కశ్మీర్ కీ వో కలీ ఔర్ కభీ నహీ ఖిలేగీ

నాకు 15-16ఏళ్ళ వయసు. మా చుట్టూ ఏం జరుగుతోందో కొంచెం కొంచెంగా ఊహ తెలుస్తున్న సమయమది. సాయంత్రం కొద్దిగా చీకటి పడే వేళకు ఇంటిముందు ఆడుకోడానికి వెడతామంటే కూడా అమ్మా నాన్నా వద్దనేవారు. నేనే కాదు, మా వర్గం పిల్లలందరి పైనా అలాంటి ఆంక్షలే ఉండేవి. ఇంక ఆడపిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇంట్లో నుంచి బైటకే రానిచ్చే వారే కాదు. వాళ్ళకి చదువు, బడి అనేవి ఉండేవే కాదు. ఆ విషయంలో మాత్రం మగ పిల్లలు అదృష్టవంతులే. అలా అని మా ఇళ్ళలో ఆడవాళ్ళంటే వివక్ష ఉండేదని కాదు. ఎప్పుడు ఏ అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోతారో, అత్యాచారం చేసి జీవచ్ఛవాల్లా చేసి విసిరి పారేస్తారో అన్న భయం. మా బంధువుల్లోనే ఇద్దరు ముగ్గురమ్మాయిలు అదృశ్యమైపోవడం, కొన్నాళ్ళకు వారి శవాలు ఊరి చివర దొరకడం నాకు లీలగా గుర్తుంది కూడా.

మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా నాన్నగారి అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ వాళ్ళందరి కుటుంబాలూ కలిసి ఉండేవి. మా తాతయ్య కట్టించిన మూడంతస్తుల మేడలోనే అందరం కలిసుండేవాళ్లం. పిల్లమూక అందరం కలిసి మేడపైకెక్కి ఆడుకుంటుంటే ఎంత సందడిగా ఉండేదో. కానీ ఆ భోగం అరగంట కూడా ఉండేది కాదు. ఆరుబైట ఆడుకోడం ప్రమాదకరమంటూ ఎవరో ఒకళ్ళు వచ్చి మమ్మల్ని ఇంట్లోకి తీసుకుపోయేవారు. బాల్యపు మా కుతూహలం భయాన్ని లెక్క చేసేది కాదు, కానీ అమ్మానాన్నలు చెప్పిన మాట జవదాటే వాళ్ళం కాదు.

కొందరి పలకరింపులకు నవ్వుతోనే బదులిచ్చే వాళ్ళం తప్ప పెద్దగా మాట్లాడేవాళ్ళం కాదు. గుండెలు బితుకు బితుకు మంటూనే ఉండేవి. వాళ్ళలో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో.. ఎవరు ఎప్పుడు కాల్చేస్తారో తెలీదు. దానికి చిన్నా పెద్దా తేడా లేదు. తేడా అల్లా మతమే. వాళ్ళ ప్రార్థనాలయాల మీద మైకుల నుంచి వాళ్ళని మన మతంలోకి మార్చండి, ఒప్పుకోని కాఫిర్లను చంపి పారేయండిఅన్న మాటలు గాలితరగల మీద నుంచి తేలుకుంటూ వచ్చి, ఇళ్ళలో తలుపులు వేసుకుని కూర్చున్న మా చెవుల్లో గింగిర్లు తిరుగుతుండేవి. అలాంటి బహిరంగ బెదిరింపులు వినిపించిన ప్రతీసారీ తల్లికోడి తన పిల్లల్ని రెక్కల కింద అదుముకున్నట్టు అమ్మ మమ్మల్ని దగ్గరకు తీసుకునేది.

ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది 1947లోనే కావచ్చు. అప్పటికి నేను పుట్టలేదు. అప్పటి గొడవల్ని నేను ప్రత్యక్షంగా చూడలేదు. పాకిస్తాన్ కన్ను కశ్మీర్ మీద ఉన్నప్పటికీ 1950 తర్వాత గొడవలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. 30 ఏళ్ళు ఒకమోస్తరు సాఫీగా గడిచాయేమో.* మళ్ళీ 80ల నుంచీ టార్చర్ మొదలైంది. 90ల నాటికి అది పరాకాష్టకు చేరుకుంది. ఆ దశలోని సంఘటనలే నేను చెబుతున్నవి.

ఒకరోజు రాత్రి నాన్న మమ్మల్నందరినీ లేపేసారు. కళ్ళు నులుముకుంటూ బైటకు హాల్లోకి వచ్చాం. పెదనాన్నలు పెద్దమ్మలు చిన్నాన్నలు చిన్నమ్మలు అత్తయ్యలు మావయ్యలు కూడా వచ్చేసారు. పెద్దవాళ్ళ చేతుల్లో కొన్ని సంచీలున్నాయి. అంత చీకట్లో ఆ ప్రయాణం మాపిల్లలందరికీ మహా సరదాగా అనిపించింది. మాకు అసలు సంగతి పూర్తిగా తెలీదు కదా. కొన్ని కిలోమీటర్ల దూరం చల్లటి గాలిలో నడిచాం. నిద్దర్లు వదలని పిల్లలని అమ్మలో నాన్నలో ఎత్తుకున్నారు. పెద్దవాళ్ళందరి ముఖాల్లో ఆవేదన. చివరికి ఎప్పటికో మేం ఓ శిబిరాల సమూహం దగ్గరకు చేరుకున్నాం. పెద్ద కుటుంబం కావడంతో మాకందరికీ ఒక డేరా కేటాయించారు. పిల్లలందరం వెంటనే నిద్రపోయాం, పెద్దవాళ్ళు మాత్రం ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు.

పొద్దున్న లేచాక అందరం కాలకృత్యాలు తీర్చుకున్నాం. అందరికీ ఒకటే బాత్రూం, ఒకటే టాయిలెట్. మా ఇంట్లో మూడంతస్తుల్లోనూ వేరేవేరేగా ఉండేవి. మొదట్లో మాకు ఈ తేడా దేనికో తెలీలేదు. కొన్ని రోజులు బాగానే గడిచిపోయాయి. తర్వాత మాకు ఆ శిబిరం బోర్ కొట్టేసింది. ‘అమ్మా, మనింటికి వెళ్ళిపోదామేఅంటూ మారాం చేసేవాళ్ళం. పెద్ద పిల్లలకి విషయం కొద్దికొద్దిగా అర్ధమైనాఇంటి బెంగతో అక్కడికే వెళ్ళిపోదామంటూ గోల చేసే వాళ్ళం. మమ్మల్ని సముదాయించ లేక, కొట్టకుండా ఉండలేక నానా యాతనా పడేవారు. అంతలో ఒకరోజు ఒక వార్త వచ్చింది. మేం ఢిల్లీ వెళ్ళిపోతున్నామట.

ఢిల్లీఢిల్లీఢిల్లీ…. కొన్నాళ్ళు పిల్లలకు అదో సరదాగా ఉండేది. పెద్దవాళ్ళు మాత్రం ఏంటేంటో మాట్లాడుకునే వారు. తిట్టుకునేవారు, అరుచుకునేవారు. చచ్చినా సొంతూరు వదిలి ఎక్కడికీ కదిలే ప్రసక్తే లేదంటూ ఆడవాళ్ళు కన్నీళ్ళ పట్టు పట్టుక్కూర్చునే వారు. కదలకపోతే చచ్చిపోతామంటూ మగాళ్ళు హెచ్చరిస్తుండేవారు. డేరాల దగ్గర దొరికే బులెట్ల, బాంబుల ఖాళీ షెల్స్ మాకు ఢిల్లీలో దొరుకుతాయా లేదాఅవి లేకపోతే ఆడుకోడం ఎలా? వంటి సందేహాలు మా పిల్లల బుర్రలు తొలిచేస్తుండేవి. కొద్దిరోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోడానికి ఏర్పాట్లు జరుగుతుండగా…. అమ్మ చచ్చిపోయింది.

అలాగే ఢిల్లీ వెళ్ళిపోయాం. వెళ్ళిన రోజే మా ఉత్సాహం నీరు కారిపోయింది. రోడ్డు పక్కన పేవ్ మెంట్ మీద టెంటులో ఎందుకుండాలో అర్ధం కాదు. అక్కడి మా ఇంటికి వెళ్ళిపోదామంటే వినిపించుకోరు. ఇక్కడేం చేయాలోఎన్నాళ్ళిలా గడపాలో అనుకుంటూ ఉండేవాళ్ళం. మా సరదాలన్నీ చచ్చిపోయాయి. ఎటు చూసినా నిరాశ, నిరాసక్తతే (మాయూసీ). దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగేవాళ్ళం. ఎప్పటికైనా శ్రీనగర్ లోని మా మూడంతస్తుల మేడకు వెళ్ళిపోతామన్న కల మాత్రం ఉండేది. కొన్నాళ్ళకు అదీ తీరిపోయింది. ఆ ఇంటిని ఎవరో తమ సొంతం చేసేసుకున్నారట. ఆ విషయంలో మా బంధువుల్లోనే కొందరు నాన్నని తిట్టేవారు. ‘ఆ బెదిరించిన వాళ్ళు ఎంతో కొంత ముట్టజెబుతామన్నారు కదావాళ్ళకి ఇల్లు అమ్మేసి ఉంటే నాలుగు డబ్బులైనా వచ్చేవి కదాసెంటిమెంటల్ ఫూల్ లా ప్రవర్తించావుఅనేవారు. అలాంటి వారికి నాన్న ఎప్పుడూ జవాబివ్వలేదు.

ఎప్పటికైనా ఎలాగైనా కశ్మీర్ వెళ్ళిపోవాలన్న మా కలలు నెరవేరలేదు. శ్రీనగర్లోని మా ఇంటిని కూల్చేసారని, ఆ స్థలాన్ని ఆక్రమించేసుకుని కొత్తగా ఇల్లు కట్టుకున్నారనీ తెలిసిన నాడు ఒంట్లో ఏదో నరం తెగిపోయింది. కొన్నాళ్ళకే నాన్న మాకు దూరమయ్యారు. తర్వాత మా గతి మా చేతిలో లేకుండా పోయింది. ఢిల్లీ రోడ్ల మీదే పెరిగాం. ఏవో చదువులు చదువుకున్నాం. ఎలాగోలా డిగ్రీలు పూర్తి చేసాం. అప్పుడే ఈ ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ వచ్చేసాను.

మీ భాగ్యనగరంతో మాకు ఫిర్యాదులూ లేవు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ నాకు కావలసింది లేదు. ఆఫీసులో మీతో సరదాగా కబుర్లు చెప్పే నేను నేను కాను. ఈ చీకట్లో మగ్గిపోతూ నా ఇంటికి, నా వాళ్ళకి దూరమైన వేదనతో ఏడుస్తున్న నేనే నిజమైన నేను……

***** ***** ***** ***** ***** *****

చెట్టంత మనిషి అలా ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు. భట్ కొన్ని నిమిషాల్లో తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. పద అలా వెళ్ళి చాయ్ తాగొద్దాం అన్నాను. అలా రోడ్లెక్కి దగ్గరి థియేటర్ లో ఆడుతున్న హిందీ సినిమా గురించి, ఇంకా నానా సోది సబ్జెక్టుల గురించీ కబుర్లు చెప్పుకున్నాం.

మా డెస్క్ ఒక నానాజాతి సమితిలా ఉండేది. కనీసం పది రాష్ట్రాలకూ, వేర్వేరు భాషలకూ చెందిన సుమారు పాతిక మంది కలిసి పనిచేసేవాళ్ళం. ఆ గ్రూప్ లోని కశ్మీరీ పండిట్ మిత్రుడి గదికి వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ అది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ మా గ్రూప్ లో కశ్మీర్ గురించి చర్చలు జరుగుతుండేవి. కానీ అవెప్పుడూ అంత ఎమోషనల్ స్థాయికి చేరుకోలేదు. బహుశా 2005-2006 నాటి సంఘటన ఇది. నాలుగైదేళ్ళ తర్వాత భట్ కి ఆ ఛానెల్లోనే జమ్మూలో రిపోర్టింగ్ ఛాన్స్ వచ్చింది, మరికొన్నాళ్ళకి నేను ఆ ఛానెల్ వదిలిపెట్టేసాను.

ఇప్పుడు కశ్మీరీ పండితులను సొంతగడ్డకు ఆహ్వానిస్తూ అక్కడి రాష్ట్రప్రభుత్వం ప్రకటనలు చేస్తుండడం, దాన్ని ప్రతిపక్షాలూ, వేర్పాటువాదులూ వ్యతిరేకిస్తుండడం చూస్తుంటే ఆనాటి మా సంభాషణ మళ్ళీ గుర్తుకొచ్చింది.

***** ***** ***** ***** ***** *****

మీ పండిట్లను మళ్ళీ వెనక్కి కశ్మీర్ లోయలోకి తీసుకెళ్ళాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా….

నిజమే. కానీ అది సాధ్యం కాదు. ప్రభుత్వం మాకు విడిగా కాలనీలు కట్టి సెక్యూరిటీ ఇచ్చినా కూడా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు.

అదేంటది?

అవును. మా ఇళ్ళన్నీ ఆక్రమించేసుకున్నారు, కబ్జాలు చేసేసారు. ఏ కొద్దిమందో అప్పట్లో నామమాత్రపు ధరకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు అవి కొనుక్కునేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

మరి సెక్యూరిటీ యాంగిల్ ఏంటి?

ఇప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళెవరు? మా తల్లిదండ్రులనూ మా అన్నదమ్ములనూ చంపేసిన వాళ్ళే. మాఅక్కచెల్లెళ్ళను చెర పట్టి మానభంగాలు చేసినవాళ్ళే. అలాంటి వాళ్ళ మధ్యకు ప్రాణాలకు తెగించి వెళ్ళాలంటే మాతృభూమి అన్న ఒకే ఒక సెంటిమెంట్ కోసం వెళ్ళాలి. అప్పుడైనా మా భద్రతకు గ్యారంటీ ఏమీ ఉండదు.

అదేం?

మాకు ఇళ్ళంటూ ఇస్తే రెండు రకాలుగా ఇవ్వాలి. అయితే ప్రత్యేక కాలనీలైనా కట్టాలి, లేదా నివాస ప్రాంతాల్లోనే మాకు ఇళ్ళు కేటాయించాలి. కాలనీలు కడితే…. వాళ్ళకి మేం ఎక్కడున్నామో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు మమ్మల్ని చంపడం వాళ్ళకి మరింత సులువు. అలా కాకుండాఊళ్ళలోనే నివాస ప్రాంతాల్లోనే మాకు ఇళ్ళు కేటాయిస్తేవాళ్ళ మధ్యలో మేముండాలి. వాళ్ళు పదిమంది ఉంటే మేం ఒకళ్ళమో ఇద్దరిమో ఉంటాం. అప్పుడు కూడా మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఏ క్షణంలో వేటు పడుతుందో తెలీదు. పోలీసులూ, జవాన్లూ 24గంటలూ పహరా ఉండలేరు కదా. అంటేబొమ్మ పడినా, బొరుసు పడినా మాకు చావు తప్ప మరో మార్గం లేదు.

అందుకేనా కొత్త తరం పండిట్లు లోయకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు?

అదో విచిత్రమైన లాజిక్. మా కష్టాలు మా తర్వాత తరాలకు తెలీవన్నది నిజమే. కానీ వారిలో చాలామంది సొంతగడ్డకు వెళ్ళడానికి ఇష్టంగానే ఉన్నారు. ఐతే.. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలి? వ్యవసాయం, వ్యాపారం వంటి సంప్రదాయిక వృత్తుల్లోకి వెళ్ళాలి, అంతే. ఇన్నాళ్ళూ ఢిల్లీ లాంటి నగరంలో పుట్టి పెరిగిన మా తర్వాతి తరాలకు ఆ పనులు పూర్తిగా చేత కావు. మరోవైపు దేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు సాఫ్ట్ వేర్, టెక్నాలజీ వంటి రంగాల్లో హైలీ పెయిడ్ శాలరీస్ సంపాదించుకుంటుంటే మేం మాత్రం మా సొంతింటి కష్టాల్లో వెనుకబడిపోతుంటాం. ఓ పక్కన సరిహద్దులకు అవతల నుంచి వాళ్ళకు హార్దికంగానూ ఆర్ధికంగానూ పూర్తిస్థాయి సహకారం అందుతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసుకోడానికి కూడా ఫుల్ టైమ్ కేటాయించడానికి కూడా రెడీగా ఉంటారు. మేం ఒక పక్కన మా రోజీ రోటీ చూసుకుంటూ ఉండాలి, ఇంకో పక్కన వాళ్ళ బెడదని ఎదుర్కొంటూ ఉండాలి. ఎటునుంచి ఏ కత్తి, ఏ బాంబు ఎలా వచ్చి ప్రాణాలు తీస్తుందో అన్న టెన్షన్ అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. అన్ని రిస్కులు తీసుకుంటూ ఉండడం దేనికి అనుకోడం తప్పా? కాదు. కానీ, దాన్ని కొత్తతరం కశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా చిత్రించడం పరిపాటి అయిపోయింది. వాళ్ళకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని చిత్రీకరించివారి మూలాలను తెంచేసే ప్రయత్నం ఇది. దీనికి సొల్యూషన్ ఏమీ లేదు.

అంటే

అంటే ఏముంది? ప్రాణాలకు తెగించి వెళ్ళగలిగితే వెళ్ళి ఉండాలి. వెళ్తే వాళ్ళు చంపేస్తారు. వెళ్ళకపోతే మా జన్మభూమి మీద మాకు ప్రేమ లేదంటారు. ఎటునుంచి ఎలా చూసుకున్నా మాది లూజ్ లూజ్ సిట్యువేషన్. ఈ సమస్యని పరిష్కారం చేయాల్సిన టైంలో చేయలేదుఇప్పుడు చేస్తామని చెప్పేవాళ్ళున్నా**, అవన్నీ నాలుక చివరి మాటలే. ఆ కబుర్లన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే. జమ్మూలోనో లెహ్ లోనో మాకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయవచ్చేమో కానీఅవన్నీ కంటితుడుపుళ్ళే.

***** ***** ***** ***** ***** *****

జమ్మూకశ్మీర్ లో పీడీపీ బీజేపీ విచిత్ర అష్టావక్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నడుస్తున్న డ్రామాల మధ్యలో మరోసారి కశ్మీరీ పండిట్లకు స్వస్థలాల్లో మళ్ళీ ఇళ్ళ అంశం తెర మీదకు వచ్చింది. పండిట్లకు ఇళ్ళు కట్టివ్వడానికి స్థలం సమీకరించాలని కేంద్రం రాష్ట్రాన్ని అడిగింది, రాష్ట్రం దానికి సానుకూలంగా స్పందించింది. వెంటనే కాంగ్రెస్, ఎన్సీలు మండిపడ్డాయి. పండిట్లు కూడా కశ్మీరియత్ లో భాగమే కాబట్టి వారికి వేరుగా ఇళ్ళు కట్టించి ఇవ్వకూడదనీపండిట్లను వేర్పరచకుండా వారిని తమతో సమైక్యంగా ఉంచేలా చేయాలనీ…. ప్రముఖ వేర్పాటువాద నేతలు డిమాండ్లు చేస్తున్నారు. ప్రత్యేక కాలనీల నిర్మాణంతో పండిట్ల మనసులో వేరు భావాలు మొలకెత్తుతాయట. అది మంచిది కాదటఈ మాటలు చెబుతున్నది తన రోగానికి మూడునెలల పాటు ఢిల్లీలో చికిత్స తీసుకుంటూ పాకిస్తాన్ పాట పాడిన జేకేఎల్లెఫ్ యాసిన్ మాలిక్నాలుగేళ్ళ క్రితం కశ్మీర్లో బాంబు దాడులు చేయించి వందమందిని పొట్టన పెట్టుకున్న మసరత్ ఆలం వంటి మహానుభావులు. ఆ మాటలు వింటుంటే ఇక్కడ తెలుగు గడ్డ మీద కూచున్న మనకే ఒళ్ళు మండిపోడం లేదూ. గంగా జమునా తెహజీబ్ వంటి దొంగ మాటలు చెబుతూ లౌకికవాదపు నాటకాలాడే మానవ హక్కుల ముఠాల, రాజకీయ పార్టీల నాయకుల అసలు రంగులు తెలిసిన వారికి కశ్మీరీ పండిట్ల కన్నీటి వ్యథ ఆవేదన కలిగించడం లేదూ!!!

పాద పీఠికలు :

* ఆ సమయంలో పాకిస్తాన్ దృష్టి పంజాబ్ ను విరగ్గొట్టి ఖలిస్తాన్ ఏర్పాటు చేయడం మీద ఉన్నట్టు గుర్తు. ఆ ప్రయోగం వికటించిన తర్వాతే పాకిస్తాన్ కన్ను మరోసారి కశ్మీర్ పై పడింది.

** మా భట్ ఆ మాట చెప్పిన సందర్భంలో కశ్మీర్ లో గులాం నబీ ఆజాద్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: