వర్మకీ బుర్ర పనిచేస్తోంది… రామకీర్తన పాడాలి….

చాలా రోజుల తర్వాత రాంగోపాల్ వర్మ కొంచెం సెన్సిబుల్‌గా మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో వర్మ పోచికోలు విషయాల మీద పనికిమాలిన వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ బతికేస్తున్నట్టు అప్పుడప్పుడూ చూసే వార్తలను బట్టి అనిపించేది. అలాంటిది… మత అసహనం లాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ దగ్గరకు వచ్చేసరికి తన నిజమైన శైలిలో చాలా సంప్రదాయబద్ధంగా మాట్లాడాడు.

అవును… సంప్రదాయబద్ధంగానే. అంటే రెండు రకాలుగా ట్రెడిషనల్‌గా. మొదటిది… మత అసహనం వంటి విషయంలో సోకాల్డ్‌ బుద్ధిజీవుల అభిప్రాయాలకు భిన్నంగా సంప్రదాయబద్ధంగా మాట్లాడాడు. సాధారణంగా హిందూ దేవీ దేవతల గురించి రకరకాల వెకిలి వ్యాఖ్యలు చేసే వర్మ నుంచి ఇలాంటి మడిచీర కామెంట్లను ది గ్రేట్‌ మేధోవర్గం జీర్ణించుకోవడం కష్టమే. ఇక రెండోది… అసలు వర్మ శైలే సంప్రదాయబద్ధం అని. సినిమా ప్రమోషన్ల కోసం ఎన్నిరకాల కహానీలు చెప్పినా… బేసిగ్గా వర్మ సినిమాలన్నీ రూల్‌బుక్‌ని కచ్చితంగా ఫాలో అయ్యేవే. సినిమాలోని కథ, కథా సంవిధానం పక్కన పెడితే… సాంకేతిక విషయాలన్నీ నిర్దుష్టంగా ఉంటాయి. కెమెరా, లైటింగ్‌, ఫ్రేమింగ్‌ లాంటి ప్రయోగాలన్నీ ఆ పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. అలా… వర్మ పక్కా సంప్రదాయవాది అని థీరీ. 🙂

రంగేళీ రాజా ఆమిర్‌ఖాన్‌… కడుంగడు బుద్ధిజీవి. సత్యమేవ జయతే అని నినదించిన నిఖార్సయిన దేశభక్తుడు. ఆయనకు ఉన్నట్టుండి దేశంలో మత అసహనం పెరిగిపోతుండడం గురించి ఆవేదన పెల్లుబికింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక మొట్టమొదటిసారి గత ఆరేడు నెలల్లోనే దేశంలో పరిస్థితులు పాడైపోయినట్టు, సర్వనాశనమైనట్టూ తెలిసింది. అది కూడా… తన సంతానం భవిష్యత్తు కోసం తన భాగస్వామి ఆందోళన వ్యక్తం చేసి దేశం వదిలిపెట్టిపోదామన్నప్పుడే అర్ధమయింది. ఆ విషయం గురించి ఆయన తన ఆవేదనను  పబ్లిక్‌ ఫోరమ్‌లోనే చెప్పాడు. అది కూడా కేంద్ర మంత్రి సమక్షంలో. పాపం… తన భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా పోయిందని ఆమిర్‌కు ఆ సమయంలో ఎంత భయం వేసి ఉంటుందో!

ఆ సందర్భంలో సోకాల్డ్‌ అసహనశీలురు ఎవరూ నేరుగా ప్రస్తావించడానికి భయపడే విషయాన్ని వర్మ చాలా సింపుల్‌గా అడిగేసాడు. అయ్యా… 125 కోట్ల భారతదేశం ఆదరించే ప్రపంచంలోని అతిపెద్ద సినీపరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్‌ను ఏలుతున్నది ముగ్గురు ఖాన్‌లు కదా… వారు ముగ్గురూ ముస్లిములే కదా… అయినా వాళ్ళ సినిమాలన్నీ మెజారిటీ హిందువుల దేశంలో సూపర్‌డూపర్‌ హిట్‌లు కదా… వాళ్ళను ఈ దేశం ఐకానిక్‌ సూపర్‌స్టార్లుగా నెత్తిన పెట్టుకుంది కదా… అది కూడా అసహనమేనా? అని అడిగేసాడు. (అన్నట్టు ఇదేదో కరడు గట్టిన హిందుత్వ వాదుల భాషలా లేదూ?… వర్మా సిగ్గుసిగ్గు… వర్మా డౌన్‌డౌన్‌… లాంటి క’ళ్ళెర్ర’జేసే మేధావుల ప్రకటనలు ఇంకా రాలేదా?)

aamir_rgv
అదే సమయంలో వర్మ ఇంకో వాక్యం వదిలాడు…. ఇవాళ్టి రోజుల్లో మనం కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న సమాచారంలో మునిగిపోతున్నాం తప్ప జ్ఞానం మాత్రం కరువయింది.. అన్నాడు. ఈ వాక్యాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. సెల్ఫ్‌ ప్రొక్లెయిమ్డ్‌ మేధావులకు తాము చెప్పిందే జ్ఞానం అన్న ఎరుక ఉంటుంది కదా.. అలాంటప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమకు తగిలేలా వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆ ముక్కని ఎందుకు పట్టించుకుంటారు లెండి. మోదీ అధికారంలోకి వచ్చిన సుమారు ఆరునెలల తర్వాత విడుదలైన ఆమిర్‌ఖాన్‌ సినిమా పీకే… హిందువుల్లోని (అంధ)విశ్వాసాల మీద వ్యంగ్యంగా విరుచుకుపడినప్పుడు పాపం కిరణ్‌రావుకు భయం వేసినట్టు లేదు… అప్పుడు ప్రజలకు జ్ఞానం అవసరం లేదు. ఇప్పుడు మాత్రం సోకాల్డ్‌ మత అసహనం గురించిన జ్ఞానం అక్కరపడిపోయింది.

సగటు ప్రేక్షకుడికి హీరో హిందువా ముస్లిమా అన్నది అనవసరం… తనకు కావలసిన వినోదం పంచుతున్నాడా లేదా అన్నది ముఖ్యం. సగటు పౌరుడికి అసహనం గురించిన చర్చలు అనవసరం. భారీ స్థాయిలో మతకలహాలు జరిగి తన ఇంటికి నిప్పంటుకుంటేనే దానిగురించి ఆలోచిస్తాడు. పరిమాణాత్మకంగా చూసుకుంటే అలాంటి ఘర్షణలు దేశంలో బాగా తగ్గాయన్నది కాదనలేని నిజం. ఆ విషయాన్ని ఒప్పుకోవడం చాలా కష్టం. ఢిల్లీలో చర్చిల మీద దాడులు చేసేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. తర్వాత అవి మతపరమైన దాడులు కావని తెలిసాక కిక్కురుమన్న వారే లేరు. ఈ దేశంలో మావోయిస్టులు చేసే హత్యల గురించి తెలియనివారు లేరు. సాయుధ పోరాటం పేరిట వారు చేస్తే ఒప్పయిన దాడులు…. మత విశ్వాసం పేరిట హిందువులు చేస్తే (చేసారని ఇంకా నిరూపణ కాలేదు, కానీ ఒకవేళ అదే నిజమని అనుకుంటే) మాత్రం తప్పయిపోతాయి. అయ్యా కుల లేదా మత దురహంకారంతో చేసే హత్యలకూ సైద్ధాంతిక పోరాటాలకూ సాపత్యమా అని విరుచుకుపడవచ్చు… మార్గం ఏదైనా ఫలితం ఒక్కటే కదా.

మత అసహనానికి నిదర్శనంగా చూపిన ఘటనలు… మహారాష్ట్రలో దభోల్కర్‌ హత్య… కర్ణాటకలో కల్బుర్గీ హత్య… దాద్రీలో అఖ్లాక్‌ హత్య…! వాటిని ఎవరూ సమర్ధించడం లేదు. కానీ అలాంటి రాజకీయ హత్యలు ఇంతకుముందు దేశంలో ఎప్పుడూ లేవా? అలా ప్రశ్నించడం లౌకిక సామ్యవాదానికి విఘాతకరమట. వామపక్ష నాయకులు గతంలో ఎన్నడూ హత్యలకు గురికాలేదా… వామపక్ష అతివాదులైన మావోయిస్టులు ఇతర పక్షాల వారిని హతమార్చలేదా. కానీ ఈ ఆరేడు నెలల్లోనే దేశం పరిస్థితి భయానకంగా మారిపోయిందా? దాద్రీ హతుడు అఖ్లాక్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు కదా అనవచ్చుగాక… ఇన్ఫార్మర్ల నెపంతో ఎన్ని వందల మంది సామాన్య జనాన్ని బలితీసుకున్నారు? వాటిని నేరుగా సమర్ధించకపోయినా ఏనాడూ వ్యతిరేకించని మహానుభావులకు ఇప్పుడు అఖ్లాక్‌ కుటుంబం మీద జాలీ దయా పెల్లుబికిపోయాయి. అదేం (బిహా)రాజకీయమో అర్ధం చేసుకోవడం కష్టమా!

మైనారిటీలంటే ఈ దేశంలో ముస్లిములు, వారి తర్వాత కొంతవరకూ క్రైస్తవులు మాత్రమే. సిక్కులు, బౌద్ధులు, జైనులు మైనారిటీలు కారు. వారికి హక్కులు, నిధులు, పదవులు, హోదాలు అక్కర్లేదు. ముస్లిములు చెప్పేది మాత్రమే నిజం అన్న భావనలు మెజారిటీ ప్రజల్లో పాతుకుపోయాయి. ఏదైనా అంశంపై ఒక పొల్లుమాట మాట్లాడినందుకు విమర్శిస్తే అది ముస్లిముల భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అని లౌకికవాదులు ఎగిరెగిరి అరిచి ఇల్లుపీకి పందిరేసే వాతావరణం ఉంది. అలాంటి చోట… పక్కా సంప్రదాయవాదిలా… హిందుత్వ ప్రచారక్‌లా వర్మ మాట్లాడాడు. వర్మా.. బీ రెడీ… హిందూ దేవీ దేవతల మీద సొల్లు ట్వీట్లు చేసినట్టు కాదు. త్వరలోనే నీ అవార్డులను నీతోనే వాపస్‌ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతాయి.

Advertisements

5 Comments (+add yours?)

 1. Veerendra
  Nov 24, 2015 @ 23:04:03

  Good one ra

  Reply

 2. kastephale
  Nov 25, 2015 @ 04:23:50

  Simply super,well said

  Reply

 3. nri
  Jan 02, 2016 @ 18:08:01

  well said sir

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: