గుర్‌మెహర్‌… యుద్ధానికీ పాకిస్తాన్‌కీ తేడా తెలుసా!

ప్రియమైన గుర్‌మెహర్‌… సత్‌శ్రీ అకాల్‌. నువ్వు బాగున్నావని తలుస్తాను.

ఢిల్లీ రాంజస్‌ కాలేజీలో ‘ఆజాదీ’ [(భారతదేశం నుంచి) స్వేచ్ఛ] అనుకూల నిరసనల గురించిన నీ వైఖరి తెలిసింది. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అన్న నీ ట్వీట్ ప్రకటనా చూశాను.

ఇవాళ నేను బతికి ఉంటే నాకు 40 ఏళ్ళుండేవి. కాబట్టి నువ్వు నన్ను అన్నయ్యా అని పిలిచినా, అంకుల్ అన్నా… ఇంకెలా పిలిచినా పర్వాలేదు.

గుర్‌మెహర్‌, నేను నీకొక విషయం స్పష్టంగా చెబుదామనుకుంటున్నాను. ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి రెండు విషయాలు స్పష్టంగా తెలిసి ఉంటాయి. ఒకటి అతని కోరిక, రెండవది వాస్తవం. యుద్ధం చెడ్డది, అది జరగకూడదు — అనేది కోరిక. మన మీద యుద్ధం ప్రకటించబడింది — అనేది ప్రస్తుత వాస్తవం. జీవితంలో రెండూ ప్రధానమైనవే. మంచి సైనికుడు ఎప్పుడూ తన కోరిక నెరవేరాలని ప్రార్థిస్తాడు, వాస్తవాన్ని గుర్తించి కార్యాచరణ అమలు చేస్తాడు. ఆ రెండింటినీ కలగలిపేసేవారికి మిగిలేది ఓటమి మాత్రమే.

పాకిస్తాన్ మనకు మిత్రదేశంగా ఉండాలని మన కోరిక. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ కోరిక ఆధారంగా మన వ్యూహాలు రూపొందించుకుంటామా? లేదు. చరిత్ర గురించి, వర్తమానం గురించి ఏ కొంచెం తెలిసిన వారయినా — ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచన ఆధారంగా పాకిస్తాన్‌ ఏర్పడిందన్న విషయం అర్ధం చేసుకోగలరు. ‘పాక్’ అంటే ‘పవిత్రమైనది’… ‘పాకిస్తాన్‌’ అంటే ‘పవిత్ర భూమి’. తమ భూభాగం తప్ప… మిగతాదంతా (ప్రత్యేకించి భారతదేశం) అపవిత్రమైనది అన్న ఆలోచన మీద పాకిస్తాన్‌ ఏర్పాటైంది. పాకిస్తాన్‌ ఏర్పాటు, దాని ఉనికి… ఆ రెండూ ముస్లిములు హిందువులతో కలిసి బతకలేరన్న భావనకు నిదర్శనాలు.

పాకిస్తాన్‌కు మద్దతు పలకడం లేదా ఆ దేశంతో స్నేహం చేయడమంటే ‘అపవిత్రులైన హిందువులతో కలిసి ముస్లిములు జీవించలేరు’ అన్న ఆలోచనను ఆమోదించడమే. మనం నిజమైన లౌకికవాదులమే అయి, పై వాదనకు మద్దతు పలికే వారిమి కాకపోతే పాకిస్తాన్‌ అన్న ఆలోచనను, ఆ దేశాన్నీ మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తాం.

ఇంక నీ వ్యాఖ్య దగ్గరకు వద్దాం. ఏమన్నావ్‌ నువ్వు…. ‘మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు, యుద్ధం’ అనా…!

saurabha-kalia

మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన మీ నాన్నకు సెల్యూట్‌. నేను కూడా అలా నా ప్రాణాలను ఇచ్చేసిన వాడినే. నిజానికి ఆ (కార్గిల్) యుద్ధం కనీసం ప్రాథమిక దశకైనా చేరక ముందే ఆ పోరులోకి అడుగు పెట్టిన మొదటి వ్యక్తిని నేను. నీ నుంచి నీ తండ్రినీ, నా పిల్లల నుంచి నన్నూ దూరం చేసిన ఆ యుద్ధాన్ని మొట్టమొదట గుర్తించిన వాణ్ణి, దానిగురించి ప్రపంచానికి చెప్పిన వాణ్ణీ… నేను.

గుర్‌మెహర్‌, నేను యుద్ధంలో చంపబడలేదు. నన్ను ఎలా చంపేరో కొద్దిగా చెబుతాను నా మాట వింటావా… అవాళ 1999 మే 15. మరో ఐదుగురు సహచరులతో కలిసి నా దేశపు భూభాగంలోనే గస్తీ తిరుగుతున్నాను. అప్పటికే మన భూభాగంలోకి చొరబడి వచ్చిన పాకిస్తాన్‌ సైనికులు (యుద్ధం చేస్తున్న సైనికులు కాదు) మా గస్తీ బృఃదాన్ని దొంగదెబ్బ తీశారు. మమ్మల్ని నిర్బంధించారు. పాకిస్తాన్‌ గడ్డ మీదకు తీసుకుపోయారు (యుద్ధభూమిలోకి కాదు).

ఆ శాంతి సమయంలో వారు మమ్మల్ని రోజుల తరబడి చిత్రహింసలుపెట్టారు. సిగరెట్లతో మా శరీరాల మీద వాతలు పెట్టారు. ఎర్రగా కాల్చిన ఇనపచువ్వలతో మా చెవి గూబలు తూట్లు పొడిచారు. మా కనుగుడ్లను పొడిచేసి ఆ తర్వాత వాటిని పీకేశారు. మా నోళ్ళల్లోని పళ్ళు, ఒళ్ళల్లోని ఎముకలు విరగ్గొట్టి చూర్ణం చేసేశారు. మా పుర్రెలు పగలగొట్టారు, పెదాలు కత్తిరించారు, ముక్కుదూలాలు విరగ్గొట్టారు, కీళ్ళు విరిచేశారు. మర్మాంగాలను కోసేశారు. ఇంకా మరెన్నో రకాలుగా శారీరక, మానసిక చిత్రహింసలకు గురి చేశారు.

ఇదంతా ఒక్కరోజు కథ కాదు. 22 రోజుల పాటు చిత్రవధల పాలుచేశారు. చివరికి ఒకరోజు మమ్మల్ని కాల్చి చంపేశారు. అది యుద్ధ సమయం కాదు… శాంతి సమయంలోనే. మా కళేబరాలను మా తల్లిదండ్రులకు అప్పగించారు… శాంతి సమయంలోనే.

మమ్మల్ని చంపింది యుద్ధం కాదు… పాకిస్తాన్‌.

ఇప్పుడు నేను దిగంతాల నుంచి దిగువన మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ భరించలేని ఆవేదనతో రోదిస్తున్నాను. వేలాది విద్యార్ధులు భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ చేస్తున్న డిమాండ్లను గమనిస్తున్నాను. వారు నా దేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్నారు.

నేను నా తల్లి కోసం… భారతమాత కోసం ప్రాణాలిచ్చాను. భారతదేశం సమైక్యంగా ఉండడం కోసం నన్ను ముక్కలుగా నరుకుతున్నా భరించాను. పదునైన కత్తులతో వాళ్ళు నన్ను నిలువునా చీలుస్తున్నా ఏ ఒక్కక్షణమూ నొప్పితో ఏడవలేదు. కానీ ఇవాళ, ఈ క్షణం నేను మోసపోయినట్టు అర్ధం చేసుకున్నాను. ఏమాత్రం కృతజ్ఞత లేని ద్రోహుల కోసం చనిపోయినందుకు సిగ్గుపడుతున్నాను.

తమకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందంటున్నారు వారు. నాకు లేదా ఆ స్వేచ్ఛ? రణరంగం నుంచి తప్పుకుని వెనుదిరిగే స్వేచ్ఛ నాకు లేదా?? 22 రోజుల పాటు అనుభవించిన చిత్రహింసల నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా??? నా శరీరాంగాలు 22 రోజుల పాటు ముక్కలు ముక్కలుగా నరికివేయబడడం నుంచి తప్పించుకునే స్వేచ్ఛ నాకు లేదా???? ‘ఆజాదీ’ కావాలని కోరుతున్న వారిలో, వారికి మద్దతిస్తున్న నీలాంటి వారిలో కనీసం ఒక్కరైనా నా దగ్గరకు రాలేదు, గస్తీ తిరగొద్దంటూ వెనక్కి పిలవలేదు. అత్యంత కిరాతకమైన, నరహంతక జిహాదీలకు ఎదురొడ్డి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడకుండా ఉండగల అవకాశమూ స్వేచ్ఛా నాకూ ఉన్నాయి కదా.

వాళ్ళు మీ కాలేజీకి షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌లను అతిథులుగా పిలిచారు. ఎవరీ షీలా రషీద్‌, ఉమర్ ఖాలిద్‌? కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలి, కశ్మీరీ వేర్పాటువాదులకు ఆజాదీ డిమాండ్ చేసే హక్కు కావాలీ అని వాదించే వాళ్ళే కదా. మా శరీరాలను అంగుళం అంగుళం చొప్పున రోజుల తరబడి కత్తిరించిన వాళ్ళు ప్రతీరోజూ మాకు ఏం చెప్పేవారో తెలుసా — ఈ ఆజాదీయే. మాకు ఆజాదీ కావాలి. కశ్మీర్‌కు భారత్‌ నుంచి స్వేచ్ఛ కావాలి. కశ్మీర్‌ను పాకిస్తాన్‌గా మారుస్తాం. పాకిస్తాన్‌ అంటే అర్ధం తెలుసా, అదొక్కటే పవిత్ర భూమి… ఇదిగో సరిగ్గా ఇవే వాదనలు.

రాంజస్‌ కాలేజ్‌ లేదా జేఎన్‌యూ లేదా మరి ఏ ఇతర ప్రదేశంలోనైనా ఆజాదీ పేరిట చేసే నినాదాలు… మా శరీరాలను తునాతునకలు చేసిన ఘటనలను, ఆ చేదు జ్ఞాపకాలనూ పదేపదే గుర్తుచేస్తాయి. భారతదేశం నుంచి స్వేచ్ఛ కావాలంటూ మీరు గొంతెత్తి అరిచే ప్రతీసారీ… మీరెప్పుడూ అనుభవించని, ఎంతమాత్రం అనుభవించకూడని భయంకరమైన ఆ సందర్భాలు కళ్ళకు కట్టి వెన్ను జలదరిస్తుంది.

విద్యార్ధుల తప్పేముంది? అని మీరు అడగవచ్చు. ఏ విద్యార్ధి తప్పూ లేదు. కానీ ఆజాదీ నినాదాలు, ప్రదర్శనలతో సంబంధం ఉన్నవారు… జిహాదీల బూట్లు నాకే తొత్తులను లెక్చర్లిమ్మంటూ ఆహ్వానించేవారూ… చేస్తున్న పనులు కచ్చితంగా తప్పే. ఈ ఆజాదీ నినాదాలతో వారు మా త్యాగాలను అవమానిస్తుంటే…. నా ప్రజలు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. నా ప్రజలు నా గౌరవం కోసం పోరాడాలని కోరుకుంటున్నాను.

అలాంటి నిరసనలు, ప్రదర్శనలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తాన్‌ అన్న ఆలోచనకు మద్దతిస్తాయని తెలిసినా, వాటిలో భాగం కావడం ఏం తెలివైన పని? మీరు భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఉద్యమిద్దామనుకుంటున్నారా? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడండి. ఉగ్రవాదంపైనా, ఉగ్రవాదులపైనా మీ భావాలు స్వేచ్ఛగా ప్రకటించండి. అష్టకష్టాలూ పడుతున్న మహిళలకు బాసటగా ఉద్యమించండి. బహుభార్యాత్వం, తలాఖ్‌ పద్ధతులకు వ్యతిరేకంగా నడుం కట్టండి. గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయండి. పాకిస్తాన్‌కు, ఆ దేశపు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళమెత్తండి.’అపవిత్రమైన’ జాతికి చెందిన వాడన్నకారణంగా ఒక వ్యక్తి శరీర భాగాలను నరికి పోగులు పెట్టే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడండి. గురు తేగ్ బహదూర్‌ తల నరికిన సిద్ధాంతానికి, నలుగురు రాకుమారులను సజీవ సమాధి చేసిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడండి. 1947 వరకూ లక్షల మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండి. కశ్మీర్‌ లోయలో కశ్మీరీ హిందూ పండిట్ల జాతిని ఊచకోత కోసిన వారిపై ఉద్యమించండి.

మీ ధైర్యానికి, సాహసానికి, ఉద్వేగానికి నిజమైన పరీక్ష… మీరు ఎంచుకునే కారణంలోనే ఉంటుంది. తమ అనుకూలతలను బట్టి కారణాన్ని ఎంచుకునేవారు పిరికిగొడ్డులు. నిజమైన వీరులు తమ ప్రాథమ్యాలను బట్టి కారణాలను ఎంచుకుంటారు.

ప్రియమైన గుర్‌మెహర్‌, చాలామంది తాకడానికి సైతం భయపడే నిజమైన అంశాలను గుర్తించి వాటి తరఫున పోరాడతావని ఆశిస్తున్నాను. నీ తండ్రి లాంటి, నాలాంటి వారిని గర్వపడేలా చేయి. దేవుడు నీకు మేలు చేయుగాక.

— స్వర్గీయ కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా.

[కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్‌ మన్‌జీత్‌ సింగ్‌ కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌… పాక్‌ అనుకూల వామపక్ష విద్యార్ధి సంస్థల తరఫున వకాల్తా పుచ్చుకుని ఉద్యమిస్తున్న నేపథ్యంలో… కార్గిల్ యుద్ధాన్ని ముందుగా గుర్తించి పాక్‌ దుండగీడుల చేతిలో హతమైన సౌరభ్‌ కాలియా ఆమెకు హితవు పలుకుతున్నట్టుగా రాసిన బహిరంగలేఖ ఇది. ఈ లేఖ రాసినవారు కాన్పూర్ ఐఐటీ సైంటిస్ట్ డాక్టర్ వశీ శర్మ. డాక్టర్ వశీ శర్మ బోంబే ఐఐటీ నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ఆయన పేరొందిన శాస్త్రవేత్త. ఇస్లామిక్ ఉగ్రవాదం, డీ-ర్యాడికలైజేషన్‌ అంశాల్లో నిపుణుడు కావడం ఆసక్తికరం.]

Advertisements

2 Comments (+add yours?)

  1. Sairam
    Mar 04, 2017 @ 16:09:50

    Excellent

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: