వాళ్ళు రాసిందే చరిత్ర మరి…!

ఏరా అబ్బాయ్‌… ‘పర్వ’ గురించి ఇంక ప్రయత్నించకు. దొరికింది.
ఎలా దొరికింది నాన్నగారూ…
సెంట్రల్‌ యూనివర్సిటీలో మా ఫ్రెండున్నాడు కదా… బెంగళూరులో ఓ ప్రొఫెసర్‌ గారి నుంచి సంపాదించాడు… ఆ రోహిత్ వేముల గొడవల కారణంగా పంపడం ఆలస్యమైందట.. ఇప్పుడు పంపించాడు… ఇవాళే వచ్చింది…
అసలది మనకి నచ్చుతుందో లేదో…
వాడు కూడా అదే మాట అడిగాడురా…! ‘మీ రైటిస్టులకి ఈ పుస్తకం నచ్చదేమో’ అంటూనే ఇచ్చారట ఆ బెంగళూరు ప్రొఫెసర్‌గారు. ప్రారంభమూ అలాగే ఉంది…
ఇంతకీ మీకు బైరప్ప పర్వ చదవాలని ఇప్పుడెందుకు అనిపించింది?
మా స్టూడెంట్‌ గోవాలో ఉజ్యోగం చేస్తున్నవాడు ఒకడున్నాళ్ళే… అప్పుడప్పుడూ వాడు మనింటికి వస్తుంటాడు… నువ్వు చూళ్ళేదు… కొన్నాళ్ళ క్రితం వాడు మనింటికి వచ్చినప్పుడు ఆవరణ నవల గురించి, ఆ సమయంలో జరిగిన వివాదాల గురించీ చెప్పాడు. ఆ సందర్భంలోనే పర్వ గురించి చెప్పాను. సరే ఓసారి చదువుదామని ప్రయత్నించాను…
ఆవరణ విడుదల సమయంలోనే అనుకుంటా గిరీష్‌ కర్నాడ్‌ బైరప్పనీ వంశవృక్షనీ చెడతిట్టాడు… అప్పుడు ఈ భైరప్ప రైటిస్టా లెఫ్టిస్టా అన్న అనుమానం వచ్చింది.
రెండూ కాకుండా సెంటరిస్టేమో అనిపిస్తోంది.
ఏమో… పర్వలో మాత్రం కృష్ణుడు తప్ప దాదాపు అందరినీ స్వార్థపరులుగా చిత్రీకరించడం చూసి అలా అనిపించింది. ఐతే కర్నాడాదులకు రైటిస్టు అనీ… బెంగళూరు అభ్యుదయవాద ప్రొఫెసరు గారికి లెఫ్టిస్టు అనీ… అనిపించడం చిత్రమే.
మొత్తం మీద ఆయనది ఆసక్తికరమైన వ్యక్తిత్వమన్న మాట.

*****     *****     *****     *****

సుమారు రెండేళ్ళ నాటి ఆ సంభాషణ తర్వాత భైరప్ప గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2007లో ‘ఆవరణ’ ప్రచురణకు ముందు ఆయన ‘చారిత్రక అసత్యాలతో జాతీయత ఎన్నటికీ బలపడదు’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కన్నడ సాహిత్య ప్రపంచంలో తీవ్ర స్థాయి వాద ప్రతివాదాలకు దారి తీసింది. వాటికి జవాబు అన్నట్టుగా 2012లో ఆయన ‘చరిత్రకారుడు నవలాకారుడిలా సృజనాత్మకత పేరిట స్వేచ్ఛ తీసుకుంటే అసలు సత్యం పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ మరో వ్యాసం రాశారు. అది ఈ మధ్య అంతర్జాలంలో విస్త్రతంగా ప్రచారం అవుతోంది. దాని తెలుగు సేత ఇదిగో ఇదీ….

*****     *****     *****     *****

అది 1969-70 నాటి మాట. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయమది. నాటి కేంద్ర ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆప్తుడైన దౌత్యాధికారి జి పార్థసారథి ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ లక్ష్యం… విద్య ద్వారా దేశాన్ని ఏకం చేయడం. నన్ను సదరు కమిటీలో ఒక సభ్యుడిగా ఎంపిక చేశారు. నేనప్పట్లో ఎన్‌సీఈఆర్‌టీలో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ రీడర్‌గా పనిచేస్తుండే వాణ్ణి. మా మొదటి సమావేశానికి పార్థసారథి కమిటీ ఛైర్మన్‌ హోదాలో వచ్చారు. కమిటీ సాధించవలసిన ప్రయోజనాల గురించి తనదైన మర్యాదాపూర్వక పరిభాషలో వాక్రుచ్చారు : “ఎదిగే పిల్లల మనసుల్లో విషబీజాలు నాటకుండా ఉండడం మన విధి. ఎందుకంటే అలా జరిగితే జాతీయ సమైక్యత అన్న భావనకు వారు అడ్డంకులుగా మారతారు. సాధారణంగా అలాంటి విషబీజాలు చరిత్ర క్రమంలోనే ఎక్కువగా ఉంటాయి. సోషల్ సైన్సెస్, భాషాశాస్త్రాల్లో కూడా అప్పుడప్పుడూ అలాంటి అభ్యంతరకర అంశాలు కనిపించడం పరిపాటి. అలాంటి అంశాలన్నింటినీ మనం ముందుగానే ఏరి పారేయాలి. మన చిన్నారుల మనసుల్లో జాతీయ సమైక్యత గురించిన భావనలు మాత్రమే మొలకెత్తించగల ఆలోచనలనే ప్రోది చేయాలి. ఆ గురుతర బాధ్యతను మన కమిటీ భుజాలకెత్తుకుంది.”

మిగతా నలుగురు సభ్యులూ గౌరవ పురస్సరంగా తలలూచారు. కానీ నేనలా చేయలేకపోయాను. “సర్! మీ మాటలు నాకు అర్ధం కాలేదు. కొన్ని ఉదాహరణలతో వివరించగలరా?” అని నేరుగా అడిగేశాను. ఆయన జవాబిచ్చారు. “సోమనాథ్‌ దేవాలయాన్ని గజనీ మహమ్మద్‌ దోచుకున్నాడు. కాశీ మథురల్లో దేవళాలను కూలగొట్టి ఔరంగజేబు మసీదులు కట్టాడు, జిజియా పన్నులు వసూలు చేశాడు — ఇలాంటి పనికిమాలిన వాస్తవాలను బోధిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశాన్ని బలోపేతం చేయడం సాధ్యమేనంటారా? అలాంటి నిజాలు ద్వేషాన్ని రగల్చడం తప్ప ఏ విధంగా మేలు చేయగలవు?”

“కానీ అవన్నీ చారిత్రక సత్యాలు కదా!” నేను రెట్టించి అడిగాను.

“అరే, మనకు నిజాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా అని అన్నింటినీ చెప్పేస్తామా ఏమిటి? నిజాలను తగుమాత్రంగా ఉపయోగించడమే చరిత్ర బోధించడానికి తెలివైన పద్ధతి” అన్నారాయన. ‘ఔనౌను’ అన్నట్టుగా మిగతా నలుగురు సభ్యులూ తలలు ఊపారు. కానీ నేను అలా ఒప్పేసుకోడానికి సిద్ధంగా లేను.

“మీరే కాశీ, మథుర వంటి ఉదాహరణలు చెప్పారు. ఇప్పటికీ దేశం నలుమూలల నుంచి ఆయా క్షేత్రాలకు ప్రతీ యేటా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఆయా దేవాలయాలను శిథిలం చేసి, వాటికి చెందిన గోడలు, స్తంభాల ఆధారంగా నిర్మించిన భారీ మసీదులు అందరి కళ్ళకూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే మసీదు వెనక చిన్న పాకలా వేసుకుని అందులో ఆలయం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి నిర్మాణాలను చూస్తున్న భక్తుల ఆవేదనకు అంతే లేదు. తమ ప్రీతిపాత్రమైన దైవపు మందిరం దుస్థితి గురించి తమ బంధువులకు చెప్పుకుని వాపోతున్నారు. అలాంటి పరిస్థితులు జాతీయ సమైక్యతను సృష్టించగలవా? అలాంటి చరిత్రను మీరు పాఠ్యపుస్తకాల్లో చేర్చకుండా దాచగలరు. కానీ ఆ పిల్లలు విహారయాత్రలకు వెళ్ళినపుడు తమ కళ్ళతో ఆ నిజాలను చూసి తెలుసుకున్నప్పుడు ఆ చరిత్రను దాచడం సాధ్యమా? పరిశోధకుల అంచనాల ప్రకారం భారతదేశం మొత్తం మీద అలా ధ్వంసం చేసిన మందిరాలు 30వేలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు దాచిపెట్టగలరా?”

పార్థసారథి నా మాటలను అడ్డుకున్నారు : “మీరు తత్వశాస్త్ర ప్రాచార్యులు కదా, చరిత్ర ప్రయోజనం ఏమిటో కొంచెం వివరిస్తారా?”

“చరిత్ర ప్రయోజనాన్ని ఎవరూ నిర్వచించలేరు. భవిష్యత్తులో సైన్స్‌, టెక్నాలజీల అభివృద్ధి కారణంగా పరిస్థితులు ఎలా ఉండబోతాయన్నది మనకు తెలీదు. కొందరు పాశ్చాత్య ఆలోచనాపరులు దీన్ని ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ అంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఆలోచనల వల్ల ప్రయోజనం శూన్యం. మన చర్చ ఏంటి — చరిత్ర బోధించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని కదా. చరిత్ర అంటే మన గతకాలపు సంఘటనల గురించి నిజాలు తెలుసుకోవడం, మానవ జీవితాల గురించి నేర్చుకోవడం. దానికోసం శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ఇతరత్రా రికార్డులు, సాహితీ గ్రంథాలు, పురాతన అవశేషాలు, కళాఖండాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి. మన పూర్వీకులు చేసిన తప్పులు చేయకుండా ఉండడమూ నేర్చుకోవాలి. వాళ్ళు ఆచరించిన సద్గుణాలను మనం అనుసరించాలి. వాటన్నింటినీ నేర్చుకోడానికి చారిత్రక వాస్తవాలు మనకు సహాయం చేస్తాయి.”

“సత్యం గురించిన అన్వేషణ మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తే ఏం చేయాలి? సమాజాన్ని మనం విభజించవచ్చా? మనం విషబీజాలు నాటవచ్చా?” అని అడుగుతూ ఆయన నన్ను ఆపడానికి ప్రయత్నించారు.

“సర్‌, మెజారిటీ, మైనారిటీ అంటూ కేటగిరీలు చేస్తున్నామంటేనే ఈ సమాజాన్ని విభజిస్తున్నామని… కనీసం విభజన దిశగా అడుగులు వేస్తున్నామని అర్ధం. అసలీ ‘విషబీజాలు’ అన్న ఆలోచనే పక్షపాత ధోరణికి నిదర్శనం. గజినీ మహమ్మద్‌ లేదా ఔరంగజేబు తమ సొంత మనుషులు, హీరోలు అని మైనారిటీలు ఎందుకు అనుకోవాలి? మొగల్‌ సామ్రాజ్యం నశించిపోడానికి కారణం ఔరంగజేబ్‌ మతోన్మాదం. అక్బర్‌ కాలంలో అతను పరమత సహనం అనే విధానాన్ని అనుసరించాడు కాబట్టి మతపరంగానూ సామాజికంగానూ మిత్రత్వం సాధ్యమైంది. చారిత్రక వాస్తవాలను దెబ్బతీయకుండా పిల్లలకు అలాంటి పాఠాలు చెప్పలేమా? చరిత్ర నుంచి నేర్చుకోవలసిన పాఠాలు బోధించడానికి ముందు చారిత్రక వాస్తవాలను తెలియజెప్పాల్సిన పని లేదా? నిజమైన చరిత్రను దాచడం అనేది రాజకీయాల కోసం చేసే పని. ఈ ట్రెండ్ ఎక్కువకాలం కొనసాగదు. మైనారిటీలు కానివ్వండి, మెజారిటీలు కానివ్వండి… ఉద్వేగాలను నియంత్రించుకునే పరిపక్వతతో సత్యాన్ని ఎదుర్కొనే శీలాన్ని విద్యార్ధులకు ఇవ్వలేని విద్య అర్ధరహితం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం కూడా.” అని చెప్పాను.

నా మాటలతో పార్థసారథి ఏకీభవించారు. నా పాండిత్యాన్ని, స్పష్టంగా ఆలోచించగల సామర్థ్యాన్నీ ప్రశంసించారు. భోజన విరామ సమయంలో ఆయన నన్ను ఓ పక్కకి పిలిచారు. నాకు ఎంతో సన్నిహితుడిలా నా భుజాలపై చేతులు వేసి, విజయం సాధించినట్టు నవ్వుతూ నాతో ఇలా చెప్పారు : “మీరు ఇప్పటివరకూ చెప్పిందంతా అకడమిక్‌గా కరెక్టే. మీరు చెప్పిన అంశాలతో ఓ మంచి వ్యాసం రాసుకోండి. కానీ ప్రభుత్వం దేశం మొత్తానికీ ఒక విధానాన్ని తయారు చేసేటప్పుడు, అది అందరు ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. మేథోపరంగా స్వచ్ఛమైన నియమాలు ఎలాంటి ప్రయోజనాన్నీ అందీయలేవు.”

మరునాడు మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా నేను నా వాదనకే కట్టుబడి ఉండిపోయాను. సత్యం ఆధారంగా లేని చరిత్ర నిష్ప్రయోజనకరము, ప్రమాదకరమూ అని నిష్కర్షగా తేల్చిచెప్పాను. పార్థసారథి తన ఆగ్రహాన్ని ముఖం ద్వారా ప్రకటించినప్పటికీ నేను నా వాదన నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఆ ఉదయం సమావేశం ఎలాంటి ఫలితమూ తేలకుండానే ముగిసిపోయింది.

ఆ తర్వాత పార్థసారథి నాతో మాట్లాడలేదు. మేం మళ్ళీ ఒక పక్షం రోజుల తర్వాత సమావేశమయ్యాం. అప్పటికి కమిటీని పునర్‌ వ్యవస్థీకరించారు. అందులో నేను లేను. నా స్థానంలో మరో కొత్త వ్యక్తి ఉన్నారు. వామపక్ష భావజాలం కలిగిన ఆ హిస్టరీ లెక్చరర్‌ పేరు అర్జున్ దేవ్‌. ఆ తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన కొత్త సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ టెక్స్ట్‌ పుస్తకాలు, వాటిలో పొందుపరిచిన కొత్త పాఠాలూ అన్నీ ఆయన మార్గదర్శకత్వంలో రాయబడినవే. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో ఆ పుస్తకాలనే పాఠ్యపుస్తకాలుగా పెట్టుకోవడం కానీ లేదా వాటి ఆధారంగా పాఠ్యపుస్తకాలు రాయడం కానీ జరిగింది.

చాలా కాలం తర్వాత అంటే 2005 అక్టోబర్‌లో ఒక ప్రసంగంలో ఆనాటి విషయం గురించి నేనిలా వ్యాఖ్యానించాను :
11వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ‘ప్రాచీన భారతదేశం’ అన్న పాఠ్యభాగాన్ని రాసింది మార్క్సిస్టు చరిత్రకారుడు ఆర్‌.ఎస్ శర్మ. మధ్యయుగాల నాటి భారతదేశం అన్న భాగాన్ని రాసిన సతీష్‌ చంద్ర కూడా మార్క్సిస్టే. వాటిని నిశితంగా పరిశీలించి పరీక్షించినప్పుడు… ఆ వర్గానికి చెందిన వారు ఎదుగుతున్న పిల్లల మనసులను బ్రెయిన్‌వాష్‌ చేయాలన్న దురుద్దేశంతో కుటిల వ్యూహాలు అమలు చేసిన తీరును గమనించవచ్చు. ఆ చరిత్రకారుల రాతల ప్రకారం… “సహనం అనే లక్షణపు గొప్పదనాన్ని వివరిస్తూ అశోకుడు భ్రాహ్మణులను ‘కూడా’ గౌరవించాలని బోధించే వాడు. అశోకుడు తన రాజ్యంలో పశువులు పక్షులను బలి ఇచ్చే ఆచారాలపై నిషేధం విధించాడు. దానివల్ల యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిలిచిపోయాయి. దాంతో బ్రాహ్మణులకు దక్షిణలు నిలిచిపోయి, వారి జీవిక ఆగిపోయింది. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. అందులోని పలుభాగాలు బ్రాహ్మణుల పాలనలోకి వెళ్ళిపోయాయి. ఆ బ్రాహ్మణులే బౌద్ధమతం అంతరించిపోవడానికి కారకులయ్యారు..” భారతదేశంలో మాత్రమే కాక చుట్టుపక్కల దేశాలకు సైతం వ్యాపించిన, దేశంలో అత్యంత ప్రభావశీలంగా నిలిచిన మతం — తమ దక్షిణలు కోల్పోయామనే అసంతృప్తితో ఉన్నబ్రాహ్మణుల వల్ల అణిగిపోయిందనడం — ఇంతకు మించిన మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా!

ఎర్రకళ్ళ చరిత్రకారులు చేసిన మరో ప్రచారం — ముస్లిములు తమ దండయాత్రల్లో దేవాలయాలను విధ్వంసం చేయడానికి కారణం ఆ మందిరాల్లో పోగుపడివున్న సంపదను దోచుకోవడం కోసమే అనే విషయం. ముస్లిముల దండయాత్రలను హేతుబద్ధీకరించడమే ఈ వివరణ లక్ష్యం. మరికొన్ని సందర్భాల్లో… అలాంటి దోపిడీలు షరియా చట్టం పరిధిలోకి వస్తాయని కూడా వారు వాదిస్తారు. ఆ దాడులు, దోపిడీలకు చట్టబద్ధత కల్పిస్తున్నారన్న మాట.

నిజానికి బౌద్ధం భారతదేశంలోనుంచి మాయమైపోయింది అశోకుడి తర్వాత కానే కాదు. అసలు నిజాన్ని స్వయంగా బౌద్ధమతావలంబి అయిన డాక్టర్ బీ ఆర్‌ అంబేడ్కర్‌ — బౌద్ధం పతనం, నాశనం అనే వ్యాసంలో (అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు మూడవ సంపుటం, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచురణ, 1987) — స్పష్టంగా చెప్పారు. భారతదేశంలోకి చొరబడిన ముస్లిం దురాక్రమణదారులు నలంద, విక్రమశీల, జగద్దళ, ఓదాంతపుర విశ్వవిద్యాలయాలను సమూలంగా ధ్వంసం చేశారు. బౌద్ధ సాధువులను ఊచకోత కోశారు. బతికి బట్టకట్టిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేపాల్, టిబెట్‌ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు. అంబేడ్కర్‌ మాటల్లో “బౌద్ధమతం వేళ్ళను సమూలంగా నరికేశారు. భారతదేశంలో బౌద్ధానికి పట్టిన అత్యంత ఘోరమైన దుర్గతి అదే.” ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు హిందూమతాన్ని దూషించాలనుకునే ప్రతీసారీ… దయ్యాలు వేదాలు వల్లించినట్టు… అంబేడ్కర్‌ను ఉటంకిస్తారు. అదేసమయంలో “ముస్లిముల బీభత్స భయానక కృత్యాల కారణంగానే భారతదేశంలో బౌద్ధం అంతరించిపోయింది” అని అంబేడ్కర్‌ చెప్పిన మాటల్ని మాత్రం… తమకు అనుకూలంగా లేనందున విస్మరిస్తారు.

ఎన్‌సీఈఆర్‌టీ కోసం రాసిన ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’లో ఆర్‌ఎస్‌శర్మ ఇలా అంటారు : “సుసంపన్నమైన బౌద్ధ విహారాలు భారతదేశంపై దండయాత్రకు వచ్చిన తురుష్కులను ఆకర్షించాయి. చొరబాటుదారులకు అవి ప్రత్యేకమైన లక్ష్యాలుగా నిలిచాయి. బౌద్ధ భిక్షువులు ఎందరినో తురుష్కులు హతమార్చారు. అప్పటికీ మరెంతో మంది బౌద్ధులు తప్పించుకుని నేపాల్, టిబెట్‌లకు పారిపోగలిగారు.” ఆ తురుష్కులు ఎవరు — హిందువులా? మహా మేధావి అయిన మార్క్సిస్టు శర్మ గారు సరిగ్గా ఇక్కడే నిఖార్సైన నిజాలు దాచేశారు.. తురుష్కులు (టర్కీ దేశస్తులు) ముస్లిములు. తమ షరియా లా — ఇస్లామిక్‌ న్యాయం ప్రకారమే వారు భారతదేశంలో మందిరాలను కూల్చేశారు. ఆ నిజాన్ని దాచడం కోసమే ఆర్‌ఎస్‌ శర్మ టర్కీ దేశపు ముస్లిములను వారి జాతినామంతో తురుష్కులని ప్రస్తావించారు. ఆ సమయంలోనే ఆయన తోటి చరిత్రకారులు ‘అశోకుడి పాలనలో దక్షిణలు కోల్పోయిన బ్రాహ్మణుల వల్లనే బౌద్ధమతం పతనం అయిపోయింది’ అని తప్పుడు ప్రచారం చేశారు. తురుష్కులు ముస్లిములు అనే నిజాన్ని దాచిపెట్టడం, బ్రాహ్మణుల వల్లే బౌద్ధం పతనమైందని అబద్ధాలు చెప్పడం — ఎంత గొప్పగా చేశారో! అలాంటి ఎత్తుగడల గురించి లాటిన్‌లో ఓ మాట ఉంది ‘సప్రెసియో వెరి – సజెస్టియో ఫాల్సి’. దాన్ని మనం తెలుగులో ‘నిజాల్ని తొక్కెయ్‌ – అబద్ధాలాడెయ్‌’ అనుకోవచ్చు.

*****     *****     *****     *****

అదండీ భైరప్ప గారి వాదన. మరి ఎర్ర కళ్ళజోళ్ళ వాళ్ళు పర్వని పొగిడి, ఈ వ్యాసాలను తెగ తిట్టారేమో నాకు తెలీదు. తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి. ఇప్పటికైనా ఓపిక చేసుకుని వచ్చి రచ్చ చేస్తారు.

Advertisements

2 Comments (+add yours?)

 1. అన్యగామి
  Feb 15, 2017 @ 22:40:20

  పార్థసారథిగారిది, మీవి వాదనలు సహేతుకంగానే ఉన్నా, నిజం చెప్పి తీరాలన్న మీ పట్టుదల నచ్చింది. చివరికి మనకి జరిగిన నష్టానికి మనమే (మందిరాలు – బ్రాహ్మణులూ – బౌద్ధులు – వీటి పతనం) బాద్యులని తేల్చేశారు పుస్తకాల్లో. నిజాన్ని దాచకుండా జాతీయ సమైక్యత సాధించటం ఎలా అన్నది ఎండమావిలాగే ఉండిపోయింది.

  Reply

 2. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Feb 16, 2017 @ 17:00:29

  అన్యగామిగారూ… మీరన్న ‘మీరు’…. నేను కాదు, భైరప్పగారు. ఆ స్పష్టత మీకుందనే అనుకుంటున్నా. ఇక పార్థసారథి గారిది సహేతుక వాదన అని మీకు అనిపించిందా? నాకయితే రాజకీయ ప్రేరేపిత కుట్ర అని అర్ధమైంది.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: