత సైనిక బలగాలు మట్టుపెట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రనేత రయాజ్ నాయకూ అలియాస్ జుబేరుల్ ఇస్లామ్ ఇంటిమీద అతని తండ్రి స్వయంగా భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. రయాజ్, కశ్మీర్ లోయలో హిజ్బుల్ సంస్థకు ప్రధాన నేత. బుర్హాన్ వనీ తర్వాత ఆ స్థానాన్ని అందుకున్న ఉగ్రవాది. సోషల్ మీడియాలో ఆడియో, వీడియో సందేశాల ద్వారా ఇస్లామిక్ రాడికలిజాన్ని వ్యాపింపజేయడం ఇతని ప్రత్యేకత. ఇంకా ఇలాంటి ఎందరో ఉగ్రవాదుల ఇళ్ళలో వారి కుటుంబ సభ్యులు, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసారు.

నిజంగా ఇది అమృత మహోత్సవం. ఈ వేడి ఇలాగే కొనసాగితే, స్వతంత్ర భారతి శతజయంతి నాటికి పాక్ ఆక్రమిత కశ్మీర్.. మన కశ్మీర్ లో కలిసిపోతుందేమో. ఝండా ఊంచా రహే హమారా.

Previous Older Entries