శ్రీ గురుభ్యో నమః

‘‘తరగతిలో ఎవరైనా నిద్రపోతుంటే పక్కవాణ్ణి పిలిచి ‘వాణ్ణి జాగ్రత్తగా లేపండి. వాణ్ణి తాకేరు సుమా, అలా చేయకండి. నిద్రలో ఉలిక్కిపడితే లేచేటప్పుడు గాబరా పడతాడు. అలా కంగారు పెట్టకుండా జాగ్రత్తగా నిద్ర లేపండి’ అని చెప్పేవారు మీరు. అది మాకు చాలా విచిత్రంగా అనిపించేది. అలాంటి విషయాలకు కదా మాస్టారూ మీరు మాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది.’’ 

‘‘ఏ బళ్ళో అయినా మిగతా టీచర్ల కంటె తెలుగు మాస్టర్లంటే మామూలుగానే కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు చెప్పే కథలూ, కబుర్లూ, ఉదాహరణలూ, పద్యాలు పాడడాలూ… ఇలాంటి వాటివల్ల తెలుగు చెప్పే మాస్టర్లంటే ఇష్టం ఉండడం సహజం. కానీ మీరు మాకు గుర్తుండిపోయింది కేవలం గురువుగా మాత్రమే కాదు. జీవితంలో ఉండాల్సిన విలువల్ని సుతిమెత్తగా మా గుండెల్లో చొప్పించారే, వాటివల్ల మీరు మా అనుదిన జీవితంలో భాగమైపోయారు. మీమీద మాకున్నది కేవలం గౌరవం కాదు. ప్రేమా, అభిమానమున్నూ.’’

****                     ****                     ****                     ****

గోదావరి దరిన గురుకులం లాంటి ఓ పాఠశాల. రాజమంద్రం శివార్లలో సువిశాల ప్రాంగణంలో ఆశ్రమ వాతావరణంలో రెసిడెన్షియల్ హైస్కూల్. ఆ బళ్ళో చేరడానికి చుట్టుపక్కల నాలుగైదు జిల్లాల పిల్లలు వస్తుండేవారట. ఆ డిమాండ్ తట్టుకోలేక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు పెట్టేవారట. ఎప్పుడు. డెబ్భైలలో. ఆ ప్రాభవం ఎనభైల వరకూ నడిచింది. తొంభైల నుంచీ పరిస్థితి మారిపోయింది. క్షీణదశ మొదలైంది. అంటే.. ఇప్పటికీ పాఠశాల నడుస్తూనే ఉంది కానీ ఆనాటి జవజీవాలు లేవు. (బహుశా ఇది నా భావనేనేమో. ఇప్పటి స్కూల్ మేనేజ్మెంట్ వారు అలాంటి సమస్యలేమీ లేవంటారేమో) సరే అదంతా వేరే కథ.

అసలా బడే ఒక ఇంద్రజాలం. కనీసం నా వరకూ నాకు. ఆటస్థలమే సరిగ్గా ఉండని బడులతో పోలిస్తే కొన్ని ఎకరాల స్థలంలో విస్తరించి, ఈతకొలను కూడా ఉన్న ఆ పాఠశాల లోపలికి వెళ్ళి చూడాలని చాలా ఉబలాటంగా ఉండేది. చూడడానికి అదో పెద్ద తోటలా ఉండేది. అక్కడ వనవిహారం చేయాలనిపించేది. అయితే అక్కడ హాస్టలర్స్ కి తప్ప డేస్కాలర్స్ కి ప్రవేశం లేకపోవడంతో ఆ బడిలో చదువుకోవాలనే కోరిక కలగానే మిగిలిపోయింది. అక్కడే అధ్యాపకుడిగా పనిచేసిన మా నాన్నగారు చాలా ప్రయత్నించారు, ‘కనీసం టీచర్ల పిల్లలకు ఇళ్ళనుంచి వచ్చి చదువుకునే అవకాశం కల్పించండీ’ అని కొంతకాలం అడిగారు. కానీ యాజమాన్యం ఒప్పుకోలేదు. అలా, ఈత కొలను దగ్గరకంటా వెళ్ళి చూడాలనే నా కోరిక తీరనే లేదు.

పాఠశాలలో తెలుగు మాధ్యమం తీసేసినప్పుడు అందులోని ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే వేరే చోట్లకు డెప్యూట్ చేశారు. అలా ఓ ఐదారేళ్ళు బైట పనిచేశాక నాన్న రిటైరయ్యారు. మా ఇల్లు ఆ పాఠశాలకు చేరువలోనే కట్టుకోడంతో ఆయనకు ఆ అనుబంధం అలా కొనసాగింది.

****                     ****                     ****                     ****

సాహిత్య పరిభాషలో ఆధునికోత్తర యుగంగా పరిగణించే 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా. జీవిత వాస్తవికతను కళ్ళముందుకు తీసుకొచ్చి మనుషులను నేలకు దింపిన నిజం కరోనా. కాలచక్రంలో వందల వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్న జీవితాలను ఒక్కసారిగా ఆపేసి నిస్తబ్ధ స్థితికి తీసుకొచ్చి భూకంపంలాంటి బలమైన కుదుపు నిచ్చిన సంఘటన కరోనా. పాలకులూ ప్రభుత్వాలూ భారీ ప్యాకేజీలూ ఆస్పత్రులూ ఉచిత వైద్యాలూ ప్రకటనలూ అవన్నీ పక్కన పెడితే… పేద, మధ్యతరగతి కుటుంబాలు కరోనా ప్రకంపలను తట్టుకోవడం చాలా కష్టమే అయింది. కాలి నడకన కదిలిపోయిన వలస వెతలు కనిపించినవయితే, కడుపు కట్టుకుని ఉగ్గబట్టుకుని కష్టాలకడలి ఈదిన కతలు కనబడనివి.

అదే సమయంలో, మానవత్వపు పరిమళాలు సుదూర తీరాలకు సైతం వ్యాపించిన సందర్భాలూ కోకొల్లలు. ఆగొన్న వారిని గుర్తించి వారికి నిత్యావసరాల నుంచి ఆర్థిక సహాయం వరకూ ఆదరించిన దాతలెందరో. సమాజంలో చాలామంది తమకు చేతనైనంత స్థాయిలో తమ తోటి వారికి సాయం అందించారు. సోనూ సూద్ లాంటి వాళ్ళు గంగాళాలతో నీళ్ళు తోడి పోస్తే, మామూలు మనుషులు చెంబులు తప్పేలాలతో తమ ప్రయత్నాలు తాము చేశారు. అలాంటివారిలో మా నాన్నగారూ ఒకరు.

సరస్వతీ శిశుమంధిరాలు ఆరెస్సెస్ నిర్వహిస్తున్న పాఠశాలలు. సేవా దృక్పథంతో నడిపే ఆ బడుల్లో ఉపాధ్యాయులకు వేతనాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. కరోనా కల్లోలానికి వారి జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ఆ గురువులకు ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదని, ఆ సంస్థ వారు విరాళాలు సేకరించారు. ఆ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆ బాధ్యతను కొంతమందికి అప్పగించారు. వాళ్ళలో మా నాన్నగారూ ఒకరు.

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో, కరోనా వల్ల బైటకు రాకూడని పరిస్థితుల్లోనూ, నేనేం చేయగలనులే అనుకోలేదాయన. తనకు తెలిసిన అందరికీ ఫోన్లు చేశారు. నచ్చజెప్పేలా మాట్లాడి విరాళాలు రాబట్టారు. ఆ క్రమంలో, గతంలో ఆయన దగ్గర చదువుకున్న ఒక పూర్వ విద్యార్థికి ఈ విషయం తెలిసింది. వ్యక్తిగతంగా తాను సహాయం చేయడమే కాకుండా, తమ బ్యాచ్ విద్యార్థులందరికీ చెబుతానని హామీ ఇచ్చారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఆ మాట నిలబెట్టుకున్నారు. తమ స్కూల్ బ్యాచ్ వాట్సప్ గ్రూప్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు.

అది ఆ ఒక్క బ్యాచ్ కే పరిమితం కాలేదు. వాళ్ళ ద్వారా మరో బ్యాచ్ వారికి… అక్కడినుంచి మరొక బ్యాచ్ వారికీ… అలా చాలామందికి తెలిసింది. ఇలాంటి సందర్భాల్లో మేము గుర్తుకు రాలేదా మాస్టారూ అంటూ వాళ్ళందరూ తమ సౌమనస్కతను చాటారు. ఇంక అక్కణ్ణుంచీ జోరువాన మొదలైంది. విదేశాల్లో స్థిరపడిన కొందరు భూరి విరాళాలు అందించారు. దాంతో మా నాన్నగారు అనుకున్న లక్ష్యం కంటె ఎక్కువ మొత్తం పోగయింది.

ఇంకా గొప్ప సంగతి ఏంటంటే… ఈ విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది, మీకు రసీదులు పంపిస్తానని నాన్నగారు చెబితే, ఆ విద్యార్థులు నిరాకరించారు. ‘‘అలా ఒక్కొక్కరికీ రసీదులు ఇస్తే ఎవరెవరు ఎంతెంత ఇచ్చిందీ తెలుస్తుంది కదా… తక్కువ విరాళం ఇచ్చినవారు చిన్నబుచ్చుకోవచ్చు, మా మిత్రుల్లో మాకు అలాంటి భేదభావాలు రాకూడదు, అందుకే ఎలాంటి రసీదులూ వద్దు మాస్టారూ. మీ ద్వారా మా పాఠశాల మిత్రులం ఫలానా సంవత్సరపు బ్యాచ్ వాళ్ళం కలిసి ఇచ్చామనే చెప్పండి’’ అని సూచించారు. విచిత్రం ఏంటంటే, ఈ పూర్వవిద్యార్థి బృందాలన్నీ అలాగే సుమారు అజ్ఞాతంగానే తమ సాయం అందించారు.

‘‘నేనేదో మహా అయితే ఒక లక్ష రూపాయలు సేకరించగలనేమో అనుకున్నాను. మిత్రులు, బంధువులు, పరిచయస్తుల నుంచి దాదాపు అరవై డెబ్భై వేలు వచ్చాయి. కానీ ఈ విషయం మా పిల్లలకి తెలిసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అందరూ అభిమానంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ప్రేమ చూపించారు. కొంతమంది అయితే తమ స్తోమత ఇంతేనంటూ బాధపడ్డారు. ఎంత ఇచ్చారన్నది కాదు, ఎంత ప్రేమగా ఇచ్చారన్నది ముఖ్యం అని వాళ్ళకి చెప్పాను.’’

‘‘ఇంకో మాట కూడా ముందే చెప్పాను. శిశుమందిరాలు ఆర్ ఎస్ ఎస్ నిర్వహించే విద్యాసంస్థలు. సంఘం భావాలు అందరికీ నచ్చాలని లేదు. అందుకే నేను ముందే స్పష్టంగా చెప్పాను. ఈ విరాళాలు ఫలానా వారికి చేరతాయి, అది మీకు ఇష్టమైతేనే ఇవ్వండి అని కూడా వివరించాను. కానీ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. మా గురువు గారి ద్వారా పదిమందికి సాయం చేసే అవకాశం వచ్చింది, అని ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఇప్పటికి ఏడు లక్షలు పైగా విరాళాలు వచ్చాయి. ఇంకా మరికొంతమంది ముందుకొస్తున్నారు.’’

‘‘నేను వాళ్ళకి చేసింది ఏముంది. నా ఉద్యోగధర్మంగా పాఠాలు చెప్పాను. నాకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పానంతే. నిజానికి సుమారు ముప్ఫై నలభై ఏళ్ళ తర్వాత ఆ పిల్లల్లో కొంతమందయితే నాకు గుర్తు కూడా లేరు. కానీ వాళ్ళకి అవేమీ పట్టలేదు. నేనింకా వాళ్ళకి గుర్తున్నాను, వాళ్ళకి నామీద ప్రేమాభిమానాలూ ఉన్నాయి. దాన్ని ఇలా తమ దాతృత్వం రూపంలో చూపించారు. అందరు గురువులకూ ఇలాంటి శిష్యులు దొరుకుతారేమో తెలీదు కానీ నాకు మాత్రం దొరికారు. అందుకు నాకు గర్వంగా ఉంది.’’

‘‘ఈ డబ్బులన్నీ నేనెక్కడా నేరుగా తీసుకోలేదు. శిశుమందిరాల నిర్వాహకులు ఇచ్చిన ఖాతాలో నేరుగా జమ చేయమని చెప్పానంతే. ఎప్పుడో దశాబ్దాల నాడు నాలుగు ముక్కలు చెప్పిన మాస్టారి మాట విని అంతమంది పిల్లలు ముందుకొచ్చారంటే, వారి మనసులు ఎంత మంచివో. కష్టకాలంలో తోటివారికి సాయం చేయగల సంస్కారం నేర్పగలిగానన్న సంతృప్తి చాలు నాకు.’’

ఇలా నాన్న చెబుతుంటే ఏం మాట్లాడాలో తెలీని స్థితి. ఎందుకు ఇంతమంది మా నాన్నగారిని గుర్తు పెట్టుకున్నారు అనుకుంటే… ఓ విద్యార్థి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవే ఈ కథనం ప్రారంభ వాక్యాలు. అంత సుతిమెత్తటి గురువు లభించిన విద్యార్థులది కదా అదృష్టమంటే.

4 Comments (+add yours?)

  1. kastephale
    Nov 23, 2020 @ 15:26:12

    మానవత్వం మూర్తీభవించింది.
    ఆనందో బ్రహ్మ
    శ్రీ గురుభ్యోనమః

    Reply

  2. విన్నకోట నరసింహారావు
    Nov 23, 2020 @ 20:37:10

    మహానుభావులు అటువంటి ఉపాధ్యాయులు 🙏.

    Reply

    • ఫణీన్ద్ర పురాణపణ్డ
      Nov 26, 2020 @ 16:08:36

      నరసింహారావు గారూ…
      మా నాన్నగారు గొప్ప అన్న అభిమానం నాకు ఉండడం సహజం. అందుకే ఇప్పటివరకూ ఆయన గురించి పెద్దగా ఎప్పుడూ రాయలేదు.

      మా గురువుగారు గొప్ప అన్న ప్రేమ ఆయన విద్యార్థులతో చేయించిన సేవ… నాకు మాటలకు అందనిది.

      స్పందనకు ధన్యవాదాలు.

      Reply

Leave a comment