ఇద్దరు దేవుళ్ళు… ఒక మాత… కొన్ని మనోభావాలు

పవిత్ర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మతాలు రెండు.. ఒకటి క్రికెట్‌రెండు సినిమా. ఈ రెండు రంగాలకు చెందిన డెమీ గాడ్స్‌పై చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడిపోయే భక్త జనులు కోకొల్లలు. అలాంటి భక్తులను అడ్డు పెట్టుకుని తాము చెప్పిందే వేదంతాము చేసిందే గొప్ప అని భావిస్తూ చెలరేగిపోతుంటారు ఈ దైవాలు. బంగారు పళ్ళేనికైనా గోడచేర్పు ఉండాలన్న సామెత సామాన్య ప్రజలకు ఎంత తెలుసో కానీ ఈ డెమీ గాడ్స్‌కి మాత్రం బాగా తెలుసు. అయితే వీరు ఆనుకునే గోడలు.. విచిత్రంగా తమను అభిమానించి పూజించే ప్రజలు కాదు, తమ రంగాలకు చెందిన తెర వెనుక సూత్రధారులు లేదా గర్భగుడిలోని మూలవిరాట్టులు, వారి వెనుక ఉండి నడిపించే రాజకీయ నాయకులు. ఒకోసారి ఈ డెమీ గాడ్స్‌కీ, వారి సూత్రధారులకూ చిన్నచిన్న ఘర్షణలు తలెత్తుతుంటాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుని తమ దైవత్వానికి ఎలాంటి ఆటంకమూ కలక్కుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సాధారణంగా ఈ సూత్రధారులు కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేస్తుంటారు. అలాంటి నియమ నిబంధనలు ఒక్కోసారి ఆ దేవుళ్ళ భక్తులకు నచ్చవు. ఇంకా చెప్పాలంటే కడుపు మంట పుట్టిస్తాయి కూడా. అయినాఈ మూలవిరాట్టులు ఎంతమాత్రం చలించరు. అవసరాన్ని బట్టి కొంత స్పందించినట్టు కనిపిస్తారు కానీదైవాలకే బలాన్నిచ్చే తమ శక్తిని భక్తుల్లాంటి అల్పజీవులకోసం వృధా చేసుకోడం అనవసరం అని వారికి తెలుసు.

సినిమా దేవుళ్ళ విషయానికి వస్తే వారికి అలాంటి గోడ చేర్పులు లేదా సూత్రధారులు లేదా మూల విరాట్టుల్లో ప్రధానమైనది సెన్సార్‌ బోర్డ్. ఆ పై దశలో రాజకీయ నాయకులు ఉంటారనుకోండి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఈ మధ్య ఈ దైవాలకు సాధారణ స్థాయి భక్తులకు ఉచిత దర్శనం ఇవ్వడం సరిపోవడం లేదు. హుండీలు వందల కోట్ల మార్కు దాటాలంటే స్పెషల్‌ దర్శనాలు ఇవ్వక తప్పడం లేదు. అలాంటి స్పెషల్‌ దర్శనాల్లో ప్రధానమైనది సంచలన లేదా వివాదాస్పద దర్శనం. దేవుణ్ణి మామూలుగా దర్శించుకోడం కంటె స్పెషల్‌గా దర్శనం చేసుకోడం మీదనే ఎక్కువ మంది భక్తులకు ఆసక్తి ఉంటుంది. ఆ ఫార్ములాను ఆసరా చేసుకుని ఈ స్పెషల్‌ కోటా దర్శనాలు ఇస్తుంటారు దేవుళ్ళు. వాళ్ళకి ఈ సూత్రధారులు అవసరమైన సహాయమూ అందిస్తుంటారు. భక్తులకు సాధారణంగా అర్ధం కాని విషయం ఏంటంటే ఉత్సవ విగ్రహాలలాంటి ఈ డెమీగాడ్స్‌కూ, వరాలిచ్చే మూలవిరాట్టులకూ మధ్య చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినప్పుడు ఈ భక్తులను అడ్డం పెట్టుకుని ఇద్దరూ ఆడుకుంటారు. ఆటలో వారిద్దరిలో ఎవరో ఒకరిది పైచేయి అవడం ఖాయం కానీ మధ్యలో వెర్రివెధవలయ్యేది మూఢ భక్తులే. అప్పుడప్పుడూ ఈ సోకాల్డ్ భక్తుల మనోభావాలు గాయపడుతూ ఉంటూంటాయి. కానీ సదరు గాయాలకు మలాము ఎలా రాయాలన్నది ఆ డెమీగాడ్‌, మరియు మూల విరాట్టు మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ ఉత్సవ మూర్తులో లేక మూలవిరాట్టులో తమతమ అవసరాల మేరకు తమ సన్నిహిత భక్తులతో మనోభావాలు గాయపడే నాటకాలు కూడా ఆడిస్తుంటారు.

కొన్నాళ్ళ క్రితం కమల్‌హాసన్‌ అనే దేవుడు విశ్వరూపం చూపించాలని ప్రయత్నించాడు. అదే సమయంలో తమిళనాడులో అంతకంటె మహాదైవం స్థాయిలో ఉన్న అమ్మవారు ఈ విశ్వరూపం మీద కినుక వహించారు. ఆ పోరులో కమల్‌దైవం జయఅమ్మవారి చేతిలో ఒకరకంగా ఓడిపోయాడు. అమ్మవారు ఈ విశ్వరూపి మీద ఆధిక్యం సాధించడానికి ప్రయోగించిన అస్త్రం ముస్లిముల మనోభావాలు గాయపడడం. ఆ బ్రహ్మాస్త్రానికి, క్షమించాలి, అల్లాస్త్రానికి విశ్వరూపి విలవిలలాడిపోయాడు. చివరికి సదరు గాయపడిన మనోభావాలకు అమ్మవారు చికిత్స చేయడంతో విశ్వరూపి ఊపిరి పీల్చుకోగలిగాడు. అన్నట్టు అంతకుముందు అదే విశ్వరూపుడి వల్ల కొన్ని హిందూ వర్గాల మనోభావాలు కూడా గాయపడ్డాయి. వారూ తమకు కావలసిన మలాము ఇదీ అని ఆ మూడ భక్తులు కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ భక్తులు అమ్మవారి భక్తులు కాకపోవడంతో వారి మనోభావాలకు తగిలిన గాయాలు చర్చనీయాంశం కాలేదు. ఆ భక్తులకు తమిళదేశంలో పెద్దగా సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఈ దేవుడు కూడా పట్టించుకోలేదు. అంటేభక్తుల మనోభావాలను గాయపరిచే హక్కు దైవాలకు ఉంటుంది కానీ ఆ గాయాలకు మందు పూయాల్సిన బాధ్యతను వారు భుజాలకెత్తుకోవడం అనేది ఆ భక్తుల ఒరిజినల్ మతాలకు అప్పటికి ఉన్న బలాబలాలను బట్టి మాత్రమే ఉంటుందన్న మాట.

ఇటీవల ఇద్దరు దైవాలకు సంబంధించిన చలనచిత్రాలు వివాదాస్పదమయ్యాయి. అవి ఆయా దైవాలు ఉద్దేశపూర్వకంగా చేసినవా కాదా అన్నది కాసేపు పక్కన పెడదాం. ఇద్దరు దైవాలకూ సెన్సార్‌ స్థాయిలో మూలవిరాట్టు మాత్రం ఒక్కరే. రెండు సందర్భాల్లోనూ వివాదం మనోభావాలు గాయపడడమే. కానీ సెన్సారు మాత కరుణ ఒక దైవానికి ఒకలా కరుణించింది, మరో దైవానికి మరొకలా కోసిపారేసింది. అంతే కాదుమొదటి దైవాన్ని తాను కరుణించిన తీరున రెండో దైవాన్ని తనకంటె బలమైన మరో మూలవిరాట్టు కరుణిస్తే…. సహించలేకపోయింది. ఆ రాజకీయ గోడ బలమైనది కావడంతో ఈ సెన్సారు గోడ కూలిపోయింది. అది తర్వాతి విషయం. ఇంతకీ ఇద్దరు డెమీగాడ్స్‌ పట్లా సెన్సారు మాత వేర్వేరు స్టాండ్స్‌ తీసుకోడానికి కారణాలేంటి?

మొదటగా ఆమిర్‌ఖాన్‌ అనే డెమీగాడ్‌ మహిమలను వెల్లడించే పీకే అనే సినిమా వచ్చింది. సాధారణ రెలిజియస్‌ గాడ్స్‌, గాడ్‌మెన్‌ గురించి చర్చించడమే ఆ చిత్రం ఇతివృత్తం. బాగుంది, బహు బాగుంది. నామమాత్రంగా ఇస్లాం, క్రైస్తవ మతాలను ఉపరిస్పర్శ చేసినప్పటికీ ప్రధానంగా హిందూమతంలోని బహుళ దైవాల విధానం, దొంగబాబాల లీలలను తూర్పారపట్టడం మీదనే దృష్టి సారించింది. ఉగ్ర హిందుత్వ మూఢ భక్తులు దానిపై ఆగ్రహించారు. తమ మనోభావాలు గాయపడ్డాయంటూ వీధులకెక్కారు. గోలగోల చేసారు. మహాపెద్ద మూలవిరాట్టు అండ తమకుంటుందేమో అన్న భ్రమతో చెలరేగిపోయారు కూడానూ. ఐతే ఆమిర్‌ దైవం చలించలేదు. నిర్మాతదర్శక పూజారులు కరుణించలేదు. సెన్సారు మాత తమకు సర్టిఫికెట్‌ ఇచ్చేసినందున భక్తుల మనోభావాలను పట్టించుకోడం అవసరం లేదని తేల్చేసారు. ఆ సమయంలో సెన్సారు మాత సినీదైవానికి అండగా నిలబడింది. సినిమాను క్షుణ్ణంగా పరిశీలించామనీఅందులో అభ్యంతరకరమైన అంశాలేమీ లేవనీమనోభావాలు గాయపడ్డాయంటూ రగడ చేయడం కళాకారుల సృజనాత్మకతను అణిచేయడమేననీ వ్యాఖ్యానించింది. చివరికి అరిచి అరిచి గోలచేసిన మూఢ భక్తులు మూగనోము పట్టారు. సినీదైవం హుండీ వందల కోట్లతో నిండిపోయి రికార్డులు సృష్టించింది.

111

ఇప్పుడు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ అనే గాడ్‌మాన్‌ టర్న్‌డ్‌ డెమీగాడ్‌ తీసిన మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ అనే సినిమా వంతు వచ్చింది. ఈ సినీదైవం గారు తమ సినిమాలో మాయలూ మంత్రాలూ చేస్తూంటారు, వాటిని లోక కళ్యాణం కోసం వాడుతూంటారు, ప్రజలను మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్‌ వంటి ఉపద్రవాల నుంచి కాపాడడానికి ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ఈ చిత్రానికి సెన్సారు మాత సర్టిఫికెట్‌ ప్రసాదం పెట్టకుండా మోకాలడ్డారు. అక్కడ గొడవ మొదలైంది. దానికి ఆ మాత చెప్పిన కారణంఆ చిత్రానికి కనీసం ప్రదర్శన అర్హత కూడా లేదట. ఎందుకంటే ఆ సినిమా కొన్ని మతాల మనోభావాలను దెబ్బతీసే ప్రమాదం పొంచివుండడమేనట. అందువల్ల ఆ సినిమాను ప్రజలు చూడకుండా తాను చేయగలిగినంతా చేస్తుందట.

అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్నట్టుతాను మొదటికే గాడ్‌మాన్‌, ఆపైన సినీ డెమీగాడ్‌గా అవతరించే ప్రయత్నంలో ఉన్నాడుఅలాంటి గుర్మీత్ రాం రహీం ఎందుకు ఊరుకుంటాడు? సెన్సార్‌ మాతతో తెగని పేచీని పై స్థాయికి వెళ్ళి సర్దుబాటు చేసుకున్నాడు. ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకున్నాడు. సదరు ట్రిబ్యునల్‌ రెండు చిన్నచిన్న సర్దుబాట్లతో ఆ సినిమా విడుదలకు సర్టిఫికెట్ మంజూరు చేసేసింది. అయితే ఆలోగా మరికొందరు చిన్నచిన్న మూల విరాట్టులు తమ భక్తులతో మనోభావాలు ఆట మొదలుపెట్టారు. దాంతో సర్టిఫికెట్‌ వచ్చిన తర్వాత కూడా బొమ్మ విడుదల చేసుకునే అవకాశం లేకుండా పోయింది డెమీగాడ్‌ టర్న్‌డ్‌ గాడ్‌మాన్‌ గారికి. ఈయనకు మహాపెద్ద మూలవిరాట్టు కుటుంబంతో సంబంధాలున్నాయన్న వార్తలూ ఉన్నాయి కానీ అవేవీ సినిమా విడుదలకు (కనీసం ఇప్పటివరకూ) సాయపడలేక పోయాయి.

పీకే స్వామి వారు ప్రజలకు మేలు చేస్తారుగాడ్‌గారి మెసెంజర్‌ గారు ప్రజలకు కీడు చేస్తారుఅని సెన్సారు మాత సూత్రీకరించేసారన్న మాట. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ పీకే స్వామికి అనుకూలంగా ఘాట్టిగా నిలబడిన సెన్సారు మాతదైవ దూత విషయానికి వచ్చేసరికి ప్లేటు తిరగేసారు. తన కంటె పెద్ద గోడదే పైచేయి అయేసరికి ఏకంగా రాజీనామా చేసేసారు. తన భావ ప్రకటనా స్వేచ్ఛకి ఎవరు అడ్డొచ్చినా సహించేది లేదంటూ రాజీనామాస్త్రం ప్రయోగించారు. ఇంతకీ ఈ కొత్త సినీదైవం కావాలనుకుంటున్న గాడ్ మాన్ అంటే ఎందుకంత విముఖత? ఈ సెన్సారు మాతకి ఆశ్రయం కల్పించిన మూలవిరాట్టు, ఆ గాడ్‌మాన్‌ కు అండగా నిలుస్తున్న మూలవిరాట్టుకూ రాజకీయ మతంలో ప్రబల శత్రుత్వమే ప్రధాన కారణమట.

ఆమిర్‌ దైవానికి సినీమతంలో భారీ పాపులారిటీ ఉంది. కోటానుకోట్ల మంది భక్తులు ఇప్పటికే ఉన్నారు. పైగా ఆయనేం చేసినా అది సెక్యులరిజం అనే పవిత్రత సంతరించుకుంటుంది. అందుకే హిందూ, ముస్లిం లాంటి తుచ్ఛమతాల అడ్డుగోడలు ఆ సినీదైవానికి వర్తించవు. ఏదో కాలం కలిసిరాక ఇప్పటి రాజకీయ మహా మూలవిరాట్టు విషయంలో నోరెత్తకుండా ఉంటున్నాడు కానీ గతంలో ఇదే మహా మూలవిరాట్టుకు వ్యతిరేకంగా నిలిచినవాడే. అందువల్ల ఆయన పీకే స్వామి అవతారంలో హిందూమతంలోని దురాచారాలను దునుమాడడంలో ఏ తప్పూ లేదు. దానికి ఆ తుచ్ఛమతంలోని ఆమిర్ దైవం భక్తులు సైతం మద్దతిస్తారు. అందుకే కొందరు చేసిన రగడను దేశం మొత్తం ముక్తకంఠంతో గర్హించింది, ఖండించింది, పీకే స్వామి దర్శనం చేసుకుని కోట్లకు కోట్లు అప్పగించింది.

మరి కొత్త సినీదైవంగా అవతరిద్దామనుకుంటున్న గుర్మీత్ రాం రహీం సింగ్ సంగతేంటి? ఆయన తుచ్ఛమతాల్లో సిక్కిజానికి చెందిన వాడు. సచ్చా సౌదా పేరిట సొంత డేరా కట్టుకున్న వాడు. ఉత్తరాదిన ఐదారు రాష్ట్రాల్లో కొన్ని కోట్లమందిని భక్తులుగా మలచుకున్న వాడు. దక్షిణాదిలోనూ పెద్దసంఖ్యలో ఉండే సిక్కులను తన డేరాలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వాడు. ఆ డేరా మాటున బోలెడు అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ కోకొల్లలుగా కలిగిన వాడు. అంటే నిఖార్సైన గాడ్ మాన్ అన్నమాట. ఇప్పుడు సాధారణ తుచ్ఛమతాల స్థాయిని దాటి సినీమతంలోనూ దైవంగా నిలవడానికి సొంత కాళ్ళ మీద ప్రయత్నిస్తున్న వాడు.

ఇక్కడ ఈ డేరాల పూర్వాపరాల గురించి కొంచెం అర్ధం చేసుకోవాలి. హిందూ మతంలో కుల వ్యవస్థ వంటి అమానుష దురాచారాలున్నాయన్న  ఉద్దేశంతో, ఇస్లాం మతంలో కొన్ని గొప్ప, కొన్ని చెడ్డ విషయాలున్నాయన్న భావనతోకేవలం మంచి లక్షణాలు మాత్రమే కలిగిన మహత్తరమైన మతానికి రూపకల్పన చేసే క్రమంలో పుట్టుకొచ్చిందే సిక్కు మతం. అయితే కాలాంతరంలో ఆ మతంలోనూ కుల వ్యవస్థ ప్రాబల్యం పెరిగిపోయింది. అంటే, హిందూముస్లిం మతాలలోని లోపాలు ఈ కొత్తమతంలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో సిక్కుల్లోని తక్కువ కులాల వాళ్ళు తమపై అగ్రకులాల ఆధిక్యాన్ని అడ్డుకోడానికి సొంత పాయలు ఏర్పాటు చేసుకోడం మొదలెట్టారు. అవే ఈ డేరాలు. వాటిలో సచ్చా సౌదా ప్రధానమైనది. దాని వ్యవస్థాపకుడే ఈ రాం రహీం సింగ్.

మందేశంలో మెజారిటీ ప్రజల మతం హిందూమతం. కాబట్టి దాన్ని ఎలా బూతులు తిట్టినా పర్వాలేదు. మెజారిటీ అనే బలమే బలహీనత కాబట్టి వాళ్ళు నోరు మూసుకుని పడి ఉండాల్సిందే. ఇస్లాం, క్రైస్తవం మైనారిటీ మతాలు. కాబట్టి వారి మనోభావాలకు ఎలాంటి గాయమూ తగలకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా హిందువులదే. చిత్రమేంటంటే బౌద్ధం, జైనం, పార్సీ, సిక్కు వంటి మతాలు కూడా మైనారిటీ మతాలే. కానీ హేమిటో వారికి పెద్దగా మనోభావాలు ఉండవు. వాటిని పట్టించుకోవలసిన అవసరమూ ఉండదు. అదెందుకు అని అడక్కూడదేమో కూడా.

గుర్మీత్ రాం రహీం సింగ్ సిక్కు మతం మాటున అక్రమాలకు పాల్పడుతూ ఉండి ఉండవచ్చు. తన సొంత డేరాలో చేసే పనుల్లో అవినీతి, అక్రమాలు, అమ్మాయిల వ్యవహారాలూ అన్నీ ఉండి ఉండొచ్చు. అవన్నీ మన రాజ్యాంగానికి విరుద్ధమైనవి అయి ఉండొచ్చు. రాం రహీం సింగ్ కరుడు గట్టిన నేరస్తుడై ఉండవచ్చు. అలాంటి నేరాలకు కచ్చితంగా శిక్షించాల్సిందే. అయితే, దాని ఫోరం వేరు.

రాం రహీం సింగ్ ఒక సినిమా తీస్తే, దానికి కనీసం ప్రదర్శన అర్హత కూడా లేదంటూ నిలిపేసేందుకు సెన్సారు మాత చేసిన ప్రయత్నం వెనుక ఎన్ని రాజకీయ కారణాలున్నాయో మరి. ఎందుకంటేకళాసృజన పేరిట అడ్డమైన చెత్త సినిమాలు ఎన్ని రాలేదు? ప్రదర్శన యోగ్యమైనవంటూ సెన్సారు మాత సర్టిఫికెట్ ఇచ్చిన ఎన్ని వందల సినిమాలను చూడకుండా ప్రజలు తిరస్కరించలేదు? పొట్ట నింపుకోడానికి కాక కోట్లు వెనకేసుకోడానికి పోర్న్ సినిమాల్లో నటించే లియోనిని అదేదో ఘనకార్యం లాగ విదేశాల నుంచి తీసుకొచ్చి తీసిన బూతు సినిమాలకు సెన్సారు మాత సర్టిఫికెట్లు ఇవ్వలేదా? రాం రహీం తన మంత్రశక్తులతో డ్రగ్స్, లిక్కర్ వ్యాపారాలను అడ్డుకుంటున్నట్టు సినిమా తీస్తే అది కొన్ని మతాల వారి మనోభావాలను దెబ్బతీస్తుంది కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వడం లేదనడంలోని డొల్లతనం ఇక్కడే అర్ధమవడం లేదూ….! రాం రహీం సినిమా ప్రేక్షకులకు నచ్చితే చూస్తారు, లేదంటే యేటా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వందలాది అనామక సినిమాల్లో అదీ ఒకటిగా ఓ మూలన పడిఉంటుంది. కథ, మాటలు, పాటలు, మొదలుకుని నిర్మాత, దర్శకుడు, కథానాయకుడు వరకూ అన్నీ తానే అయిన రాం రహీంకు చేతులు కాలతాయి. అంతే కదా.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: