మొట్టమొదటి సెకనులో….

విశ్వం ఎలా ఏర్పడింది.. ఎలా విస్తరించింది… అన్న ప్రశ్న… ఇప్పటికీ జవాబు అందకుండా ఊరిస్తున్న రహస్యమే. ఆ ప్రశ్నకు సైద్ధాంతిక సమాధానాలే తప్పించి సాక్ష్యాలు, ఆధారాలతో కూడిన జవాబులు ఇప్పటివరకూ లేవు. అలాంటి ఆధారం ఒకటిప్పుడు శాస్త్రవేత్తలకు లభించింది. మహావిస్ఫోటనం తర్వాత మొట్టమొదటి సెకనులో విశ్వం విస్తరణ జరిగిన క్రమానికి సంబంధించి కీలకమైన ఆధారం దొరికింది.

సుమారు 14వందల కోట్ల సంవత్సరాల క్రితం రోదసిలో మహావిస్ఫోటనం సంభవించింది. అదే ఈ విశ్వం ఆవిర్భావానికి మొదలు. భౌతికశాస్త్రంలో ఆ క్షణాన్నే కాలానికి ప్రారంభంగా భావిస్తారు. ఆ మరుసటి సెకను నుంచీ కాలం లెక్క మొదలవుతుంది. సరిగ్గా అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడం మీదనే ఇప్పుడు భౌతిక శాస్త్ర ప్రయోగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు అదే విషయానికి సంబంధించి కీలక ఆధారం లభించినట్టు భావిస్తున్నారు.

బిగ్‌ బ్యాంగ్‌ జరిగిన మొట్టమొదటి సెకను నుంచే విశ్వం విస్తరించడం మొదలైంది. ఆ మహావిస్ఫోటనంలో పుట్టిన పదార్ధమే విశ్వంగా వ్యాపించింది. అదే సమయంలో వెలువడిన కాంతి కూడా రోదసి అంతటా విస్తరించింది. ఆ కాంతి ఇప్పటికీ అంతరించిపోలేదు. దాని అవశేషం ఇప్పటికీ రోదసిలో అత్యంత బలహీనంగా కొనసాగుతోంది. దాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం. దాన్ని సుసాధ్యం చేశారు శాస్త్రవేత్తలు.

bigbang

మహా విస్ఫోటన సమయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి కేంబ్రిడ్జ్‌, హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, మిన్నెసోటా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లోని ఆస్ట్రో ఫిజిక్స్‌ విభాగాలు, నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఆ సంస్థల శాస్త్రవేత్తల బృందం ఉత్తర ధ్రువ ప్రాంతపు గగన తలంలో నిర్దిష్ట ప్రాంతాన్ని మూడేళ్ళ పాటు నిశితంగా పరిశీలించింది. విశ్వంలో వ్యాపిస్తుండే లక్షల కోట్ల కాంతి తరంగాల్లో… ఒక కచ్చితమైన పాటెర్న్‌ కోసం ఆ శాస్త్రవేత్తలు అన్వేషించారు. మహావిస్ఫోటనం ప్రకంపనాల నుంచి వెలువడి ఇప్పటివరకూ కొనసాగుతున్న అత్యంత బలహీనమైన వెలుగురేక కోసం వారు జరిపిన అన్వేషణ ఫలించింది. రోదసిలో నిర్దిష్ట స్థల కాలాల అవధిలో జనించిన గురుత్వాకర్షణ తరంగాల విస్తరణలోనే ఈ కాంతి తరంగానికి ఒక పాటెర్న్‌ ఏర్పడింది. ఆ పాటెర్న్‌ నుంచే ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఈ ఆధారం లభించింది.

విశ్వం ఏర్పడిన తొలి క్షణాల్లో ఏం జరిగిందనే విషయంపై వైజ్ఞానిక లోకంలో పెద్దగా భేదాభిప్రాయాలు లేవు. ఐతే పూర్తి సైద్ధాంతిక విషయమే తప్ప దానికి ప్రాయోగిక నిరూపణలు లేవు. అందుకే ఇప్పుడు తెలిసిన ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ కాంతి తరంగపు జాడను కచ్చితంగా పట్టుకోగలిగితే… కాంతి వేగానికి కొన్ని లక్షల రెట్ల వేగంతో విశ్వం విస్తరించిన తీరును తెలుసుకోడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Advertisements

2 Comments (+add yours?)

  1. karthik
    Mar 19, 2014 @ 23:20:18

    Chaalaa baagundi sir:):)

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: