కృష్ణరాయా, క్షమించు

తెగులదేల యన్న దేశమ్ము తెగులు

ఏను తెగులు జనకుండ తెగులొ‌, చండ

ఎల్ల జనులు నరుక, నెరుగవే తూలనాడి

దేశభాషలందు తెగులు తుస్సు

జాత్యహంకారి దొరికాడు… కుమ్మేద్దాం పదండి

వెయ్యి మంచిపనులు చేసి ఉండవచ్చు గాక… ఒక్క హత్య చేస్తే చాలు… అంతా పోయినట్టే..!
తరుణ్‌ విజయ్‌ జాత్యహంకారి అంటూ జరుగుతున్న రచ్చలో కనబడిన ఓ వ్యాఖ్య అది.

నిజానికి ఈ వ్యవహారంలో ఒక సామెత వాడవచ్చునా లేదా అని ఆలోచిస్తున్నాను. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయింది’ అన్న సామెత అది. పోలికలో తేడా గురించి కాదు, ఆ సామెతను వాడితే అది అపసవ్యమైన ఇంటర్‌ప్రిటేషన్స్‌కు దారి తీస్తుందన్నది భయం. సరే, ఇప్పుడు ఆ మొదటి వ్యాఖ్యను తీసుకోవచ్చు.

తరుణ్‌ విజయ్ జాత్యహంకారి, మనువాది, ఆరెస్సెస్‌ ఫాసిస్టు, బ్లా బ్లా బ్లా… అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా రాసేస్తున్న వారిలో అందరూ మాటల శూరులే అని అర్ధమవుతోంది కానీ చేతల వీరులు ఎవరైనా ఉన్నారా అంటే అనుమానమే.

తరుణ్‌ విజయ్ వ్యాఖ్యలు సరైనవి అని సమర్ధించబోవడం లేదు. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు సందర్భం ఏంటి, అతనేం మాట్లాడాడు, ఎందుకలా మాట్లాడాడు అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. ఆ మాటలు స్లిప్ ఆఫ్‌ టంగా, లేక అతనికి మాలాఫైడ్ ఇంటెన్షన్‌ ఉందా, అసలు అతని ట్రాక్‌ రికార్డ్ ఏంటి… అన్నవి చూడాలి కదా.

భారతదేశంలోని ఆఫ్రికా ఖండవాసులు అందరిపైనా దాడులు జరుగుతున్నాయి… అవన్నీ జాత్యహంకార దాడులే… అన్న పాయింట్‌ మీద అల్‌జజీరా ఛానెల్ చర్చాగోష్టి నిర్వహించింది. ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌, కొందరు ఆఫ్రికన్‌ విద్యార్థులతో పాటు బీజేపీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ (ఇండియా ఆఫ్రికా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్‌ గ్రూప్‌ ఛైర్మన్) పాల్గొన్నాడు. ఆఫ్రికన్లపై జరిగే అన్ని దాడులనూ రేసిస్టు దాడులుగా పరిగణించడం సరికాదని ఆయన చెప్పాడు. భారతీయులు దేవుడిగా కొలిచే కృష్ణుడి పేరుకు అర్ధమే నల్లనయ్య అయినప్పుడు రంగు ఆధారంగా వ్యక్తులను అంచనా వేయడం సరికాదన్నాడు. ఐతే… భారతదేశం మొత్తం రేసిస్టుల మయం అన్న సాధారణీకరించేసిన ఇతర ప్యానెలిస్టులతో మాట్లాడే సందర్భంలో నోరు జారాడు. భారతీయులు జాత్యహంకారులైతే దక్షిణాది రాష్ట్రాలతో ఎలా కలిసుంటారని వ్యాఖ్యానించాడు. అక్కడే తరుణ్‌ విజయ్‌ అడుసులో కాలేశాడు. తర్వాత ట్విట్టర్‌ ద్వారా తను సరిగ్గా మాట్లాడలేదని ఒప్పుకున్నారు. తన భావానికీ పదప్రయోగానికీ పొంతన లేకుండా పోయిందంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇంకేం, గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతిపక్షాల వారందరూ తరుణ్‌ను ఏకిపారేశారు. సోషల్‌ మీడియా ట్రాలింగూ పెరిగిపోయింది.

ఇంతకీ దక్షిణాది అంటే తరుణ్‌విజయ్‌కి నిజంగా చిన్నచూపేనా? అతని వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కొన్ని ఘటనలు చూద్దాం…

— తమిళనాడు హైకోర్టులో తమిళాన్ని వాడుకభాష చేయాలంటూ ఉద్యమించాడు.

— తమిళం, తిరుక్కురళ్‌ లేకుండా భారతదేశమే లేదని వ్యాఖ్యానించాడు.
TV 2

— తిరువళ్ళువర్‌ జీవిత చరిత్రను విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశాడు.

— తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తిరువళ్ళువర్‌ విగ్రహం కట్టించాడు.

TV 1

— అగ్ర, నిమ్న వర్ణాల సమన్వయం కోసం కృషి చేశాడు, ఆ క్రమంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు.

— దళితులకు ఆలయ ప్రవేశం చేయిస్తూ సోకాల్డ్ అగ్రవర్ణస్తుల చేత రాళ్ళదెబ్బలు తిన్నాడు.

— కర్ణాటక కోలార్‌ జిల్లా కగ్గనహళ్ళి గ్రామంలో సాంఘిక బహిష్కరణ ఎదుర్కొన్న ఎస్సీ మహిళ రాధమ్మకు అండగా నిలబడ్డాడు. మూడురోజులు ఆ గ్రామంలో ఉండి ఆమె చేతి వంట తిన్నాడు. ఆమె బాధను పార్లమెంటులో వినిపించాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన తరుణ్‌ విజయ్‌కి తమిళ భాష గురించో, కన్నడ ఎస్సీ మహిళ గురించో కష్టపడాల్సిన పనేంటి? తరుణ్‌ విజయ్‌ను మీడియాలో, సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్న వారిలో ఎవరైనా అతని ఆచరణలో వెయ్యోవంతైనా ఆచరించగలరా? కానీ మనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందిగా. వాడేసుకుంటే పోలా. పైగా తప్పు చేశాడు, చేశానని ఒప్పుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. అలాంటి జాత్యహంకారిని కుమ్మేద్దాం పదండి.

గుర్‌మెహర్‌… యుద్ధానికీ పాకిస్తాన్‌కీ తేడా తెలుసా!

ప్రియమైన గుర్‌మెహర్‌… సత్‌శ్రీ అకాల్‌. నువ్వు బాగున్నావని తలుస్తాను.

ఢిల్లీ రాంజస్‌ కాలేజీలో ‘ఆజాదీ’ [(భారతదేశం నుంచి) స్వేచ్ఛ] అనుకూల నిరసనల గురించిన నీ వైఖరి తెలిసింది. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అన్న నీ ట్వీట్ ప్రకటనా చూశాను.

ఇవాళ నేను బతికి ఉంటే నాకు 40 ఏళ్ళుండేవి. కాబట్టి నువ్వు నన్ను అన్నయ్యా అని పిలిచినా, అంకుల్ అన్నా… ఇంకెలా పిలిచినా పర్వాలేదు.

గుర్‌మెహర్‌, నేను నీకొక విషయం స్పష్టంగా చెబుదామనుకుంటున్నాను. ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి రెండు విషయాలు స్పష్టంగా తెలిసి ఉంటాయి. ఒకటి అతని కోరిక, రెండవది వాస్తవం. యుద్ధం చెడ్డది, అది జరగకూడదు — అనేది కోరిక. మన మీద యుద్ధం ప్రకటించబడింది — అనేది ప్రస్తుత వాస్తవం. జీవితంలో రెండూ ప్రధానమైనవే. మంచి సైనికుడు ఎప్పుడూ తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తాడు, వాస్తవాన్ని గుర్తించి కార్యాచరణ అమలు చేస్తాడు. ఆ రెండింటినీ కలగలిపేసేవారికి మిగిలేది ఓటమి మాత్రమే.

పాకిస్తాన్ మనకు మిత్రదేశంగా ఉండాలని మన కోరిక. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ కోరిక ఆధారంగా మన వ్యూహాలు రూపొందించుకుంటామా? లేదు. చరిత్ర గురించి, వర్తమానం గురించి ఏ కొంచెం తెలిసిన వారయినా — ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచన ఆధారంగా పాకిస్తాన్‌ ఏర్పడిందన్న విషయం అర్ధం చేసుకోగలరు. ‘పాక్’ అంటే ‘పవిత్రమైనది’… ‘పాకిస్తాన్‌’ అంటే ‘పవిత్ర భూమి’. తమ భూభాగం తప్ప… మిగతాదంతా (ప్రత్యేకించి భారతదేశం) అపవిత్రమైనది అన్న ఆలోచన మీద పాకిస్తాన్‌ ఏర్పాటైంది. పాకిస్తాన్‌ ఏర్పాటు, దాని ఉనికి… ఆ రెండూ ముస్లిములు హిందువులతో కలిసి బతకలేరన్న భావనకు నిదర్శనాలు.

పాకిస్తాన్‌కు మద్దతు పలకడం లేదా ఆ దేశంతో స్నేహం చేయడమంటే ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచనను ఆమోదించడమే. మనం నిజమైన లౌకికవాదులమే అయి, పై వాదనకు మద్దతు పలికే వారిమి కాకపోతే పాకిస్తాన్‌ అన్న ఆలోచనను, ఆ దేశాన్నీ మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తాం.

ఇంక నీ వ్యాఖ్య దగ్గరకు వద్దాం. ఏమన్నావ్‌ నువ్వు…. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అనా…!

saurabha-kalia

మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన మీ నాన్నకు సెల్యూట్‌. నేను కూడా అలా నా ప్రాణాలను ఇచ్చేసిన వాడినే. నిజానికి ఆ (కార్గిల్) యుద్ధం కనీసం ప్రాథమిక దశకైనా చేరక ముందే ఆ పోరులోకి అడుగు పెట్టిన మొదటి వ్యక్తిని నేను. నీ నుంచి నీ తండ్రినీ, నా పిల్లల నుంచి నన్నూ దూరం చేసిన ఆ యుద్ధాన్ని మొట్టమొదట గుర్తించిన వాణ్ణి, దానిగురించి ప్రపంచానికి చెప్పిన వాణ్ణీ… నేను.

గుర్‌మెహర్‌, నేను యుద్ధంలో చంపబడలేదు. నన్ను ఎలా చంపేరో కొద్దిగా చెబుతాను నా మాట వింటావా… అవాళ 1999 మే 15. మరో ఐదుగురు సహచరులతో కలిసి నా దేశపు భూభాగంలోనే గస్తీ తిరుగుతున్నాను. అప్పటికే మన భూభాగంలోకి చొరబడి వచ్చిన పాకిస్తాన్‌ సైనికులు (యుద్ధం చేస్తున్న సైనికులు కాదు) మా గస్తీ బృఃదాన్ని దొంగదెబ్బ తీశారు. మమ్మల్ని నిర్బంధించారు. పాకిస్తాన్‌ గడ్డ మీదకు తీసుకుపోయారు (యుద్ధభూమిలోకి కాదు).

ఆ శాంతి సమయంలో వారు మమ్మల్ని రోజుల తరబడి చిత్రహింసలుపెట్టారు. సిగరెట్లతో మా శరీరాల మీద వాతలు పెట్టారు. ఎర్రగా కాల్చిన ఇనపచువ్వలతో మా చెవి గూబలు తూట్లు పొడిచారు. మా కనుగుడ్లను పొడిచేసి ఆ తర్వాత వాటిని పీకేశారు. మా నోళ్ళల్లోని పళ్ళు, ఒళ్ళల్లోని ఎముకలు విరగ్గొట్టి చూర్ణం చేసేశారు. మా పుర్రెలు పగలగొట్టారు, పెదాలు కత్తిరించారు, ముక్కుదూలాలు విరగ్గొట్టారు, కీళ్ళు విరిచేశారు. మర్మాంగాలను కోసేశారు. ఇంకా మరెన్నో రకాలుగా శారీరక, మానసిక చిత్రహింసలకు గురి చేశారు.

ఇదంతా ఒక్కరోజు కథ కాదు. 22 రోజుల పాటు చిత్రవధల పాలుచేశారు. చివరికి ఒకరోజు మమ్మల్ని కాల్చి చంపేశారు. అది యుద్ధ సమయం కాదు… శాంతి సమయంలోనే. మా కళేబరాలను మా తల్లిదండ్రులకు అప్పగించారు… శాంతి సమయంలోనే.

మమ్మల్ని చంపింది యుద్ధం కాదు… పాకిస్తాన్‌.

ఇప్పుడు నేను దిగంతాల నుంచి దిగువన మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ భరించలేని ఆవేదనతో రోదిస్తున్నాను. వేలాది విద్యార్ధులు భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ చేస్తున్న డిమాండ్లను గమనిస్తున్నాను. వారు నా దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్నారు.

నేను నా తల్లి కోసం… భారతమాత కోసం ప్రాణాలిచ్చాను. భారతదేశం సమైక్యంగా ఉండడం కోసం నన్ను ముక్కలుగా నరుకుతున్నా భరించాను. పదునైన కత్తులతో వాళ్ళు నన్ను నిలువునా చీలుస్తున్నా ఏ ఒక్కక్షణమూ నొప్పితో ఏడవలేదు. కానీ ఇవాళ, ఈ క్షణం నేను మోసపోయినట్టు అర్ధం చేసుకున్నాను. ఏమాత్రం కృతజ్ఞత లేని ద్రోహుల కోసం చనిపోయినందుకు సిగ్గుపడుతున్నాను.

తమకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందంటున్నారు వారు. నాకు లేదా ఆ స్వేచ్ఛ? రణరంగం నుంచి తప్పుకుని వెనుదిరిగే స్వేచ్ఛ నాకు లేదా?? 22 రోజుల పాటు అనుభవించిన చిత్రహింసల నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా??? నా శరీరాంగాలు 22 రోజుల పాటు ముక్కలు ముక్కలుగా నరికివేయబడడం నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా???? ‘ఆజాదీ’ కావాలని కోరుతున్న వారిలో, వారికి మద్దతిస్తున్న నీలాంటి వారిలో కనీసం ఒక్కరైనా నా దగ్గరకు రాలేదు, గస్తీ తిరగొద్దంటూ వెనక్కి పిలవలేదు. అత్యంత కిరాతకమైన, నరహంతక జిహాదీలకు ఎదురొడ్డి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడకుండా ఉండగల అవకాశమూ స్వేచ్ఛా నాకూ ఉన్నాయి కదా.

వాళ్ళు మీ కాలేజీకి షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌లను అతిథులుగా పిలిచారు. ఎవరీ షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌? కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలి, కశ్మీరీ వేర్పాటువాదులకు ఆజాదీ డిమాండ్ చేసే హక్కు కావాలీ అని వాదించే వాళ్ళే కదా. మా శరీరాలను అంగుళం అంగుళం చొప్పున రోజుల తరబడి కత్తిరించిన వాళ్ళు ప్రతీరోజూ మాకు ఏం చెప్పేవారో తెలుసా — ఈ ఆజాదీయే. మాకు ఆజాదీ కావాలి. కశ్మీర్‌కు భారత్‌ నుంచి స్వేచ్ఛ కావాలి. కశ్మీర్‌ను పాకిస్తాన్‌గా మారుస్తాం. పాకిస్తాన్‌ అంటే అర్ధం తెలుసా, అదొక్కటే పవిత్ర భూమి… ఇదిగో సరిగ్గా ఇవే వాదనలు.

రాంజస్‌ కాలేజ్‌ లేదా జేఎన్‌యూ లేదా మరి ఏ ఇతర ప్రదేశంలోనైనా ఆజాదీ పేరిట చేసే నినాదాలు… మా శరీరాలను తునాతునకలు చేసిన ఘటనలను, ఆ చేదు జ్ఞాపకాలనూ పదేపదే గుర్తుచేస్తాయి. భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ మీరు గొంతెత్తి అరిచే ప్రతీసారీ… మీరెప్పుడూ అనుభవించని, ఎంతమాత్రం అనుభవించకూడని భయంకరమైన ఆ సందర్భాలు కళ్ళకు కట్టి వెన్ను జలదరిస్తుంది.

విద్యార్ధుల తప్పేముంది? అని మీరు అడగవచ్చు. ఏ విద్యార్ధి తప్పూ లేదు. కానీ ఆజాదీ నినాదాలు, ప్రదర్శనలతో సంబంధం ఉన్నవారు… జిహాదీల బూట్లు నాకే తొత్తులను లెక్చర్లిమ్మంటూ ఆహ్వానించేవారూ… చేస్తున్న పనులు కచ్చితంగా తప్పే. ఈ ఆజాదీ నినాదాలతో వారు మా త్యాగాలను అవమానిస్తుంటే…. నా ప్రజలు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. నా ప్రజలు నా గౌరవం కోసం పోరాడాలని కోరుకుంటున్నాను.

అలాంటి నిరసనలు, ప్రదర్శనలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్‌ అన్న ఆలోచనకు మద్దతిస్తాయని తెలిసినా, వాటిలో భాగం కావడం ఏం తెలివైన పని? మీరు భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఉద్యమిద్దామనుకుంటున్నారా? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడండి. ఉగ్రవాదంపైనా, ఉగ్రవాదులపైనా మీ భావాలు స్వేచ్ఛగా ప్రకటించండి. అష్టకష్టాలూ పడుతున్న మహిళలకు బాసటగా ఉద్యమించండి. బహుభార్యాత్వం, తలాఖ్‌ పద్ధతులకు వ్యతిరేకంగా నడుం కట్టండి. గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయండి. పాకిస్తాన్‌కు, ఆ దేశపు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళమెత్తండి.’అపవిత్రమైన’ జాతికి చెందిన వాడన్నకారణంగా ఒక వ్యక్తి శరీర భాగాలను నరికి పోగులు పెట్టే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడండి. గురు తేగ్ బహదూర్‌ తల నరికిన సిద్ధాంతానికి, నలుగురు రాకుమారులను సజీవ సమాధి చేసిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడండి. 1947 వరకూ లక్షల మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండి. కశ్మీర్‌ లోయలో కశ్మీరీ హిందూ పండిట్ల జాతిని ఊచకోత కోసిన వారిపై ఉద్యమించండి.

మీ ధైర్యానికి, సాహసానికి, ఉద్వేగానికి నిజమైన పరీక్ష… మీరు ఎంచుకునే కారణంలోనే ఉంటుంది. తమ అనుకూలతలను బట్టి కారణాన్ని ఎంచుకునేవారు పిరికిగొడ్డులు. నిజమైన వీరులు తమ ప్రాథమ్యాలను బట్టి కారణాలను ఎంచుకుంటారు.

ప్రియమైన గుర్‌మెహర్‌, చాలామంది తాకడానికి సైతం భయపడే నిజమైన అంశాలను గుర్తించి వాటి తరఫున పోరాడతావని ఆశిస్తున్నాను. నీ తండ్రి లాంటి, నాలాంటి వారిని గర్వపడేలా చేయి. దేవుడు నీకు మేలు చేయుగాక.

— స్వర్గీయ కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా.

[కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్‌ మన్‌జీత్‌ సింగ్‌ కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌… పాక్‌ అనుకూల వామపక్ష విద్యార్ధి సంస్థల తరఫున వకాల్తా పుచ్చుకుని ఉద్యమిస్తున్న నేపథ్యంలో… కార్గిల్ యుద్ధాన్ని ముందుగా గుర్తించి పాక్‌ దుండగీడుల చేతిలో హతమైన సౌరభ్‌ కాలియా ఆమెకు హితవు పలుకుతున్నట్టుగా రాసిన బహిరంగలేఖ ఇది. ఈ లేఖ రాసినవారు కాన్పూర్ ఐఐటీ సైంటిస్ట్ డాక్టర్ వశీ శర్మ. డాక్టర్ వశీ శర్మ బోంబే ఐఐటీ నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ఆయన పేరొందిన శాస్త్రవేత్త. ఇస్లామిక్ ఉగ్రవాదం, డీ-ర్యాడికలైజేషన్‌ అంశాల్లో నిపుణుడు కావడం ఆసక్తికరం.]

వాళ్ళు రాసిందే చరిత్ర మరి…!

ఏరా అబ్బాయ్‌… ‘పర్వ’ గురించి ఇంక ప్రయత్నించకు. దొరికింది.
ఎలా దొరికింది నాన్నగారూ…
సెంట్రల్‌ యూనివర్సిటీలో మా ఫ్రెండున్నాడు కదా… బెంగళూరులో ఓ ప్రొఫెసర్‌ గారి నుంచి సంపాదించాడు… ఆ రోహిత్ వేముల గొడవల కారణంగా పంపడం ఆలస్యమైందట.. ఇప్పుడు పంపించాడు… ఇవాళే వచ్చింది…
అసలది మనకి నచ్చుతుందో లేదో…
వాడు కూడా అదే మాట అడిగాడురా…! ‘మీ రైటిస్టులకి ఈ పుస్తకం నచ్చదేమో’ అంటూనే ఇచ్చారట ఆ బెంగళూరు ప్రొఫెసర్‌గారు. ప్రారంభమూ అలాగే ఉంది…
ఇంతకీ మీకు బైరప్ప పర్వ చదవాలని ఇప్పుడెందుకు అనిపించింది?
మా స్టూడెంట్‌ గోవాలో ఉజ్యోగం చేస్తున్నవాడు ఒకడున్నాళ్ళే… అప్పుడప్పుడూ వాడు మనింటికి వస్తుంటాడు… నువ్వు చూళ్ళేదు… కొన్నాళ్ళ క్రితం వాడు మనింటికి వచ్చినప్పుడు ఆవరణ నవల గురించి, ఆ సమయంలో జరిగిన వివాదాల గురించీ చెప్పాడు. ఆ సందర్భంలోనే పర్వ గురించి చెప్పాను. సరే ఓసారి చదువుదామని ప్రయత్నించాను…
ఆవరణ విడుదల సమయంలోనే అనుకుంటా గిరీష్‌ కర్నాడ్‌ బైరప్పనీ వంశవృక్షనీ చెడతిట్టాడు… అప్పుడు ఈ భైరప్ప రైటిస్టా లెఫ్టిస్టా అన్న అనుమానం వచ్చింది.
రెండూ కాకుండా సెంటరిస్టేమో అనిపిస్తోంది.
ఏమో… పర్వలో మాత్రం కృష్ణుడు తప్ప దాదాపు అందరినీ స్వార్థపరులుగా చిత్రీకరించడం చూసి అలా అనిపించింది. ఐతే కర్నాడాదులకు రైటిస్టు అనీ… బెంగళూరు అభ్యుదయవాద ప్రొఫెసరు గారికి లెఫ్టిస్టు అనీ… అనిపించడం చిత్రమే.
మొత్తం మీద ఆయనది ఆసక్తికరమైన వ్యక్తిత్వమన్న మాట.

*****     *****     *****     *****

సుమారు రెండేళ్ళ నాటి ఆ సంభాషణ తర్వాత భైరప్ప గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2007లో ‘ఆవరణ’ ప్రచురణకు ముందు ఆయన ‘చారిత్రక అసత్యాలతో జాతీయత ఎన్నటికీ బలపడదు’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కన్నడ సాహిత్య ప్రపంచంలో తీవ్ర స్థాయి వాద ప్రతివాదాలకు దారి తీసింది. వాటికి జవాబు అన్నట్టుగా 2012లో ఆయన ‘చరిత్రకారుడు నవలాకారుడిలా సృజనాత్మకత పేరిట స్వేచ్ఛ తీసుకుంటే అసలు సత్యం పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ మరో వ్యాసం రాశారు. అది ఈ మధ్య అంతర్జాలంలో విస్త్రతంగా ప్రచారం అవుతోంది. దాని తెలుగు సేత ఇదిగో ఇదీ….

*****     *****     *****     *****

అది 1969-70 నాటి మాట. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయమది. నాటి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆప్తుడైన దౌత్యాధికారి జి పార్థసారథి ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లక్ష్యం… విద్య ద్వారా దేశాన్ని ఏకం చేయడం. నన్ను సదరు కమిటీలో ఒక సభ్యుడిగా ఎంపిక చేశారు. నేనప్పట్లో ఎన్‌సీఈఆర్‌టీలో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ రీడర్‌గా పనిచేస్తుండే వాణ్ణి. మా మొదటి సమావేశానికి పార్థసారథి కమిటీ ఛైర్మన్‌ హోదాలో వచ్చారు. కమిటీ సాధించవలసిన ప్రయోజనాల గురించి తనదైన మర్యాదాపూర్వక పరిభాషలో వాక్రుచ్చారు : “ఎదిగే పిల్లల మనసుల్లో విషబీజాలు నాటకుండా ఉండడం మన విధి. ఎందుకంటే అలా జరిగితే జాతీయ సమైక్యత అన్న భావనకు వారు అడ్డంకులుగా మారతారు. సాధారణంగా అలాంటి విషబీజాలు చరిత్ర క్రమంలోనే ఎక్కువగా ఉంటాయి. సోషల్ సైన్సెస్, భాషాశాస్త్రాల్లో కూడా అప్పుడప్పుడూ అలాంటి అభ్యంతరకర అంశాలు కనిపించడం పరిపాటి. అలాంటి అంశాలన్నింటినీ మనం ముందుగానే ఏరి పారేయాలి. మన చిన్నారుల మనసుల్లో జాతీయ సమైక్యత గురించిన భావనలు మాత్రమే మొలకెత్తించగల ఆలోచనలనే ప్రోది చేయాలి. ఆ గురుతర బాధ్యతను మన కమిటీ భుజాలకెత్తుకుంది.”

మిగతా నలుగురు సభ్యులూ గౌరవ పురస్సరంగా తలలూచారు. కానీ నేనలా చేయలేకపోయాను. “సర్! మీ మాటలు నాకు అర్ధం కాలేదు. కొన్ని ఉదాహరణలతో వివరించగలరా?” అని నేరుగా అడిగేశాను. ఆయన జవాబిచ్చారు. “సోమనాథ్‌ దేవాలయాన్ని గజనీ మహమ్మద్‌ దోచుకున్నాడు. కాశీ మథురల్లో దేవళాలను కూలగొట్టి ఔరంగజేబు మసీదులు కట్టాడు, జిజియా పన్నులు వసూలు చేశాడు — ఇలాంటి పనికిమాలిన వాస్తవాలను బోధిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశాన్ని బలోపేతం చేయడం సాధ్యమేనంటారా? అలాంటి నిజాలు ద్వేషాన్ని రగల్చడం తప్ప ఏ విధంగా మేలు చేయగలవు?”

“కానీ అవన్నీ చారిత్రక సత్యాలు కదా!” నేను రెట్టించి అడిగాను.

“అరే, మనకు నిజాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా అని అన్నింటినీ చెప్పేస్తామా ఏమిటి? నిజాలను తగుమాత్రంగా ఉపయోగించడమే చరిత్ర బోధించడానికి తెలివైన పద్ధతి” అన్నారాయన. ‘ఔనౌను’ అన్నట్టుగా మిగతా నలుగురు సభ్యులూ తలలు ఊపారు. కానీ నేను అలా ఒప్పేసుకోడానికి సిద్ధంగా లేను.

“మీరే కాశీ, మథుర వంటి ఉదాహరణలు చెప్పారు. ఇప్పటికీ దేశం నలుమూలల నుంచి ఆయా క్షేత్రాలకు ప్రతీ యేటా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఆయా దేవాలయాలను శిథిలం చేసి, వాటికి చెందిన గోడలు, స్తంభాల ఆధారంగా నిర్మించిన భారీ మసీదులు అందరి కళ్ళకూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే మసీదు వెనక చిన్న పాకలా వేసుకుని అందులో ఆలయం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి నిర్మాణాలను చూస్తున్న భక్తుల ఆవేదనకు అంతే లేదు. తమ ప్రీతిపాత్రమైన దైవపు మందిరం దుస్థితి గురించి తమ బంధువులకు చెప్పుకుని వాపోతున్నారు. అలాంటి పరిస్థితులు జాతీయ సమైక్యతను సృష్టించగలవా? అలాంటి చరిత్రను మీరు పాఠ్యపుస్తకాల్లో చేర్చకుండా దాచగలరు. కానీ ఆ పిల్లలు విహారయాత్రలకు వెళ్ళినపుడు తమ కళ్ళతో ఆ నిజాలను చూసి తెలుసుకున్నప్పుడు ఆ చరిత్రను దాచడం సాధ్యమా? పరిశోధకుల అంచనాల ప్రకారం భారతదేశం మొత్తం మీద అలా ధ్వంసం చేసిన మందిరాలు 30వేలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు దాచిపెట్టగలరా?”

పార్థసారథి నా మాటలను అడ్డుకున్నారు : “మీరు తత్వశాస్త్ర ప్రాచార్యులు కదా, చరిత్ర ప్రయోజనం ఏమిటో కొంచెం వివరిస్తారా?”

“చరిత్ర ప్రయోజనాన్ని ఎవరూ నిర్వచించలేరు. భవిష్యత్తులో సైన్స్‌, టెక్నాలజీల అభివృద్ధి కారణంగా పరిస్థితులు ఎలా ఉండబోతాయన్నది మనకు తెలీదు. కొందరు పాశ్చాత్య ఆలోచనాపరులు దీన్ని ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ అంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఆలోచనల వల్ల ప్రయోజనం శూన్యం. మన చర్చ ఏంటి — చరిత్ర బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని కదా. చరిత్ర అంటే మన గతకాలపు సంఘటనల గురించి నిజాలు తెలుసుకోవడం, మానవ జీవితాల గురించి నేర్చుకోవడం. దానికోసం శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ఇతరత్రా రికార్డులు, సాహితీ గ్రంథాలు, పురాతన అవశేషాలు, కళాఖండాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు చేసిన తప్పులు చేయకుండా ఉండడమూ నేర్చుకోవాలి. వాళ్ళు ఆచరించిన సద్గుణాలను మనం అనుసరించాలి. వాటన్నింటినీ నేర్చుకోడానికి చారిత్రక వాస్తవాలు మనకు సహాయం చేస్తాయి.”

“సత్యం గురించిన అన్వేషణ మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తే ఏం చేయాలి? సమాజాన్ని మనం విభజించవచ్చా? మనం విషబీజాలు నాటవచ్చా?” అని అడుగుతూ ఆయన నన్ను ఆపడానికి ప్రయత్నించారు.

“సర్‌, మెజారిటీ, మైనారిటీ అంటూ కేటగిరీలు చేస్తున్నామంటేనే ఈ సమాజాన్ని విభజిస్తున్నామని… కనీసం విభజన దిశగా అడుగులు వేస్తున్నామని అర్ధం. అసలీ ‘విషబీజాలు’ అన్న ఆలోచనే పక్షపాత ధోరణికి నిదర్శనం. గజినీ మహమ్మద్‌ లేదా ఔరంగజేబు తమ సొంత మనుషులు, హీరోలు అని మైనారిటీలు ఎందుకు అనుకోవాలి? మొగల్‌ సామ్రాజ్యం నశించిపోడానికి కారణం ఔరంగజేబ్‌ మతోన్మాదం. అక్బర్‌ కాలంలో అతను పరమత సహనం అనే విధానాన్ని అనుసరించాడు కాబట్టి మతపరంగానూ సామాజికంగానూ మిత్రత్వం సాధ్యమైంది. చారిత్రక వాస్తవాలను దెబ్బతీయకుండా పిల్లలకు అలాంటి పాఠాలు చెప్పలేమా? చరిత్ర నుంచి నేర్చుకోవలసిన పాఠాలు బోధించడానికి ముందు చారిత్రక వాస్తవాలను తెలియజెప్పాల్సిన పని లేదా? నిజమైన చరిత్రను దాచడం అనేది రాజకీయాల కోసం చేసే పని. ఈ ట్రెండ్ ఎక్కువకాలం కొనసాగదు. మైనారిటీలు కానివ్వండి, మెజారిటీలు కానివ్వండి… ఉద్వేగాలను నియంత్రించుకునే పరిపక్వతతో సత్యాన్ని ఎదుర్కొనే శీలాన్ని విద్యార్ధులకు ఇవ్వలేని విద్య అర్ధరహితం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా.” అని చెప్పాను.

నా మాటలతో పార్థసారథి ఏకీభవించారు. నా పాండిత్యాన్ని, స్పష్టంగా ఆలోచించగల సామర్థ్యాన్నీ ప్రశంసించారు. భోజన విరామ సమయంలో ఆయన నన్ను ఓ పక్కకి పిలిచారు. నాకు ఎంతో సన్నిహితుడిలా నా భుజాలపై చేతులు వేసి, విజయం సాధించినట్టు నవ్వుతూ నాతో ఇలా చెప్పారు : “మీరు ఇప్పటివరకూ చెప్పిందంతా అకడమిక్‌గా కరెక్టే. మీరు చెప్పిన అంశాలతో ఓ మంచి వ్యాసం రాసుకోండి. కానీ ప్రభుత్వం దేశం మొత్తానికీ ఒక విధానాన్ని తయారు చేసేటప్పుడు, అది అందరు ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. మేథోపరంగా స్వచ్ఛమైన నియమాలు ఎలాంటి ప్రయోజనాన్నీ అందీయలేవు.”

మరునాడు మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా నేను నా వాదనకే కట్టుబడి ఉండిపోయాను. సత్యం ఆధారంగా లేని చరిత్ర నిష్ప్రయోజనకరము, ప్రమాదకరమూ అని నిష్కర్షగా తేల్చిచెప్పాను. పార్థసారథి తన ఆగ్రహాన్ని ముఖం ద్వారా ప్రకటించినప్పటికీ నేను నా వాదన నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఆ ఉదయం సమావేశం ఎలాంటి ఫలితమూ తేలకుండానే ముగిసిపోయింది.

ఆ తర్వాత పార్థసారథి నాతో మాట్లాడలేదు. మేం మళ్ళీ ఒక పక్షం రోజుల తర్వాత సమావేశమయ్యాం. అప్పటికి కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు. అందులో నేను లేను. నా స్థానంలో మరో కొత్త వ్యక్తి ఉన్నారు. వామపక్ష భావజాలం కలిగిన ఆ హిస్టరీ లెక్చరర్‌ పేరు అర్జున్ దేవ్‌. ఆ తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన కొత్త సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ టెక్స్ట్‌ పుస్తకాలు, వాటిలో పొందుపరిచిన కొత్త పాఠాలూ అన్నీ ఆయన మార్గదర్శకత్వంలో రాయబడినవే. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో ఆ పుస్తకాలనే పాఠ్యపుస్తకాలుగా పెట్టుకోవడం కానీ లేదా వాటి ఆధారంగా పాఠ్యపుస్తకాలు రాయడం కానీ జరిగింది.

చాలా కాలం తర్వాత అంటే 2005 అక్టోబర్‌లో ఒక ప్రసంగంలో ఆనాటి విషయం గురించి నేనిలా వ్యాఖ్యానించాను :
11వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ‘ప్రాచీన భారతదేశం’ అన్న పాఠ్యభాగాన్ని రాసింది మార్క్సిస్టు చరిత్రకారుడు ఆర్‌.ఎస్ శర్మ. మధ్యయుగాల నాటి భారతదేశం అన్న భాగాన్ని రాసిన సతీష్‌ చంద్ర కూడా మార్క్సిస్టే. వాటిని నిశితంగా పరిశీలించి పరీక్షించినప్పుడు… ఆ వర్గానికి చెందిన వారు ఎదుగుతున్న పిల్లల మనసులను బ్రెయిన్‌వాష్‌ చేయాలన్న దురుద్దేశంతో కుటిల వ్యూహాలు అమలు చేసిన తీరును గమనించవచ్చు. ఆ చరిత్రకారుల రాతల ప్రకారం… “సహనం అనే లక్షణపు గొప్పదనాన్ని వివరిస్తూ అశోకుడు భ్రాహ్మణులను ‘కూడా’ గౌరవించాలని బోధించే వాడు. అశోకుడు తన రాజ్యంలో పశువులు పక్షులను బలి ఇచ్చే ఆచారాలపై నిషేధం విధించాడు. దానివల్ల యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. దాంతో బ్రాహ్మణులకు దక్షిణలు నిలిచిపోయి, వారి జీవిక ఆగిపోయింది. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. అందులోని పలుభాగాలు బ్రాహ్మణుల పాలనలోకి వెళ్ళిపోయాయి. ఆ బ్రాహ్మణులే బౌద్ధమతం అంతరించిపోవడానికి కారకులయ్యారు..” భారతదేశంలో మాత్రమే కాక చుట్టుపక్కల దేశాలకు సైతం వ్యాపించిన, దేశంలో అత్యంత ప్రభావశీలంగా నిలిచిన మతం — తమ దక్షిణలు కోల్పోయామనే అసంతృప్తితో ఉన్నబ్రాహ్మణుల వల్ల అణిగిపోయిందనడం — ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా!

ఎర్రకళ్ళ చరిత్రకారులు చేసిన మరో ప్రచారం — ముస్లిములు తమ దండయాత్రల్లో దేవాలయాలను విధ్వంసం చేయడానికి కారణం ఆ మందిరాల్లో పోగుపడివున్న సంపదను దోచుకోవడం కోసమే అనే విషయం. ముస్లిముల దండయాత్రలను హేతుబద్ధీకరించడమే ఈ వివరణ లక్ష్యం. మరికొన్ని సందర్భాల్లో… అలాంటి దోపిడీలు షరియా చట్టం పరిధిలోకి వస్తాయని కూడా వారు వాదిస్తారు. ఆ దాడులు, దోపిడీలకు చట్టబద్ధత కల్పిస్తున్నారన్న మాట.

నిజానికి బౌద్ధం భారతదేశంలోనుంచి మాయమైపోయింది అశోకుడి తర్వాత కానే కాదు. అసలు నిజాన్ని స్వయంగా బౌద్ధమతావలంబి అయిన డాక్టర్ బీ ఆర్‌ అంబేడ్కర్‌ — బౌద్ధం పతనం, నాశనం అనే వ్యాసంలో (అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు మూడవ సంపుటం, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ, 1987) — స్పష్టంగా చెప్పారు. భారతదేశంలోకి చొరబడిన ముస్లిం దురాక్రమణదారులు నలంద, విక్రమశీల, జగద్దళ, ఓదాంతపుర విశ్వవిద్యాలయాలను సమూలంగా ధ్వంసం చేశారు. బౌద్ధ సాధువులను ఊచకోత కోశారు. బతికి బట్టకట్టిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేపాల్, టిబెట్‌ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు. అంబేడ్కర్‌ మాటల్లో “బౌద్ధమతం వేళ్ళను సమూలంగా నరికేశారు. భారతదేశంలో బౌద్ధానికి పట్టిన అత్యంత ఘోరమైన దుర్గతి అదే.” ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు హిందూమతాన్ని దూషించాలనుకునే ప్రతీసారీ… దయ్యాలు వేదాలు వల్లించినట్టు… అంబేడ్కర్‌ను ఉటంకిస్తారు. అదేసమయంలో “ముస్లిముల బీభత్స భయానక కృత్యాల కారణంగానే భారతదేశంలో బౌద్ధం అంతరించిపోయింది” అని అంబేడ్కర్‌ చెప్పిన మాటల్ని మాత్రం… తమకు అనుకూలంగా లేనందున విస్మరిస్తారు.

ఎన్‌సీఈఆర్‌టీ కోసం రాసిన ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’లో ఆర్‌ఎస్‌శర్మ ఇలా అంటారు : “సుసంపన్నమైన బౌద్ధ విహారాలు భారతదేశంపై దండయాత్రకు వచ్చిన తురుష్కులను ఆకర్షించాయి. చొరబాటుదారులకు అవి ప్రత్యేకమైన లక్ష్యాలుగా నిలిచాయి. బౌద్ధ భిక్షువులు ఎందరినో తురుష్కులు హతమార్చారు. అప్పటికీ మరెంతో మంది బౌద్ధులు తప్పించుకుని నేపాల్, టిబెట్‌లకు పారిపోగలిగారు.” ఆ తురుష్కులు ఎవరు — హిందువులా? మహా మేధావి అయిన మార్క్సిస్టు శర్మ గారు సరిగ్గా ఇక్కడే నిఖార్సైన నిజాలు దాచేశారు.. తురుష్కులు (టర్కీ దేశస్తులు) ముస్లిములు. తమ షరియా లా — ఇస్లామిక్‌ న్యాయం ప్రకారమే వారు భారతదేశంలో మందిరాలను కూల్చేశారు. ఆ నిజాన్ని దాచడం కోసమే ఆర్‌ఎస్‌ శర్మ టర్కీ దేశపు ముస్లిములను వారి జాతినామంతో తురుష్కులని ప్రస్తావించారు. ఆ సమయంలోనే ఆయన తోటి చరిత్రకారులు ‘అశోకుడి పాలనలో దక్షిణలు కోల్పోయిన బ్రాహ్మణుల వల్లనే బౌద్ధమతం పతనం అయిపోయింది’ అని తప్పుడు ప్రచారం చేశారు. తురుష్కులు ముస్లిములు అనే నిజాన్ని దాచిపెట్టడం, బ్రాహ్మణుల వల్లే బౌద్ధం పతనమైందని అబద్ధాలు చెప్పడం — ఎంత గొప్పగా చేశారో! అలాంటి ఎత్తుగడల గురించి లాటిన్‌లో ఓ మాట ఉంది ‘సప్రెసియో వెరి – సజెస్టియో ఫాల్సి’. దాన్ని మనం తెలుగులో ‘నిజాల్ని తొక్కెయ్‌ – అబద్ధాలాడెయ్‌’ అనుకోవచ్చు.

*****     *****     *****     *****

అదండీ భైరప్ప గారి వాదన. మరి ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు పర్వని పొగిడి, ఈ వ్యాసాలను తెగ తిట్టారేమో నాకు తెలీదు. తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి. ఇప్పటికైనా ఓపిక చేసుకుని వచ్చి రచ్చ చేస్తారు.

సింధు నాగరికతలో కుల పిచ్చి కహానీ

మన దేశంలో కులానికి అనుకూలంగా మాట్లాడడం అంటే మహా నేరం అన్న పరిస్థితి వచ్చేసి కనీసం ఓ రెండు దశాబ్దాలు అయి ఉంటుంది. రకరకాల వాదులు అందరూ కులం ప్రస్తావన వస్తే ఒంటికాలి మీద లేచి గొంతులు ఓ చించేసుకునే వారే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన దేశంలో కులం అనే అస్తిత్వం ఇంకా అమల్లో ఉంది. ప్రభుత్వాలే దాన్ని ఏ దశలోనూ తొలగించడం లేదు. కానీ సోకాల్డ్ అభ్యుదయ వాదులు, కులనిర్మూలన వాదులు, ఉదారవాదులు, లౌకిక వాదులు… ఇంకా రకరకాల వారంతా కులం అన్న పదాన్ని ఓ మహా భూతంలా… దానికి అనుకూలంగా నోరెత్తే ప్రతీ ఒక్కడినీ భయంకరమైన విలన్‌లా చిత్రీకరిస్తున్నారు. తాజాగా… ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు విషయంలోనూ అదే జరిగింది.

Sindhu

సింధు దేశం పరువు నిలబెట్టిన వేళ లక్షలాది మంది ఆమె కులం ఏమిటో తెలుసుకోవాలనే కుల గజ్జితో గింజుకుపోయారంటూ న్యూస్‌మినిట్ అనే వెబ్ సైట్ ఓ కథనాన్ని వండి వార్చేసింది. దాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైంస్ ఆఫ్ ఇండియా పత్రికలు క్యారీ చేసేసాయి. ఇంక సోషల్ మీడియాలో విమర్శకుల నోళ్ళన్నీ కేకలు వేయడం మొదలెట్టాయి. అయితే ఇంతకీ అది నిజమేనా? సింధు కులం గురించి లక్షల మంది వెతికారా? ఆ విషయంలోని నిజానిజాలను ఇండియాఫ్యాక్ట్స్ వెబ్‌సైట్‌లో సంక్రాంత్ సనూ అనే రచయిత బైటపెట్టాడు. అతని వ్యాసానికిది స్వేచ్చానువాదం.

ఒలింపిక్స్‌లో పీవీ సింధు వెండి పతకం గెలవగానే… దాని గురించి ‘దేశం’ కోణం లోనుంచి రాయాలని చాలా మంది మీడియా జనాలు ప్రయత్నించారు. ఇండియా అంతే కులాల కుమ్ములాటలే అన్నది మన మీడియాలో చాలా మంది భావన. ఆందుకే న్యూస్‌మినిట్ వాళ్ళు ఓ వ్యాసానికి శిర్షిక ఇలా పెట్టారు “పతకం కోసం సింధు శ్రమిస్తున్న వేళ ఎందరో భారతీయులు ఆమె కులం గురించి గూగుల్‌లో వెతికారు”. ఆ వ్యాసం కోసం ఎంతో సమాచారం సేకరించారు. “21వ శతాబ్దంలోనూ భారతీయులు తమ కులం అంటే పిచ్చెక్కి పోతుండడం శొచనీయం, దేశంలోని నికృష్ట పరిస్థితికి ఇది నిదర్శనం” లాంటి పడికట్టు రాళ్ళకు లెక్కే లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ వ్యాసంలో “కులం” పేరిట చేసిన ఆరోపణలు తప్పు. ఆ పత్రిక సిబ్బందికి “రిలేటివ్”కీ “యాబ్సొల్యూట్”కీ తేడా తెలీదు. ఇంక “గూగుల్ ట్రెండ్స్” లేదా “యాడ్‌వర్డ్స్” ఎలా పనిచేస్తాయో తెలీదు. కానీ భారతదేశంలో కులం అన్న పదం ముందు పెట్టుకుని ఏమైనా రాసేయవచ్చు కదా. ఇంక సహజంగానే ఆ కథనాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైంస్ ఆఫ్ ఇండియా పత్రికలు (నిర్ధారించుకోకుండానే) అందేసుకున్నాయి. ఇంక సొషల్ మీడియా సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేస్తారు. ఆ వ్యాసంలోని వాక్యాలు ఇలా ఉన్నాయి : “పీవీ సింధు తీవ్రంగా పరిశ్రమిస్తూ రియో ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టాలని ప్రయత్నిస్తున్న వేళ, ఆమె కులం గురించి వేల మంది వెతుకుతున్నారు. ఆ విషయం గూగుల్ స్టాట్స్ ద్వారా తెలిసింది. దాని ఫలితాలు ఆశ్చర్యకరం కాదు బాధాకరం”.

తమ కథనాన్ని సమర్ధించుకునేందుకు న్యూస్ మినిట్ వాళ్ళు సింధు గతం తవ్వుతూ తమకు అనుకూలంగా కనిపించిన గూగుల్ ట్రెండ్స్ గ్రాఫ్స్ ప్రచురించారు. వాటిని ఒకసారి చూద్దాం.

న్యూస్ మినిట్ వాళ్ళ ప్రకారం సింధు కులం గురించిన వెతుకులాట జూలైతో పోలిస్తే ఆగస్టులో కనీసం 10 రెట్లు పెరిగింది. కాబట్టి ఇప్పటివరకూ లక్షలాది భారతీయులు ఆమె కులం గురించి వెతికారన్న మాట.

SC 1

మధ్యలో ఈ లక్షలాది మంది ఎక్కడి నుంచి వచ్చారు? తమది కచ్చితమైన సమాచారం అనుకుంటున్న వారు గూగుల్ ట్రెండ్స్ సాపేక్షమని గుర్తించాలి. (గ్రాఫ్ పై భాగంలోని విలువ 100). సింధు కులం గురించిన సెర్చ్‌లు ఎందుకు ఒక్కసారిగా పెరిగాయి? ఆసలు, సింధు గురించిన అన్ని సెర్చ్‌లూ విపరీతంగా పెరిగాయి. కావాలంటే సింధు తల్లి అన్న పెరామీటర్‌కి కూడా అలానే పెరిగి కనిపిస్తాయి.

SC 2

అలా సింధు తల్లి గురించిన వెతుకులాటలో కూడా గతం కంటె గణనీయంగా పెరిగిన గణాంకాలు న్యూస్ మినిట్ వాళ్ళకి “కలచివేసేవి”గానో, “హృదయ విదారకం”గానో ఎందుకు కనిపించలేదో మరి.

ఇంక “లక్షలు” అన్న సంఖ్య గురించి వారేం చెబుతున్నారో చూద్దాం. “మరి కచ్చితమైన గణాంకాల మాటేమిటి? “సింధు కులం” అన్న సెర్చ్ టెరంతో 2016 మే, జూన్, జులై నెలల్లో నమోదైన అంకెలనే మేము చూపుతున్నాం.” అంటూ ఈ ఇమేజ్ చూపిస్తున్నారు.

SC 3

“సింధు కులం గురించి జూన్‌లో లక్షా 50వేల మంది వెతికారు, ఇక జులైలో 90వేల మంది వెతికారు”. ఇదీ వాళ్ళు చెప్పిన మాటలు.

ఇక్కడ న్యూస్ మినిట్ వాళ్ళు గూగుల్ యాడ్‌వర్డ్స్ కీ వర్డ్స్ ప్లానర్ టూల్ వాడారు. ఐతే దాన్ని ఎలా వాడాలో వాళ్ళకి సరిగ్గా తెలియలేదు. ఆ టూల్ మీ సెర్చ్ టెరంలోని అన్ని పదాల గురించీ వెతికేస్తుంది. ఆంటే పైన చెప్పిన లక్షల సెర్చ్‌లు “సింధు కులం” గురించి కాకుండా ఉత్త “సింధు” అన్న పదం గురించిన వెతుకులాటలను కూడా ప్రస్తావిస్తున్నాయన్న మాట.

మరైతే, కచ్చితంగా “సింధు కులం” గురించే సెర్చ్ చేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ సంఖ్య ఇదిగో ఇక్కడ చూడండి.

SC 4

అంటే సింధు కులం గురించి సగటున ఒక నెలలో జరిగిన సెర్చ్‌లు 210 మాత్రమే. గూగుల్ ట్రెండ్స్ రిలెటివ్ రేషియోని పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య 10 రెట్లు పెరిగి 2100 అవుతుంది. అంతే తప్ప లక్షలకు లక్షలు కాదు. మరి ఇంతకీ ఆ సంఖ్య ఎక్కడిది? అది పీవీ సింధు అనే కీ వర్డ్ ఉన్న అన్ని సెర్చ్‌ల సంఖ్య.

మరో విషయం, సింధు కులం గురించి సెర్చ్‌లు పెరగలేదా అంటే.. పెరిగాయనే చెప్పుకోవాలి. ఆ పెరుగుదల ఎంతో తెలుసా? జూన్ నుంచి ఆగస్ట్ నాటికి సింధు కులం గురించిన అన్వేషణలో పెరుగుదల 0.14 శాతం మాత్రమే.

కులం గురించి గొంతులు చించుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే దేనికి వ్యతిరేకంగా అరుస్తున్నారో, దేనికి అనుకూలంగా చేతులు ఎత్తుతున్నారో తేడా తెలీనంత. దీనికి కారణం ఏంటి?

వర్మకీ బుర్ర పనిచేస్తోంది… రామకీర్తన పాడాలి….

చాలా రోజుల తర్వాత రాంగోపాల్ వర్మ కొంచెం సెన్సిబుల్‌గా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో వర్మ పోచికోలు విషయాల మీద పనికిమాలిన వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ బతికేస్తున్నట్టు అప్పుడప్పుడూ చూసే వార్తలను బట్టి అనిపించేది. అలాంటిది… మత అసహనం లాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ దగ్గరకు వచ్చేసరికి తన నిజమైన శైలిలో చాలా సంప్రదాయబద్ధంగా మాట్లాడాడు.

అవును… సంప్రదాయబద్ధంగానే. అంటే రెండు రకాలుగా ట్రెడిషనల్‌గా. మొదటిది… మత అసహనం వంటి విషయంలో సోకాల్డ్‌ బుద్ధిజీవుల అభిప్రాయాలకు భిన్నంగా సంప్రదాయబద్ధంగా మాట్లాడాడు. సాధారణంగా హిందూ దేవీ దేవతల గురించి రకరకాల వెకిలి వ్యాఖ్యలు చేసే వర్మ నుంచి ఇలాంటి మడిచీర కామెంట్లను ది గ్రేట్‌ మేధోవర్గం జీర్ణించుకోవడం కష్టమే. ఇక రెండోది… అసలు వర్మ శైలే సంప్రదాయబద్ధం అని. సినిమా ప్రమోషన్ల కోసం ఎన్నిరకాల కహానీలు చెప్పినా… బేసిగ్గా వర్మ సినిమాలన్నీ రూల్‌బుక్‌ని కచ్చితంగా ఫాలో అయ్యేవే. సినిమాలోని కథ, కథా సంవిధానం పక్కన పెడితే… సాంకేతిక విషయాలన్నీ నిర్దుష్టంగా ఉంటాయి. కెమెరా, లైటింగ్‌, ఫ్రేమింగ్‌ లాంటి ప్రయోగాలన్నీ ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. అలా… వర్మ పక్కా సంప్రదాయవాది అని థీరీ. 🙂

రంగేళీ రాజా ఆమిర్‌ఖాన్‌… కడుంగడు బుద్ధిజీవి. సత్యమేవ జయతే అని నినదించిన నిఖార్సయిన దేశభక్తుడు. ఆయనకు ఉన్నట్టుండి దేశంలో మత అసహనం పెరిగిపోతుండడం గురించి ఆవేదన పెల్లుబికింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి గత ఆరేడు నెలల్లోనే దేశంలో పరిస్థితులు పాడైపోయినట్టు, సర్వనాశనమైనట్టూ తెలిసింది. అది కూడా… తన సంతానం భవిష్యత్తు కోసం తన భాగస్వామి ఆందోళన వ్యక్తం చేసి దేశం వదిలిపెట్టిపోదామన్నప్పుడే అర్ధమయింది. ఆ విషయం గురించి ఆయన తన ఆవేదనను  పబ్లిక్‌ ఫోరమ్‌లోనే చెప్పాడు. అది కూడా కేంద్ర మంత్రి సమక్షంలో. పాపం… తన భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా పోయిందని ఆమిర్‌కు ఆ సమయంలో ఎంత భయం వేసి ఉంటుందో!

ఆ సందర్భంలో సోకాల్డ్‌ అసహనశీలురు ఎవరూ నేరుగా ప్రస్తావించడానికి భయపడే విషయాన్ని వర్మ చాలా సింపుల్‌గా అడిగేసాడు. అయ్యా… 125 కోట్ల భారతదేశం ఆదరించే ప్రపంచంలోని అతిపెద్ద సినీపరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్‌ను ఏలుతున్నది ముగ్గురు ఖాన్‌లు కదా… వారు ముగ్గురూ ముస్లిములే కదా… అయినా వాళ్ళ సినిమాలన్నీ మెజారిటీ హిందువుల దేశంలో సూపర్‌డూపర్‌ హిట్‌లు కదా… వాళ్ళను ఈ దేశం ఐకానిక్‌ సూపర్‌స్టార్లుగా నెత్తిన పెట్టుకుంది కదా… అది కూడా అసహనమేనా? అని అడిగేసాడు. (అన్నట్టు ఇదేదో కరడు గట్టిన హిందుత్వ వాదుల భాషలా లేదూ?… వర్మా సిగ్గుసిగ్గు… వర్మా డౌన్‌డౌన్‌… లాంటి క’ళ్ళెర్ర’జేసే మేధావుల ప్రకటనలు ఇంకా రాలేదా?)

aamir_rgv
అదే సమయంలో వర్మ ఇంకో వాక్యం వదిలాడు…. ఇవాళ్టి రోజుల్లో మనం కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న సమాచారంలో మునిగిపోతున్నాం తప్ప జ్ఞానం మాత్రం కరువయింది.. అన్నాడు. ఈ వాక్యాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. సెల్ఫ్‌ ప్రొక్లెయిమ్డ్‌ మేధావులకు తాము చెప్పిందే జ్ఞానం అన్న ఎరుక ఉంటుంది కదా.. అలాంటప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమకు తగిలేలా వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆ ముక్కని ఎందుకు పట్టించుకుంటారు లెండి. మోదీ అధికారంలోకి వచ్చిన సుమారు ఆరునెలల తర్వాత విడుదలైన ఆమిర్‌ఖాన్‌ సినిమా పీకే… హిందువుల్లోని (అంధ)విశ్వాసాల మీద వ్యంగ్యంగా విరుచుకుపడినప్పుడు పాపం కిరణ్‌రావుకు భయం వేసినట్టు లేదు… అప్పుడు ప్రజలకు జ్ఞానం అవసరం లేదు. ఇప్పుడు మాత్రం సోకాల్డ్‌ మత అసహనం గురించిన జ్ఞానం అక్కరపడిపోయింది.

సగటు ప్రేక్షకుడికి హీరో హిందువా ముస్లిమా అన్నది అనవసరం… తనకు కావలసిన వినోదం పంచుతున్నాడా లేదా అన్నది ముఖ్యం. సగటు పౌరుడికి అసహనం గురించిన చర్చలు అనవసరం. భారీ స్థాయిలో మతకలహాలు జరిగి తన ఇంటికి నిప్పంటుకుంటేనే దానిగురించి ఆలోచిస్తాడు. పరిమాణాత్మకంగా చూసుకుంటే అలాంటి ఘర్షణలు దేశంలో బాగా తగ్గాయన్నది కాదనలేని నిజం. ఆ విషయాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం. ఢిల్లీలో చర్చిల మీద దాడులు చేసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. తర్వాత అవి మతపరమైన దాడులు కావని తెలిసాక కిక్కురుమన్న వారే లేరు. ఈ దేశంలో మావోయిస్టులు చేసే హత్యల గురించి తెలియనివారు లేరు. సాయుధ పోరాటం పేరిట వారు చేస్తే ఒప్పయిన దాడులు…. మత విశ్వాసం పేరిట హిందువులు చేస్తే (చేసారని ఇంకా నిరూపణ కాలేదు, కానీ ఒకవేళ అదే నిజమని అనుకుంటే) మాత్రం తప్పయిపోతాయి. అయ్యా కుల లేదా మత దురహంకారంతో చేసే హత్యలకూ సైద్ధాంతిక పోరాటాలకూ సాపత్యమా అని విరుచుకుపడవచ్చు… మార్గం ఏదైనా ఫలితం ఒక్కటే కదా.

మత అసహనానికి నిదర్శనంగా చూపిన ఘటనలు… మహారాష్ట్రలో దభోల్కర్‌ హత్య… కర్ణాటకలో కల్బుర్గీ హత్య… దాద్రీలో అఖ్లాక్‌ హత్య…! వాటిని ఎవరూ సమర్ధించడం లేదు. కానీ అలాంటి రాజకీయ హత్యలు ఇంతకుముందు దేశంలో ఎప్పుడూ లేవా? అలా ప్రశ్నించడం లౌకిక సామ్యవాదానికి విఘాతకరమట. వామపక్ష నాయకులు గతంలో ఎన్నడూ హత్యలకు గురికాలేదా… వామపక్ష అతివాదులైన మావోయిస్టులు ఇతర పక్షాల వారిని హతమార్చలేదా. కానీ ఈ ఆరేడు నెలల్లోనే దేశం పరిస్థితి భయానకంగా మారిపోయిందా? దాద్రీ హతుడు అఖ్లాక్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు కదా అనవచ్చుగాక… ఇన్ఫార్మర్ల నెపంతో ఎన్ని వందల మంది సామాన్య జనాన్ని బలితీసుకున్నారు? వాటిని నేరుగా సమర్ధించకపోయినా ఏనాడూ వ్యతిరేకించని మహానుభావులకు ఇప్పుడు అఖ్లాక్‌ కుటుంబం మీద జాలీ దయా పెల్లుబికిపోయాయి. అదేం (బిహా)రాజకీయమో అర్ధం చేసుకోవడం కష్టమా!

మైనారిటీలంటే ఈ దేశంలో ముస్లిములు, వారి తర్వాత కొంతవరకూ క్రైస్తవులు మాత్రమే. సిక్కులు, బౌద్ధులు, జైనులు మైనారిటీలు కారు. వారికి హక్కులు, నిధులు, పదవులు, హోదాలు అక్కర్లేదు. ముస్లిములు చెప్పేది మాత్రమే నిజం అన్న భావనలు మెజారిటీ ప్రజల్లో పాతుకుపోయాయి. ఏదైనా అంశంపై ఒక పొల్లుమాట మాట్లాడినందుకు విమర్శిస్తే అది ముస్లిముల భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అని లౌకికవాదులు ఎగిరెగిరి అరిచి ఇల్లుపీకి పందిరేసే వాతావరణం ఉంది. అలాంటి చోట… పక్కా సంప్రదాయవాదిలా… హిందుత్వ ప్రచారక్‌లా వర్మ మాట్లాడాడు. వర్మా.. బీ రెడీ… హిందూ దేవీ దేవతల మీద సొల్లు ట్వీట్లు చేసినట్టు కాదు. త్వరలోనే నీ అవార్డులను నీతోనే వాపస్‌ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతాయి.

కశ్మీర్ కీ వో కలీ ఔర్ కభీ నహీ ఖిలేగీ

నాకు 15-16ఏళ్ళ వయసు. మా చుట్టూ ఏం జరుగుతోందో కొంచెం కొంచెంగా ఊహ తెలుస్తున్న సమయమది. సాయంత్రం కొద్దిగా చీకటి పడే వేళకు ఇంటిముందు ఆడుకోడానికి వెడతామంటే కూడా అమ్మా నాన్నా వద్దనేవారు. నేనే కాదు, మా వర్గం పిల్లలందరి పైనా అలాంటి ఆంక్షలే ఉండేవి. ఇంక ఆడపిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇంట్లో నుంచి బైటకే రానిచ్చే వారే కాదు. వాళ్ళకి చదువు, బడి అనేవి ఉండేవే కాదు. ఆ విషయంలో మాత్రం మగ పిల్లలు అదృష్టవంతులే. అలా అని మా ఇళ్ళలో ఆడవాళ్ళంటే వివక్ష ఉండేదని కాదు. ఎప్పుడు ఏ అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోతారో, అత్యాచారం చేసి జీవచ్ఛవాల్లా చేసి విసిరి పారేస్తారో అన్న భయం. మా బంధువుల్లోనే ఇద్దరు ముగ్గురమ్మాయిలు అదృశ్యమైపోవడం, కొన్నాళ్ళకు వారి శవాలు ఊరి చివర దొరకడం నాకు లీలగా గుర్తుంది కూడా.

మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారి అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వాళ్ళందరి కుటుంబాలూ కలిసి ఉండేవి. మా తాతయ్య కట్టించిన మూడంతస్తుల మేడలోనే అందరం కలిసుండేవాళ్లం. పిల్లమూక అందరం కలిసి మేడపైకెక్కి ఆడుకుంటుంటే ఎంత సందడిగా ఉండేదో. కానీ ఆ భోగం అరగంట కూడా ఉండేది కాదు. ఆరుబైట ఆడుకోడం ప్రమాదకరమంటూ ఎవరో ఒకళ్ళు వచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకుపోయేవారు. బాల్యపు మా కుతూహలం భయాన్ని లెక్క చేసేది కాదు, కానీ అమ్మానాన్నలు చెప్పిన మాట జవదాటే వాళ్ళం కాదు.

కొందరి పలకరింపులకు నవ్వుతోనే బదులిచ్చే వాళ్ళం తప్ప పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు. గుండెలు బితుకు బితుకు మంటూనే ఉండేవి. వాళ్ళలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో.. ఎవరు ఎప్పుడు కాల్చేస్తారో తెలీదు. దానికి చిన్నా పెద్దా తేడా లేదు. తేడా అల్లా మతమే. వాళ్ళ ప్రార్థనాలయాల మీద మైకుల నుంచి వాళ్ళని మన మతంలోకి మార్చండి, ఒప్పుకోని కాఫిర్లను చంపి పారేయండిఅన్న మాటలు గాలితరగల మీద నుంచి తేలుకుంటూ వచ్చి, ఇళ్ళలో తలుపులు వేసుకుని కూర్చున్న మా చెవుల్లో గింగిర్లు తిరుగుతుండేవి. అలాంటి బహిరంగ బెదిరింపులు వినిపించిన ప్రతీసారీ తల్లికోడి తన పిల్లల్ని రెక్కల కింద అదుముకున్నట్టు అమ్మ మమ్మల్ని దగ్గరకు తీసుకునేది.

ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది 1947లోనే కావచ్చు. అప్పటికి నేను పుట్టలేదు. అప్పటి గొడవల్ని నేను ప్రత్యక్షంగా చూడలేదు. పాకిస్తాన్ కన్ను కశ్మీర్ మీద ఉన్నప్పటికీ 1950 తర్వాత గొడవలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. 30 ఏళ్ళు ఒకమోస్తరు సాఫీగా గడిచాయేమో.* మళ్ళీ 80ల నుంచీ టార్చర్ మొదలైంది. 90ల నాటికి అది పరాకాష్టకు చేరుకుంది. ఆ దశలోని సంఘటనలే నేను చెబుతున్నవి.

ఒకరోజు రాత్రి నాన్న మమ్మల్నందరినీ లేపేసారు. కళ్ళు నులుముకుంటూ బైటకు హాల్లోకి వచ్చాం. పెదనాన్నలు పెద్దమ్మలు చిన్నాన్నలు చిన్నమ్మలు అత్తయ్యలు మావయ్యలు కూడా వచ్చేసారు. పెద్దవాళ్ళ చేతుల్లో కొన్ని సంచీలున్నాయి. అంత చీకట్లో ఆ ప్రయాణం మాపిల్లలందరికీ మహా సరదాగా అనిపించింది. మాకు అసలు సంగతి పూర్తిగా తెలీదు కదా. కొన్ని కిలోమీటర్ల దూరం చల్లటి గాలిలో నడిచాం. నిద్దర్లు వదలని పిల్లలని అమ్మలో నాన్నలో ఎత్తుకున్నారు. పెద్దవాళ్ళందరి ముఖాల్లో ఆవేదన. చివరికి ఎప్పటికో మేం ఓ శిబిరాల సమూహం దగ్గరకు చేరుకున్నాం. పెద్ద కుటుంబం కావడంతో మాకందరికీ ఒక డేరా కేటాయించారు. పిల్లలందరం వెంటనే నిద్రపోయాం, పెద్దవాళ్ళు మాత్రం ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు.

పొద్దున్న లేచాక అందరం కాలకృత్యాలు తీర్చుకున్నాం. అందరికీ ఒకటే బాత్రూం, ఒకటే టాయిలెట్. మా ఇంట్లో మూడంతస్తుల్లోనూ వేరేవేరేగా ఉండేవి. మొదట్లో మాకు ఈ తేడా దేనికో తెలీలేదు. కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి. తర్వాత మాకు ఆ శిబిరం బోర్ కొట్టేసింది. ‘అమ్మా, మనింటికి వెళ్ళిపోదామేఅంటూ మారాం చేసేవాళ్ళం. పెద్ద పిల్లలకి విషయం కొద్దికొద్దిగా అర్ధమైనాఇంటి బెంగతో అక్కడికే వెళ్ళిపోదామంటూ గోల చేసే వాళ్ళం. మమ్మల్ని సముదాయించ లేక, కొట్టకుండా ఉండలేక నానా యాతనా పడేవారు. అంతలో ఒకరోజు ఒక వార్త వచ్చింది. మేం ఢిల్లీ వెళ్ళిపోతున్నామట.

ఢిల్లీఢిల్లీఢిల్లీ…. కొన్నాళ్ళు పిల్లలకు అదో సరదాగా ఉండేది. పెద్దవాళ్ళు మాత్రం ఏంటేంటో మాట్లాడుకునే వారు. తిట్టుకునేవారు, అరుచుకునేవారు. చచ్చినా సొంతూరు వదిలి ఎక్కడికీ కదిలే ప్రసక్తే లేదంటూ ఆడవాళ్ళు కన్నీళ్ళ పట్టు పట్టుక్కూర్చునే వారు. కదలకపోతే చచ్చిపోతామంటూ మగాళ్ళు హెచ్చరిస్తుండేవారు. డేరాల దగ్గర దొరికే బులెట్ల, బాంబుల ఖాళీ షెల్స్ మాకు ఢిల్లీలో దొరుకుతాయా లేదాఅవి లేకపోతే ఆడుకోడం ఎలా? వంటి సందేహాలు మా పిల్లల బుర్రలు తొలిచేస్తుండేవి. కొద్దిరోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోడానికి ఏర్పాట్లు జరుగుతుండగా…. అమ్మ చచ్చిపోయింది.

అలాగే ఢిల్లీ వెళ్ళిపోయాం. వెళ్ళిన రోజే మా ఉత్సాహం నీరు కారిపోయింది. రోడ్డు పక్కన పేవ్ మెంట్ మీద టెంటులో ఎందుకుండాలో అర్ధం కాదు. అక్కడి మా ఇంటికి వెళ్ళిపోదామంటే వినిపించుకోరు. ఇక్కడేం చేయాలోఎన్నాళ్ళిలా గడపాలో అనుకుంటూ ఉండేవాళ్ళం. మా సరదాలన్నీ చచ్చిపోయాయి. ఎటు చూసినా నిరాశ, నిరాసక్తతే (మాయూసీ). దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగేవాళ్ళం. ఎప్పటికైనా శ్రీనగర్ లోని మా మూడంతస్తుల మేడకు వెళ్ళిపోతామన్న కల మాత్రం ఉండేది. కొన్నాళ్ళకు అదీ తీరిపోయింది. ఆ ఇంటిని ఎవరో తమ సొంతం చేసేసుకున్నారట. ఆ విషయంలో మా బంధువుల్లోనే కొందరు నాన్నని తిట్టేవారు. ‘ఆ బెదిరించిన వాళ్ళు ఎంతో కొంత ముట్టజెబుతామన్నారు కదావాళ్ళకి ఇల్లు అమ్మేసి ఉంటే నాలుగు డబ్బులైనా వచ్చేవి కదాసెంటిమెంటల్ ఫూల్ లా ప్రవర్తించావుఅనేవారు. అలాంటి వారికి నాన్న ఎప్పుడూ జవాబివ్వలేదు.

ఎప్పటికైనా ఎలాగైనా కశ్మీర్ వెళ్ళిపోవాలన్న మా కలలు నెరవేరలేదు. శ్రీనగర్లోని మా ఇంటిని కూల్చేసారని, ఆ స్థలాన్ని ఆక్రమించేసుకుని కొత్తగా ఇల్లు కట్టుకున్నారనీ తెలిసిన నాడు ఒంట్లో ఏదో నరం తెగిపోయింది. కొన్నాళ్ళకే నాన్న మాకు దూరమయ్యారు. తర్వాత మా గతి మా చేతిలో లేకుండా పోయింది. ఢిల్లీ రోడ్ల మీదే పెరిగాం. ఏవో చదువులు చదువుకున్నాం. ఎలాగోలా డిగ్రీలు పూర్తి చేసాం. అప్పుడే ఈ ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ వచ్చేసాను.

మీ భాగ్యనగరంతో మాకు ఫిర్యాదులూ లేవు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ నాకు కావలసింది లేదు. ఆఫీసులో మీతో సరదాగా కబుర్లు చెప్పే నేను నేను కాను. ఈ చీకట్లో మగ్గిపోతూ నా ఇంటికి, నా వాళ్ళకి దూరమైన వేదనతో ఏడుస్తున్న నేనే నిజమైన నేను……

***** ***** ***** ***** ***** *****

చెట్టంత మనిషి అలా ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు. భట్ కొన్ని నిమిషాల్లో తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. పద అలా వెళ్ళి చాయ్ తాగొద్దాం అన్నాను. అలా రోడ్లెక్కి దగ్గరి థియేటర్ లో ఆడుతున్న హిందీ సినిమా గురించి, ఇంకా నానా సోది సబ్జెక్టుల గురించీ కబుర్లు చెప్పుకున్నాం.

మా డెస్క్ ఒక నానాజాతి సమితిలా ఉండేది. కనీసం పది రాష్ట్రాలకూ, వేర్వేరు భాషలకూ చెందిన సుమారు పాతిక మంది కలిసి పనిచేసేవాళ్ళం. ఆ గ్రూప్ లోని కశ్మీరీ పండిట్ మిత్రుడి గదికి వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ అది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ మా గ్రూప్ లో కశ్మీర్ గురించి చర్చలు జరుగుతుండేవి. కానీ అవెప్పుడూ అంత ఎమోషనల్ స్థాయికి చేరుకోలేదు. బహుశా 2005-2006 నాటి సంఘటన ఇది. నాలుగైదేళ్ళ తర్వాత భట్ కి ఆ ఛానెల్లోనే జమ్మూలో రిపోర్టింగ్ ఛాన్స్ వచ్చింది, మరికొన్నాళ్ళకి నేను ఆ ఛానెల్ వదిలిపెట్టేసాను.

ఇప్పుడు కశ్మీరీ పండితులను సొంతగడ్డకు ఆహ్వానిస్తూ అక్కడి రాష్ట్రప్రభుత్వం ప్రకటనలు చేస్తుండడం, దాన్ని ప్రతిపక్షాలూ, వేర్పాటువాదులూ వ్యతిరేకిస్తుండడం చూస్తుంటే ఆనాటి మా సంభాషణ మళ్ళీ గుర్తుకొచ్చింది.

***** ***** ***** ***** ***** *****

మీ పండిట్లను మళ్ళీ వెనక్కి కశ్మీర్ లోయలోకి తీసుకెళ్ళాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా….

నిజమే. కానీ అది సాధ్యం కాదు. ప్రభుత్వం మాకు విడిగా కాలనీలు కట్టి సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు.

అదేంటది?

అవును. మా ఇళ్ళన్నీ ఆక్రమించేసుకున్నారు, కబ్జాలు చేసేసారు. ఏ కొద్దిమందో అప్పట్లో నామమాత్రపు ధరకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు అవి కొనుక్కునేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

మరి సెక్యూరిటీ యాంగిల్ ఏంటి?

ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళెవరు? మా తల్లిదండ్రులనూ మా అన్నదమ్ములనూ చంపేసిన వాళ్ళే. మాఅక్కచెల్లెళ్ళను చెర పట్టి మానభంగాలు చేసినవాళ్ళే. అలాంటి వాళ్ళ మధ్యకు ప్రాణాలకు తెగించి వెళ్ళాలంటే మాతృభూమి అన్న ఒకే ఒక సెంటిమెంట్ కోసం వెళ్ళాలి. అప్పుడైనా మా భద్రతకు గ్యారంటీ ఏమీ ఉండదు.

అదేం?

మాకు ఇళ్ళంటూ ఇస్తే రెండు రకాలుగా ఇవ్వాలి. అయితే ప్రత్యేక కాలనీలైనా కట్టాలి, లేదా నివాస ప్రాంతాల్లోనే మాకు ఇళ్ళు కేటాయించాలి. కాలనీలు కడితే…. వాళ్ళకి మేం ఎక్కడున్నామో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు మమ్మల్ని చంపడం వాళ్ళకి మరింత సులువు. అలా కాకుండాఊళ్ళలోనే నివాస ప్రాంతాల్లోనే మాకు ఇళ్ళు కేటాయిస్తేవాళ్ళ మధ్యలో మేముండాలి. వాళ్ళు పదిమంది ఉంటే మేం ఒకళ్ళమో ఇద్దరిమో ఉంటాం. అప్పుడు కూడా మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఏ క్షణంలో వేటు పడుతుందో తెలీదు. పోలీసులూ, జవాన్లూ 24గంటలూ పహరా ఉండలేరు కదా. అంటేబొమ్మ పడినా, బొరుసు పడినా మాకు చావు తప్ప మరో మార్గం లేదు.

అందుకేనా కొత్త తరం పండిట్లు లోయకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు?

అదో విచిత్రమైన లాజిక్. మా కష్టాలు మా తర్వాత తరాలకు తెలీవన్నది నిజమే. కానీ వారిలో చాలామంది సొంతగడ్డకు వెళ్ళడానికి ఇష్టంగానే ఉన్నారు. ఐతే.. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? వ్యవసాయం, వ్యాపారం వంటి సంప్రదాయిక వృత్తుల్లోకి వెళ్ళాలి, అంతే. ఇన్నాళ్ళూ ఢిల్లీ లాంటి నగరంలో పుట్టి పెరిగిన మా తర్వాతి తరాలకు ఆ పనులు పూర్తిగా చేత కావు. మరోవైపు దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు సాఫ్ట్ వేర్, టెక్నాలజీ వంటి రంగాల్లో హైలీ పెయిడ్ శాలరీస్ సంపాదించుకుంటుంటే మేం మాత్రం మా సొంతింటి కష్టాల్లో వెనుకబడిపోతుంటాం. ఓ పక్కన సరిహద్దులకు అవతల నుంచి వాళ్ళకు హార్దికంగానూ ఆర్ధికంగానూ పూర్తిస్థాయి సహకారం అందుతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసుకోడానికి కూడా ఫుల్ టైమ్ కేటాయించడానికి కూడా రెడీగా ఉంటారు. మేం ఒక పక్కన మా రోజీ రోటీ చూసుకుంటూ ఉండాలి, ఇంకో పక్కన వాళ్ళ బెడదని ఎదుర్కొంటూ ఉండాలి. ఎటునుంచి ఏ కత్తి, ఏ బాంబు ఎలా వచ్చి ప్రాణాలు తీస్తుందో అన్న టెన్షన్ అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అన్ని రిస్కులు తీసుకుంటూ ఉండడం దేనికి అనుకోడం తప్పా? కాదు. కానీ, దాన్ని కొత్తతరం కశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా చిత్రించడం పరిపాటి అయిపోయింది. వాళ్ళకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని చిత్రీకరించివారి మూలాలను తెంచేసే ప్రయత్నం ఇది. దీనికి సొల్యూషన్ ఏమీ లేదు.

అంటే

అంటే ఏముంది? ప్రాణాలకు తెగించి వెళ్ళగలిగితే వెళ్ళి ఉండాలి. వెళ్తే వాళ్ళు చంపేస్తారు. వెళ్ళకపోతే మా జన్మభూమి మీద మాకు ప్రేమ లేదంటారు. ఎటునుంచి ఎలా చూసుకున్నా మాది లూజ్ లూజ్ సిట్యువేషన్. ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిన టైంలో చేయలేదుఇప్పుడు చేస్తామని చెప్పేవాళ్ళున్నా**, అవన్నీ నాలుక చివరి మాటలే. ఆ కబుర్లన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే. జమ్మూలోనో లెహ్ లోనో మాకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయవచ్చేమో కానీఅవన్నీ కంటితుడుపుళ్ళే.

***** ***** ***** ***** ***** *****

జమ్మూకశ్మీర్ లో పీడీపీ బీజేపీ విచిత్ర అష్టావక్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నడుస్తున్న డ్రామాల మధ్యలో మరోసారి కశ్మీరీ పండిట్లకు స్వస్థలాల్లో మళ్ళీ ఇళ్ళ అంశం తెర మీదకు వచ్చింది. పండిట్లకు ఇళ్ళు కట్టివ్వడానికి స్థలం సమీకరించాలని కేంద్రం రాష్ట్రాన్ని అడిగింది, రాష్ట్రం దానికి సానుకూలంగా స్పందించింది. వెంటనే కాంగ్రెస్, ఎన్సీలు మండిపడ్డాయి. పండిట్లు కూడా కశ్మీరియత్ లో భాగమే కాబట్టి వారికి వేరుగా ఇళ్ళు కట్టించి ఇవ్వకూడదనీపండిట్లను వేర్పరచకుండా వారిని తమతో సమైక్యంగా ఉంచేలా చేయాలనీ…. ప్రముఖ వేర్పాటువాద నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ప్రత్యేక కాలనీల నిర్మాణంతో పండిట్ల మనసులో వేరు భావాలు మొలకెత్తుతాయట. అది మంచిది కాదటఈ మాటలు చెబుతున్నది తన రోగానికి మూడునెలల పాటు ఢిల్లీలో చికిత్స తీసుకుంటూ పాకిస్తాన్ పాట పాడిన జేకేఎల్లెఫ్ యాసిన్ మాలిక్నాలుగేళ్ళ క్రితం కశ్మీర్లో బాంబు దాడులు చేయించి వందమందిని పొట్టన పెట్టుకున్న మసరత్ ఆలం వంటి మహానుభావులు. ఆ మాటలు వింటుంటే ఇక్కడ తెలుగు గడ్డ మీద కూచున్న మనకే ఒళ్ళు మండిపోడం లేదూ. గంగా జమునా తెహజీబ్ వంటి దొంగ మాటలు చెబుతూ లౌకికవాదపు నాటకాలాడే మానవ హక్కుల ముఠాల, రాజకీయ పార్టీల నాయకుల అసలు రంగులు తెలిసిన వారికి కశ్మీరీ పండిట్ల కన్నీటి వ్యథ ఆవేదన కలిగించడం లేదూ!!!

పాద పీఠికలు :

* ఆ సమయంలో పాకిస్తాన్ దృష్టి పంజాబ్ ను విరగ్గొట్టి ఖలిస్తాన్ ఏర్పాటు చేయడం మీద ఉన్నట్టు గుర్తు. ఆ ప్రయోగం వికటించిన తర్వాతే పాకిస్తాన్ కన్ను మరోసారి కశ్మీర్ పై పడింది.

** మా భట్ ఆ మాట చెప్పిన సందర్భంలో కశ్మీర్ లో గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.

ఇద్దరు దేవుళ్ళు… ఒక మాత… కొన్ని మనోభావాలు

పవిత్ర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మతాలు రెండు.. ఒకటి క్రికెట్‌రెండు సినిమా. ఈ రెండు రంగాలకు చెందిన డెమీ గాడ్స్‌పై చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడిపోయే భక్త జనులు కోకొల్లలు. అలాంటి భక్తులను అడ్డు పెట్టుకుని తాము చెప్పిందే వేదంతాము చేసిందే గొప్ప అని భావిస్తూ చెలరేగిపోతుంటారు ఈ దైవాలు. బంగారు పళ్ళేనికైనా గోడచేర్పు ఉండాలన్న సామెత సామాన్య ప్రజలకు ఎంత తెలుసో కానీ ఈ డెమీ గాడ్స్‌కి మాత్రం బాగా తెలుసు. అయితే వీరు ఆనుకునే గోడలు.. విచిత్రంగా తమను అభిమానించి పూజించే ప్రజలు కాదు, తమ రంగాలకు చెందిన తెర వెనుక సూత్రధారులు లేదా గర్భగుడిలోని మూలవిరాట్టులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ నాయకులు. ఒకోసారి ఈ డెమీ గాడ్స్‌కీ, వారి సూత్రధారులకూ చిన్నచిన్న ఘర్షణలు తలెత్తుతుంటాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుని తమ దైవత్వానికి ఎలాంటి ఆటంకమూ కలక్కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణంగా ఈ సూత్రధారులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేస్తుంటారు. అలాంటి నియమ నిబంధనలు ఒక్కోసారి ఆ దేవుళ్ళ భక్తులకు నచ్చవు. ఇంకా చెప్పాలంటే కడుపు మంట పుట్టిస్తాయి కూడా. అయినాఈ మూలవిరాట్టులు ఎంతమాత్రం చలించరు. అవసరాన్ని బట్టి కొంత స్పందించినట్టు కనిపిస్తారు కానీదైవాలకే బలాన్నిచ్చే తమ శక్తిని భక్తుల్లాంటి అల్పజీవులకోసం వృధా చేసుకోడం అనవసరం అని వారికి తెలుసు.

సినిమా దేవుళ్ళ విషయానికి వస్తే వారికి అలాంటి గోడ చేర్పులు లేదా సూత్రధారులు లేదా మూల విరాట్టుల్లో ప్రధానమైనది సెన్సార్‌ బోర్డ్. ఆ పై దశలో రాజకీయ నాయకులు ఉంటారనుకోండి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఈ మధ్య ఈ దైవాలకు సాధారణ స్థాయి భక్తులకు ఉచిత దర్శనం ఇవ్వడం సరిపోవడం లేదు. హుండీలు వందల కోట్ల మార్కు దాటాలంటే స్పెషల్‌ దర్శనాలు ఇవ్వక తప్పడం లేదు. అలాంటి స్పెషల్‌ దర్శనాల్లో ప్రధానమైనది సంచలన లేదా వివాదాస్పద దర్శనం. దేవుణ్ణి మామూలుగా దర్శించుకోడం కంటె స్పెషల్‌గా దర్శనం చేసుకోడం మీదనే ఎక్కువ మంది భక్తులకు ఆసక్తి ఉంటుంది. ఆ ఫార్ములాను ఆసరా చేసుకుని ఈ స్పెషల్‌ కోటా దర్శనాలు ఇస్తుంటారు దేవుళ్ళు. వాళ్ళకి ఈ సూత్రధారులు అవసరమైన సహాయమూ అందిస్తుంటారు. భక్తులకు సాధారణంగా అర్ధం కాని విషయం ఏంటంటే ఉత్సవ విగ్రహాలలాంటి ఈ డెమీగాడ్స్‌కూ, వరాలిచ్చే మూలవిరాట్టులకూ మధ్య చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినప్పుడు ఈ భక్తులను అడ్డం పెట్టుకుని ఇద్దరూ ఆడుకుంటారు. ఆటలో వారిద్దరిలో ఎవరో ఒకరిది పైచేయి అవడం ఖాయం కానీ మధ్యలో వెర్రివెధవలయ్యేది మూఢ భక్తులే. అప్పుడప్పుడూ ఈ సోకాల్డ్ భక్తుల మనోభావాలు గాయపడుతూ ఉంటూంటాయి. కానీ సదరు గాయాలకు మలాము ఎలా రాయాలన్నది ఆ డెమీగాడ్‌, మరియు మూల విరాట్టు మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ ఉత్సవ మూర్తులో లేక మూలవిరాట్టులో తమతమ అవసరాల మేరకు తమ సన్నిహిత భక్తులతో మనోభావాలు గాయపడే నాటకాలు కూడా ఆడిస్తుంటారు.

కొన్నాళ్ళ క్రితం కమల్‌హాసన్‌ అనే దేవుడు విశ్వరూపం చూపించాలని ప్రయత్నించాడు. అదే సమయంలో తమిళనాడులో అంతకంటె మహాదైవం స్థాయిలో ఉన్న అమ్మవారు ఈ విశ్వరూపం మీద కినుక వహించారు. ఆ పోరులో కమల్‌దైవం జయఅమ్మవారి చేతిలో ఒకరకంగా ఓడిపోయాడు. అమ్మవారు ఈ విశ్వరూపి మీద ఆధిక్యం సాధించడానికి ప్రయోగించిన అస్త్రం ముస్లిముల మనోభావాలు గాయపడడం. ఆ బ్రహ్మాస్త్రానికి, క్షమించాలి, అల్లాస్త్రానికి విశ్వరూపి విలవిలలాడిపోయాడు. చివరికి సదరు గాయపడిన మనోభావాలకు అమ్మవారు చికిత్స చేయడంతో విశ్వరూపి ఊపిరి పీల్చుకోగలిగాడు. అన్నట్టు అంతకుముందు అదే విశ్వరూపుడి వల్ల కొన్ని హిందూ వర్గాల మనోభావాలు కూడా గాయపడ్డాయి. వారూ తమకు కావలసిన మలాము ఇదీ అని ఆ మూడ భక్తులు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ భక్తులు అమ్మవారి భక్తులు కాకపోవడంతో వారి మనోభావాలకు తగిలిన గాయాలు చర్చనీయాంశం కాలేదు. ఆ భక్తులకు తమిళదేశంలో పెద్దగా సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఈ దేవుడు కూడా పట్టించుకోలేదు. అంటేభక్తుల మనోభావాలను గాయపరిచే హక్కు దైవాలకు ఉంటుంది కానీ ఆ గాయాలకు మందు పూయాల్సిన బాధ్యతను వారు భుజాలకెత్తుకోవడం అనేది ఆ భక్తుల ఒరిజినల్ మతాలకు అప్పటికి ఉన్న బలాబలాలను బట్టి మాత్రమే ఉంటుందన్న మాట.

ఇటీవల ఇద్దరు దైవాలకు సంబంధించిన చలనచిత్రాలు వివాదాస్పదమయ్యాయి. అవి ఆయా దైవాలు ఉద్దేశపూర్వకంగా చేసినవా కాదా అన్నది కాసేపు పక్కన పెడదాం. ఇద్దరు దైవాలకూ సెన్సార్‌ స్థాయిలో మూలవిరాట్టు మాత్రం ఒక్కరే. రెండు సందర్భాల్లోనూ వివాదం మనోభావాలు గాయపడడమే. కానీ సెన్సారు మాత కరుణ ఒక దైవానికి ఒకలా కరుణించింది, మరో దైవానికి మరొకలా కోసిపారేసింది. అంతే కాదుమొదటి దైవాన్ని తాను కరుణించిన తీరున రెండో దైవాన్ని తనకంటె బలమైన మరో మూలవిరాట్టు కరుణిస్తే…. సహించలేకపోయింది. ఆ రాజకీయ గోడ బలమైనది కావడంతో ఈ సెన్సారు గోడ కూలిపోయింది. అది తర్వాతి విషయం. ఇంతకీ ఇద్దరు డెమీగాడ్స్‌ పట్లా సెన్సారు మాత వేర్వేరు స్టాండ్స్‌ తీసుకోడానికి కారణాలేంటి?

మొదటగా ఆమిర్‌ఖాన్‌ అనే డెమీగాడ్‌ మహిమలను వెల్లడించే పీకే అనే సినిమా వచ్చింది. సాధారణ రెలిజియస్‌ గాడ్స్‌, గాడ్‌మెన్‌ గురించి చర్చించడమే ఆ చిత్రం ఇతివృత్తం. బాగుంది, బహు బాగుంది. నామమాత్రంగా ఇస్లాం, క్రైస్తవ మతాలను ఉపరిస్పర్శ చేసినప్పటికీ ప్రధానంగా హిందూమతంలోని బహుళ దైవాల విధానం, దొంగబాబాల లీలలను తూర్పారపట్టడం మీదనే దృష్టి సారించింది. ఉగ్ర హిందుత్వ మూఢ భక్తులు దానిపై ఆగ్రహించారు. తమ మనోభావాలు గాయపడ్డాయంటూ వీధులకెక్కారు. గోలగోల చేసారు. మహాపెద్ద మూలవిరాట్టు అండ తమకుంటుందేమో అన్న భ్రమతో చెలరేగిపోయారు కూడానూ. ఐతే ఆమిర్‌ దైవం చలించలేదు. నిర్మాతదర్శక పూజారులు కరుణించలేదు. సెన్సారు మాత తమకు సర్టిఫికెట్‌ ఇచ్చేసినందున భక్తుల మనోభావాలను పట్టించుకోడం అవసరం లేదని తేల్చేసారు. ఆ సమయంలో సెన్సారు మాత సినీదైవానికి అండగా నిలబడింది. సినిమాను క్షుణ్ణంగా పరిశీలించామనీఅందులో అభ్యంతరకరమైన అంశాలేమీ లేవనీమనోభావాలు గాయపడ్డాయంటూ రగడ చేయడం కళాకారుల సృజనాత్మకతను అణిచేయడమేననీ వ్యాఖ్యానించింది. చివరికి అరిచి అరిచి గోలచేసిన మూఢ భక్తులు మూగనోము పట్టారు. సినీదైవం హుండీ వందల కోట్లతో నిండిపోయి రికార్డులు సృష్టించింది.

111

ఇప్పుడు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ అనే గాడ్‌మాన్‌ టర్న్‌డ్‌ డెమీగాడ్‌ తీసిన మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ అనే సినిమా వంతు వచ్చింది. ఈ సినీదైవం గారు తమ సినిమాలో మాయలూ మంత్రాలూ చేస్తూంటారు, వాటిని లోక కళ్యాణం కోసం వాడుతూంటారు, ప్రజలను మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్‌ వంటి ఉపద్రవాల నుంచి కాపాడడానికి ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ఈ చిత్రానికి సెన్సారు మాత సర్టిఫికెట్‌ ప్రసాదం పెట్టకుండా మోకాలడ్డారు. అక్కడ గొడవ మొదలైంది. దానికి ఆ మాత చెప్పిన కారణంఆ చిత్రానికి కనీసం ప్రదర్శన అర్హత కూడా లేదట. ఎందుకంటే ఆ సినిమా కొన్ని మతాల మనోభావాలను దెబ్బతీసే ప్రమాదం పొంచివుండడమేనట. అందువల్ల ఆ సినిమాను ప్రజలు చూడకుండా తాను చేయగలిగినంతా చేస్తుందట.

అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టుతాను మొదటికే గాడ్‌మాన్‌, ఆపైన సినీ డెమీగాడ్‌గా అవతరించే ప్రయత్నంలో ఉన్నాడుఅలాంటి గుర్మీత్ రాం రహీం ఎందుకు ఊరుకుంటాడు? సెన్సార్‌ మాతతో తెగని పేచీని పై స్థాయికి వెళ్ళి సర్దుబాటు చేసుకున్నాడు. ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకున్నాడు. సదరు ట్రిబ్యునల్‌ రెండు చిన్నచిన్న సర్దుబాట్లతో ఆ సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసేసింది. అయితే ఆలోగా మరికొందరు చిన్నచిన్న మూల విరాట్టులు తమ భక్తులతో మనోభావాలు ఆట మొదలుపెట్టారు. దాంతో సర్టిఫికెట్‌ వచ్చిన తర్వాత కూడా బొమ్మ విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది డెమీగాడ్‌ టర్న్‌డ్‌ గాడ్‌మాన్‌ గారికి. ఈయనకు మహాపెద్ద మూలవిరాట్టు కుటుంబంతో సంబంధాలున్నాయన్న వార్తలూ ఉన్నాయి కానీ అవేవీ సినిమా విడుదలకు (కనీసం ఇప్పటివరకూ) సాయపడలేక పోయాయి.

పీకే స్వామి వారు ప్రజలకు మేలు చేస్తారుగాడ్‌గారి మెసెంజర్‌ గారు ప్రజలకు కీడు చేస్తారుఅని సెన్సారు మాత సూత్రీకరించేసారన్న మాట. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ పీకే స్వామికి అనుకూలంగా ఘాట్టిగా నిలబడిన సెన్సారు మాతదైవ దూత విషయానికి వచ్చేసరికి ప్లేటు తిరగేసారు. తన కంటె పెద్ద గోడదే పైచేయి అయేసరికి ఏకంగా రాజీనామా చేసేసారు. తన భావ ప్రకటనా స్వేచ్ఛకి ఎవరు అడ్డొచ్చినా సహించేది లేదంటూ రాజీనామాస్త్రం ప్రయోగించారు. ఇంతకీ ఈ కొత్త సినీదైవం కావాలనుకుంటున్న గాడ్ మాన్ అంటే ఎందుకంత విముఖత? ఈ సెన్సారు మాతకి ఆశ్రయం కల్పించిన మూలవిరాట్టు, ఆ గాడ్‌మాన్‌ కు అండగా నిలుస్తున్న మూలవిరాట్టుకూ రాజకీయ మతంలో ప్రబల శత్రుత్వమే ప్రధాన కారణమట.

ఆమిర్‌ దైవానికి సినీమతంలో భారీ పాపులారిటీ ఉంది. కోటానుకోట్ల మంది భక్తులు ఇప్పటికే ఉన్నారు. పైగా ఆయనేం చేసినా అది సెక్యులరిజం అనే పవిత్రత సంతరించుకుంటుంది. అందుకే హిందూ, ముస్లిం లాంటి తుచ్ఛమతాల అడ్డుగోడలు ఆ సినీదైవానికి వర్తించవు. ఏదో కాలం కలిసిరాక ఇప్పటి రాజకీయ మహా మూలవిరాట్టు విషయంలో నోరెత్తకుండా ఉంటున్నాడు కానీ గతంలో ఇదే మహా మూలవిరాట్టుకు వ్యతిరేకంగా నిలిచినవాడే. అందువల్ల ఆయన పీకే స్వామి అవతారంలో హిందూమతంలోని దురాచారాలను దునుమాడడంలో ఏ తప్పూ లేదు. దానికి ఆ తుచ్ఛమతంలోని ఆమిర్ దైవం భక్తులు సైతం మద్దతిస్తారు. అందుకే కొందరు చేసిన రగడను దేశం మొత్తం ముక్తకంఠంతో గర్హించింది, ఖండించింది, పీకే స్వామి దర్శనం చేసుకుని కోట్లకు కోట్లు అప్పగించింది.

మరి కొత్త సినీదైవంగా అవతరిద్దామనుకుంటున్న గుర్మీత్ రాం రహీం సింగ్ సంగతేంటి? ఆయన తుచ్ఛమతాల్లో సిక్కిజానికి చెందిన వాడు. సచ్చా సౌదా పేరిట సొంత డేరా కట్టుకున్న వాడు. ఉత్తరాదిన ఐదారు రాష్ట్రాల్లో కొన్ని కోట్లమందిని భక్తులుగా మలచుకున్న వాడు. దక్షిణాదిలోనూ పెద్దసంఖ్యలో ఉండే సిక్కులను తన డేరాలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వాడు. ఆ డేరా మాటున బోలెడు అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ కోకొల్లలుగా కలిగిన వాడు. అంటే నిఖార్సైన గాడ్ మాన్ అన్నమాట. ఇప్పుడు సాధారణ తుచ్ఛమతాల స్థాయిని దాటి సినీమతంలోనూ దైవంగా నిలవడానికి సొంత కాళ్ళ మీద ప్రయత్నిస్తున్న వాడు.

ఇక్కడ ఈ డేరాల పూర్వాపరాల గురించి కొంచెం అర్ధం చేసుకోవాలి. హిందూ మతంలో కుల వ్యవస్థ వంటి అమానుష దురాచారాలున్నాయన్న  ఉద్దేశంతో, ఇస్లాం మతంలో కొన్ని గొప్ప, కొన్ని చెడ్డ విషయాలున్నాయన్న భావనతోకేవలం మంచి లక్షణాలు మాత్రమే కలిగిన మహత్తరమైన మతానికి రూపకల్పన చేసే క్రమంలో పుట్టుకొచ్చిందే సిక్కు మతం. అయితే కాలాంతరంలో ఆ మతంలోనూ కుల వ్యవస్థ ప్రాబల్యం పెరిగిపోయింది. అంటే, హిందూముస్లిం మతాలలోని లోపాలు ఈ కొత్తమతంలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో సిక్కుల్లోని తక్కువ కులాల వాళ్ళు తమపై అగ్రకులాల ఆధిక్యాన్ని అడ్డుకోడానికి సొంత పాయలు ఏర్పాటు చేసుకోడం మొదలెట్టారు. అవే ఈ డేరాలు. వాటిలో సచ్చా సౌదా ప్రధానమైనది. దాని వ్యవస్థాపకుడే ఈ రాం రహీం సింగ్.

మందేశంలో మెజారిటీ ప్రజల మతం హిందూమతం. కాబట్టి దాన్ని ఎలా బూతులు తిట్టినా పర్వాలేదు. మెజారిటీ అనే బలమే బలహీనత కాబట్టి వాళ్ళు నోరు మూసుకుని పడి ఉండాల్సిందే. ఇస్లాం, క్రైస్తవం మైనారిటీ మతాలు. కాబట్టి వారి మనోభావాలకు ఎలాంటి గాయమూ తగలకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా హిందువులదే. చిత్రమేంటంటే బౌద్ధం, జైనం, పార్సీ, సిక్కు వంటి మతాలు కూడా మైనారిటీ మతాలే. కానీ హేమిటో వారికి పెద్దగా మనోభావాలు ఉండవు. వాటిని పట్టించుకోవలసిన అవసరమూ ఉండదు. అదెందుకు అని అడక్కూడదేమో కూడా.

గుర్మీత్ రాం రహీం సింగ్ సిక్కు మతం మాటున అక్రమాలకు పాల్పడుతూ ఉండి ఉండవచ్చు. తన సొంత డేరాలో చేసే పనుల్లో అవినీతి, అక్రమాలు, అమ్మాయిల వ్యవహారాలూ అన్నీ ఉండి ఉండొచ్చు. అవన్నీ మన రాజ్యాంగానికి విరుద్ధమైనవి అయి ఉండొచ్చు. రాం రహీం సింగ్ కరుడు గట్టిన నేరస్తుడై ఉండవచ్చు. అలాంటి నేరాలకు కచ్చితంగా శిక్షించాల్సిందే. అయితే, దాని ఫోరం వేరు.

రాం రహీం సింగ్ ఒక సినిమా తీస్తే, దానికి కనీసం ప్రదర్శన అర్హత కూడా లేదంటూ నిలిపేసేందుకు సెన్సారు మాత చేసిన ప్రయత్నం వెనుక ఎన్ని రాజకీయ కారణాలున్నాయో మరి. ఎందుకంటేకళాసృజన పేరిట అడ్డమైన చెత్త సినిమాలు ఎన్ని రాలేదు? ప్రదర్శన యోగ్యమైనవంటూ సెన్సారు మాత సర్టిఫికెట్ ఇచ్చిన ఎన్ని వందల సినిమాలను చూడకుండా ప్రజలు తిరస్కరించలేదు? పొట్ట నింపుకోడానికి కాక కోట్లు వెనకేసుకోడానికి పోర్న్ సినిమాల్లో నటించే లియోనిని అదేదో ఘనకార్యం లాగ విదేశాల నుంచి తీసుకొచ్చి తీసిన బూతు సినిమాలకు సెన్సారు మాత సర్టిఫికెట్లు ఇవ్వలేదా? రాం రహీం తన మంత్రశక్తులతో డ్రగ్స్, లిక్కర్ వ్యాపారాలను అడ్డుకుంటున్నట్టు సినిమా తీస్తే అది కొన్ని మతాల వారి మనోభావాలను దెబ్బతీస్తుంది కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వడం లేదనడంలోని డొల్లతనం ఇక్కడే అర్ధమవడం లేదూ….! రాం రహీం సినిమా ప్రేక్షకులకు నచ్చితే చూస్తారు, లేదంటే యేటా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వందలాది అనామక సినిమాల్లో అదీ ఒకటిగా ఓ మూలన పడిఉంటుంది. కథ, మాటలు, పాటలు, మొదలుకుని నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు వరకూ అన్నీ తానే అయిన రాం రహీంకు చేతులు కాలతాయి. అంతే కదా.

రావుగారూ… మమ్మల్నెందుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు?

”మంగళ్‌యాన్‌ ప్రాజెక్టుకు మహా అయితే 450 నుంచి 500 కోట్లు ఖర్చవుతుంది. దానికోసం భారతీయులు ఎందుకింత గింజుకుంటున్నారు? నిజానికి ఇవాళ భారతదేశం చరిత్రలోనే ఓ గొప్ప రోజు. దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో 5వేల కోట్లు ఖర్చు చేయడానికి భారతీయులకు ఎలాంటి సమస్యా ఉండదు. ఆ మొత్తంలో కేవలం పదోవంతును మాత్రమే ఈ అంగారక యాత్ర కోసం వెచ్చిస్తున్నాం. దానికి ఇంత గోల ఎందుకు?”

ఈ మాటలు మాట్లాడింది ఎవరో లాకాయి లూకాయి మనిషి అయితే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఈ ఆగ్రహం వెలిగ్రక్కింది ప్రొఫెసర్‌ యు,ఆర్‌.రావు. ప్రస్తుతం గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిజికల్ రిసెర్చ్‌ ల్యాబొరేటరీకి ఛైర్‌పెర్సన్‌. ఈ పద్మభూషణుడు స్వయంగా ఇస్రో మాజీ ఛైర్మన్‌ కూడా. తాను ఒకప్పుడు నాయకత్వం వహించిన సంస్థ మీద ప్రేమాభిమానాలతో… తమ సంస్థ తాజా ప్రయోగంపై విమర్శలకు తనదైన శైలిలో స్పందించారు. మంగళయాన్‌కు అమంగళం పలికేవారిని ఆడిపోసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు… మంగళయాన్‌ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారెవరు? వారి వ్యతిరేకతలపై యు.ఆర్‌,రావు వెలిబుచ్చిన ఆగ్రహం ఏమిటి? ఆ విమర్శల లక్ష్యం ఎవరు? ఆ విమర్శలు తగిలింది ఎవరికి? దానిపై ఆయన్ను తిరిగి ప్రశ్నించగలిగింది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి.

వాతావరణ వివరాల నుంచి టీవీ ప్రసారాల వరకూ ఎన్నో రకాల సేవలందిస్తున్న ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడుతోంది ఇస్రో. కేవలం మన దేశపు ఉపగ్రహాలనే కాక… విదేశీ ఉపగ్రహాలను సైతం రోదసిలోకి చేర్చే సేవలందిస్తూ వాణిజ్యపరంగానూ లాభదాయకంగా నిలుస్తోంది. అలాంటి మన ఇస్రో ప్రాజెక్టులంటే సగటు భారతీయుడు పొంగిపోతాడు. దేశాభివృద్ధితో ముడిపడి ఉన్నవిగా ఇలాంటి ప్రయోగాలను చూసి పల్లెటూరి రైతు నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌లో పల్లీలమ్ముకునే వాళ్ళ వరకూ అందరూ గర్వపడతారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, ప్రయోగాలతో దేశానికేదో మేలు జరుగుతుందని ఆమ్‌ ఆద్మీ భావిస్తాడు. రాజకీయంగా ఏ పార్టీని అభిమానించే వారయినా… ఇస్రో ప్రాజెక్టులను వ్యతిరేకించరు… కనీసం బైటకు వ్యతిరేకంగా మాట్లాడరు. (బహుశా కొన్ని మినహాయింపులు ఉంటాయేమో కానీ నాకు అనుమానాలే తప్ప కాంక్రీట్‌గా తెలీవు). ఐ మీన్‌… లేమ్యాన్‌ఆఫ్‌ ఇండియా ఎవ్వడూ మంగళయాన్‌ను చూసి పొంగిపోతాడు… సాధారణ రాజకీయ పక్షాలు ఈ ప్రయోగాలను వ్యతిరేకించే సాహసం చేయవు. మరి… రావుగారి ఆగ్రహం ఎవరిమీద.

మంగళయాన్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం 2012 ఆగస్టు 3న ఆమోదించింది. అప్పటికే మార్స్‌ ఆర్బిటర్ గురించిన అధ్యయనాల కోసం 125 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే… ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగానికి ఆమోదముద్ర వేయకపోతే ఆ నూటపాతిక కోట్లూ రోదసీ వ్యర్ధాల్లో కలిసిపోయేదన్న మాట. సరే… మన్మోహన్‌ సర్కారు ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసేసింది. ఫలితంగా మరో 375కోట్ల వ్యయానికి దేశం సిద్ధమైంది. దేశం చేసే ప్రతిష్టాత్మక ప్రయోగాల కోసం ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు. ప్రత్యేకించి… ఒక్కో రాష్ట్రమే లక్ష కోట్ల బడ్జెట్‌లు ప్రవేశపెట్టేసి… వాటిలో వేల కోట్లు కొట్టేస్తుంటే… ఈ ఐదొందల కోట్లతో వచ్చేదెంత, పోయేదెంత? ఎంతమాత్రం తప్పేం లేదు.

Mangal Yaan

కానీ… మంగళయాన్‌ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారు కొద్దిమంది ఉన్నారు. ప్రత్యేకించి… రోదసీ ప్రయోగాల రంగంలో విశేష ఖ్యాతి గడించిన వారు ఒకరిద్దరున్నారు. వాళ్ళేమన్నారో ఒక్కసారి చూద్దాం.

”ప్రతీ రాత్రీ డొక్కలోకి కాళ్ళు ముడుచుకుని పడుకునే 23కోట్ల మంది ప్రజలున్న దేశంలో… కనీస వైద్య సౌకర్యాలు, పరిశుభ్రమైన తాగునీరు, కనీస విసర్జన సౌకర్యాలూ లభించని దేశంలో… పేదవాడి ఆత్మగౌరవం పట్ల ఎలాంటి పట్టింపూ లేనితనాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోంది.” అన్నాడో పెద్దాయన. పేరు హర్ష మందేర్‌. మన దేశానికి ప్రస్తుతం మెదడూ, రక్తమూ, మాంసమూ, మజ్జా అన్నీ తనే అయిన సోనియా గాంధీ నాయకత్వంలోని నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌లో కొన్నాళ్ళ క్రితం వరకూ సభ్యుడు. సామాజిక కార్యకర్త. (ఎక్కడో ఏదో ఎర్రటి రంగు కనిపిస్తోంది… ఏమో) సరే.. దేశంలో ప్రతీ ప్రాజెక్టుకూ ఈ వాదనను అప్లై చేసి కబుర్లు చెప్పే జనాలకు ఈయన ప్రతినిథి అనుకుందాం.

”ఈ మిషన్‌ అత్యంత మతిమాలిన ప్రాజెక్ట్‌. (అట్టర్‌ నాన్‌సెన్స్‌). అంగారకుడి మీద జీవం అనేది లేనే లేదని నాసా (అమెరికన్ల ఇస్రో) ఏనాడో కచ్చితంగా తేల్చి చెప్పేసింది. ప్రజలను పిచ్చివాళ్ళను (fools) చేయడానికి, దేశాన్ని మోసం (fool) చేయడానికి ఒక పరిమితి అంటూ ఉండాలి.” — ఈ మాటలన్నది సైంటిఫిక్‌ కమ్యూనిటీకే చెందిన పెద్దమనిషి. డాక్టర్‌ మాధవన్‌ నాయర్‌. 2003 సెప్టెంబర్‌ నుంచి 2009 అక్టోబర్‌ వరకూ ఆరేళ్ళ పాటు ఇస్రో ఛైర్మన్. అంతేకాదు… యు.ఆర్‌.రావు తర్వాత కస్తూరి రంగన్‌ తర్వాత ఇస్రో పగ్గాలు అందుకున్నది ఆయనే. ఇప్పుడున్న ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ గారు మాధవన్‌ నాయర్‌ తర్వాతి వాడే.

”నేటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ ప్రయోగం కనుగొనగలిగిన కొత్త విషయాలు పెద్దగా ఏమీ లేవు. ఇప్పటికే పూర్తయిపోయిన ప్రయోగాలను ఇస్రో రిక్రియేట్‌ చేయాల్సిన పనిలేదు” — ఈమాట నాసాలో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్త అమితాభ ఘోష్‌ చెప్పినది. మంగళయాన్‌ ప్రాజెక్టు అవసరం పెద్దగా లేదంటూ ఓ వ్యాసమే రాశాడాయన. మాధవన్‌ నాయర్‌ చెప్పిన విషయాన్నే కొంచెం సాఫ్ట్‌గా చెప్పినట్టున్నాడీయన, ఎంతైనా ప్రస్తుతానికి ‘బైటి’ మనిషి కదా.

మంగళయాన్‌ ప్రయోగ ప్రారంభం విజయవంతమవడాన్ని ఒప్పుకోలేని, ఒప్పుకోక తప్పని చైనా… ఛాన్స్‌ దొరికింది కదా అని… ఇలాంటి విమర్శలను నొక్కి వక్కాణించింది. చైనా ప్రభుత్వపు అధికారిక ఇంగ్లీషు టాబ్లాయిడ్‌ గ్లోబల్ టైమ్స్‌ ఇలా రాసింది. ‘మూడో వంతు జనాభాకు విద్యుత్తు కూడా అందించలేని దేశం… కేవలం కొన్ని అంగారకుడి చిత్రాల కోసం మిలియన్ల డాలర్ల డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ… భారతదేశంలోనూ, విదేశాల్లోనూ విమర్శకులు మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ను విమర్శిస్తున్నారు.” చైనా ఇంతకు మించి గొప్పగా ఎలా రాయగలదు లెండి. అసలింత సాఫ్ట్‌గా రాయడమే అనూహ్యం.

సరే.. మనం మళ్ళీ బ్యాక్‌ టు బేసిక్స్‌… ఉడుపి రామచంద్రరావుగారు… అదే యు.ఆర్‌. రావు గారి దగ్గరకు వద్దాం.

మంగళయాన్‌ ప్రాజెక్టును విమర్శించింది ఇస్రో ఛైర్మన్ల పరంపరలోని మాధవన్‌ నాయర్‌, మరో ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ నాసాలోని భారతీయ శాస్త్రవేత్త అమితాభ ఘోష్‌. ఓ ప్రముఖ(సోనియా టీమ్‌లో కొన్నాళ్ళున్నాడు కదా…) సామాజిక కార్యకర్త హర్ష మందేర్‌. వారి వాదనల్లో దేన్నీ తప్పు అనడానికో… అదే సమయంలో ఇస్రోయే ఒప్పు అనడానికో… సగటు భారతీయుడికి అంత తెలివి లేదు. మరి రావుగారూ… మీ ఉరుములు ఏ మంగళం మీద పడుతున్నాయి?

దీపావళి టపాసుల కోసం 5వేల కోట్లు ఖర్చవుతోందా? ఏమో. అంత పెద్ద శాస్త్రవేత్త చెబుతున్న మాటలు తప్పని అనుకోలేం. ఐతే ఆ ఐదువేల కోట్లూ ఎక్కడికి పోతున్నాయి? శివకాశీలో టపాసులు తయారు చేసే సంస్థలకే కదా! అంటే అది టర్నోవరే తప్ప ఏకపక్షమైన నష్టం కాదు కదా. పైగా.. వంద కోట్ల జనాభా మీద స్ప్రెడ్‌ అయి ఉన్న మొత్తమే తప్ప ఏ ఒక్క ఖజానా మీదనో నేరుగా పడుతున్న వ్యయం కాదు కదా. నేను… నా ఆదాయంలో నుంచి… దేశానికి కట్టాల్సిన పన్నులు టీడీఎస్‌ రూపంలో ముందే కట్టేశాక… నా సొంత ఖర్చులు, అవసరాలు, విలాసాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కోసం దాచుకున్న డబ్బుల నుంచి… నాకు ఇష్టమైన టపాసులు కొనుక్కుని ఒక్క రాత్రి నా దేశపు ప్రజలందరితో కలిసి పండుగ చేసుకుంటే… దాన్ని మంగళయాన్‌ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చుతో పోల్చాల్సిన అవసరం ఏముంది…! మేమేమైనా మీ ప్రాజెక్టు గురించి పన్నెత్తు మాట అన్నామా? రావు గారూ… మమ్మల్నెందుకు ఇన్వాల్వ్‌ చేస్తున్నారు?

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ సహా ప్రపంచంలోని ప్రతీ చిన్న దేశానికీ మన దేశం లోకువ. మన దేశంలో… మెజారిటీ ప్రజలైన హిందువులంటే లోకువ. వాళ్ళ పండుగలంటే లోకువ. అవునయ్యా… నా పండుగ రోజు నేను బాణాసంచా కాల్చేస్తాను. ఒక రోజు రోజంతా దేశాన్ని పొగలో ముంచెత్తేస్తాను. (దీపావళి రోజు దేశంలో కాలుష్యం పెరిగిపోయిందంటూ జాతీయ ఛానెళ్ళు చేసిన గోల చూశారా?) అయితే ఏంటి? సో వాట్‌ బ్యాంబూ?

ప్రపంచంలో ఏ దేశమూ బాణాసంచా కాల్చదు మరి. అక్కడ పొగలు రావు మరి. దాంతో కాలుష్యం జరగదు మరి. ఓజోన్‌ పొరకి అతిపెద్ద రంధ్రం పొడిచిన సీఎఫ్‌సీలు నా దేశంలో దీపావళి రోజు విడుదలైనవా? అంటార్కిటికాలో మంచుకొండలను కరిగించేస్తున్న రేడియేషన్‌ నా దేశపు దీపావళి పొగల నుంచి వచ్చిందా? వీర కమ్నిస్టు దేశం చైనా నుంచి మహా పెట్టుబడిదారీ దేశం అమెరికా వరకూ అన్ని దేశాలూ ఏదో ఒక సందర్భంలో (దీపావళి రోజు ఇండియాలో కంటె ఎక్కువ) బాణాసంచాను తగలేస్తున్న సందర్భాలు ఏ ఒక్క రావుగారి కంటికీ కనిపించవెందుకో? డిసెంబర్‌ 31నాడు ఈ భూగోళం 360 డిగ్రీల్లోనూ జరిగే వేడుకలకు అయ్యే ఖర్చెంత? ఆనాడు తగలబడే బాణాసంచా వల్ల కలిగే కాలుష్యమెంత? అని ఎవరైనా అడగ్గలరా? అడుగుతారా? ఒక్క భారతదేశమే కాదు… వర్ధమాన దేశాలన్నీ కలిసి ప్రపంచ పర్యావరణానికి కలిగిస్తున్న నష్టం… ఒక్క అగ్రరాజ్యం కలిగించే నష్టంలో సగమైనా లేదు. అయినా ఎంతకీ దీపావళి కాలుష్యం మీదనే కన్ను. లెక్చర్లు. హితబోధలు. ఆగ్రహావేశాలు. హెచ్చరికలు. బెదిరింపులు. మరి దాన్ని నా ధర్మం మీద దాడి అని నేను ఎందుకు అనుకోకూడదు?

ప్రస్తుతం గురించే చూసుకుందాం. రావుగారి ఉరుము ఉరిమి నా మంగలం మీద ఎందుకు పడుతోంది? మీ పొలిటికల్‌ ఫిలాసఫీ ఏంటో నాకు తెలీదు కానీ… రావు గారూ… నా ధర్మాన్నీ, నా పండుగనూ ఎందుకు ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు?

‘నా పేరు ఖాన్ కాదు’

నేను ‘ఖాన్’ని కాను. నా పేరులో వేరే నాలుగు అక్షరాలున్నాయి. కె-ఎ-యు-ఎల్…. కౌల్. హిందువులు అని పిలవబడే కుటుంబంలో నేను పుట్టానని… భారతీయుల పేర్లను గురించి తెలిసిన వారికి ఇట్టే అర్ధమవుతుంది, కాబట్టి, మేం ఎదుర్కొనే అవమానాల గురించి, అపహాస్యాల గురించి, మా సొంతగడ్డ నుంచి దారుణంగా తరిమికొట్టబడినప్పుడు పడిన కష్టాల గురించీ ఓ సినిమా తీయడాని కేజే లాంటి స్నేహితుడు మాకు ఎప్పటికీ దొరకడని మాకు కచ్చితంగా తెలుసు. ఎందుకంటే మా కథలూ వెతల్లో ఫ్యాషన్ ఉండదు. ఒక ఖాన్‌ని స్నేహితుడుగా పొందడంలో…. ఓ అమెరికన్ భద్రతాసిబ్బంది బూట్లు తొలగించి, సాక్స్ చూపించమన్నపుడు ఆ ఖాన్‌పడిన కష్టాలనూ బాధలనూ అవమానాలనూ ఫ్యాషన్‌ఉంది. ఖాన్‌ అవమానపడడం, ఆగ్రహించడం చాలా సహజం, సమర్థనీయం. సినిమా తీయడానికి బోలెడంత మసాలా ఉంది దానిలో.

కానీ దురదృష్టవశాత్తూ నేను ‘కౌల్‌’ని. ‘ఖాన్‌’ని కాను.

నా చెల్లెళ్ళు, నా తల్లులు అత్యాచారాలకూ, హత్యలకూ గురైనప్పుడు…. తన తమ్ముణ్ణి, తల్లిని, తండ్రినీ ఒక ఖాన్‌చేతి కసాయి కత్తి కిరాతకంగా నరికి చంపిన ఘటనకు ఆరేళ్ళ సీమ ప్రత్యక్ష సాక్షిగా నిలిచినప్పుడు…. నా బాధ, ఆవేదన, ఆక్రోశం, కన్నీళ్ళను సినిమాగా తీయడానికి ఎవ్వరూ, ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.

కశ్మీరీ హిందువుల గురించి సినిమా తీయడానికి ఏ కేజే ముందుకు రాడు. ఎందుకంటే మేం ‘ఖాన్‌’లం కాము. మేం ‘కౌల్‌’లం.

ఒక ‘కౌల్‌’గా మమ్మల్ని మేం చూసుకున్నప్పుడు… పార్లమెంటులో నాయకులాడే ఘోరమైన చిందుల్నీ చూస్తాం. వారిలో కొందరు మా గురించి నిజంగానే పట్టించుకున్నారు. వారికి బంగళాలు, ఎకరాలకు ఎకరాల పచ్చటి పొలాలూ దక్కాయి. వారి చిత్రపటాలను తెలివితక్కువ దేశభక్తులు ఇళ్ళలో పెట్టుకుని పూజిస్తుంటారు.

వాళ్ళు బడుల్లోనూ కాలేజీల్లోనూ మాకు రిజర్వేషన్లు ఇచ్చారు…. వేరే వేరే రాష్ట్రాల్లో. కానీ మమ్మల్ని మా ఇళ్ళకు పంపించడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. వాళ్ళకు ‘పొరుగునున్న జిహాదీలను ప్రేమించడం’ వంటి వేరే ప్రాధాన్యాలున్నాయి. ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళు మెత్తబడుతూ ఉంటారు. మాకు ప్రవచనాలిస్తూ ఉంటారు. పూర్వీకులు ప్రవచించిన, గ్రంథాల్లో చెప్పిన నైతిక విలువలను అనుసరించాలనీ, సరళంగా జీవించాలనీ…. సలహాలిస్తూంటారు.

వాళ్ళు నాతో రకరకాల ఆటలు ఆడుతూంటారు. ఎందుకంటే నా పేరు కౌల్… ఖాన్ కాదు. ఆ సినిమా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఉగ్రవాదం చెడ్డదనీ, అది కూడా శాంతిని ప్రబోధించాల్సిన మతం పేరిట వ్యాపిస్తుంటే మరింత దుర్మార్గమవుతుందనీ ఆ సినిమాలో కనీసం సంకేతప్రాయంగానైనా చెప్పలేదు. దాన్ని అనుసరించే వారందరికీ, ఇతర జీవరాశులన్నిటికీ శాంతి కలుగుగాక. ఇంతకీ మీ సినిమా…. మరో 9/11జరక్కుండా నిరోధించడం కోసం నిర్ణయించుకున్న విదేశీ పోలీసులు మీ బూట్లు విప్పించడం వల్ల మీకు కలిగిన అవమానం మీదనే కదా. మీ అమాయకత్వాన్ని నిరూపించుకోవాలన్న కోరికే కదా.

కానీ… సొంత ఇంటినీ, దేశాన్నీ ప్రపంచాన్నీ, బంధువులనీ, భార్యా పిల్లలనీ, తల్లిదండ్రులనీ వదిలేయాల్సిన వారి అవమానం మాటేమిటి? పరమ చెత్త గుడారాల్లో నివసించక తప్పని వారి పరిస్థితి ఏంటి? తమ కష్టాల గురించి నోటికొచ్చినట్టు వదరుతూ చేతికందినంత దండుకునే రాజకీయ నాయకుల దయ మీద ఆధారపడాల్సిన దుర్గతిలో ఉన్నవారి కథేంటి? ఒక్కసారిగా ఎదిగిపోయిన కూతుళ్ళకు తమ మానాన్ని దాచుకోడానికి తగిన చోటే చూపలేని నిర్భాగ్యుల సంగతేంటి?

దోడాలో తన తల్లితండ్రులనూ, సోదరుణ్ణీ ఒక కసాయి కత్తి నరికేస్తుంటే కళ్ళారా చూసిన ఐదేళ్ళ చిన్నారి సీమా వెన్ను జలదరించేలా చెబుతున్న ఆ కథని ఉద్వేగభరితమైన సినిమాగా తీయడానికి ఏ ఒక్క కేజే కూడా ముందుకు రాడు. ఎందుకంటే ఆమె తండ్రి ‘మిస్టర్ ఖాన్’ కాడు. అతను కేవలం ఒక ‘కౌల్‌’ మాత్రమే.

మిస్టర్ కౌల్… ఇంకా అలాంటి పేరున్న ఎవరైనా సరే… సారీ బాస్… మీకు నేను ఏం సాయపడలేను.

‘కౌల్స్’కి కనీసం మాటసాయం చేయడంలో ఫ్యాషన్ ఏమీ లేదు. రైనాలు ఐనా అంతే… భట్‌లు ఐనా అంతే. ఒక్క ముక్కలో కేపీలు ఎవరి సంగతైనా అంతే. అదే… కశ్మీరీ పండిట్స్. అదొక మతతత్వ వాదుల గుంపు. ఖాన్‌లపై తప్పుడు ఆరోపణలు చేయడం కోసమే తమ సొంత ఇళ్ళను వదిలిపెట్టి పోవాలన్న జగ్‌మోహన్‌ప్లాన్లను అమలు చేస్తున్న ఏజెంట్లు. నిజానికి…. (కశ్మీర్)లోయలోని తమ ప్రియతమ ఖాన్‌సోదరులను బదనాం చేయడానికి తమంత తామే ప్రవాసానికి పోవడమనే కుట్రని ‘కేపీ’లు ఎలా అమలు చేస్తున్నారో ఓ మాంఛి సినిమా తీయవచ్చు.

ఈ ‘కౌల్‌’లకు ఇచ్చిన వాగ్దానాల గురించి మాట్లాడడం పాపం. ప్రధానమంత్రో, రాష్ట్రపతో ఇచ్చే పార్టీలు ఆహ్వానాలు పొందడానికి సరైన పని ఒక్కటే… ”హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్… అయామ్ మిస్టర్ ఖాన్” అని….ఇంటిపైకప్పు ఎక్కి గట్టిగా అరవడమే సరి.

ఈ దేశం చూపించే అతిపెద్ద జాతి వివక్ష ఒక్కటే… కౌల్స్‌గురించి ఏడ్చేవారిని, అయోధ్య రంగులు ధరించేవారిని, ఈ దేశపు నాగరిక సంస్కృతి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రేమించేవారిని, నేటికీ హిందుస్తాన్ అని పిలిచే ఈ దేశంలోని హిందువుల గురించి బలంగా మాట్లాడే వారిని, కౌల్స్‌లాగ ఆత్మగౌరవంతో జీవించడం కోసం పోరాడుతుండే వారిని పట్టించుకోకపోడం. వారిని ప్రవాసంలోకి పంపేశారు. ఈ దేశంలో కౌల్స్‌ని ఒకే ఒక్క పనికి, ఒకే ఒక్క ప్రదేశానికి అనుమతిస్తారు. జంతర్ మంతర్‌దగ్గర అరవడం, ఏడవడం, అలిసిపోయే వరకూ ప్రదర్శన చేయడం, తర్వాత తమ గుడారాలకు వెళ్ళడం. మిస్టర్ కౌల్‌…. నువ్వొక తప్పుడు పేరు సంపాదించుకున్నావు.

నీకొక ఖాన్‌పేరుండాలి.. నువ్వొక సునీతనో ప్రణీతనో కోమల్‌నో కామినినో ప్రేమించాలి. చాలు.. నీ కథని అజరామరం చేయడానికి, పూలతోటల్లో నీ ప్రేమగాధల్ని చిత్రించడానికి డజన్ల కొద్దీ కేజేలు ఎగురుకుంటూ వస్తారు. ఆ… అన్నట్టు నిన్ను ఇష్టపడుతూ ఓ మందిర కూడా ఉంటుంది. అప్పుడు కథ మరింత బాగా పండుతుంది.

ఇంక నీ సినిమా కథకి ఆటిజం లాంటి జబ్బు వెన్నుదన్నుగా నిలుస్తుంది.

నేను చాలా చాలా ఏడ్చాను. ఒక కొడుక్కి తండ్రిగా, ఒక భారతీయుడిగా కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆటిజంతో బాధ పడే కొడుకు, పాశ్చాత్య ప్రపంచంతో అతని సంబంధాలు, హిందువో-ముస్లిమో లేక మతం మారిన క్రిస్టియనో అని పట్టించుకోకుండా కేవలం హృదయాన్నే అనుసరించే ఓ అందమైన యువతితో అతని ప్రేమాయణం… అన్నీ చూసి బాధ పడ్డాను. అంతే తప్ప… ‘నన్ను నేను ఇస్లాంకు రాయబారినేమో అనుకుంటాను’ అనే షారుఖ్‌ని చూసి కాదు. షారుఖ్‌ను షారుఖ్‌గానే చూస్తాను. అంతే తప్ప ఇస్లాంకు రాయబారిగా కాదు. అదే నిజమైతే అతను దేవబంద్‌లో ఓ చోట ఉండిపోయేవాడు. అప్పుడది సరిపోయేది. కానీ అతను ప్రముఖ స్టార్, కొన్ని కోట్లమంది హృదయాలను గెలుచుకున్న వాడు. దానికి కారణం… అతను గొప్ప నటుడు కావడమే. అతను కేవలం ముస్లిములకే కాదు… భారతీయులందరికీ ఋణపడి ఉన్నాడు. మనం అతన్ని ప్రేమిస్తున్నది అతనొక ఖాన్‌కాబట్టి కాదు. అతను మన కలలు, ఆకాంక్షలు, ఆవేదనలు, బాధలు, మన దైనందిన జీవితంలో ఎత్తుపల్లాలు అన్నిటికీ వెండితెర మీద రూపమిస్తున్నాడు కాబట్టి అభిమానిస్తున్నాం. ఒక భారతీయుడిగా, మనలో ఒకడిగా ప్రేమిస్తున్నాం.

మనం పంచుతున్న అభిమానాన్నీ, ప్రేమనీ షారుఖ్…. ఇస్లాం రాయబారిగా తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోడానికి ఉపయోగించుకోవాలనుకుంటే, హిందువుల రాయబారిగా పెట్టుకోడానికి మరొకరిని వెతుక్కోవాలా? కనీసం నావరకూ అది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే… ఖాన్‌, కౌల్‌, సింగ్, విక్టర్‌ఎవరినైనా నేను నమ్ముతాను. భారత్‌కు ప్రాతినిధ్యం చేసే వారందరూ మనందరికీ ప్రతినిధులే…. హిందువులతో సహా. నా రాయబారం త్రివర్ణ పతాకంతోనే తప్ప మరింక దేనితోనూ కాదు… ఎందుకంటే నా రాముణ్ణీ, నా ధర్మాన్నీ దానిలోనే చూసుకుంటాను. నాకు తెలిసినంత వరకూ అమితాబ్ బచన్‌లేదా హృతిక్ రోషన్‌ఎప్పుడూ షారుఖ్‌చెప్పినట్టు ఆలోచించరు. అయితే… తమ స్వస్థలం నుంచి కౌల్స్‌ఎందుకు తరిమివేయబడ్డారన్న అంశం మీద…. ఈ పెద్ద, విజయవంతమైన, హిందూ పేర్లు కలిగిన భారతీయులు సినిమా ఎందుకు తియ్యరు? అసలు గోద్రా ఘటన జరగడానికి కారణమేంటి? హిందువులపై విరుచుకుపడడానికి ప్రతీ ముస్లిం ఫిర్యాదిదారూ హిందూ అడ్వొకేట్లనే ఎంచుకుంటే… సొంతింటి నుంచి తరిమేయబడిన, నరికి పోగులు పెట్టబడిన, నామమాత్రపు సంఖ్యకి కుదించేయబడిన కౌల్స్‌గురించి నోరెత్తడానికి ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా ముందుకు రారేం?

ఒక ఖాన్‌ మృతదేహం రైల్వేట్రాక్‌ మీద దొరికితే మొత్తం దేశం అట్టుడికిపోతుంది. అలా దొరికిన వ్యక్తి, రిజ్వాన్‌ కూడా. బహుశా… మన మిస్టర్ ఖాన్‌ సినిమాలో పేరు రిజ్వాన్ కావడం కాకతాళీయమేమో. రిజ్వాన్‌ మృతికి ఓ పోలీస్‌ కమిషనర్‌కి శిక్ష పడింది. పత్రికల్లో యుద్ధ ప్రాతిపదికన ముఖచిత్ర కథనాలూ వచ్చాయి. ఐతే…. శ్రీనగర్‌లో ఒక శర్మ లేదా కౌల్‌ ఒక అమీనా యూసుఫ్‌ని ప్రేమిస్తే అతని శవం ఏదో ఒక పోలీస్‌ ఠాణాలో తేలుతుంది. తప్పుడు కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోయినందుకు కనీసం ఒక్క కానిస్టేబుల్ వివరణ కూడా అడగరు. అంతేనా.. స్థానికంగా ఉండే ఛోటామోటా పత్రికలో కనీసం ఒక సింగిల్ కాలమ్ వార్త కూడా రాదు. ఎందుకంటే ఠాణాలో చనిపోయిన ప్రేమికుడు మిస్టర్ ఖాన్‌ కాడు.

‘నా పేరు కౌల్‌. ఖాన్‌ల ఉగ్రవాద బాధితుడిని’ అంటూ సినిమా తీయడానికి ఏ కేజే ముందుకు రాడు.

ఒక భారతీయుడిగా నా ఉనికిని నాకు వెనక్కివ్వు మిస్టర్ ఖాన్. అప్పుడు ఆటిజంతో బాధ పడుతున్న ఓ కొడుకు సున్నితమైన ప్రేమను ప్రశంసించడానికి నాకు ఏ అభ్యంతరమూ ఉండదు. అంతేకాదు… నీ పేరు పెట్టుకోడానికి కూడా నాకు ఏ సమస్యా ఉండదు.

(అమెరికా పత్రిక కోసం షారుఖ్ వ్యాసం – దానికి వచ్చిన స్పందనలూ… ఆ తర్వాత విశ్వరూపం వివాదం నేపథ్యంలో… ….. చాన్నాళ్ళ క్రితం టైమ్సాఫ్ ఇండియాలో తరుణ్ విజయ్ రాసిన వ్యాసానికిది యథాతథ అనువాదం)

(తరుణ్ విజయ్‌ ఆరెస్సెస్‌లోనూ, బీజేపీలోనూ పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తి. ఈ వివరం చెప్పడం… ఆయన రాసిన ఈ వ్యాసానికి స్పష్టమైన రాజకీయ నేపథ్యం ఉందని గుర్తు చేయడానికి మాత్రమే)

Previous Older Entries

%d bloggers like this: