శాస్త్రవేత్త కొలత

భౌతికశాస్త్రంలో నోబెల్ విజేత, రాయల్ అకాడెమీ అధ్యక్షుడిగా పని చేసిన సర్ ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్ ఒకసారి నిజంగా జరిగిన ఓ కథ చెప్పారు.

కొన్నాళ్ళ క్రితం నాకొక సహోద్యోగి నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఓ చిత్రమైన సమస్యలో ఇరుక్కున్నాడు. ఒక ప్రశ్నకి ఒక విద్యార్ధి రాసిన జవాబుకు ఆయన సున్నా మార్కులు ఇద్దామనుకుంటున్నాడు. అదే సమయంలో ఆ విద్యార్ధి తన జవాబుకు పూర్తి మార్కులు ఇచ్చి తీరాల్సిందేనని భావిస్తున్నాడు. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. తటస్థంగా వ్యవహరించే మూడో వ్యక్తితో ఆ ప్రశ్నకు మార్కులు ఇప్పించాలన్నదే ఆ ఒప్పందం. వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు.

ముందుగా నేను ప్రశ్నాపత్రం చూశాను. ‘‘ఒక పొడవైన భవనం ఎత్తును భారమితి సహాయంతో కొలవడం ఎలా?’’ దానికి ఆ విద్యార్థి ఇలా జవాబిచ్చాడు. ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. దానికి ఓ పొడవాటి తాడు కట్టాలి. దాన్ని రోడ్డు మీద వరకూ వదలాలి. ఆ తర్వాత తాడును పైకి లాగాలి. దాని పొడవు కొలవాలి. ఆ తాడు పొడవు భవనం పొడవుకు సమానం.’’

ఆ విద్యార్ధి జవాబులో తప్పేమీ లేదు. అతను పూర్తిగా వివరించాడు, సరైన సమాధానం ఇచ్చాడు. కాబట్టి అతనికి పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. కానీ సమస్యేంటంటే… పూర్తి మార్కులు ఇచ్చేస్తే అతనికి ఫిజిక్స్ లో మంచి గ్రేడ్ వస్తుంది, అంటే భౌతికశాస్త్రంలో అతను సమర్ధుడు అని నిర్ధారించినట్టవుతుంది. కానీ అతని జవాబు అలాంటి నిర్ధారణకు అవకాశం ఇవ్వడం లేదు. దాంతో నేను ఆ విద్యార్ధికి ఒక సలహా ఇచ్చాను. అదే ప్రశ్నకు మరొకసారి భౌతికశాస్త్రం ప్రకారం జవాబు ఇవ్వాలని హెచ్చరించాను. దానికి ఆరు నిమిషాల వ్యవధి ఇచ్చాను.

ఐదు నిమిషాలు గడిచిపోయాయి, కానీ అతను ఏమీ రాయలేదు. దాంతో ఈ పరీక్షను వదిలేసుకుంటున్నావా అని అతన్ని అడిగాను. దానికి అతని జవాబు నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ సమస్యకు అతని దగ్గర చాలా జవాబులు ఉన్నాయట. వాటిలో ఏది అత్యుత్తమమైన జవాబు కాగలదో ఆలోచిస్తున్నాను అని చెప్పాడా విద్యార్ధి. అతని సమయం వృధా చేసినందుకు క్షమాపణలు కోరాను. మిగిలిన ఒక్క నిమిషంలోనూ జవాబు రాయమని అతనికి చెప్పాను.

మరునిమిషంలోనే అతను తన ఆన్సర్ షీట్ ఇచ్చేశాడు. అందులో ఇలా రాసివుంది ‘‘భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. భవనం పై అంచు దగ్గర వంగి నిలబడండి. భారమితిని పైనుంచి వదిలేయండి. అది కిందకు పడడానికి పడిన సమయాన్ని స్టాప్ వాచ్ తో కొలవండి.

అప్పుడు x = 0.5 X aXt^2 అనే సూత్రం ఆధారంగా భవనం ఎత్తును కొలవవచ్చు’’ అని చెప్పాడు.

ఆ సమయంలో నేను నా మిత్రుణ్ణి పిలిచాను. విద్యార్ధికి మార్కులు ఇస్తావా అని అడిగాను. సరే అంటూ అతను ఆ విద్యార్ధికి పూర్తి మార్కులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. నేను అక్కడినుంచి వెళ్ళిపోడానికి సిద్ధపడుతున్నాను. ఆ సమయంలో అదే ప్రశ్నకు మరిన్ని జవాబులున్నాయని అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవేంటో చెప్పమని అతన్ని అడిగాను.

‘‘ఒక భవనం ఎత్తును భారమితితో కొలవాలంటే చాలా పద్ధతులున్నాయి. మచ్చుకి, ఎండగా ఉన్న ఒకానొక రోజు భవనం దగ్గరకు భారమితి తీసుకువెళ్ళాలి. భారమితి నీడ పొడవు కొలవాలి. అలాగే భవనం నీడ పొడవు కొలవాలి. ఆ రెండింటి నిష్పత్తిని బట్టి భవనం ఎత్తు కనుక్కోవచ్చు.’’

‘‘బావుంది. మరి మిగతా పద్ధతులేంటి?’’

‘‘మీకు నచ్చే అత్యంత మౌలికమైన పద్ధతి ఒకటుంది. ఆ పద్ధతిలో… మీరు భారమితిని చేతిలో పట్టుకుని మెట్లు ఎక్కండి. పైకి ఎక్కేకొద్దీ గోడ వెంబడి భారమితి పొడవు దగ్గర గుర్తులు పెట్టుకుంటూ పైదాకా వెళ్ళండి. పూర్తిగా పైదాకా ఎక్కేయండి. భారమితి గుర్తులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టండి. ఆ సంఖ్యతో భారమితి పొడవును గుణించండి. భవనం ఎత్తు ఎంతో తెలిసిపోతుంది.’’

‘‘మరీ ప్రత్యక్ష పద్ధతి.’’

‘‘నిజమే. మీకు మరింత నాజూకైన పద్ధతి కావాలంటే… భారమితిని ఒక తాడు చివర కట్టండి. దాన్ని పెండ్యులంలా ఊపండి. ఆ పద్ధతిలో భవనం మొదలు దగ్గరా, భవనం చివరా గురుత్వాకర్షణ శక్తి ‘g’ విలువ లెక్కకట్టండి. ఆ రెండు విలువల మధ్య తేడాను బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

ఈ ప్రయోగాన్నే కొద్దిగా మార్చి మరోలా చేయవచ్చు. భారమితిని భవనం పైకి తీసుకువెళ్ళాలి. పొడవాటి తాడుకు దాన్ని తగిలించాలి. అప్పుడు దాన్ని భవనం కింద వరకూ వేలాడదీసి, పెండ్యులంలా ఊపాలి. అప్పుడు అప్పుడు ప్రెసిషన్ పిరియడ్ బట్టి భవనం ఎత్తును గణించవచ్చు.’’

‘‘చెప్పాలంటే ఇలా చాలా పద్ధతులున్నాయి.’’ అన్నాడా యువకుడు. ‘‘బహుశా, వాటన్నిటిలో ఉత్తమమైనది ఇలా ఉండవచ్చు. భారమితిని తీసుకుని భవనం బేస్మెంట్ లో ఉన్న సూపరింటెండెంట్ ఇంటికి నేరుగా వెళ్ళాలి. ఆయన తలుపు తీశాక ‘సూపరింటెండెంట్ గారూ, నా దగ్గరో మంచి విలువైన భారమితి ఉంది. ఈ భవనం ఎత్తు ఎంతో చెప్పారంటే దీన్ని మీకు ఇచ్చేస్తాను’ అని ఆయనకు చెప్పవచ్చు.’’

ఆ దశకు వచ్చేసరికి అసలు ఆ అబ్బాయికి ఆ ప్రశ్నకు సాధారణ సంప్రదాయిక పద్ధతిలో జవాబు తెలుసా అని అడిగాను. తనకు తెలుసని చెప్పాడా అబ్బాయి. అయితే హైస్కూల్ లోనూ, కాలేజీ లోనూ ఉపాధ్యాయులు అతనికి ఆలోచించడం పదేపదే చెబుతూనే ఉండడం తనను పూర్తిగా విసిగించేసిందని చెప్పాడతను.

ఆ విద్యార్ధి పేరు ‘‘నీల్స్ బోర్’’. అతను 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కార విజేత.

స్వేచ్ఛా మానస స్వాతంత్ర్యం

చర్ఖా మీద చేత్తో నేసిన పత్తి నుంచి నేను 1947లో పుట్టాను. ధైర్యం, శాంతి, జన్మభూమి అనే మూడు వన్నెలు అద్దుకున్నాను. నేను స్వాతంత్ర్యానికి ప్రతీకను.

నేను ఎవరిని? ఎక్కణ్ణుంచి వచ్చాను? అన్న విషయాలు ప్రజలు మరచిపోయారా? ఏదో ఒకరాత్రి నేను అకస్మాత్తుగా పుట్టుకొచ్చేసానని భావిస్తున్నారా.. అని కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.

నా పుట్టుకకు కారణం మహా పోరాట రూపంలోని ఓ సుదీర్ఘ ప్రయాణం. నాకు జన్మనిచ్చిన ఆ యుద్ధం విదేశీయుల ఆధిక్యం, అణచివేత మీద జరిగిన పోరాటం. అధికారులు, సంఘసంస్కర్తలు, మహావీరులు, గొప్ప నాయకులు చేసిన పోరాటం.. ఎలుగెత్తి మాటాడాడానికి సామాన్యుడు చేసిన పోరాటం.

స్వాతంత్ర్యం నా జన్మహక్కు. స్వాతంత్ర్యం రాత్రికి రాత్రి వికసించే పుష్పం కాదు. భూగర్భంలో లావా కుతకుతా ఉడికి అగ్నిప్రవాహమై పొంగిపొంగి పొర్లిపొర్లి నదీతరంగాలుగా వెల్లువెత్తి ఉవ్వెత్తున ఎగసిపడి ఆవేశ ప్రవాహం కొండకొమ్ములుగా పేరుకుని శతాబ్దాల కాలగమనంలో ఉద్రేకం చల్లబడి ఘనీభవించి స్థిరమైన ఆకృతి దాల్చి ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి క్రమక్షయం చెంది నిలిచిన మహాపర్వతం స్వాతంత్ర్యం.

స్వాతంత్ర్యం మీరు మలచుకోగల మార్పు. దాన్ని ఎలా సృజించుకోవాలన్నది మీ నిర్ణయం. స్వాతంత్ర్యం అంటే ఎంపిక. దేన్ని సృష్టించాలన్న ఎంపిక. స్వాతంత్ర్యం అంటే మీరు తీసుకోవలసిన నిర్ణయం. స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణ సత్యం.

తరగతి గదిలో కూర్చుని ప్రశ్న తర్వాత ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతుండే చిన్నారే స్వాతంత్ర్యం. నాకు జవాబు తెలీదు అని చెప్పడానికి భయపడే గురువే స్వాతంత్ర్యం. సరైన పదం కోసం వెతుకుతున్న రచయితే స్వాతంత్ర్యం, కచ్చితమైన వన్నె కోసం వెతుకుతున్న చిత్రకారుడే స్వాతంత్ర్యం. అది సత్యాశ్రయం.

tricolor

స్వాతంత్ర్యం అంటే ఆకాంక్షించడం. ఓ పల్లెటూరి కుర్రాడు తన ఇంటి పెరట్లో నుంచి హెలికాప్టర్‌ షాట్ కొడుతూ రాబోయే తరపు గొప్ప క్రికెటర్‌ కావాలని కోరుకునే ఆకాంక్ష. వారణాసిలో వీధుల్లో వీడియోలు చూస్తూ భవిష్యత్తరాలకు దిగ్దర్శకుడు కావాలని కలలుగనే ఆకాంక్ష. ఒక వైద్యుడు భూకంపంతో దద్దరిల్లిన పొరుగుదేశానికి వెళ్ళి తల్లడిల్లిన హృదయాలకు సాంత్వన కలిగించడం కోసం వైద్యవృత్తికి ఓ యువకుడు రాజీనామా చేయడమే స్వాతంత్ర్యం.

పితృస్వామ్య సమాజంలో పెరిగిన ఓ కాలేజీ కుర్రాడు అత్యాచార బాధితురాలికి న్యాయం కావాలని కోరుతూ మౌనంగా పట్టుకున్న దివ్వే స్వాతంత్ర్యం. ఓ అత్యాచార బాధితురాలు తనపై పడిన కళంకం మీద ఉమిసిన ధైర్యమే స్వాతంత్ర్యం. ఆ కళంకాన్ని ప్రశ్నించేది ఒక చిన్న చుంబన పూరిత ప్రేమ. అది అన్ని ప్రతికూలతలపైనా పోరాడే రెండు భిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ. అది అన్ని ప్రతికూలతలపైనా పోరాడే ఒకే రకమైన దేహాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ. ప్రేమంటే కొన్నిసార్లు ఓటమిని ఒప్పుకోవడం కావచ్చు, కానీ ఎప్పుడూ వదిలిపెట్టడం కానిది. మీ ఆకాంక్షలకు ప్రతీకగా నన్ను ఎంచుకున్నది మీరు చూసే ఆ ప్రేమే.

జులపాల జుట్టు పెంచుకుని డెనిమ్‌ దుస్తులు ధరించి నిరంతరం దమ్ముకొడుతూ శాంతి గురించీ నక్షత్రాల గురించీ కవిత్వం అల్లడమా… లేక ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఇంట్లో ఇడ్లీలు తయారుచేసి బైటకొచ్చి గురుగ్రహం మీదకి ఆర్బిటర్‌ని పంపించడమా… ఎంపిక మీదే. స్వేచ్ఛామానసం చేతనా స్థితి మరి. దాని పరిమితులు మీ పరికల్పనలు. మీ మనోవిహారమే దాని అనంతత్వం. మీ చుట్టూ చూస్తే కనిపించేది కాదు స్వేచ్ఛా మానసం. అది అంతరంగ గవేషణం. మీకెంత వస్తుందని అడిగితే ఎవరో ఇచ్చేది కాదది… స్వయంగా స్వీకరించి స్వీయానుగుణంగా మలచుకునేది.

ఆ స్వేచ్ఛా మానసమే స్వాతంత్ర్యం. ఎందుకంటే…. చివరికి ఏది ఎలాగున్నా భారత్‌ అనేది కేవలం ఒక దేశం మాత్రమే. కొన్ని గీతల సరిహద్దుల మధ్యనున్న మట్టి. నేను కేవలం ఓ గుడ్డపీలికని మాత్రమే. మేము మీ ఆలోచనలకు, ఉద్వేగాలకు ప్రతిబింబాలం మాత్రమే. మేం ఎవరమో కాదు.. మీరే. వినువీధుల్లో ఎగురుతూ కనిపించేది మేం. కానీ నిజానికి ఆకాశాన్ని అందుకునేది మీరే. దానికి ప్రయత్నించాల్సింది మీరే. పరతంత్రపుటర్ధరాత్రి చిమ్మచీకట్ల నుంచి వేకువ దిశగా మేల్కొనవలసింది మీరే.

(స్వకీయం కాదు… యూట్యూబ్‌లో కనిపించిన ఓ నృత్యరూపకానికి అక్షర రూపం.)

అదసలు జీవితమే కాదు కదా….

నీవు లేని జీవితం గురించి
ఏ ఆలోచనా లేదు, సణుగుళ్ళూ గొణుగుళ్ళూ లేవు
నీవు లేకుండా కూడా బతుకు సాగిపోతోంది
కానీ… అదసలు జీవితమే కాదే….

suchitra

బహుశా ఇలా జరిగుండాల్సింది
నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మహలుకు చేరాల్సింది
ఎక్కడో సుదూరంగా ఉన్న భవనమది
కానీ నువ్వు తోడుగా ఉంటే బాగుండేది
భవంతులకు లోటే లేదు, కానీ నువ్వే….

గుండెలో పురుగు తొలుస్తూంటుంది
ఆ ఒత్తిళ్ళలో తల దించుకుని మేం ఏడుస్తూనే ఉంటాం…
కన్నీళ్ళు కారుస్తూ ఉండిపోతాం
నీ నీలాల కన్నులు మాత్రం చెమ్మగిల్లలేదు కదా..
నీవు లేని జీవితం…

నువ్వేదో చెబుతూ ఉంటావు
ఈ రాత్రి చందమామ ఇక నిశిలోకి జారుకోదు
నీ పలుకులు జాలువారుతుంటే రేయి నిలిచిపోవాలి
అంత కంటె ఈ జీవితానికి ఇంకేం కావాలి
కానీ నువ్వే…

(ఆంధీ సుచిత్ర ఇక లేదు.. మరి ఎలా….)

నీవు లేవు… నీ పాట లేదు…

స్వరాలు పలకడమే లేదు…
ఏ లొల్లాయి పాట పాడాలి నేను…
సరిగమలే లేని జీవితం…
ఆకాశంలా శూన్యమే కదా…

అక్కడా ఇక్కడా నాపై అలిగితే ఎలా
నీవు లేక నా పాట అబద్ధమైపోతే ఎలా

నా జీవితం దగ్ధమైపోతోంది
ఈ రేయి గడిచి పొద్దు పొడిచే దారే లేదే

సంగీతం మనసుకు రెక్కలనిస్తోంది
స్వర రాగ గంగ ప్రవహిస్తోంది
స్వర సాధనే ఈశ్వరోపాసన కదా

Manna Dey

సుర్‌ నా సజే.. క్యా గావూ( మై…
అంటూ బసంత్‌ బహార్‌ కోసం మన్నాడే అల్లల్లాడిపోయిన పాట
ఇప్పుడు మన్నా కోసం మనమూ అంతే కదా…

జిందగీ కైసీ హై పహేలీ… మళ్ళీ మన్నాడేనే.

జిందగీ కైసీ హై పహేలీ…

ఎంత విచిత్రమైనదీ జీవిత ప్రహేళిక
నవ్వులాటకీ కన్నీటి పాటకీ చోటొకటేనట

మనసుకి ఒకోసారి నిజమెంతకీ స్ఫురించదే
కలల ఎండమావుల వెనుకనే పరుగు తీస్తుంటుందే
ఆ కలల దారిన ఓ బాటసారి ఒకోసారి
వాటినే దాటి పోతాడు, ఎక్కడికో మరి

ఇక్కడింత అందంగా సర్దిపెట్టినదెవరో
సుఖదు:ఖాల జమిలి పడవలెక్కినదెవరో
మౌనంగా ఉండిపోయినదెందుకో
ఒంటరిగా పయనమైపోయినదెచటికో

(గుల్జార్ పదాలకు సలీల్‌ చౌధురి స్వరాలు సమకూర్చిన గీతం)
(మన్నాడే పెదాలకు రాజేష్ ఖన్నా నటించిన ఆనంద్‌ చిత్రం)

యశ్… ఎంత ప్రేమ నీకు

ఉన్నట్టుండి నాకో విషయం అవగతమవుతుంది
నువ్వు పుట్టింది నాకోసమే అని అర్ధమవుతుంది
ఏ తారాలోకాల్లోనో ఉండే నిన్ను ఈ భూమ్మీదకు
ఆ దేవుడు నా కోసమే పంపించిన సంగతి తెలుస్తుంది

నీ మేని మెరుపులు, నీ చూపుల తూపులు నా కోసమేనా
ఒత్తరి మెత్తని నీలాల నీ కురుల నీడలు నా సొంతమేనా
విడీ విడని నీ పెదాలు, చుట్టుకుని వదలని నీ చేతులూ నావే కదా

దూరాన్నుంచి సన్నగా షెహనాయి పాట వినిపిస్తూంటుంది
నీ మోముపై మేలిముసుగు మెలమెల్లగా జారిపోతూంటుంది
తొలిరేయి నునుసిగ్గు తెరల కౌగిలిలో నీవొదిగిపోతూంటావు
ఆ స్వప్న సౌకుమార్యం నా గుండెల్లో నిలిచిపోతుంది

ఈ జీవితమంతా నువ్వు నన్నే ప్రేమిస్తావు కదూ
ఆరాధన నిండిన సోగ కళ్ళతో నన్నే చూస్తావు కదూ
అలా కొత్తగా ఊరకనే నన్ను చూస్తూనే ఉంటావు కదూ
ఉన్నట్టుండి నీ ప్రేమ నాకు అలా అలా గుర్తొస్తూనే ఉంటుంది


(ప్రణయ హృదయాలను మండించేసిన సాహిర్ లూధియాన్వీ కభీ కభీ గీతానికి పేలవపు టనుకృతి)

తు ముఝే భులా న పావోగే….

నా గాలిపాట విన్నపుడల్లా
కూనిరాగాలు తీస్తుంటావు
నన్నెలా మరువగలవు నీవు

ఆనాటి మన ఊసులెన్నో, ఒక్కటీ గుర్తులేదనకు
కొంచెం కనికరించు, ఒకట్రెండు ముత్యాలు రాల్చు
ఈ గుండె నీది, జవదాటను నీ మాటను

నా మౌన ప్రణయ రాగాలు అర్ధమయేది నీకే
ఈ జీవితం గడచిపోయినది నీ గురుతుల్లోనే
కరిగిపోతున్నా నీ తలపుల్లోనే, ఇంకెంత వేధించినా

నా ఎద గదిలో దాగినదంతా నీపై ప్రేమే
నా జీవితం గురించి ఆలోచనైనా లేనేలేదే
ఆ దారిలో నీకై వేచినదెవరో తెలియులే

నా గాలిపాట విన్నపుడల్లా
కూనిరాగాలు తీస్తుంటావు
నన్నెలా మరువగలవు నీవు

( శంకర్ జైకిషన్ స్వరాల సాయంతో లత గానించిన హస్రత్ జైపురి అలతి అలతి పదాలకు నా వికృతి )

చౌధ్‌వీ కా చాంద్ హో…

అందగించిన చందమామవో అరుణారుణ ఇనబింబానివో
మరి నీవెవరివో ఏమో… నీకు సాటి ఇల లేదేమో

ఆ బుజాల మీద దిగిన కరిమబ్బులు నీ కురులు
లేలేత మదిర నిండిన పానపాత్రలు నీ కనులు
నిండుప్రేమతో పండినవి నీ నీలి నేత్రాలు

కొలనులో అరవిరిసిన అరవిందమో నీ మోము
జీవన వీణ మంద్రపు తీవెలపై మీటిన పదమో
విరిసిన వసంతమో ఆ మోము ఏ కవి స్వప్నమో

ఎరుపెక్కిన పెదాలపై వెలిగె లేత నగవులు
నీ పదములంటిన నేలను వాలెనెన్నో తలలు
నీవె ప్రణయ పరాగమువొ, సౌందర్య సరాగమువో

(రఫీ గళాన పండిన షకీల్ బదయూనీ పదాల రవి సంగీతపు
పున్నమి చందమామ పాటను అమవస నిశి చేసిన నా పైత్య ప్రకోపం)

మల్లెలోయ్ మల్లెలు

మల్లెలు… చిన్ని చిన్ని మల్లెలు
ఆ సొగసరి పూలు నా చేతుల్లో నవ్విన తొలిరోజింకా గుర్తే
సూర్యకాంతీ, ఆకాశమూ, పచ్చటి నేలా చూసినప్పుడల్లా
నిర్నిద్ర నిశీధిలో నది మర్మర ధ్వనులు వింటున్నా
బాల్యంలో నా చిన్ని అరచేతుల్లో నవ్విన మల్లెల గుబాళింపు గుర్తొస్తోంది
ప్రియుణ్ణి ఆహ్వానించడానికి ముసుగు కొద్దిగా తప్పించిన ప్రేయసిలా
రాదారి మలుపులో ఓ వసంత సాయంత్రం నాకోసం చూస్తున్నా
బాల్యంలో నా చిన్ని అరచేతుల్లో నవ్విన మల్లెల గుబాళింపు గుర్తొస్తోంది
సోమరిగా లల్లాయి పదాలు పాడుకున్న వానాకాలపు పొద్దుల్లా
జీవితం నిండా తీపి జ్ఞాపకాలెన్నో పరుచుకున్నా
బాల్యంలో నా చిన్ని అరచేతుల్లో నవ్విన మల్లెల గుబాళింపు గుర్తొస్తోంది

( టాగోర్ “ది ఫస్ట్ జాస్మిన్” కవితకు నా స్వేచ్ఛానువాదం )

( “జనగణమనకు వందేళ్ళు” వార్తకు స్టోరీ రాస్తున్నపుడు… గతేడాది టాగోర్ జయంతి సందర్భంగా చేసిన ప్రత్యేక బులెటిన్ కోసం నేను అనువదించుకున్న గురుదేవుడి కవితలు బయటకు తీసాను. వాటిని మీతో పంచుకుందామని… )

బంగరు నావ

ఆకాశంలో మబ్బులు తేలియాడుతున్నయి
నది ఒడ్డున నేను… ఏకాంతంగా, విషాదంగా !
కుప్పలన్నీ పడున్నాయి. పంట కోతలైపోయాయి
ఒడ్డులొరసిపోతూ మహోగ్రంగా పొర్లుతోంది నది
ధాన్యం రాశులు పోసేసరికి వాన మొదలు

ఆ చిన్న పొలంలో ఎవరూ లేరు, నేను తప్ప
సుళ్ళు తిరుగుతూ అంతటా వరద గోదారి
దూరాన గట్టుపై చెట్లు, చీకటిలా పరుచుకున్న నీడలు
పగటి బూడిద రంగుతో గీసిన చిత్రంలా గ్రామం
ఆ చిన్న పొలంలో ఎవరూ లేరు, నేను తప్ప

అదిగో… గట్టుకి దగ్గరగా ఎవరో అక్కడ
పాడుతోందా? ఆమె నాకు తెలిసినట్టే ఉంది
పరుచుకుంటున్న తెరచాపల్ని చూస్తోంది
పడవకి తగిలి అలలు విరుచుకుపడిపోతున్నాయ్
ఆమె మొహం ఎప్పుడో ఎక్కడో చూసినట్టే ఉంది

పడవెక్కి ఏ సుదూర తీరాలకు పోతున్నావమ్మాయ్
గట్టుకొచ్చి కాసేపు నీ పడవ కట్టేసి ఇలా రా
నీక్కావలసిన చోటుకెళ్ళు, ఇష్టమైన వారిని కలు
కానీ ఒక్కసారి ఈ గట్టుకు రా…. నీ చిర్నవ్వు చూడనీ
నీవెళ్ళే చోటికి నా బంగారు పంట తీసుకువెళ్ళు

తీసుకో. నీ పడవలో పట్టినంత నింపుకో
ఎంత కావాలి. ఇక్కడ నాకేమీ అక్కర్లేదు
ఈ నది ఒడ్డున నా పరిశ్రమ పూర్తైంది
ఈ గరిసెలతో నాకిక ఏ సంబంధమూ లేదు
దయచేసి నన్ను కూడా ఆవలికి తీసుకుపో

ఇంక ఖాళీ లేదు… పడవ చాలా చిన్నది
నా బంగరు పంటతో నిండిపోయింది
వినువీధిలో మబ్బులు ఆడుకుంటున్నాయ్
ఒడ్డున నేనొక్కణ్ణే మిగిలిపోయాను
అంతటినీ ఆ బంగరు పడవ తీసుకువెళ్ళిపోయింది

( టాగోర్ “గోల్డెన్ బోట్” కి నా స్వేచ్ఛానువాదం )

%d bloggers like this: