టెడ్డీ తప్పిపోయింది

నయోమీకి వచ్చిన మొట్టమొదటి కానుక అది. బ్రౌన్ కలర్ లో, ముక్కు మీద ఓ చిన్ని బొత్తంతో ముద్దుగా ఉంటుందా బొమ్మ. సుమారు ఏడాది వయసున్నప్పుడు నయోమీ ‘తన’ అని గుర్తించిన తొట్టతొలి కానుక అది. అందుకే ఆ చిన్నారి ఎప్పుడూ దాన్ని హత్తుకునే ఉండేది. అలాంటిది, ఒక్కసారిగా ఆ బొమ్మ పోతే తన పరిస్థితి ఏంటి?

ఇథియోపియాలోని ఆ అనాథాశ్రమంలో పిల్లలకు అక్కడున్న బొమ్మలు అన్నింటినీ పంచుకుని కలిసికట్టుగా ఆడుకోవడం అలవాటు. నయోమీ కూడా అంతే. కానీ ఆ టెడ్డీ మాత్రం తన సొంతం. నిజానికి అప్పటికి ఆ బొమ్మని తనకు ఎవరు పంపించారో ఆమెకు తెలీదు. మరికొన్ని వారాల్లోనే ఆ దంపతులు 2016లో ఆమెని దత్తత తీసుకున్నారు. వాళ్ళే బెన్ పాస్కల్, ఆడీ పాస్కల్. వాళ్ళతో కలిసి అమెరికా వ్యోమింగ్ వెళ్ళిపోయింది నయోమీ. తన టెడ్డీని పట్టుకుని. అప్పటినుంచీ వాళ్ళ అన్ని ప్రయాణాల్లోనూ టెడ్డీ కూడా ఉంది. రువాండా, క్రొయేషియా, గ్రీస్…. అలా ఎక్కడికి వెళ్ళినా నయోమీకి తోడుగా టెడ్డీ ఉండాల్సిందే.

2020 అక్టోబర్. పాస్కల్ కుటుంబం మోంటానాకు హైకింగ్ ట్రిప్ కి వెళ్ళారు. అక్కడ గ్లేసియర్ నేషనల్ పార్క్ సందర్శించారు. అందులోని హిడెన్ లేక్ ట్రయల్ కూడా చూసారు. పర్యటన అంతా పూర్తయి, వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో తన నేస్తం కనిపించడం లేదని గుర్తించింది నయోమీ. ‘మా తిరుగు ప్రయాణం మొదలై గంట దాటిపోయింది. ఉన్నట్టుండి టెడ్డీ ఏదని నయోమీ అడిగింది. నా గుండె జారిపోయింది’ అని చెప్పారు బెన్.

అప్పటికే చాలా ఆలస్యమైంది. వెనక్కి వెళ్ళి వెతుకుదామంటే చీకటి పడిపోయింది. మర్నాడు వెళ్ళి వెతుకుదామని ఆలోచించారు బెన్, ఆడీ. కానీ ఆ రాత్రి మంచు తుఫాన్ మొదలైంది. ఆ తర్వాత ఆ సీజన్ కి పార్కు మూసేసారు. ఇంక టెడ్డీ దొరికే అవకాశాలూ మూసుకుపోయాయి. నయోమీ బాధకి అంతే లేదు.

2021 జూన్. సుమారు తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఋతువు మారింది కదా, మంచు తొలగిపోయి ఉంటుంది, బొమ్మ దొరుకుతుందేమోనన్న చిరు ఆశ. పాస్కల్ దంపతులు తమకు తెలిసిన వాళ్ళందరికీ ‘గ్లేసియర్ నేషనల్ పార్క్ లో హిడెన్ లేక్ ట్రయల్ కి వెళ్ళేవాళ్ళు దయచేసి తమ టెడ్డీ దొరుకుతుందేమో చూడండి’ అని చెప్పారు.. ఆడీ అయితే తన ఫేస్ బుక్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసింది.

కానీ వాళ్ళకి ఆ సమయానికి తెలీని విషయమేంటంటే… టెడ్డీ అప్పటికే దొరికేసింది.

గ్లేసియర్ పార్క్ రేంజర్స్ ప్రతీ యేటా, సీజన్ ముగిసిన తర్వాత ఒకసారి క్లీనింగ్ చేస్తుంటారు. ఆ పనిలో వారికి మంచులో కూరుకుపోయి, తడిసి నానిపోయి, మురికి పట్టి  మాసిపోయిన టెడ్డీ దొరికింది. మామూలుగా అయితే దాన్ని పారేసేవారే. కానీ, అది దొరికినది టామ్ మజారిసీ అనే రేంజర్ కి. హడ్సన్ బే ప్రాంతంలో ఎలుగుబంట్ల ఆనుపానులు కనిపెట్టుకుని ఉండడం అతని విధి. ‘ఎలుగుబంట్లు అంటే నాకు ప్రాణం.  ఆ టెడ్డీ బేర్ బొమ్మని పారేయడానికి నాకు చేతులు రాలేదు‘ అంటూ అతను గ్లేసియర్ నేషనల్ పార్క్ ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చాడు. ‘ఆ టెడ్డీ బేర్ లో ఏదో ప్రత్యేకత ఉంది. దాన్ని నాతో తెచ్చుకున్నాను. దానికి సీజర్ అని పేరు పెట్టుకున్నాను.’

రేంజర్ మజారిసీ పెట్రోలింగ్ కారుకి సీజర్ ఓ అలంకారమయింది. కారు డాష్ బోర్డ్ మీద కూర్చుని వన్యప్రాణులను చూస్తూండేది. సుమారు ఏడాది పాటు వన్యప్రాణి సంరక్షణలో రేంజర్ మజారిసీకి తోడుగా ఉంది టెడ్డీ సీజర్.

ఈ 2021 ఆకురాలు కాలం టెడ్డీ కథలో మరో మలుపు. పాస్కల్ కుటుంబానికి స్నేహితురాలు టెరీ హేడెన్ సెప్టెంబర్ నెలాఖరులో గ్లేసియర్ పార్కుకు వెళ్ళింది. అక్కడ రేంజర్ వాహనంలో సీజర్ ని చూసి, అనుమానించింది. ఆమె మేనకోడలు దాన్ని ఫొటో తీసింది. టెరీ ఆ ఫొటోని ఆబీకి పంపించింది. ఆబీ దాన్ని గుర్తుపట్టింది. అదే టెడ్డీ అని తెలిసిపోయింది. ఆ రాత్రి టెరీ హేడెన్ ఆబీకి వీడియో కాల్ చేసింది. ‘నీకొక సర్ ప్రైజ్’ అని నయోమీకి చెప్పింది.

‘టెడ్డీయేనా?’ అని అరిచి గంతులు వేసింది నయోమీ. చిన్ననాటి నుండీ తన చిన్నారి నేస్తం, ఏడాది కాలంగా ఏడిపించిన తోడు, తన టెడ్డీ మళ్ళీ తనకు దొరికింది. నయోమీ ఆనందానికి అవధులు లేవు.

మరి, రేంజర్ మజారిసీ పరిస్థితి ఏంటి? టెరీ హేడెన్ అతనికి ఇంకో బొమ్మని కానుకగా ఇచ్చింది. ఆ బేర్ కి క్లోవర్ అని పేరు పెట్టుకున్నాడతను. క్లోవర్ ప్రస్తుతానికి మజారిసీ క్యాబిన్ లో శీతాకాలం సెలవుల్లో ఉంది. వచ్చే వసంత ఋతువులో విధుల్లో చేరుతుంది.

Leave a comment