శాస్త్రవేత్త కొలత

భౌతికశాస్త్రంలో నోబెల్ విజేత, రాయల్ అకాడెమీ అధ్యక్షుడిగా పని చేసిన సర్ ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్ ఒకసారి నిజంగా జరిగిన ఓ కథ చెప్పారు.

కొన్నాళ్ళ క్రితం నాకొక సహోద్యోగి నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఓ చిత్రమైన సమస్యలో ఇరుక్కున్నాడు. ఒక ప్రశ్నకి ఒక విద్యార్ధి రాసిన జవాబుకు ఆయన సున్నా మార్కులు ఇద్దామనుకుంటున్నాడు. అదే సమయంలో ఆ విద్యార్ధి తన జవాబుకు పూర్తి మార్కులు ఇచ్చి తీరాల్సిందేనని భావిస్తున్నాడు. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. తటస్థంగా వ్యవహరించే మూడో వ్యక్తితో ఆ ప్రశ్నకు మార్కులు ఇప్పించాలన్నదే ఆ ఒప్పందం. వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు.

ముందుగా నేను ప్రశ్నాపత్రం చూశాను. ‘‘ఒక పొడవైన భవనం ఎత్తును భారమితి సహాయంతో కొలవడం ఎలా?’’ దానికి ఆ విద్యార్థి ఇలా జవాబిచ్చాడు. ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. దానికి ఓ పొడవాటి తాడు కట్టాలి. దాన్ని రోడ్డు మీద వరకూ వదలాలి. ఆ తర్వాత తాడును పైకి లాగాలి. దాని పొడవు కొలవాలి. ఆ తాడు పొడవు భవనం పొడవుకు సమానం.’’

ఆ విద్యార్ధి జవాబులో తప్పేమీ లేదు. అతను పూర్తిగా వివరించాడు, సరైన సమాధానం ఇచ్చాడు. కాబట్టి అతనికి పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. కానీ సమస్యేంటంటే… పూర్తి మార్కులు ఇచ్చేస్తే అతనికి ఫిజిక్స్ లో మంచి గ్రేడ్ వస్తుంది, అంటే భౌతికశాస్త్రంలో అతను సమర్ధుడు అని నిర్ధారించినట్టవుతుంది. కానీ అతని జవాబు అలాంటి నిర్ధారణకు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను ఆ విద్యార్ధికి ఒక సలహా ఇచ్చాను. అదే ప్రశ్నకు మరొకసారి భౌతికశాస్త్రం ప్రకారం జవాబు ఇవ్వాలని హెచ్చరించాను. దానికి ఆరు నిమిషాల వ్యవధి ఇచ్చాను.

ఐదు నిమిషాలు గడిచిపోయాయి, కానీ అతను ఏమీ రాయలేదు. దాంతో ఈ పరీక్షను వదిలేసుకుంటున్నావా అని అతన్ని అడిగాను. దానికి అతని జవాబు నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ సమస్యకు అతని దగ్గర చాలా జవాబులు ఉన్నాయట. వాటిలో ఏది అత్యుత్తమమైన జవాబు కాగలదో ఆలోచిస్తున్నాను అని చెప్పాడా విద్యార్ధి. అతని సమయం వృధా చేసినందుకు క్షమాపణలు కోరాను. మిగిలిన ఒక్క నిమిషంలోనూ జవాబు రాయమని అతనికి చెప్పాను.

మరునిమిషంలోనే అతను తన ఆన్సర్ షీట్ ఇచ్చేశాడు. అందులో ఇలా రాసివుంది ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. భవనం పై అంచు దగ్గర వంగి నిలబడండి. భారమితిని పైనుంచి వదిలేయండి. అది కిందకు పడడానికి పడిన సమయాన్ని స్టాప్ వాచ్ తో కొలవండి.

అప్పుడు x = 0.5 X aXt^2 అనే సూత్రం ఆధారంగా భవనం ఎత్తును కొలవవచ్చు’’ అని చెప్పాడు.

ఆ సమయంలో నేను నా మిత్రుణ్ణి పిలిచాను. విద్యార్ధికి మార్కులు ఇస్తావా అని అడిగాను. సరే అంటూ అతను ఆ విద్యార్ధికి పూర్తి మార్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నేను అక్కడినుంచి వెళ్ళిపోడానికి సిద్ధపడుతున్నాను. ఆ సమయంలో అదే ప్రశ్నకు మరిన్ని జవాబులున్నాయని అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవేంటో చెప్పమని అతన్ని అడిగాను.

‘‘ఒక భవనం ఎత్తును భారమితితో కొలవాలంటే చాలా పద్ధతులున్నాయి. మచ్చుకి, ఎండగా ఉన్న ఒకానొక రోజు భవనం దగ్గరకు భారమితి తీసుకువెళ్ళాలి. భారమితి నీడ పొడవు కొలవాలి. అలాగే భవనం నీడ పొడవు కొలవాలి. ఆ రెండింటి నిష్పత్తిని బట్టి భవనం ఎత్తు కనుక్కోవచ్చు.’’

‘‘బావుంది. మరి మిగతా పద్ధతులేంటి?’’

‘‘మీకు నచ్చే అత్యంత మౌలికమైన పద్ధతి ఒకటుంది. ఆ పద్ధతిలో… మీరు భారమితిని చేతిలో పట్టుకుని మెట్లు ఎక్కండి. పైకి ఎక్కేకొద్దీ గోడ వెంబడి భారమితి పొడవు దగ్గర గుర్తులు పెట్టుకుంటూ పైదాకా వెళ్ళండి. పూర్తిగా పైదాకా ఎక్కేయండి. భారమితి గుర్తులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టండి. ఆ సంఖ్యతో భారమితి పొడవును గుణించండి. భవనం ఎత్తు ఎంతో తెలిసిపోతుంది.’’

‘‘మరీ ప్రత్యక్ష పద్ధతి.’’

‘‘నిజమే. మీకు మరింత నాజూకైన పద్ధతి కావాలంటే… భారమితిని ఒక తాడు చివర కట్టండి. దాన్ని పెండ్యులంలా ఊపండి. ఆ పద్ధతిలో భవనం మొదలు దగ్గరా, భవనం చివరా గురుత్వాకర్షణ శక్తి ‘g’ విలువ లెక్కకట్టండి. ఆ రెండు విలువల మధ్య తేడాను బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

ఈ ప్రయోగాన్నే కొద్దిగా మార్చి మరోలా చేయవచ్చు. భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. పొడవాటి తాడుకు దాన్ని తగిలించాలి. అప్పుడు దాన్ని భవనం కింద వరకూ వేలాడదీసి, పెండ్యులంలా ఊపాలి. అప్పుడు అప్పుడు ప్రెసిషన్ పిరియడ్ బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

‘‘చెప్పాలంటే ఇలా చాలా పద్ధతులున్నాయి.’’ అన్నాడా యువకుడు. ‘‘బహుశా, వాటన్నిటిలో ఉత్తమమైనది ఇలా ఉండవచ్చు. భారమితిని తీసుకుని భవనం బేస్మెంట్ లో ఉన్న సూపరింటెండెంట్ ఇంటికి నేరుగా వెళ్ళాలి. ఆయన తలుపు తీశాక ‘సూపరింటెండెంట్ గారూ, నా దగ్గరో మంచి విలువైన భారమితి ఉంది. ఈ భవనం ఎత్తు ఎంతో చెప్పారంటే దీన్ని మీకు ఇచ్చేస్తాను’ అని ఆయనకు చెప్పవచ్చు.’’

ఆ దశకు వచ్చేసరికి అసలు ఆ అబ్బాయికి ఆ ప్రశ్నకు సాధారణ సంప్రదాయిక పద్ధతిలో జవాబు తెలుసా అని అడిగాను. తనకు తెలుసని చెప్పాడా అబ్బాయి. అయితే హైస్కూల్ లోనూ, కాలేజీ లోనూ ఉపాధ్యాయులు అతనికి ఆలోచించడం పదేపదే చెబుతూనే ఉండడం తనను పూర్తిగా విసిగించేసిందని చెప్పాడతను.

ఆ విద్యార్ధి పేరు ‘‘నీల్స్ బోర్’’. అతను 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కార విజేత.

హరప్పా అశ్వమేథమూ… అమెరికా పరిశోధనలూ…

భారత చరిత్రను వక్రీకరించే క్రమంలో ప్రధానంగా చేసే వాదనల్లో ప్రధానమైనదిఆర్యులు బైటి దేశాల నుంచి మన దేశానికి వచ్చాకనే ఇక్కడ సంస్కృతీ నాగరికతా ప్రబలాయన్నది. క్రీస్తుపూర్వం 1500 తర్వాతే వారు ఇక్కడకు వచ్చారూ, ఆ తరవాతే వేదాలు రాసారూ అని వాదన. దాన్ని నిలబెట్టుకోడానికి చూపించే రుజువు ఏంటయ్యా అంటేభారతదేశంలో క్రీ.పూ. 1500కు ముందు గుర్రాలు లేవు…… ఆ సమయంలో వచ్చిన ఆర్యులు తమతోపాటే గుర్రాలు తీసుకొచ్చారు…. ఋగ్వేదంలో గుర్రాల గురించి పలుమార్లు ప్రస్తావనలు ఉన్నాయి…. కాబట్టి వేదాలు 1500 బీసీ తర్వాతివే.

హరప్పా నాగరికతలో ఎన్నో ముద్రలు బైటపడ్డాయి. వాటిలో ఎద్దు, గేదె, మేక వంటి జంతువులు ఎన్నో ఉన్నాయి కానీ గుర్రాల బొమ్మలు లేవు. కాబట్టి హరప్పా నాగరికత కాలానికి భారతదేశంలో గుర్రాలు లేవు. ఆ నాగరికత పూర్తిగా పతనం అయ్యాకనే ఆర్యులు భారతదేశానికి వచ్చారు.

horse

కాబట్టిక్రీ.పూ. 1500 తర్వాత ఆర్యులనే జాతికి చెందిన వారు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చాక వారు తమగురించి పాడుకున్న గీతాలే వేదాలుఅంతేతప్ప ఇక్కడి దేశీయ దస్యులకు, ద్రవిడులకు బట్ట కట్టడమూ అన్నం వండుకోడమూ తెలీదు.. గుర్రాలను మచ్చిక చేసుకుని వాడుకునే తెలివితేటలు అసలే లేవు. రొమిల్లా థాపరులూ, సతీష్ చంద్రలూ ఇలాంటి మహోగ్ర చరిత్రకారులు చెప్పే ఆ కట్టుకథలను చరిత్రగా చదువుకోవలసిందే.

ఆ వాదన తప్పని చెప్పడానికి ప్రయత్నించేవారిని హిందుత్వ వాదులుగా ముద్ర వేయడం పరిపాటి. కావాలంటే మీరూ గమనించవచ్చు.

http://www.frontline.in/static/html/fl1720/17200040.htm

http://www.frontline.in/static/html/fl1723/17231220.htm

కానీ ఈ గడ్డ మీద 5న్నర కోట్ల యేళ్ళనాడే గుర్రాలు, రైనోలు ఉండేవని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. కాదని దబాయించేద్దామంటే వాళ్ళు అమెరికనులు అయిపోయారుఅంతటోళ్ళు తప్పు చెబుతారా? 🙂 జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం గుర్రాలు, రైనోలు భారత ఉపఖండంలోనే పుట్టి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

భారత ఉపఖండం ఒక ద్వీపంగా ఉన్నప్పుడు, ఆ ద్వీపం ఆసియా భూభాగంలో కలిసిపోడానికి ముందే ఆ ప్రాంతంలో పెరిసోడాక్టిలా అనే జీవ వర్గానికి చెందిన జీవులు ఉద్భవించాయట. ఇప్పుడు మనం చూస్తున్న గుర్రాలు, రైనోలతో పాటు టాపిర్ అనే జంతువులు ఆ వర్గానికి చెందినవే, ఆ కాలంలో అభివృద్ధి చెందినవే. వెనుక కాళ్ళకు బేసి సంఖ్యలో వేళ్ళు ఉండే జంతువులివి. పెరిసోడాక్టిలా వర్గానికి చెందిన జీవులు ఇయోసీన్ యుగం ప్రారంభం నాటికే అంటే 5కోట్ల 60లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయి. కానీ వాటి ప్రారంభ దశ నాటి వివరాలు ఇప్పటివరకూ తెలియరాలేదు.

జాన్ హాప్కిన్స్ వర్సిటీ ప్రొఫెసర్ కెన్ రోజ్ నేతృత్వంలోని బృందం (ఆ బృందంలో భారతీయ పరిశోధకులు కూడా ఉన్నారు) 2001లో పశ్చిమ భారతదేశంలో అన్వేషణలు జరిపారు. ముంబైకి ఈశాన్య దిశలో గుజరాత్ లోని కాంబే వద్ద ఓ బొగ్గు గని దగ్గర వారికి పెద్ద మొత్తంలో ప్రాచీన కాలం నాటి అవశేషాలు లభ్యమయ్యాయి. దంతాలు, ఎముకలు ఉన్న ఆ అవశేషాలను ప్రొఫెసర్ రోజ్ పెద్ద ఖజానా అని వర్ణించారు. సుమారు 2వందల శిలాజాలు లభ్యమయ్యాయి. అవన్నీ ఒకే జంతువుకు చెందినవి. దానికి కాంబేథిరియమ్ తెవ్సిసీ అని పేరు పెట్టారు. ఆ జీవిగుర్రాలు, రైనోలకు పూర్వ రూపం అని భావిస్తున్నారు.

నిజానికిఇయోసీన్ యుగం ప్రారంభంలోనేఅంటే భారత దేశం ద్వీపంగా ఉండే సమయంలో ఎన్నో రకాల క్షీరదాలు ఈ ఉపఖండంలో పుట్టాయని 1990లోనే న్యూయార్క్ కు చెందిన స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రతిపాదించారు. దానికి మొదటి ఆధారం ఈ కాంబేథిరియమ్ ఉనికి అంటున్నారు కెన్ రోజ్.

http://www.nature.com/ncomms/2014/141120/ncomms6570/full/ncomms6570.html

ఇప్పుడీ శిలాజాలు లభ్యమైన కాంబే.. నాటి హరప్పా నాగరికత పరిఢవిల్లిన ప్రాంతం లోనిదే. మరి అక్కడ క్రీస్తు పూర్వం 1500 కు ముందు గుర్రాలే కాదు, రైనోలు కూడా ఉండేవంటేఅమ్మోఎర్ర కళ్ళ చరిత్రకారుల సిద్ధాంతాలన్నీ తల కిందులైపోవూ. బహుశా భారత ఉపఖండం యూరేషియాలో కలిసిపోయాక ఆ గుర్రాలూ రైనోలన్నీ ఆఫ్రికా వెళ్ళిపోయినందునే ఇక్కడ గుర్రాల ఎముకలు మిగలకుండా పోయాయేమో. ఇప్పుడు దీన్ని కూడా కాన్స్పిరసీ థియరీగా మార్చే పని మొదలెట్టాలి మరి. ఎలాగంటారా

అక్కడ బైటపడిన ఎముకలు నేరుగా గుర్రానివి కావు. అదేదో చిత్రమైన జంతువువని చెబుతున్నారు. దానికీ గుర్రానికీ మధ్యలో ఇంకా ఎన్ని దశలున్నాయో తెలీదు. కాబట్టి వాటిని గుర్రాలుగా పరిగణించలేం.

అసలు భారతీయులకు గుర్రాలు ఎక్కడివి? ఆ ఎముకలు పర్షియా నుంచి ఇండియా వచ్చి ఇక్కడ చచ్చిపోయిన గుర్రాలవై ఉంటాయి.

కెన్ రోజ్ పరిశోధక బృందంలో ఇద్దరు భారతీయులున్నారువాళ్ళు హిందుత్వ వాదులు కాబట్టే చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

పశ్చిమ భారతదేశం మొత్తం మీద గుజరాత్ లోనే అదీ హరప్పా నాగరికతతో సంబంధం ఉన్న ప్రాంతంలోనే అది కూడా 1990ల తర్వాతి పరిశోధనల్లోనే ఇలాంటి వివరాలు బైటపడడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఇదంతా మోదీ కుట్రే.

మొట్టమొదటి సెకనులో….

విశ్వం ఎలా ఏర్పడింది.. ఎలా విస్తరించింది… అన్న ప్రశ్న… ఇప్పటికీ జవాబు అందకుండా ఊరిస్తున్న రహస్యమే. ఆ ప్రశ్నకు సైద్ధాంతిక సమాధానాలే తప్పించి సాక్ష్యాలు, ఆధారాలతో కూడిన జవాబులు ఇప్పటివరకూ లేవు. అలాంటి ఆధారం ఒకటిప్పుడు శాస్త్రవేత్తలకు లభించింది. మహావిస్ఫోటనం తర్వాత మొట్టమొదటి సెకనులో విశ్వం విస్తరణ జరిగిన క్రమానికి సంబంధించి కీలకమైన ఆధారం దొరికింది.

సుమారు 14వందల కోట్ల సంవత్సరాల క్రితం రోదసిలో మహావిస్ఫోటనం సంభవించింది. అదే ఈ విశ్వం ఆవిర్భావానికి మొదలు. భౌతికశాస్త్రంలో ఆ క్షణాన్నే కాలానికి ప్రారంభంగా భావిస్తారు. ఆ మరుసటి సెకను నుంచీ కాలం లెక్క మొదలవుతుంది. సరిగ్గా అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం మీదనే ఇప్పుడు భౌతిక శాస్త్ర ప్రయోగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు అదే విషయానికి సంబంధించి కీలక ఆధారం లభించినట్టు భావిస్తున్నారు.

బిగ్‌ బ్యాంగ్‌ జరిగిన మొట్టమొదటి సెకను నుంచే విశ్వం విస్తరించడం మొదలైంది. ఆ మహావిస్ఫోటనంలో పుట్టిన పదార్ధమే విశ్వంగా వ్యాపించింది. అదే సమయంలో వెలువడిన కాంతి కూడా రోదసి అంతటా విస్తరించింది. ఆ కాంతి ఇప్పటికీ అంతరించిపోలేదు. దాని అవశేషం ఇప్పటికీ రోదసిలో అత్యంత బలహీనంగా కొనసాగుతోంది. దాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం. దాన్ని సుసాధ్యం చేశారు శాస్త్రవేత్తలు.

bigbang

మహా విస్ఫోటన సమయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి కేంబ్రిడ్జ్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, మిన్నెసోటా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లోని ఆస్ట్రో ఫిజిక్స్‌ విభాగాలు, నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఆ సంస్థల శాస్త్రవేత్తల బృందం ఉత్తర ధ్రువ ప్రాంతపు గగన తలంలో నిర్దిష్ట ప్రాంతాన్ని మూడేళ్ళ పాటు నిశితంగా పరిశీలించింది. విశ్వంలో వ్యాపిస్తుండే లక్షల కోట్ల కాంతి తరంగాల్లో… ఒక కచ్చితమైన పాటెర్న్‌ కోసం ఆ శాస్త్రవేత్తలు అన్వేషించారు. మహావిస్ఫోటనం ప్రకంపనాల నుంచి వెలువడి ఇప్పటివరకూ కొనసాగుతున్న అత్యంత బలహీనమైన వెలుగురేక కోసం వారు జరిపిన అన్వేషణ ఫలించింది. రోదసిలో నిర్దిష్ట స్థల కాలాల అవధిలో జనించిన గురుత్వాకర్షణ తరంగాల విస్తరణలోనే ఈ కాంతి తరంగానికి ఒక పాటెర్న్‌ ఏర్పడింది. ఆ పాటెర్న్‌ నుంచే ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఈ ఆధారం లభించింది.

విశ్వం ఏర్పడిన తొలి క్షణాల్లో ఏం జరిగిందనే విషయంపై వైజ్ఞానిక లోకంలో పెద్దగా భేదాభిప్రాయాలు లేవు. ఐతే పూర్తి సైద్ధాంతిక విషయమే తప్ప దానికి ప్రాయోగిక నిరూపణలు లేవు. అందుకే ఇప్పుడు తెలిసిన ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ కాంతి తరంగపు జాడను కచ్చితంగా పట్టుకోగలిగితే… కాంతి వేగానికి కొన్ని లక్షల రెట్ల వేగంతో విశ్వం విస్తరించిన తీరును తెలుసుకోడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

బ్లాక్‌హోల్స్‌ ఆర్‌ నాట్‌ బ్లాక్‌…

కృష్ణబిలాలు అన్న ఆలోచనే తప్పని ప్రకటించి సంచలనం సృష్టించారు సంచలనాత్మక భౌతికశాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌. బ్లాక్‌ హోల్స్‌ అనేవి లేనేలేవని… ఉన్నవల్లా గ్రేహోల్స్‌ అని ఆయన తేల్చి చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ ప్రిజర్వేషన్‌ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ ఫర్‌ బ్లాక్‌హోల్స్‌ అన్న టైటిల్‌తో తన తాజా పరిశోధనా పత్రాన్ని జనవరి 22న ప్రచురించారాయన.

భౌతిక శాస్త్రంలో బ్లాక్‌హోల్స్‌ లేదా కృష్ణబిలాల ఉనికి ఓ సంచలనం. బ్లాక్‌హోల్స్‌లో పడిన ఏ శక్తి లేదా సమాచారమూ… దాన్నుంచి బైటకు పోలేదని సంప్రదాయిక భౌతిక శాస్త్రవేత్తల భావన. ఐతే అది సాధ్యమేనంటారు క్వాంటమ్‌ ఫిజిసిస్టులు. ఆ రెండు వాదనల మధ్య వైరుధ్యం శాస్త్రలోకానికి ఇప్పటికీ పెద్ద సవాల్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో… భౌతిక శాస్త్రజ్ఞుల ప్రపంచం ముందు స్టీఫెన్‌ హాకింగ్‌ సరికొత్త ప్రతిపాదన ఉంచారు.

దీనికోసం స్టీఫెన్‌ హాకింగ్‌ ఈవెంట్‌ హొరైజాన్‌ గురించిన సంప్రదాయిక భావనలను పునర్నిర్వచించారు. ఈవెంట్‌ హొరైజాన్‌ అంటే కాంతి కూడా తప్పించుకోజాలని, వెనక్కు తిరిగి రాలేని బిందువు. కృష్ణబిలాలకుండే గురుత్వాకర్షణ శక్తికి లోబడిన పదార్ధం (మేటర్‌) దానిలోపల పొడుగాటి తీగలుగా సాగి సాగి బ్లాక్‌హోల్‌ కేంద్రకం లోపలి భాగంపై బలాన్ని ప్రయోగిస్తాయి. అంతే తప్ప అక్కడినుంచి ఎంతమాత్రం బైటకు తప్పించుకోలేవని ఫిజిసిస్టుల భావన. క్వాంటమ్‌ ఫిజిసిస్టులు మాత్రం దానికి భిన్నమైన ఫలితం వస్తుందని చెబుతారు. బ్లాక్‌హోల్ కేంద్రక భాగం నుంచి భారీ మొత్తంలో రేడియేషన్‌ వెలువడుతుంది. అదే కృష్ణబిలంలోకి ప్రవేశించే మేటర్‌ని అమితమైన గురుత్వాకర్షణ శక్తితో తునాతునకలు చేసేస్తుంది… అని క్వాంటమ్‌ ఫిజిసిస్టుల వివరణ.

ఈ రెండు థియరీల మధ్య వైరుధ్యమే బ్లాక్‌హోల్స్‌ను అర్ధం చేసుకోడానికి అడ్డంకిగా మారిందంటున్నారు స్టీఫెన్‌ హాకింగ్‌. శక్తిని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం కాబట్టి. బ్లాక్‌హోల్‌ కోర్‌ లోపలికి ఆకర్షించబడి చిక్కుకుపోయే శక్తి లేదా ద్రవ్యరాశి.. మళ్ళీ బైటపడి… విశ్వంలోకి వచ్చేస్తుందని ఆయన వివరణ. అయితే ఆ పదార్ధం అప్పటికి ఛిన్నాభిన్నమైపోయి ఉంటుందనీ, ఏ రూపంలో విశ్వంలోకి వస్తుందో చెప్పడం సాధ్యం కాదనీ హాకింగ్‌ తాజా సూత్రీకరణ. ఈవెంట్ హొరైజాన్‌ అనేది గతంలో భావించినట్టు సూదిమొనలాంటి సరళరేఖలా ఉండదని… దానికి బదులు యాపరెంట్‌ హొరైజాన్‌ ఉంటుందని హాకింగ్‌ ప్రతిపాదిస్తున్నారు.

ఈ యాపరెంట్ హొరైజాన్‌ అనేది బ్లాక్‌హోల్‌ కాకుండా… గ్రే ఏరియా అంటున్నారు హాకింగ్‌. అంటే… మేటర్‌ను పూర్తిగా గ్రహించేయడం, పూర్తిస్థాయిలో మింగేయడం జరగదన్నమాట. మనుషులు పూర్తి బ్లాక్‌ అండ్‌ వైట్‌గా కాకుండా ‘గ్రే’గా ఉండేటట్టే… హొరైజాన్‌ కూడా గ్రే హొరైజాన్‌లా ఉంటుందట. క్వాంటమ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల ఆ గ్రే ఏరియా స్థానం మారుతూ, రూపం మార్చుకుంటూ ఉంటుందట. బ్లాక్‌హోల్‌ బౌండరీ అలా ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం వల్ల దానిలో ఇరుక్కుపోయి ఉండే కొంత కాంతి (లేదా పదార్ధం లేదా శక్తి) బైటకు తప్పించుకోగలదట. అలాగే కృష్ణబిలంలో గురుత్వాకర్షణ కేంద్రాలుండే ప్రదేశాలు అనూహ్యం కావడం వల్ల బ్లాక్‌హోల్స్‌కు స్థిరత్వం కూడా తక్కువేనంటున్నారు హాకింగ్‌.

హాకింగ్ తాజా సూత్రీకరణలు క్లాసికల్‌ ఫిజిసిస్టులు క్వాంటమ్‌ ఫిజిసిస్టుల వాదనల మధ్య భేదాలను తొలగించేలా ఉన్నాయి. అదే సమయంలో మరికొన్ని కొత్త భేదాభిప్రాయాలకు తావిస్తున్నాయి. ఈవెంట్‌ హొరైజాన్‌ కాన్సెప్టును తొలగించడం, కృష్ణబిలం సరిహద్దుల ప్రవర్తనను మార్చేయడం వంటి ప్రతిపాదనలు అసలు బ్లాక్‌హోల్‌ మౌలిక లక్షణాలనే మార్చేస్తున్నాయి. వాటి నుంచి పదార్ధం బైటకు రాగలదని నిర్ణయిస్తే గ్రేహోల్‌ అనేది కూడా ఉండాల్సిన అవసరం ప్రశ్నార్ధకమవుతుంది.

స్టీఫెన్‌ హాకింగ్‌ ప్రతిపాదించిన ఈ కొత్త సిద్ధాంతాన్ని చాలామంది శాస్త్రవేత్తలు సవాల్ చేస్తున్నారు. మరే ఇతర శాస్త్రవేత్తలతో ఎలాంటి కనీస స్థాయి సమీక్ష కూడా లేని ఈ ప్రతిపాదనలను నేరుగా అంగీకరించడం సాధ్యం కాదంటున్నారు. క్లాసికల్, క్వాంటమ్‌ ఫిజిసిస్టుల వాదనల మధ్య పరిష్కారం సాధించే ప్రయత్నంలో స్టీఫెన్‌ హాకింగ్‌ చేసిన ప్రతిపాదన… మానవుడు ఇప్పటికీ కనుగొనలేకపోయిన, తెలుసుకోలేకపోయిన రోదసి లక్షణాలపై మరో కొత్త చర్చకు దారి తీసింది. బ్లాక్‌హోల్‌ గురుత్వాకర్షణ శక్తిలోపల పదార్ధం లేదా శక్తి బందీ ఎలా అయి ఉంటుందో నిర్ణయించడం.. కృష్ణబిలం కేంద్రకంలో చిక్కుకున్న పదార్ధపు స్వభావాన్ని గ్రహించడం, పదార్ధం అక్కడ ఎలా ధ్వంసమవుతుందో తెలుసుకోడం, అవి బ్లాక్‌హోల్‌ నుంచి బైటపడగలిగితే అదెలా సాధ్యమో తెలుసుకోవడం… అన్నీ ప్రశ్నలే.

మొత్తం మీద బ్లాక్‌హోల్స్‌ను మనం అపార్ధం చేసుకుంటున్నామంటూ స్టీఫెన్‌ హాకింగ్‌ కొత్త సంచలనం సృష్టించాడు. అవి పూర్తిగా బ్లాక్‌ కాదనీ… వాటిలోనూ గ్రే ఏరియాస్‌ ఉంటాయనీ ప్రకటించడం ద్వారా భౌతికశాస్త్రవేత్తల ప్రయోగాలకు మరో కొత్త సవాల్‌ విసిరాడు. కృష్ణబిలాల లోపల ఏం జరుగుతుందన్న విషయాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోడం ఇప్పటికీ సాధ్యం కాకపోయినా… ఈ కొత్త చూపు కృష్ణబిలాలను అర్ధం చేసుకునే విధానాల్లో కచ్చితంగా ఓ ముందడుగే.

(బ్లాక్‌హోల్స్‌ ఆర్‌ నాట్‌ సో బ్లాక్‌.. అంటూ వచ్చిన వార్తాకథనాలను చదివాక నాకు అర్ధమైన రీతిలో రాశాను. కొన్ని పునరుక్తులను భరించండి. ఈ కంటెంట్‌లో సైంటిఫిక్‌ తప్పులేమైనా ఉంటే అవి పూర్తిగా నావే.)

ఆ మార్మిక మందహాసపు మాయ మలిగేనా?

మోనా లిసా చిరునవ్వు గురించి వినని వారుండరేమో. రినైజాన్స్‌ కాలం నాటి మోనా లిసా… కళా ప్రపంచంలో ఇప్పటికీ శేష ప్రశ్నే. ప్రపంచ చిత్రలేఖన చరిత్రలో అదో రహస్యం. స్టుమాటో శైలిలోని ఆ చిత్రలేఖనంలో దాగివున్న మార్మికతే దాని ప్రత్యేకత. ఆ చిరునవ్వు వెనుక ఉన్న వ్యక్తి ఎవరో ఇన్నాళ్ళూ నిర్ధారణగా తెలీదు. కేవలం 30 అంగుళాల పొడవు, 21 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చిన్న చిత్రలేఖనం మీద నాలుగు శతాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. మోనా లిసా చిరునవ్వు వెనుక కథేమిటన్న అంశంపై రకరకాల సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి.

లియొనార్డో ద విన్సీ అపూర్వ సృష్టి అయిన మోనా లిసా చిత్రలేఖనానికి మోడల్‌గా ఉన్నదెవరు అన్న అంశంపై ఇప్పటికే కొన్ని ప్రాథమిక నిర్ధారణలకు వచ్చారు పరిశోధకులు. అయితే అవి సరైనవా కావా అన్నది నిర్ధారించుకోవాలి. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో… ఫ్రెంచ్‌ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. ఫ్రాన్స్‌లోని ఫ్లోరెన్స్‌ నగరంలో ఒక సమాధిలో తవ్వకాలు చేపట్టి… కొన్ని అస్తిపంజరాల నుంచి ఎముకలు సేకరించారు.

mona lisa

మోనా లిసా విషయంలో ఇప్పుడు చాలామంది ఒప్పుకుంటున్న థియరీ ప్రకారం… ఫ్రాన్సెస్కో డెల్‌ గియోకొండో అనే పట్టు వ్యాపారి… తన భార్య లీసా గెరార్డినీ చిత్రలేఖనం గీయాలని లియొనార్డోను కోరాడు. లియొనార్డో పదిహేనేళ్ళు శ్రమించి ఈ పెయింటింగ్ పూర్తి చేశాడు. తన భర్త మరణానంతరం లీసా గెరార్డినీ ఫ్లోరెన్స్‌ నగరంలోని ఓ క్రైస్తవాశ్రమంలో సన్యాసినిగా చేరింది… 63ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచింది.

రెండేళ్ళ క్రితం ఫ్లోరెన్స్‌ ఆశ్రమంలోని సమాధుల నుంచి ఒక మహిళ ఎముకలు వెలికితీశారు. అవి లీసా గెరార్డినీవేనా కావా అన్న విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. దానికోసం ఫ్లోరెన్స్‌ నగరంలోని గియోకొండో వంశస్తుల సమాధులను ఇప్పుడు తవ్వి తీశారు. అదృష్టం ఏంటంటే… అక్కడ సమాధి చేసిన వ్యక్తులందరి వివరాలూ శిలాఫలకంపై రాసి ఉన్నాయి. వారిలో లీసా సంతానం కళేబరాల అవశేషాలు కూడా ఉన్నాయని నిర్దుష్టంగా తెలుస్తోంది.

ఇప్పుడు పరిశోధకులు లీసా పిల్లల ఎముకల్లోని డీఎన్‌ఏను… ఆశ్రమంలో దొరికిన ఎముకల డీఎన్‌ఏతో పరిశీలిస్తారు. అవి సరిపోలితే… ఆ ఎముకలు లీసావేనని నిర్ధారణ అవుతుంది. ఒకసారి ఆ విషయం తేలితే ఆ మహిళ కపాలాన్ని కృత్రిమంగా పునర్నిర్మిస్తారు. దాన్ని లియొనార్డో చిత్రలేఖనంలోని మహిళతో సరిపోలుస్తారు. అప్పుడు లియొనార్డో కళాఖండం రహస్యం బహిర్గతమయ్యే అవకాశాలున్నాయంటున్నారు పరిశోధకులు.

చీకట్లోంచి చీకట్లోకి వెలుగుపూలు విరజిమ్మి…..

చీకట్లోంచి చీకట్లోకి వెలుగుపూలు విరజిమ్మాడాయన. ఆ విషయం.. ఆయన చనిపోయిన వందేళ్ళకు కానీ తెలియరాలేదు. ఆయనే శ్రీనివాస రామానుజన్.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరీరం గురించి లెక్క లేదు కానీ… ఆస్పత్రి మంచం మీద కూడా అంకెల గారడీలను కనిపెట్టిన మహానుభావుడాయన. ఆ విషయాన్ని ఆయన గురువులాంటి గణితవేత్త జి.ఎచ్. హార్డీ ఇలా వివరించాడు :

”ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామానుజన్ ను చూడడానికి వెళ్ళాను. నేనెక్కి వెళ్ళిన టాక్సీ నెంబర్ 1729. నాకు ఆ సంఖ్య నిస్తేజంగా ఉన్నట్టు అనిపించింది. అదేమీ అపశకునం కాకూడదని కోరుకున్నాను. ఆ విషయాన్నే రామానుజన్ కు చెప్పాను. ఐతే అదదో అపురూపమైన సంఖ్య అని చెప్పుకొచ్చాడు రామానుజన్. రెండు సంఖ్యల ఘనాల కూడికగా రెండు రకాలుగా చూపగల అతి చిన్న సంఖ్య అదేనని అప్పటికప్పుడే చెప్పేశాడు. (1క్యూబ్+12క్యూబ్ = 9క్యూబ్ + 10క్యూబ్ = 1729)”

ramanujan

కాలక్రమంలో ఆ సంఖ్యకు రామానుజన్ నెంబర్ అన్న పేరు వచ్చిందనుకోండి. ఇంతకీ… ఆ రామానుజన్ ఇప్పుడెందుకు గుర్తొచ్చినట్టు?

1920లో మరణ శయ్య మీద నుంచే రామానుజన్ కొన్ని గణిత సూత్రాలు రూపొందించారు. అవి సరైనవో కావో, అసలవి ఎలా పనిచేస్తాయో పరిశీలించమంటూ లండన్ లో ఉన్న హార్డీకి సవినయంగా పంపించారు. గణితశాస్త్ర చరిత్రలో అంతవరకూ లేని ఎన్నో కొత్త గణిత సిద్ధాంతాలు వాటిలో ఉన్నాయి. సరే… వాటిని హార్డీ పరిష్కరించలేకపోయాడు. అంతేనా… ఇప్పటివరకూ వాటిని ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్తా పూర్తిగా పరిష్కరించలేకపోయారు.

ఇన్నాళ్ళకిన్నాళ్ళకు… సుమారు వందేళ్ళ తర్వాత… రామానుజన్ సూత్రాలను అర్ధం చేసుకోగలిగారు గణిత శాస్త్రవేత్తలు. రామానుజన్ రూపొందించిన సిద్ధాంతం… కృష్ణబిలాల ప్రవర్తనను విస్పష్టంగా వివరిస్తుందని వారు కనుగొన్నారు. ”రామానుజన్ రాసిన మార్మిక లేఖల్లోని సమస్యలను పరిష్కరించగలిగాం. తొంభైరెండేళ్ళుగా ఆ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి” అని చెప్పారు కెన్ ఓనో. అమెరికా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న ఎమొరీ విశ్వవిద్యాలయంలో గణితవేత్త ఆయన.

”1920లో రామానుజన్ తన లేఖలో ప్రతిపాదించిన ఫంక్షన్… అప్పటికి ఉనికిలో ఉన్న తీటా ఫంక్షన్స్ కంటె విభిన్నమైనది. అదే సమయంలో వాటికి చాలా సన్నిహితంగా ఉంది. దాంతో… దాని అసలు కథని కనుగొనడం చాలా కష్టమైంది. అయితే 2002లో శాండర్ జ్వెగర్స్ పరిశోధనల సమయంలో… రామానుజన్ ప్రతిపాదనలను అర్ధం చేసుకోడానికి దారి దొరికింది. ఆ వెంటనే నేను, నా సహచరులు కలిసి… కొన్ని ఆధునిక గణిత ఉపకరణాలను వాడి ఆ ప్రతిపాదనలను పరిశీలించాం. రామానుజన్ సూత్రీకరణలన్నీ సరైనవీ, కచ్చితమైనవీ అని నిరూపించగలిగాం. సరస్వతీ దేవి వరప్రసాదమని రామానుజన్ భావించిన ఒక ప్రతిపాదనను వివరించగల సూత్రాన్ని కనుగొనగలిగాం. ఆయన రూపొందించిన ఫంక్షన్ ఇవాళ్టికీ కచ్చితంగా పనిచేయగలిగేలా ఉండడం మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. 1920ల్లో కృష్ణబిలాల గురించి ఎవరికీ తెలీదు. ఆనాటికే రామానుజన్ ఈ మోడ్యులర్ ఫామ్స్ తయారు చేశాడు. ఆ ఫంక్షన్స్ ని ఉపయోగించడం ద్వారా… కృష్ణబిలాల సంక్లిష్ట ప్రవర్తనను అర్ధం చేసుకోడం సాధ్యమేనని భావిస్తున్నాం” అని కెన్ ఓనో వివరించారు.

ఆస్ప్రతి మంచమ్మీది చీకట్లోంచి నిశీధి వీధుల గహన కృష్ణబిలాల చీకట్లోకి వందేళ్ళ క్రితమే వెలుగు పువ్వులు విరజిమ్మాడు. ఒక శంకరాచార్యుడూ, ఒక వివేకానందుడి లానే పిన్న వయసులో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ భూమ్మీదకు వచ్చిన లెక్క పూర్తయి పోయిందనుకున్నాడు కాబోలు… 32ఏళ్ళ వయసులోనే తిరిగి రాని లోకాలకు మరలిపోయాడు. ఏ వ్యోమసీమల్లో ఏ కాంతివేగాలనూ ఏ కాలగమనాలనూ గణిస్తున్నాడో.

%d bloggers like this: