మూడో కుంపటి రాజుకుంటోంది

మూడో కూటమి పేరిట మళ్ళీ హడావుడి మొదలైంది. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వస్తున్నామంటూ జేడీయూ నాయకత్వంలో పన్నెండు పార్టీలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 5న దేశ రాజధానిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట కలిసి కూచుని విధి విధానాలు నిర్ణయించుకుంటాయట.

బిహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్న జేడీయూ… మరికొన్ని పార్టీలను కూడగడుతోంది. ఇన్నాళ్ళూ కాంగ్రెస్‌తో చేతులు కలపాలా వద్దా అన్న సందిగ్ధంలో జేడీయూ ఇన్నాళ్ళూ ఊగిసలాడింది. కాంగ్రెస్‌ కూడా బిహార్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, ఆర్థిక ప్యాకేజీలు అంటూ నితీష్‌ అండ్‌ కోను ఆకర్షించడానికి కొన్నాళ్ళు హడావుడి చేసింది. తర్వాత ఇప్పుడు చల్లగా లాలూప్రసాద్ గడ్డియాదవ్‌తో కలిసి లంచ్‌, డిన్నర్‌ చేస్తామని అధికారికంగానే ప్రకటించేసింది. దాంతో నితీష్‌ అండ్‌ కోకి పాపం ఏం చేయాలో పాలుపోయినట్టు లేదు. తమ వైపు నుంచి కౌంటర్‌ కనిపించాలి కదా.. అందుకే ఫిబ్రవరి 5న డజను పార్టీలతో సమావేశం అనేశారు.

దీనికి జేడీయూ నాయకులు మంచి కలరే ఇచ్చారు. పాత జనతాదళ్‌ నుంచి వేర్వేరు కారణాల వల్ల విడిపోయిన వారినీ… ఆనాటి పార్టీ భావజాలానికి దగ్గరగా ఉన్న వారినీ చేరదీస్తున్నామని ప్రకటించింది. కర్ణాటకలో దేబెగౌడ… క్షమించాలి… దేవెగౌడ జేడీఎస్‌, తమిళనాట అమ్మ పార్టీ అన్నాడీఎంకే, యూపీలో ములాయం యాదవ్‌ సమాజ్‌వాదీపార్టీ, అసోంలో అసోం గణపరిషద్‌… జార్ఖండ్‌లో జార్ఖండ్‌ విముక్తి మోర్చా…. బెంగాల్‌లోని నాలుగు పార్టీల లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమి… ఇవీ… ఇప్పటివరకూ ఫిబ్రవరి 5 సమావేశానికి హాజరవుతామని ఒప్పుకున్న పార్టీలు. వీళ్ళలో ఒక్క జయమ్మ పార్టీ తప్ప మరెవరికీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు కనుచూపు మేరలో లేవు. ఆ జయమ్మ కూడా… క్షణక్షణముల్‌ జవరాండ్ర చిత్తముల్‌… అనిపించే మహానుభావురాలు. మరోవైపు… సొంతంగా జేడీయూకే బిహార్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌ ఉంది. అక్కడ మోదీ హవా బలంగానే ఉందని సర్వేల ఉవాచ.

ఈ పార్టీలతోనే ఎలా లాక్కొస్తారో అనుకుంటుంటే… జేడీయూ నాయకులు మరో మూడు పార్టీలు కూడా తమతో రావచ్చని చెబుతున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీని… యూపీలో మాయావతిని… ఆకట్టుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నిజంగానే వస్తే అదో అపూర్వమైన కాంబినేషన్‌ అవుతుంది. జయ… మాయ… మమత… ముగ్గురూ ముగ్గురే. తమదైన స్టైల్‌లో చక్రం తిప్పే మహారాణులు. ఎవరి తిక్క వారిది. మామూలుగా ఒక ఒరలో రెండు కత్తులే పట్టవ్‌… అలాంటిది మూడు కొప్పులు ఒక చోటా. అయినా ఆ రెండు సమీకరణాలూ సాధ్యమయ్యే సీన్‌ కనిపించడం లేదు.

మమతకీ, వామపక్షాలకీ మధ్య పొత్తు ఎలా సాధ్యమో అర్ధమే కాదు. కంచుకోట బెంగాల్‌లో ఎర్రజెండాలను పీకేసింది మమత. అందుకే ఆవిడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మమత ప్రభుత్వపు ప్రతీ చిన్న తప్పునీ భూతద్దంలో చూపించి దేశమంతా ప్రచారం చేస్తున్నాయి వామపక్షాలు. మమత అంటే బెంగాలీలకి ఉన్న కొద్దిపాటి భయాన్ని గ్లోరిఫై చేసి బీభత్స భయానక రసాలతో కవిత్వం చెబుతున్నాయి. అంతకు ముందరి సుదీర్ఘ వామపక్ష పాలనలో బెంగాల్‌లో జరిగిన అరాచకాల సంగతిని కన్వీనియెంట్‌గా పక్కకు తోసేశాయి. ఆ విషయాలు మనలాంటి వాళ్ళు మరచిపోయి ఉండొచ్చు కానీ మమతక్క మరిచిపోదు కదా… వాళ్ళతో చేతులు కలిపి మూడో ఫ్రంట్‌లో అడుగు పెడుతుందా? నా కోడి దిమాక్‌కి అర్ధమైన మేరకు మమత ఆ పని చేసే అవకాశం లేదు.

మాయావతికీ ములాయంసింగ్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాళ్ళిద్దరికీ మధ్యలో నిలబడి ఇద్దరి చేతులూ చంకలో పెట్టుకున్న క్రెడిట్‌ కాంగ్రెస్‌కే దక్కింది. ఐతే… కేంద్రంలో యూపీయే అధికారంలో ఉండడం వల్లా… ములాయం, మాయ ఇద్దరి పిలకలూ తమ చేతిలో ఉండడం వల్లా… కాంగ్రెస్ ఆ ఫీట్‌ని సుసాధ్యం చేసుకోగలిగింది… అది కూడా టెంపరరీ బేసిస్‌ మీదే సుమా. అలాంటప్పుడు… థర్డ్‌ ఫ్రంట్‌లో వాళ్ళిద్దరినీ కలపడం జేడీయూకి సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దానికీ జేడీయూ నాయకులు ఓ పాత అస్త్రాన్ని బైటకు తీయబోతున్నారు. అదే మతతత్వ బీజేపీని అడ్డుకోడం అన్న వాదన. గత పదేళ్ళుగా దేశంలో ఆ పార్టీ మీద ప్రయోగిస్తున్న ప్రధానాస్త్రం అదే. కానీ ఇప్పుడా అస్త్రం ఎంతవరకూ పనిచేస్తుందో తెలీదు. అందుకే… మాయామేమ్‌ సాబ్‌… ఆది నిష్టూరం మేలని తేల్చేసుకున్నారు. ఏ పొత్తయినా ఎన్నికలు ముగిసిన తరవాతేనంటూ తేల్చేశారు.

ఇలాంటి డైనమిక్స్‌తో ముందుకు వస్తున్న థర్డ్‌ ఫ్రంట్‌ ఏం చేయగలదు? ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ చేసిన మిరకిల్‌ని మరోసారి సాధ్యం చేయగలదా… (అన్నట్టు ఈ కూటమిలోకి ఆమ్‌ ఆద్మీని పిలుస్తారో లేదో… అసలే ప్రత్యామ్నాయ రాజకీయాలు, 350 మంది అభ్యర్ధులూ అంటున్నాడు కేజ్రీవాల్‌) అని చూస్తే… అలాంటి అవకాశాలు నాకైతే కనిపించడం లేదు. కేజ్రీవాల్‌ బలం సాధించిన స్థల కాల పరిస్థితులు పూర్తిగా వేరు. అది గాక ఈ మూడో కుంపటి దేశ రాజకీయాల్లో ఎప్పటినుంచో తమ ఉనికి చాటుకుంటున్న పార్టీల కిచిడీయే. వీళ్ళ సంగతి ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు బాగానే తెలుసు. వాళ్ళు వీళ్ళను నమ్మే పరిస్థితులు పెద్దగా లేవు. అలాంటపుడు కూడా వీళ్ళు చేయగలిగింది ఒకటుంది. అదే ఓట్లు చీల్చడం.

అందుకే ఈ మూడోఫ్రంట్‌ గురించి బీజేపీ కంగారు పడుతోంది. ఈ కప్పల తక్కెడ వల్ల కాంగ్రెస్‌కి ఒరిగే నష్టం పెద్దగా ఉండదు. (ఆ పార్టీ తనను నాశనం చేసే అవకాశం వేరొకరికి ఇవ్వదు కదా…) రెండు టెర్మ్‌ల తర్వాత యాంటీ ఇంకంబెన్సీ, రాహుల్ నాయకత్వ పటిమ… వంటి అంశాలు ఆ పార్టీని ఇప్పటికే ప్రజలకు దూరం చేశాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌… వంద సీట్లు దాటడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. అంటే… థర్డ్‌ ఫ్రంట్‌ వల్ల కలిగే డ్యామేజీ కాంగ్రెస్‌కి పెద్దగా ఉండదు. కానీ అది ఏ మాత్రం ప్రభావం చూపగలిగినా బీజేపీని మాత్రం బాగానే ఇరికించగలదు. సర్వేల సంగతులు చూస్తుంటే 220-230 సీట్లు వస్తాయనిపిస్తోంది. కానీ అటు అరవింద్‌ కేజ్రీవాల్ గండం ఉండనే ఉంది. ఆయన పార్టీ 350 స్థానాల్లో పోటీ చేస్తుందట. ఢిల్లీ అంత ప్రభావం చూపకపోయినా… ఓట్ల చీలికకు దారితీసే ఫ్యాక్టర్‌గా ఆమ్‌ ఆద్మీ పనిచేయవచ్చు. ఆ భయం ఇప్పటికే బీజేపీలో కొంచెం కొంచెం కనిపిస్తోంది. ఇప్పుడీ థర్డ్‌ ఫ్రంట్‌ కూడా వస్తే… అదీ వారి భయం.

పైగా… ఈసారి మూడో కూటమిని ఇనీషియేట్‌ చేస్తున్నది జేడీయూ. బీజేపీకి బద్ధశత్రువుగా మారిన తాజా మాజీ మిత్రుడు నితీష్‌ కుమార్‌. అందుకే…. ఎన్నికల ఫలితాల తరవాత ఏదైనా తేడా వస్తే… ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ యూపీయేకి మద్దతిస్తుందని బీజేపీ అనుమానిస్తోంది. కొంతవరకూ ఆ మాట నిజమే కూడా. ఎందుకంటే… ఈ మూడో ఫ్రంట్‌ గురించిన ప్రాథమిక చర్చల సమయంలోనే జేడీయూ నాయకులు… నేరుగా తమ అస్త్రాలను బీజేపీ మీదనే సంధించారు తప్ప కాంగ్రెస్‌ను ఏమీ అనలేదు.

Advertisements

8 Comments (+add yours?)

 1. kastephale
  Feb 02, 2014 @ 20:48:36

  {(A+B+C+D+E+)-(F)} X 0 = ? 🙂

  Reply

 2. bonagiri
  Feb 02, 2014 @ 21:31:33

  మూడో ఫ్రంట్ బలపడితే కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Feb 03, 2014 @ 20:58:51

   అంటే నేననుకున్నది… యూపీయే కూటమి కంటె ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి.. ఆ పరిస్థితులకు థర్డ్‌ ఫ్రంట్‌ వల్ల దెబ్బ పడుతుంది అని.

   ఇంకో ఈక్వేషన్‌ కూడా ఉంది. పరిస్థితులు తారుమారై థర్డ్‌ ఫ్రంట్‌కి గణనీయమైన సంఖ్యలో సీట్లు వస్తే… బీజేపీని, ఎన్డీయేని నిలువరించే పేరిట థర్డ్‌ ఫ్రంట్‌కి కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశం కూడా లేకపోలేదని భోగట్టా.

   Reply

 3. kastephale
  Feb 04, 2014 @ 07:14:18

  (CPM-CPI) +(SP-BSP)+TNC-DMK) x AIADMK= ? 🙂

  Reply

 4. kastephale
  Feb 07, 2014 @ 07:03:20

  Plz see reply 2 ur post in my new blog
  http://kasthephali.blogspot.in/2014/02/blog-post_6.html

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: