సెలయేటి మూగపాట

222
నీటికీ అనుభూతులుంటాయో లేక నా చిత్తభ్రమో ఆ యేరెప్పుడూ నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అందుకే ఈ జీవితపు చరమాంకంలో చిననాటి నేస్తాన్ని కలుసుకోవాలన్న వాంఛ నన్నీ ప్రయాణానికి పురిగొల్పింది. తనతో పెనవేసుకుపోయిన జీవన దృశ్యాలు దారి పొడుగునా అలలు అలలుగా నా మదిని తడుతూనే ఉన్నాయి.

చెట్ల చీరెలో తన లేయందాలని దాచుకుంటూ నది తల్లి చాటున ముసిముసి నవ్వులు నవ్వుకునే ముగ్ధ మనోహర బాలికలా కనిపించేదా యేరు. నాన్న సాయంతో ఈత నేర్చుకుంటున్నప్పుడది తన ప్రాణ స్నేహితుడి భుజమ్మీద చేతులేసి గట్టిగా పట్టుకుని వదలకుండా వడివడిగా నడుస్తున్నట్టు అనుభూతించేది.

బళ్ళో ఓ రోజు మాస్టారు మా ప్రియమిత్రుల గురించి చెప్పమన్నప్పుడు నేనా యేటి గురించి చెప్పాను. ఆ రోజు నుంచీ అందరూ నన్ను చూసి నవ్వేవారు. ”ఆ యేరు వీడితో మాట్లాడుతుందట, వీడికి మనుషుల స్నేహమనవసరం” అని గేలిచేసేవారు. ఓసారేదో ఆటల తగవులో ”పోయి యేట్లో దూకు, పోరా” అని ఈసడించారు. బాధ, దు:ఖం, కోపం, ఆవేదన అన్నీ కలగలిసిన ఉక్రోషంతో పరిగెత్తుకుంటూ యేటి దగ్గరకే వెళ్ళాను.

”ఎందుకంత ఇదైపోతావ్‌? నీకు నేనున్నాను. నేనెన్ని అవమానాలనీ అవహేళనలనీ ఎన్ని కాలుష్యాలనీ మానసిక వైక్లబ్యాలనీ చూశానో తెలుసా. నా ఏడుపులో నేనే మునిగిపోయాను. నీ కన్నీళ్ళని నా నీళ్ళలో కలిపెయ్యి. నాలో లీనమైపో. నా కాళ్ళతోనూ చేతులతోనూ నిన్ను చుట్టేస్తాను. నా ప్రేమతో నిన్ను కౌగిలించుకుంటాను. రా. నాలో కలిసిపో!” అందా యేరు.

ఆ నీటిని తాకగానే నాలో ఓ కొత్త ఉత్తేజమొచ్చింది. ఎంతో ఉద్వేగంతో ఆ నీటిని ముఖమ్మీద జల్లుకున్నాను. అమ్మలా నా నుదుటిని ముద్దాడింది. ఏటిలోకి దూకాను. ఓ చేపపిల్లనై ఈదులాడాను. ఆ యేటిని, నా యేటిని ముద్దెట్టుకుంటున్నట్టు నీళ్ళని తాగాను. ఆ రాత్రి నన్ను వెదుక్కుంటూ నాన్నొచ్చి తీసుకుపోతున్నప్పుడు అమ్మని వదిలిపోవడంలో బాధేంటో తెలిసింది. అవును. నాకు అమ్మ లేదు. కాదు, నాకిద్దరమ్మలు. ఏరూ నాన్నా. అలాగే నాకిద్దరు నాన్నలు. నాన్నా ఏరూ. నా అక్కా చెల్లీ అన్నా తమ్ముడూ అన్నీ వాళ్ళే.

”కన్నా! మనుషుల్లో కుళ్ళు చాలా యెక్కువ. పచ్చటి మొక్కని కూడా కలుపుగా చూసే వాళ్ళకి అమాయకత, స్వచ్ఛత పనికిమాలినవిగా కనిపిస్తాయి. ఈ సమాజంలో మనుగడ సాగించాలంటే వాళ్ళతో కలిసుండక తప్పదు. వాళ్ళ అవలక్షణాలని భరించక తప్పదు. తన్ని సిలువ వేస్తున్నప్పుడు ‘ప్రభూ! నా సోదరుల అజ్ఞానాన్ని మన్నించు’ అని ప్రార్థించిన యేసు కంటె మనమేం గొప్పవాళ్ళం కాదుగా. ఈ ప్రపంచం మాటల్ని పట్టించుకోకు. నువ్వు తలొంచుకుంటే రాళ్ళతో కొడుతుంది. తలెత్తి కళ్ళెర్రజేస్తే తోక ముడుచుకుని పిల్లిలా జారుకుంటుంది. అలాంటి వాళ్ళతో నీకు పనేంటి. నేనూ ఆ యేరూ చాలమా నీకు” తన వొళ్ళో పడుకున్న నా తల నిమురుతూ నాన్న చెబుతుంటే నిద్రపోయాను.

అప్పట్నుంచీ అదే నా ప్రపంచమయిపోయింది. బణ్ణుంచి సరాసరి యేటికెళ్ళడం, వెలుగున్నంతసేపూ చదువుకోవడం, తర్వాత ఈత కొట్టడం, నాన్న రాగానే ఇంటికెళ్ళడం, నాన్నతో కలిసి పద్యాలు చదవడం. నన్ను తీసుకుపోతున్నాడని నాన్నంటే తనకి కోపం. అయినా నా వల్ల  ఆయన్నేమీ అనేది కాదు.

నేను పదో తరగతిలోకొచ్చాక నాన్న నన్ను ప్రైవేటుకి పంపుదామనుకున్నాడు. అయితే నా నేస్తంతో గడిపే సమయాన్ని వదులుకోవడం నాకు కష్టం కలిగించింది. ఎలాగయినా ప్రైవేటు మానెయ్యాలనుకున్నాను. గారం చేసాను. మారాం చేసాను. బతిమాలాను. హఠం చేసాను. నాన్న నా మాట ఒప్పుకుంటాడనుకున్నాను.

కాళ్ళు విరగ్గొట్టాడు. మొట్టమొదటిసారి నాన్న నన్ను కొట్టాడు. ఒళ్ళు హూనమయ్యేలా చితక్కొట్టాడు. నేనది అస్సలూహించలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది. కొడుతుంటే తప్పించుకోవాలనీ యేడవాలనీ కూడా నాకు తెలీలేదు. కాసేపటికి నన్నొదిలేశాడు. కూలబడ్డాడు. నేను మెల్లిగా కదిలాను. ఒళ్ళంతా పచ్చిపుండులా వుంది. అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. ఏటి గట్టున ఓ చెట్టు కింద కూలబడ్డాను. మోకాళ్ళ మడత మీద తలాన్చుకుని యేటివైపు చూస్తూ కూచున్నాను. అదే మొదటిసారి, నేను యేటికంత దూరంగా ఉండిపోవడం. నా మీద అలిగిందో కోపగించిందో జాలిపడిందో తెలీదు. నేనలా యేటిని చూస్తూనే ఉన్నాను. ఏరు నాన్నలా నిశ్చలంగా కూలబడింది. కాసేపటికి లేచి ఇంటికెళ్ళాను. మడత వేసిన కాళ్ళ మీద తల వాల్చుకుని ఉన్నాడు నాన్న. వెళ్ళి పక్కన కూచున్నాను. నాన్న తలెత్తాడు.

నాన్న కళ్ళల్లో యేరు వరదలై పారుతోంది.

మరో రెండేళ్ళు సాదాసీదాగా గడిచాయి. అంతలో నాన్న నాకు భౌతికంగా దూరమయ్యాడు. ఆ నిజం పన్నెండ్రోజుల పాటు నాకు అర్ధమే కాలేదు. ఆ తర్వాత ఓ రోజు ఒక్కణ్ణీ యేటికెళ్ళాను. ఏరు బక్కచిక్కిపోయింది. అందరూ వింతగా చూస్తున్నా అన్నాళ్ళూ చుక్క రాలని నా కంట నీరు తిరిగింది. గుండెల్లో గూడు కట్టుకున్న వేదనంతా కరిగింది. ఏటిలో ఈదుతున్నంతసేపూ యేడుస్తూనే వున్నాను. ఏం చెయ్యాలో యెలా వోదార్చాలో తెలీని ఏరు నిస్తబ్ధంగా వుండిపోయింది. నన్నొదిలిపోయిన నాన్న మీది కోపం, ప్రేమ అంతా తన మీద చూపించాను. కాళ్ళతో చేతులతో తన్నాను. కొట్టాను. ఏట్లో చేపలు భయంతో మూల మూలలకి పారిపోయాయి. పాపం, ఏరెక్కడికి వెళ్ళగలదు, ఎలా తప్పించుకోగలదు.

నేనూ తప్పించుకోలేకపోయాను చుట్టాల ప్రేమ నుంచి. ప్రేమ నామీద కాదు, నాన్న నాకొదిలేసిన ఆస్తి మీద. నేనేం మాట్లాడలేదు. నా యేరుకి దూరమవక్కర్లేదు అక్కడే వుండిపోతే.

కాలమూ యేటిలాంటిదేనట. అది నన్నూ యేటినీ ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వలేదు. నాన్నని తీసుకుపోయిన కాలం తనని నావైపు పంపింది.

తను గలగల పారే ఓ సెలయేరు. తుళ్ళింతలూ కేరింతలూ యౌవన సామ్రాజ్య ముఖద్వారాన వున్న పొలతికి సహజమే. అయితే నా అదృష్టం, తనకి నా అంతర్ముఖత్వమన్నా నా యేరన్నా విముఖత లేదు. కారణమేమవనీ, తనూ నాతో ఏటి దగ్గరకొచ్చేది. లెక్కలు చెప్పమనో, పూలు తెచ్చిపెట్టమనో తనెప్పుడూ ఆ ఏటి గట్టు దగ్గరే అడిగేది. నాతో యేకాంతానికి తనకా చోటు బాగా నచ్చింది.

నేను యేటిని తన గురించి అడిగాను. పరవళ్ళు తొక్కింది యేరు. తన్ని పూలతో అలంకరిస్తున్న ఆ అమ్మాయంటే యేటికీ ఇష్టం కలిగింది. వాళ్ళిద్దరికీ జత కుదిరాక నేనెలా కాదనగలను.

”నాక్కూడా ఈత నేర్పవూ….” ఏటిలో ఈత కొడుతున్న నన్ను చూస్తూ గట్టుమీద కూచుని అడిగిన తన కళ్ళలో రవంత చిలిపిదనం. ఏమ్మాట్లాడకుండా అడుక్కి చేరుకున్నాను. ఇసుక పొరకి చెవొగ్గి విన్నాను యేం చెబుతుందోనని. అలా మూణ్ణిమిషాలు గడిచిపోయాయి. కంగారుగా గట్టుమీంచి తను పిలుస్తోంది. ఒక్కసారిగా పైకొచ్చాను. గట్టుకొచ్చి తల విదిల్చాను. ”ఏం! చచ్చిపోయాననుకున్నావా?” అన్నాను. మీద పడ్డ నీళ్ళు దులుపుకుంటున్నదల్లా చటుక్కున తల పైకెత్తి చూసింది. కోపగించుకుంటుందనుకున్నాను.

చిర్నవ్వింది. ”చస్తే నీ శవమే తేలేదిగా!” అంది. లేచి తనెళ్ళిపోతుంటే యేటిలో పాములా ఆమె జడ కదలాడింది. వెనుకనుంచి వెళ్ళి జడ లాగాను. జళ్ళో పున్నాగలు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి చెంప మీద కొట్టబోయి ఆగింది. వేసవిలో ఎండిపోయిన ఏటిలో మిగిలిన నీటిలా ఆమె కంట సన్నటి పొర. ఏమ్మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

ఆనాటి సంజెవేళ నేను యేటినడిగాను. ఏటి గుండెని చీల్చుకుంటూ అడుక్కంటా వెళ్ళి మరీ అడిగాను. నా మాట విన్పించుకోనట్టు తప్పించుకోబోయింది యేరు. తనని నిలదీశాను. అడ్డగించాను. చెవులు పట్టుకుని మెలేశాను. ”నీకు ఈర్ష్యగా ఉంది కదూ” అని వెక్కిరించాను. ఏరు మాట తప్పించాలని చూసింది. ”ఈరోజు చూశావా, కొత్త చేపలొచ్చాయి మా ఇంటికి” అంది. ”సూర్యుడీరోజు ఎంతో అందంగా ఉన్నాడు కదూ” అంది. ”ఈరాత్రి కలువలు బాగా విరుస్తాయి, పున్నమి కదా” అంది. ఏమేమో చెప్పింది. ఐనా నేను పట్టు విడవలేదు. చివరికి సరేనని నసిగింది. ”కానీ ఓ షరతు….” అంది. నేనొప్పుకున్నాను.

”నన్ను మరిచిపోకూడదు. నన్నొదిలి వెళ్ళిపోకూడదు” అంది. నవ్వాన్నేను. తెరలు తెరలుగా నవ్వాను. కళ్ళలోంచి నీళ్ళొచ్చేలా నవ్వాను. ”నిన్ను మరిచిపోతే నన్ను నేను మరిచిపోయినట్టే”నన్నాను. నమ్మింది. ఆనందంతో పొంగిపోయింది.

వరదలొచ్చి నదితో పాటు యేటినీ నింపేశాయి. నా మనసు కూడా కొత్త పరిచయాలతో ఆలోచనలతో పొంగుతోంది. కొంగొత్త విషయాలు, సిద్ధాంతాలు తెలవడం మొదలైంది. మార్కుల కోసం చదివే పుస్తకాలే కాక మనుషుల్నీ మనసుల్నీ కలిపే పుస్తకాలు కూడా నా నేస్తం కట్టాయి. నా సాయంత్రాలు యేటిలో కాక పుస్తకాల్లో ఈత కొట్టడం మొదలుపెట్టాయి. ఏరు చిన్నబుచ్చుకుంది. ఆర్తితో తన దరి చేరే చిన్ననాటి చెలికాడు చిటికెడు దూరంలో ఉండి కూడా చిర్నవ్వుతో సరిపెట్టేస్తుంటే ఏం చేస్తుంది పాపం. భావాల సాంద్రత అమాయకతని ఘనీభవింపజేసేస్తుందని తనకు తెలీదు కదా.

ఏటితో పాటు ప్రియురాలు కూడా క్రమంగా దూరమవసాగింది. ప్రబంధ పారిజాతాల పరిమళంలో విచ్చుకునే ముద్దుల ముద్రల్ని చవిచూసిన అలతికాలం సిద్ధాంతాల రాద్ధాంతాల ఝంఝామారుతాలలో కొట్టుకుపోవడమర్ధమవని ఆ ముగ్ధ నా కోపతాపాలకెన్నిసార్లు గురయిందో. అయినా మరికొద్దిసేపటికే నా అనునయ సాంత్వన వాక్యాలకు మైమరచిపోయి అలగడం కూడా తెలీనిదైపోయింది. నా చిన్న ప్రపంచాన్ని విస్త్రతం చేసిన సాహిత్యం నన్నడకత్తెరలో పడవేసింది. విభిన్న సిద్ధాంతాల గుణాలూ దోషాలూ కలవరపెడుతుంటే చివరికన్నిట్లోనూ అంతిమ సత్యం ఒకేలా కనిపించే సందిగ్ధ సాగరంలో పడిపోయాను. ఈ పరిణామ దశలోనే విద్య నన్ను నా ఊరినుంచి దూరం చేసింది. ఎంత భౌతికమైనా శాస్త్రపు సొగసూ ఒయారమూ….. ఓహ్‌! అదో వింత ప్రపంచం. తీరని దాహం. అదే సమయంలో నాకు తెలిసిన సిద్ధాంతాలతో మమేకమైన వ్యక్తులూ, వారి వైయక్తిక జీవితాల్ని నాశనం చేసిన సిద్ధాంతాలూ చిత్రమైన విధ్వంస దృశ్యాన్ని నా మనోఫలకంపై ఆవిష్కరించాయి. విరామ వేళల్లో దరి చేరినపుడు ఊరు నా ఉన్నత విద్యకి ఔద్ధత్యాన్ని ఆపాదించినా యేరు అపరిచితుణ్ణి చూసిన అతివలా ముడుచుకుపోయింది. నా దురదృష్టం. మా మధ్య పెరిగిన దూరాన్ని పూడ్చివేయడానికి నాకు సమయం లేదు. ప్రేయసి మాత్రం సముద్రాన్ని చేరిన నదయింది. గంభీర మానసంలో చిన్నిచిన్ని పూలని పూరించింది. వేసవితో పాటే వెళ్ళిపోతూ తనలో సెగల్ని రగిల్చిపోయాను.

విద్య విజ్ఞానార్ధమా ఉద్యోగార్ధమా అని మీమాంసించకుండానే అందివచ్చిన అవకాశంతో అందలాన్నెక్కాను. మానసిక పతనమని విమర్శించారు సిద్ధాంత మిత్రులు. నాతో నేనే తర్కించుకోని నేను వాళ్ళని సమాధానపరిచే ప్రయత్నం చేయలేదు. నేను జవాబుదారీగా ఉండాల్సింది ఇద్దరికే. మాటల ముత్యాల పేటలతో ప్రియురాలిని వశం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. సమరస సహజీవనానికి తానెన్నడూ సిద్ధమే. తల్లిచాటు బిడ్డకది సహజమే. తనని నాతో సమానమైన మానసిక స్థాయికి రానీయకపోవడం మగతనపు మనోదౌర్బల్యమని నన్ను నిలదీయగలిగింది నా చిన్ననాటి నేస్తం, నా యేరు మాత్రమే.

ఆ విషయమే అడుగుదామని తన దగ్గరికి వెళ్ళాను. తనేమీ చెప్పలేదు. తన ఎదుట నిలబడింది తనలోకి దూకి తన మనసు పొరల్లోకి గుచ్చిగుచ్చి తొంగిచూసే అమాయకపు చిన్నారి నేస్తం కాదు. ఆడంబరాలూ భేషజాలని కప్పుకుని ఆప్యాయత నటిస్తున్న అనుకోని అతిథి. అతిథిని గౌరవించడం తప్ప విమర్శించని ధర్మాన్ని పాటించిందామె.

నా హృదయంలో యేరు పొంగింది. నా ఆలోచనల్నీ ప్రణాళికల్నీ పక్కన పెట్టి మనసులోని కల్మషాలని తోసేసి విలువల వలువల్ని వొలిచేసి బక్కచిక్కిన నా నేస్తాన్ని నా కన్నీటితో నింపెయ్యాలని నిశ్చయించుకున్నాను. అంతలో ”ఇంకో గంటలో ముహూర్తం పెట్టుకుని ఈ యేటి ఒడ్డున వొంటరిగా ఏం చేస్తున్నావం”టూ మేలమాడుతూ లాక్కుపోయారు పెద్దలు. ఈ సంగతెలా తెల్సిందో, అంతవరకూ ముభావించిన పెళ్ళికూతురు, నా ప్రేయసి కన్నుల్లో వెలుతురు పూలు విచ్చుకున్నాయి.

కాని ఆమెకేం తెలుసు. పాతాళగుహలో దాగిన అమృతఝరి అమాయకతకి చేరాలనుకున్నాను తప్ప కనీసం ప్రయాణం కూడా మొదలుపెట్టలేదని, తిరిగి ఛద్మవేషధారినయానని. అందుకే అడిగిందో ఏకాంత క్షణాన ”మనిద్దరమే ఒక్కసారి యేటిదగ్గరకెళదామా. నువ్వు లేనప్పుడెన్నిసార్లు వెళ్ళాలనుకున్నానో తన దగ్గరికి. కానీ ఒంటరిగా వెళ్తే ఏమనుకుంటుందోనన్న దిగులుతో వెళ్ళలేదిన్నాళ్ళూ… మళ్ళీ ఎప్పుడొస్తామో కదా ఇక్కడికి.”

తిరిగి నేను కరగసాగాను. కనుల వెనుక ఆలోచనల మంచు కరిగి గుండె గదికి ప్రవహించి వసివాడని చిర్నవ్వుల సెలయేటి గలగలల గత జ్ఞాపకాల రాతిపొరని చెమ్మగిలజేసి నాలో శీతలించిన నన్ను నాకు పున:పరిచయించి నా చిననాటి నేస్తాన్ని అభిషేకించి పూజించి పలవరించి కలవరించి కావిలించి మరోసారి నన్ను మనిషిని చేసి నా సందిగ్ధతలని నా అయోమయాలని నా నిరాశని నా నిరాసక్తతని నా నిస్తబ్ధతని తరిమేసే వరదై పొంగి పరవళ్ళు తొక్కి నా కనులలో వెలుగు చెమ్మయే క్షణాన…..

పెళ్ళికి అభినందిస్తూ వెంటనే బయలుదేరవలసిన ఔద్యోగికావసరాన్ని గుర్తుచేస్తూ సహోద్యోగులు వెంటపడడంతో హిమశిల మళ్ళీ ఘనీభవించింది. అదే ఆఖరు, నా యేటిని చూడడం.

దొంగ బెబ్బులి కాలం అందరికంటె తుంటరి. సువాసనల అనుభూతుల్ని పంచుతున్నట్టే కన్పిస్తూ ఆవిరైపోయే కర్పూరమది. ఆ వలలోనుంచి ఆవలకు తప్పించుకోవడమెంత సాధ్యమో చెప్పడం కూడా అసాధ్యమే. ఆ మత్తులో పడి లేచేసరికి నేను నేను కాకుండా పోయాను. పరిణామ క్రమంలో మార్పులు సహజమే అయినా మౌలిక హృదయార్ద్రతని కోల్పోవడం విషాదం. నీవు కోరుకున్నది నీవు కోల్పోవడం నీకు తెలియడమే అభిశప్తత. ఆ శాపం మనిషిని కూడా శిలని చేసేస్తుంది.

దాన్ని నేను తప్పించుకోలేకపోయాను. కానీ తప్పించుకోవాలని తపించిపోయాను. నేను ఘనీభవిస్తున్నకొద్దీ నాలో జ్వలనమారంభమయింది. ఒక్కసారి, ఒకే ఒక్కసారి జీవన్మృతుడిని పూర్ణమృతజీవుడినయేలోగా నా చిననాటి నేస్తాన్ని కలవాలని ఆరాటపడిపోయాను. నా ఆవేదనని బాహిరం చేసుకునే అవకాశం కూడా లేని వాతావరణంలోంచి బైటపడలేని నిస్సహాయ స్థితిలో వున్నవాణ్ణి. ‘ఏరు నా నేస్తమం’టే నవ్వని ఒకే ఒక వ్యక్తి నా ప్రియురాలేనాడో నన్ను వీడిపోయింది. భౌతిక ప్రపంచపుటాకర్షణల వెంట పరుగులు పెడుతున్న నా సంతానానికి అనుభూతుల విలువనర్ధం చేసుకునే తీరిక లేదు. సిద్ధాంతాల్ని వల్లించే స్నేహబృందాన్నేనాడో వదిలేశాను. వాళ్ళు తమ చిలుక పలుకులనెత ఆచరిస్తారో నాకు బాగా తెలుసు. ఇంత జీవితంలో నాకంటూ మిగుల్చుకున్న సొంత చిర్నవ్వు ఒక్కటీ లేదు. ఇప్పుడీ సమయాన జీవన సంధ్యాతీరాన్ని చేరుకున్నాక చివరిసారి యేటిముందు నా మనోవికారాలన్నిటినీ కన్నీటి పాటగా పేర్చి హృదయ వేదనా రాగంలో ఆలపించాలన్న ఒకే ఒక్క కోరిక నన్ను దహించసాగింది.

వ్యావహారిక బంధనాలన్నింటినుంచీ తప్పించుకుని కేవలం కట్టుబట్టలతో అక్కడికి చేరాను. నన్ను నేను ప్రక్షాళన చేసుకునే ఆ క్షణం కోసం ఎదురు చూసిన నా ఉద్విగ్నత అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. నా అస్తిత్వానికి ఆలంబన ఎడారిలో ఎండమావయిపోయింది. గతంలో ఆ వూళ్ళో వున్న నా కొద్ది పొలాన్నీ అమ్మేస్తున్నప్పుడు అక్కడి నేల విలువ గురించి విన్న వివరాలు పిడుగుపాటున గుర్తుకొచ్చాయి. నా కళ్ళకీ మెదడుకీ సంబంధం క్రమంగా వీడిపోయిన చివరి క్షణమది.

ఏ నాయకుల రాజకీయ సర్పయాగ ఫలితమో నా యేరు సమాధిపై ఓ జనారణ్యం వెలిసింది.

 

నవ్య వారపత్రిక (21-04-2004) లో ప్రచురితం

4 Comments (+add yours?)

  1. anniyya
    Jan 04, 2016 @ 17:11:54

    what is this sutti

    Reply

  2. vijayanthi
    Aug 05, 2016 @ 17:02:42

    I read this after a pushkaram. excellent presentation. manasuki hattukundi

    Reply

Leave a reply to anniyya Cancel reply