మోడీ, మీడియా : పిల్లీ, ఎలుకా ఆట పార్ట్‌ టూ షురూ

నరేంద్ర మోడీ విజయం క్రెడిట్ ఎవరిది? స్వయంగా మోడీ కృషి, కాంగ్రెస్‌ వైఫల్యాలూ ప్రధానంగా కనిపించేవి. వాటితో పాటు నిస్సంశయంగా మీడియాకు కూడా పాత్ర ఉంది. ఇవాళ్టి మోడీ సునామీకి మూలాలు పుష్కర కాలం నాటివి. 2002 మత కల్లోలాల నుంచీ…. జాతీయ మీడియా కానివ్వండి… ప్రాంతీయ మీడియా కానివ్వండి… నరేంద్ర మోడీపై లిటరల్‌గా కక్ష కట్టాయి. దానికి ప్రధాన కారణాలు రెండు. మొదటిది…. కాంగ్రెస్‌, లెఫ్టిస్టు, మైనారిటీ బుజ్జగింపు భావజాలం ఎక్కువగా ఉన్నవారి పెత్తనంలో భారతీయ మీడియా ఉండడం. రెండోది….. వృత్తివల్ల సంక్రమించే అతిశయాన్ని బుజ్జగించే వ్యక్తి కాకుండా దాన్ని ఎంతమాత్రం సంతృప్తి పరచని వ్యక్తిగా మోడీ మీడియా వ్యక్తులకు కొరకరాని కొయ్యగా నిలవడం.

మన దేశపు మీడియాకున్న విచిత్రమైన జబ్బు ఏంటంటే… ఏదైనా ఒక వ్యవహారం వెలుగు చూస్తే… దానికి ఇన్‌స్టంట్ జస్టిస్‌ కావాలి. అది కూడా తాము అనుకునే విధంగా ఉండాలి. అలాంటి తక్షణ న్యాయం అమలు కానంతవరకూ మీడియా అసహనానికి అంతుండదు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్ తీసుకునే వంద రూపాయల లంచం దగ్గర నుంచి కోటానుకోట్ల కుంభకోణం వరకూ ప్రతీ వ్యవహారంలోనూ తాము నేరస్తుడిగా భావించిన వ్యక్తికి శిక్ష పడి తీరాలన్న తపనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. దానికి రాజకీయ పక్షపాతం కూడా తోడయిందంటే ఆ అసహనం తారస్థాయికి చేరిపోతుంది. ఆ మీడియా దృశ్య మాధ్యమం అయితే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ మీడియా ఊపందుకుంటున్న తొలినాళ్ళలో జరిగిన విధ్వంసం… గోద్రా ఘటన… అనంతర పరిణామాలు. ఆ మొత్తం వ్యవహారంలో పోయిన ప్రాణాలు…. దేశచరిత్ర మీద తీవ్రప్రభావం చూపిన లోతైన గాయాలు. దానిలో అనుమానమే లేదు.

అలాంటి ఘటనతో తమ చేతికి చిక్కిన నరేంద్ర మోడీని చీల్చి చెండాడడానికి మీడియా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే మోడీ వారికి చిక్కలేదు. గుప్పిట్లో ఇసుకలా జారిపోయాడు. దాంతో మీడియా పట్టుదల మరింత పెరిగింది. ‘నరమేధం సాగించిన హంతకుడు తమ కళ్ళ ఎదుటే ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయత’ వారిని తబ్బిబ్బు చేసింది. కరడుగట్టిన నేరగాడు కళ్ళముందు తిరుగుతుంటే, రాజకీయ పదవి అనుభవిస్తుంటే ఏం చేయాలి? మోడీని ఏమీ చేయలేని ఆ పరిస్థితిలోనుంచి పుట్టుకొచ్చినదే అతనిపై ద్వేషం. జాతీయ ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో మూడొంతుల మంది జర్నలిస్టులకు మోడీ పేరు వినబడితేనే ఒళ్ళంతా కారం పూసుకున్నట్టు ఉండడానికి ప్రధాన కారణం అదే.

గోద్రా దుర్ఘటన, అనంతర పరిణామాలు జరిగి పుష్కర కాలం గడిచిపోయింది. ఈ పన్నెండేళ్ళ కాలంలో మోడీ మీద సాగిన మీడియా ట్రయల్స్‌కి అంతే లేదు. మోడీకి ఓటేసిన గుజరాతీ ప్రజలను పదేపదే నిందించారు. అది కూడా మోడీకే అనుకూలమైంది. ఇలా నిందించే కార్యక్రమాల్లో మునిగిపోయిన మీడియా.. గుజరాత్‌లో జరుగుతున్న విషయాలను గమనించకుండా పోయింది. లేదా కావాలని గమనించకుండా వదిలేసింది. అవి గుజరాతీ ప్రజల కోసం పథకాల అమలు కావచ్చు… రాష్ట్రం అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు. (సరే… మోడీ అమలు చేసిన ఆర్థిక విధానాల మీద అభ్యంతరాలుండవచ్చు… కానీ ప్రస్తుతాంశం అది కాదు) మోడీ అంటే 2002 అల్లర్లు మాత్రమే అన్న భావన దగ్గర మీడియా స్థిరపడిపోయింది. కానీ మోడీ అక్కడ ఆగలేదు. అంతకంటె ముందుకు, మున్ముందుకు సాగిపోయాడు.

మౌత్‌ కా సౌదాగర్‌ అంటూ నరేంద్ర మోడీని సోనియాగాంధీ తీవ్ర పదజాలంతో నిందించి ఆరేళ్ళు దాటిపోయింది. కానీ అంతకు ముందూ ఆ తర్వాతా కూడా గుజరాత్ ప్రభుత్వానికి యూపీయే సర్కారు చాలా రంగాల్లో అభివృద్ధి సాధించినందుకు ఎన్నో కితాబులిచ్చింది. ఆ విధంగా మోడీ ప్రభుత్వం పనితీరుకు తామే కాండక్ట్‌ సర్టిఫికెట్లు ఇస్తున్న సంగతిని గమనించినా… కాంగ్రెస్‌ ఏమీ చేయలేని స్థితి. అయితే ఆ అభివృద్ధిని ప్రధాన స్రవంతి మీడియా ప్రచురించలేదు లేదా చూపించలేదు. మోడీ, బీజేపీ స్వయంగా చెప్పుకున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అలాంటి డ్రై న్యూస్‌కు సేలబుల్ వేల్యూ పెద్దగా ఉండకపోవడం ఒక కారణం… మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సి రావడం అంతకుమించిన మరో ప్రధాన కారణం. అయితే గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి ఎప్పటికైనా తమకు ప్రమాదకరమే అని భావించిన కాంగ్రెస్‌… సామాజిక పరామితుల్లో గుజరాత్ వెనుకబడే ఉందంటూ విస్త్రతంగా ప్రచారం చేసింది. సహజంగానే మీడియా దాన్ని అందిపుచ్చుకుంది. పోషకాహార లోపం, పేదరికం రేటు, శిశు మరణాలూ వంటి విషయాల్లో గుజరాత్ అధ్వాన్నంగా ఉందంటూ మీడియా మోతెక్కించింది.

ఈ సందర్భంలో మీడియా మరచిపోయిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అవే సామాజిక పరామితుల్లో గుజరాత్‌కు ముందు, వెనుక చాలా రాష్ట్రాలున్నాయి. వాటిలో బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. పేదరికం, పోషకాహార లోపం, వైద్య సదుపాయాల లేమి వంటి సమస్యలు లేని రాష్ట్రమంటూ లేనేలేదు. బిమారూ రాష్ట్రాలుగా పేరుగాంచిన హిందీ బెల్ట్‌లో ఈ అరవయ్యేళ్ళలో ఏం సాధించారో మన కళ్ళముందే ఉంది. అంతెందుకు, అభివృద్ధికి చిరునామాలుగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాల్లో సైతం… ప్రధాన నగరాలను దాటితే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీనిది కాదు. ఈ సోషల్ పెరామీటర్స్‌లో ఆసేతు శీతాచలం చిన్నాపెద్దా తేడాలతో దాదాపు ఒకటే పరిస్థితి. ఆర్థికాభివృద్ధి కీలకం అంటూనే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక ప్రగతి సాధించడం మీద పెద్దగా దృష్టి సారించలేదు. ఆ పని చేసిన అతికొద్ది మందిలో నరేంద్ర మోడీ ఒకడు. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారు. అలాంటి విషయాలు తెలిసే మార్గం ప్రసార మాధ్యమాలు ఒక్కటే కాదు కదా. మన రాష్ట్రం సంగతే తీసుకుందాం. గత పదేళ్ళలో గుజరాత్‌లో ఉద్యోగాల కోసం ఎంతమంది తరలి వెళ్ళారు? అలాంటి వారి ద్వారా అండర్‌ కరెంట్‌గా వ్యాపించే మెసేజ్‌ ఉంటుంది కదా. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కారణం… మళ్ళీ అదే… మోడీ మీద తీవ్రంగా పెంచుకున్న అసహనమే.

మోడీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా బీజేపీ 2013 జూన్‌లో ప్రకటించింది. అంటే సుమారుగా సంవత్సరం. ఈ ఏడాది వ్యవధిలో మోడీ దేశవ్యాప్తంగా విస్త్రతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ, అడగ్‌ నుంచి కటక్‌ వరకూ బీభత్సంగా తిరిగాడు. గుజరాత్‌లో అభివృద్ధి సాధించాను… నా డెవలప్‌మెంట్ మోడల్ ఇదీ… నన్ను ప్రధానిని చేస్తే దేశవ్యాప్తంగా అభివృద్ధి సాధించగలనూ అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. సరే ప్రత్యర్థులు సహజంగానే దాన్ని వ్యతిరేకించారు. మోడీ అభివృద్ధి నమూనా అంతా ఫార్స్‌ అనీ… అతగాడు
సాధించిన అభివృద్ధి ఏమీ లేదనీ… మోడీకి ముందే గుజరాత్‌ అభివృద్ధి చెందిన రాష్ట్రమనీ… మోడీ కేవలం కరడుగట్టిన హిందుత్వవాది, నరహంతకుడూ మాత్రమేననీ… ప్రచారం చేశారు. రెండు వాదనలూ ప్రజల ముందున్నాయి. విచిత్రమేంటంటే… మోడీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని వాదించిన పార్టీలు తాము సాధించిపెట్టిన అభివృద్ధి ఇదీ అని ఏమీ చూపించుకోలేకపోయాయి. కొద్దోగొప్పో చెప్పుకున్నా ప్రజలను కన్విన్స్‌ చేయలేకపోయాయి. ఆ తేడాని మీడియా ఏనాడూ ప్రస్తావించలేదు. పైగా మోడీ ప్రసంగాల్లో ఏ మాటల నుంచి ఏ వివాదాలు సృష్టించవచ్చోనని కాచుకుని కూచుంది.

మోడీ మహా తెలివైన వాడు. ప్రజలకు చెప్పేవి ప్రజలకు చెప్పాడు. మీడియాకు కావలసిన మేత మీడియాకు పడేశాడు. ట్వంటీఫోర్‌ బై సెవెన్‌ వార్తల్లో ఉండాలంటే ఏం చేయాలో అన్నీ చేశాడు. మీడియా కూడా ఆ ట్రాప్‌లో పడింది. మోడీ పన్నాగాలను పసిగట్టలేనంత అమాయకులు మాత్రమే లేరు మీడియాలో. కానీ వారు కూడా తమకు తాము కల్పించుకున్న ఒక ఆరాకు అవతల మోడీని చూపించదలచుకోలేదు. మోడీ లోపాలను వెలికితీస్తున్నామంటూ అదే మోడీకి నెగెటివ్‌ ప్రచారం చేసిపెట్టాయి. ఇన్నాళ్ళూ కరడుగట్టిన హిందుత్వ వాది అయిన అద్వానీ ఇప్పుడు ఒక్కసారి మర్యాదా పురుషోత్తమ్ రామ్‌ ఎలా అయిపోయాడు…. మోడీ తన రాజకీయ గురువును ఎలా దెబ్బతీస్తున్నాడు… మోడీ ట్రిక్స్‌తో బీజేపీకి ఎలా నష్టం వాటిల్లబోతోంది…. నితీష్‌ కుమార్‌ మోడీ కంటె ఎందుకు మెరుగు…. కేజ్రీవాల్ మోడీ కంటె ఎంత గొప్పవాడు…. అన్నాహజారే ఎందుకు మోడీని నేరుగా కలవలేదు…. మమతా బెనర్జీ మోడీని ఎలా దూరం పెట్టాలి…. జయలలిత లాంటి తిక్క లీడర్‌ మోడీని ఎలా ఇరుకున పెట్టగలదు… రజనీకాంత్‌తో భేటీ అవుతున్నాడంటే మోడీ సినిమా గ్లామర్ మీద ఆధారపడుతున్నాడెందుకు… చివరికి… ఎంజే అక్బర్‌ లాంటి సీనియర్‌ జర్నలిస్టు మోడీకి అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన ముస్లిములు మోడీని ఆదరిస్తారా… ఇదీ వరస. ప్రజలని డ్రైవ్‌ చేయగల- నిజంగా తెలివైన-జర్నలిస్టులే ఆ తరహాలో కథనాలు వడ్డిస్తుంటే… మూడొంతుల ముప్పాతిక మంది నాలాంటి హాఫ్‌ బేక్డ్‌ జర్నలిస్టులు మోడీ ట్రాప్‌లో పడక ఛస్తారా!

మోడీ మీద మీడియా వ్యతిరేకతకు అతిపెద్ద ఉదాహరణ… ప్రీపోల్‌… పోస్ట్‌ పోల్‌ సర్వేలు. రాజకీయ పార్టీలు తమ పరిస్థితులను బట్టి సర్వేలను సమర్ధించడమో విమర్శించడమో చేస్తారు గాక… కానీ సెఫాలజీ అనేది కచ్చితంగా శాస్త్రమే. మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌తో దాదాపు కచ్చితంగా ఫలితాలను అంచనా వేయగల విధానమే. యోగేంద్ర యాదవ్‌ లాంటి సీనియర్ సెఫాలజిస్టులు మన దేశంలో చాలా మందే ఉన్నారు. పైగా ఏ పత్రికా లేదా ఛానెలూ సొంతంగా ఈ సర్వేలు నిర్వహించలేదు… సెఫాలజీ సంస్థలతో సర్వేలు చేయించాయి… వాటిలో ఏ ఒక్కటీ కూడా ఎన్డీయే కూటమికి 273 సీట్లు వస్తాయని చెప్పలేదు. 240-250 దగ్గరే ఎన్డీయే కూటమి ఆగిపోయే అవకాశముందని చెప్పుకుంటూ వచ్చాయి. నిజానికి సర్వే సంస్థలు ఈ ఫలితాలను అంచనా వేయలేకపోయాయా? కానే కాదు. ఎన్డీయే కూటమికి మూడొందల సీట్లు దాటతాయని టుడేస్‌ చాణక్య సంస్థ అంచనా వేసింది కదా. అలాంటివే అయిన ఇతర సెఫాలజిస్టు సంస్థలు ఆ అంచనా వేయలేకపోయాయా? అది కాదు నిజం. మోడీ నాయకత్వంలోని పార్టీకి… కాదనుకుందాం… ఆ కూటమికి యాబ్జొల్యూట్ మెజారిటీ వస్తుందన్న విషయాన్ని చెప్పడానికి మీడియా సంస్థలకు మనస్కరించలేదు. అందుకే పోస్ట్‌పోల్‌ సర్వే ఫలితాలను తమకు కావలసినట్టు మలచుకున్నాయి. అది కచ్చితంగా మన తెలుగు ఛానెళ్ళు చేసే టాంపరింగ్‌ లాంటిది కాదనే అనుకుందాం. ఉద్దేశపూర్వకంగా చేయలేదనే అనుకుందాం. కానీ… ఆయా మీడియా చానెళ్ళ సొంత అంచనాలు కూడా ఉంటాయి కదా… ముస్లింలైతే మోడీకి ఓటు వేయరు… ఎస్సీఎస్టీ బీసీలు బీఎస్పీకో కాంగ్రెస్‌కో ఎస్పీకో వేస్తారు… హిందువుల్లో కూడా ఓట్లు కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా చీలిపోతాయి.. అలాంటప్పుడు ఈ మూడొందల మార్కు ఎన్డీయే కూటమికి రావడం సాధ్యమేనా… ఇలాంటి లెక్కలతో ఆ ఫిగర్‌ని తగ్గించాయి.

ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఛానెళ్ళ ప్రీ – పోస్ట్‌ పోల్‌ సర్వే రిజల్ట్స్‌ చూసిన ప్రతీసారీ అదే అనుమానం. పొలిటికల్ బయాస్‌లు ఎలా ఉన్నా కొద్దో గొప్పో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని ప్రణయ్‌ రాయ్‌, రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ల మీద నమ్మకం ఉండేది. కానీ ఆ సర్వేల ఫలితాలు చూసినప్పుడు అనిపించింది ఒకటే… వారి గణాంకాలు ఎన్డీయే కూటమికి వచ్చే సీట్ల సంఖ్యను కనీసం ఐదు నుంచి పది శాతం తక్కువ చేసి చూపాయని. ఎన్డీయే కూటమికి యాబ్జొల్యూట్‌ మెజారిటీ వస్తుందన్న సంగతిని ఆ ఛానెళ్ళు ఉద్దేశపూర్వకంగానే తగ్గించాయని. ఇంక టైమ్స్‌నౌ ఆజ్‌తక్‌, ఇండియా టీవీ, ఏబీపీ వంటి చానెళ్ళ సంగతి చెప్పనే అక్కర్లేదు. సుమారు ఇరవయ్యేళ్ళ సంకీర్ణ ప్రభుత్వాల శకం తర్వాత దేశంలో ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందన్న ఆలోచన నాకైతే రాలేదు. నేను ఒప్పుకుంటా.. నా పరిమిత కాల, పరిమిత స్థాయి అనుభవంలో నాకు ఆ ఆలోచన రాలేదు. సరే… ప్రణయ్‌ రాయ్‌కీ, రాజ్‌దీప్‌కీ సర్దేశాయ్‌కీ, అర్ణబ్‌ గోస్వామికీ ఆ ఆలోచన రాలేదనే అనుకుంటాను కాసేపు. కానీ ఎన్డీయే కూటమి 272 దాటుతుందని వారి సర్వే సంస్థలు అంచనా వేయలేకపోయాయంటే నేను నమ్మలేను. ఆ విషయంలో మానిప్యులేషన్‌ జరిగిందనే నా అనుమానం… అది మాలాఫైడ్ ఇంటెన్షన్‌ అవునా కాదా అన్నది తర్వాతి సంగతి.

ఈ వారం పది రోజులూ మీడియా నిండా మోడీనే ఉంటాడు… డౌటే లేదు. కానీ అది అనుకూలంగానే ఉండాల్సిన అవసరం లేదు. యధావిధిగా ప్రతికూలంగానే ఉంటుంది. అద్వానీకి స్పీకర్‌ పోస్ట్‌ ఇచ్చి నోరు కట్టేసాడు అనో… సుష్మా స్వరాజ్‌ స్థాయికి తగిన పదవి ఇవ్వలేదనో… అరుణ్ జైట్లీని నెత్తి మీద కూచోబెట్టుకుంటున్నాడనో… అమిత్‌ షాని నేషనల్ ఫిగర్‌ చేసేస్తున్నాడనో… అలాంటివి ఒకరకం. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో ఇంకా మెరుగు పడలేదు… వచ్చే వారానికి ద్రవ్యోల్బణం పెరిగిపోతుందా… నిత్యావసరాలు, గ్యాస్‌ వంటి వాటి ధరను తగ్గించే మంత్రదండం ఏదీ ఎక్కడుంది… మన్మోహన్‌ సింగ్‌ బెటరా మోడీ బెటరా… మోడీ ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడడానికే తప్ప నిజంగా పని చేయడానికి పనికొస్తాడా… ఇలా తన నుంచి తోక దాకా స్కానింగ్‌ చేస్తారు… ఆ స్కానింగ్ రిపోర్టులు ఎలా ఉంటాయి? వాటిని మోడీ ఎంతవరకూ పట్టించుకుంటాడు… అనూహ్యం ఏమీ కాదు.

Advertisements

13 Comments (+add yours?)

 1. Sridhar
  May 18, 2014 @ 22:50:44

  V good analysis

  Reply

 2. Sri
  May 18, 2014 @ 23:49:28

  ముస్లింలైతే మోడీకి ఓటు వేయరు
  Poll data shows large number of Muslims voted for Modi

  The BJP won 45 of the 87 Lok Sabha seats identified by the Centre for the Study of Developing Societies (CSDS) as having a high concentration of Muslim voters. In Uttar Pradesh alone, the party won all but one of the 27 seats with a sizeable Muslim electorate.

  సాగరిక ఆంటి ఇంకా సెక్యులరిజం గురించి మోడికి సలహాలు ఇస్తున్నాది.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   May 19, 2014 @ 06:33:41

   ఒక్క సాగరిక ఏం ఖర్మ మాస్టారూ… మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు… మోడీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే నేషనల్ ఛానెల్స్ అన్నీ…. దేశం ఆర్థిక సమస్యలు తీర్చే సత్తా మోడీకి లేదనీ… కోట్ల మందికి ఎలా ఉపాధి కల్పిస్తాడనీ… విభజనవాదాన్ని వదిలిపెడతాడా లేదా అనీ… రకరకాల విమర్శలు మొదలెట్టేశాయి.

   Reply

 3. Zilebi
  May 19, 2014 @ 09:03:33

  Very good and firsthand candid analysis and really thought provoking.
  I wish my media colleagues give a thought to these points mentioned by yourself.

  zilebi

  Reply

 4. kastephale
  May 19, 2014 @ 12:40:03

  Very good analysis. Media also failed to estimate the victory of Modi. Further the game will continue for five years to come. Un limited mal propaganda will continue.

  Reply

 5. kamudha
  May 19, 2014 @ 16:43:46

  నేను తెలుసుకున్న విషయాలు కొంచం వేరేగా ఉన్నాయి. మీడియా అంతా మోడికి సపొర్ట్ చేసిందని. మోడికి వ్యతిరేకంగా రాసిన వారినందరిని పీకేసారని చదివాను.

  కాముధ

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   May 21, 2014 @ 10:00:32

   మీడియాలో మోడీకి అనుకూలంగా కథనాలు ఇవ్వడం పెరిగిందన్న మాట కొంతవరకూ నిజమే. గతంలో చేదు అనుభవాలూ, మోదీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణా గ్రహించడం వల్ల జాతీయ మీడియా మోదీపై ఎక్కువ కథనాలు ఇచ్చింది. ప్రింట్‌ సంగతి తెలీదు కానీ… జాతీయ టీవీ ఛానెళ్ళు టీఆర్‌పీలను పెంచుకోడానికి మోడీ వార్తలు విస్తారంగా ఇచ్చాయి. ప్రాంతీయ ఛానెళ్ళ విషయానికి వస్తే ‘ప్రొఫెషనల్ జర్నలిస్టులు’ తక్కువ ఉండడమూ… యువ జర్నలిస్టుల్లో ఎక్కువ మందికి మోదీ వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందన్న భావన ఉండడమూ నిజమే. కానీ జాతీయ ఛానెళ్ళ ప్రొఫెషనల్‌ యాజమాన్యాల ఉద్దేశాలు బహిరంగమే. ఇంక మీరన్న… మోడికి వ్యతిరేకంగా రాసిన వారినందరిని పీకేసిన ఇన్సిడెంట్ ఎక్కడిదో నాకు తెలీదు. వీలైతే లింక్‌ ఇవ్వగలరు.

   Reply

 6. ఫణీన్ద్ర పురాణపణ్డ
  May 21, 2014 @ 10:07:38

  కష్టేఫలే మాస్టారికి, జిలేబి గారికి…

  ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.. మీడియా వైఫల్యం కంటె… మోడీ విజయాన్ని మీడియా కావాలనే తక్కువ అంచనా వేసిందని నా ఉద్దేశం. జాతీయ ఛానెళ్లలో ఇప్పటికే మోడీ వ్యతిరేక ప్రచారం మొదలైంది. గమనించే ఉంటారు

  Reply

 7. yandamoori
  Jun 08, 2014 @ 14:45:30

  Dear Pani,
  can i have your phone number please? i have a small request to be made. can you SMS your number to my 9246502662?

  Reply

 8. yssubramanyam
  Nov 01, 2014 @ 17:25:42

  Modi is not a politician. He is well camouflaged to achieve task. he is a social reformer. his internal colour is to establish dharma. he is not fond of chair or wealth. he is not scared of fighting against his own men to get his target. he is getting strengthened by youth. he will wipe off all these old corrupt ducks and replace them with honest people. just wait and see.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: