మడీబా… ఇక సెలవ్‌

దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అంతులేని పోరాటం చేసి… ఆ దేశాన్ని తెల్ల పాలకుల గుప్పిట్లో నుంచి విముక్తం చేసిన వీరుడు నెల్సన్ మండేలా. జాతివివక్షను ఎదుర్కొనే రాజకీయ మార్గంలో భాగంగా అహింసనూ, హింసనూ రెండింటినీ ఉపయోగించుకున్న నాయకుడు మండేలా. మహాత్మా గాంధీ… కారల్‌ మార్క్స్‌… చే గెవారా… అందరి సిద్ధాంతాలనూ కలిపి… ఆఫ్రికన్ల విముక్తికి తనదైన మార్గాన్ని రూపొందించిన మార్గదర్శి మండేలా. సుమారు మూడు దశాబ్దాల జీవితం కటకటాల వెనుకనే గడిపిన మండేలా… ఆఫ్రికాను జాతివివక్ష పూరిత విదేశీ పాలన నుంచి తప్పించి ప్రజాస్వామ్యయుత స్వదేశీ పాలన దిశగా నడిపించిన ధీరుడు. 95ఏళ్ళ వయసులో కన్నుమూసేంత వరకూ ఆయన జీవితం పోరాటాల మయం.

Nelson_Mandela

నెల్సన్ మండేలా 1943లో విట్‌వాటర్స్‌ర్యాండ్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యార్ధిగా చేరిన నాటి నుంచీ ఆయనలో స్వతంత్ర భావనలు బలపడ్డాయి. నల్లజాతి ఆఫ్రికన్లకు తమను తాము పాలించుకునే హక్కులు కావాలన్న భావనలు మండేలాలో అప్పటినుంచే కుదురుకున్నాయి. ఆ సమయంలోనే… నల్లజాతీయుల అణచివేతపై పోరాడడానికి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ యూత్‌ లీగ్‌ ఏర్పాటులో మండేలా పాలు పంచుకున్నాడు. 1947లో ANC యూత్‌ లీగ్‌ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. అప్పటినుంచీ ఆఫ్రికన్‌ మూలవాసుల హక్కుల కోసం మండేలా పోరాటం ఒక దిశలో సాగడం మొదలైంది. 1948లో ఆఫ్రికాలో ఎన్నికైన ప్రభుత్వం జాతి వివక్షను మరింత విస్త్రతం చేసేలా చట్టం రూపొందించింది. దానికి వ్యతిరేకంగా మండేలా తమ యూత్‌లీగ్‌ ఆధ్వర్యంలో సమ్మెలు, బాయ్‌కాట్‌లు నిర్వహింపజేశాడు. మన గాంధీ తన దక్షిణాఫ్రికా రోజుల్లో చేసిన సత్యాగ్రహం తరహాలో మండేలా తమ పోరాటాలు కొనసాగించాడు. అలా క్రమంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌ను ఉద్యమపథంలోకి నడిపించిన ఘనత మండేలాదే.

1950లో మండేలా ఆఫ్రికన్‌ నేషనల్ కాంగ్రెస్‌ యూత్‌లీగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి వరకూ మండేలాకు ఆఫ్రికన్లు తమ పోరాటంలో మిగతా ఎవరితోనూ కలవకూడదన్న ఉద్దేశాలుండేవి. ఆ మేరకు ఆయన తెల్లజాతీయులు, భారతీయులు, కమ్యూనిస్టులు అందరినీ దూరం పెట్టారు. తమ లక్ష్యాన్ని సమర్థించే ఆఫ్రికనేతరులను కలుపుకుపోడంలో తప్పేమీ లేదన్న భావన 1951 వరకూ ఆయనకు కలగలేదు. 1952 మొదట్లో మండేలాకు కమ్యూనిజంపై సానుకూల భావనలు మొదలయ్యాయి. అప్పటినుంచే ఆయన గతితార్కిక భౌతికవాదాన్ని అంగీకరించారు. గాంధీ బోధించిన అహింసా పద్ధతిలో జాతి వివక్షపై పోరాటాలకు మండేలా రూపకల్పన చేసింది కూడా అదే సంవత్సరంలో కావడం కాకతాళీయం. ఆ యేడాది జూన్‌లో మొదటిసారి మండేలా డర్బన్‌లో జాతివివక్షకు వ్యతిరేకంగా అహింసామార్గంలో ఆందోళన చేపట్టాడు. పదివేల మంది హాజరైన ఆ కార్యక్రమం… ఆఫ్రికన్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. మండేలాను ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఐతే ఆ ఆందోళనలతో ANCలో సభ్యుల సంఖ్య ఒక్కసారిగా 20వేల నుంచి లక్షకు పెరిగింది. ప్రభుత్వం సామూహిక అరెస్టులకు పాల్పడింది. ఇక అక్కణ్ణుంచీ మండేలా ఉద్యమ మార్గం విస్తరించింది. తర్వాత 1952 జులైలో మండేలాను కమ్యూనిజానికి మద్దతిస్తున్నాడన్న ఆరోపణలతో ఆఫ్రికా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆరునెలల జైలుశిక్ష తర్వాత విడుదల చేస్తూ… కనీసం ఆరు నెలల పాటు ఎవరితోనూ మాట్లాడకూడదంటూ ఆయనపై నిషేధం విధించింది. మండేలా ఆ సమయంలో భారతీయ నాయకుడు జవాహర్‌లాల్ నెహ్రూ సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఒంటపట్టించుకున్నారు. ఆఫ్‌రికన్ నేషనల్ కాంగ్రెస్‌ను నిషేధిస్తే అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించారు. సంస్థను చిన్నచిన్న విభాగాలుగా విభజించి.. నాయకత్వాన్ని మరింత కేంద్రీకృతం చేయాలన్న ఆ వ్యూహం…. ఎం-ప్లాన్‌గా ప్రసిద్ధి చెందింది.

మండేలా 1953లో జొహానెస్‌బర్గ్‌ కేంద్రంగా తన సొంత న్యాయవాద కార్యాలయం ప్రారంభించారు. ఒక నల్లజాతీయుడు లా ఫర్మ్‌ ఏర్పాటు చేయడం దక్షిణాఫ్రికాలో అదే మొదటిసారి. దాంతో నల్లజాతి ప్రజల తరఫున వాదించే స్వరంగా మండేలా ప్రాధాన్యం పెరిగింది. పోలీసు అరాచకాలతో విసిగిపోయిన ఆఫ్రికన్లు మండేలాను ఆశ్రయించడం మొదలుపెట్టారు. దాంతో మండేలాపై అధికారుల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ఆఫీస్‌ పర్మిట్‌ను సైతం రద్దు చేశారు. దాంతో ఆయన తన కార్యాలయాన్ని మరోచోటికి మార్చుకోవలసి వచ్చింది. 1955లో జొహానెస్‌బర్గ్‌ శివార్లలో నల్లజాతీయులుండే సోఫియాటౌన్‌ను కూల్చేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన అహింసాత్మక పోరాటాలు నిష్ఫలం కావడంతో… సాయుధ హింసాత్మక పోరాటం తప్పనిసరి అన్న భావనకు వచ్చారు మండేలా. చైనా నుంచి ఆయుధాల సేకరణకూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ మండేలా అనుచరుల ఉద్యమం గెరిల్లా యుద్ధరీతికి సిద్ధంగా లేదని చైనా ప్రభుత్వం భావించి…. ఆయుధాలు అందించలేదు. ఆ తర్వాత ఆఫ్రికాలోని వేర్వేరు వర్గాలన్నిటినీ ఏకీకృతం చేసి ప్రజా కాంగ్రెస్‌ ఏర్పాటుకు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. ప్రజాభిప్రాయం సేకరించి ఒక ఛార్టర్‌ రూపొందించారు. ఆఫ్రికాను జాతివివక్ష రహిత ప్రజాస్వామిక దేశంగా రూపుదిద్దాలనీ… దేశంలోని ప్రధాన పరిశ్రమలన్నిటినీ జాతీయీకరించాలనీ ఆ ఛార్టర్‌లో సూత్రీకరించారు. 1955 జూన్‌లో నిర్వహించిన సదస్సు ఆ ఛార్టర్‌ను ఆమోదించింది. ఆ సదస్సును ఆఫ్రికన్‌ ప్రభుత్వం నిలువరించినా… మండేలా భావజాలానికి దేశమంతా వ్యాప్తి లభించింది.

మండేలాపై ఆఫ్రికన్‌ ప్రభుత్వం విధించిన రెండో నిషేధం 1955 సెప్టెంబర్‌తో ముగిసింది. ఐతే మరో ఆరునెలల్లోనే… అంటే 1956 మార్చిలో ఆయనపై మరోసారి నిషేధం విధించింది. ఐదేళ్ళపాటు జొహానెస్‌బర్గ్‌ దాటి కదలకూడదన్న నిషేధాజ్ఞలను మండేలా పదేపదే ఉల్లంఘించారు. 1956 డిసెంబర్‌లో దేశద్రోహం ఆరోపణలపై మండేలాను మరోసారి అరెస్టు చేశారు. జొహానెస్‌బర్గ్‌లో ఆయన్ను ఖైదు చేశారు. దానిపై భారీగా ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో రెండువారాల్లోనే బెయిల్‌ మంజూరైంది. కానీ కోర్టు కేసు రెండేళ్ళకు పైగా నడిచింది. 1959లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. అదేసమయంలో అతివాద భావజాలమున్న వర్గం విడిపోయి… ప్యాన్‌ ఆఫ్రికన్‌ కాంగ్రెస్‌గా ఏర్పడ్డారు. ఐనా రెండు పార్టీలూ కలిసి ఉద్యమాలు చేశాయి. నల్లజాతి వారు తప్పకుండా పాసులు కలిగి ఉండాలన్న చట్టానికి వ్యతిరేకంగా 1960లో పోరాటం చేశారు. ఆందోళనకారులపై ప్రభుత్వ దమనకాండలో 69మంది మరణించారు. అప్పుడే మండేలా సహా పలువురిని అరెస్టు చేశారు. ఏ కేసులూ నమోదు చేయకుండానే జైల్లో బంధించారు. ఏఎన్‌సీ, పీఏసీ పార్టీలు రెంటినీ ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో మండేలా, ఇతర నిందితులు… దేశద్రోహం కేసులో తమ వాదనలు తామే చేసుకోవలసి వచ్చింది. సుమారు ఆరేళ్ళ విచారణల తర్వాత 1961 మార్చిలో దేశద్రోహం కేసులో మండేలా నిర్దోషిగా విడుదలయ్యారు. అది ఆఫ్రికా ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చింది.

మండేలా 1961లో ఉంఖోంటో సిజ్వే అనే విప్లవసంస్థను స్థాపించారు. ఆ సంస్థకు క్యూబాలో ఫిడెల్‌ క్యాస్ట్రో నాయత్వం వహించిన విప్లవం స్ఫూర్తిగా నిలిచింది. ఆ దశలో మండేలా సాయుధ పోరాటం తప్పనిసరి అన్న భావనలో ఉన్నారు. మావో, చే గెవారా వంటి నాయకులు తమతమ దేశాల్లో అనుసరించిన గెరిల్లా యుద్ధనీతిని మండేలా అనుసరించారు. అయితే ఆఫ్రికన్ నేషనల్‌ కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా సంబంధాలు లేకుండా ఉంఖోటో తన విప్లవ కార్యక్రమాలు కొనసాగించింది. ఐతే దానికి మండేలాయే మార్గదర్శనం వహించారు. ఆఫ్రికాలో ప్రజాస్వామికంగా చేస్తున్న జాతి వివక్ష పోరాటం ఫలించకపోతే… ఉంఖోంటో సంస్థ గెరిల్లా దాడులు, ఉగ్రవాద దాడులు చేయాలన్నది ఆయన వ్యూహం. 1961 తర్వాత మండేలా ఆఫ్రికా ఖండ దేశాల్లో విస్త్రతంగా రహస్య పర్యటనలు చేశారు. ఇథియోపియా, ఈజిప్ట్‌, ట్యునీషియా, మొరాకో, మాలి, గినియా, లైబీరియా, సెనెగల్ తదితర దేశాల్లో తమ ఉద్యమానికి నైతిక మద్దతు, ఆర్థిక సహాయం కూడగట్టారు.

నెల్సన్ మండేలాను దక్షిణాఫ్రికా తెల్ల ప్రభుత్వం 1962లో అరెస్టు చేసింది. రాబెన్ దీవికి తరలించింది. అక్కడ ఆయన 8 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు ఉన్న చిన్న గదిలో బందీగా మొత్తం 20 ఏళ్ళు ఖైదులో ఉన్నారు. అత్యంత దిగువస్థాయి ఖైదీగా ఆయన్ను చిత్రహింసల పాలుచేశారు. శారీరకంగా కాకపోయినా.. మానసికంగా తీవ్రంగా హింసించారు. ఆ 18ఏళ్ళలో ఆయన ఎక్కువకాలం ఏకాంతవాసంలోనే గడిపారు. ఆ సమయంలోనే ఆయన కంటిచూపు పూర్తిగా పాడైపోయింది. 1982లో మండేలాను కేప్‌టౌన్‌లోని పాల్స్‌మూర్‌ జైలుకు మార్చారు. 1988 వరకూ అదే జైల్లో మండేలా కాలం గడిపారు. 1986, 87ల్లో ఆయన దేశ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడినా ఫలించలేదు. ఏఎన్‌సీ పార్టీని నిషేధించి… తనను విడుదల చేస్తామన్న ప్రభుత్వాధినేతల కుట్రకు మండేలా తలొగ్గలేదు. జాతి వివక్షను పూర్తిస్థాయిలో రద్దుచేయనిదే తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. 1988లో మండేలాను విక్టర్‌ వెర్‌స్టర్‌ జైలుకు మార్చారు. అక్కడ ఆయనకు కొన్ని వెసులుబాట్లు లభించాయి. 1989లో ప్రభుత్వాధినేత మార్పు తర్వాత పరిస్థితులు మారాయి. జాతి వివక్ష సరికాదని ప్రభుత్వం భావించింది. మండేలా మినహా ఏఎన్‌సీ నాయకులందరినీ విడిచిపెట్టింది. ఎట్టకేలకు 1990 ఫిబ్రవరి 2న మండేలా సుదీర్ఘ ఖైదు జీవితం నుంచి విముక్తుడయ్యారు. ఆ తర్వాత మండేలా ప్రజాపోరాటాలు చర్చల మార్గం పట్టాయి… అదే సమయంలో… ప్రభుత్వ వైఖరితోనూ మార్పు మొదలైంది. 1991లో మండేలా ఏఎన్‌సీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1994 సాధారణ ఎన్నికలతో ఆఫ్రికాలో రాజకీయాధికారం మారింది. ఆ ఎన్నికల్లో గెలిచిన నెల్సన్ మండేలా… ఆఫ్రికా అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత కథ తెలిసిందే. మండేలా రాజకీయ విధానాల్లో ఎన్ని లోపాలున్నా… దక్షిణాఫ్రికా ఒక్క దేశానికే కాక… ఆఫ్రికా ఖండానికంతటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన ధీరోదాత్తుడు నెల్సన్‌ మండేలా.

Advertisements

6 Comments (+add yours?)

 1. gajulasridevi
  Dec 09, 2013 @ 06:11:49

  Mandelaa is really great .really they missed alot.

  Reply

 2. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Dec 09, 2013 @ 06:46:22

  yup… rip madibaa…

  Reply

 3. merajfathimam
  Jan 10, 2014 @ 21:56:57

  మీ టపాలు చాలా హుందాగా ఉంటాయి, కానీ మీరు చాలా నిరాడంభరంగా ఇతరులను ప్రశంసించటం అభినందనీయం సర్.

  Reply

 4. చందుతులసి
  Jan 24, 2014 @ 21:48:28

  మీరు గొప్ప రాతగాడు కాకపోవడమేమిటి ఫణి సార్… *** *** *** మీ శక్తివంచన లేకుండా ఓ మంచి కవితల పుస్తకమో…కథల పుస్తకమో రాయండి. అది ఆదరణ పొందకపోతే నన్నడగండి. *** *** ***.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jan 24, 2014 @ 22:49:05

   చందూ/తులసీ…. ఈ వ్యాఖ్య ఇప్పుడే చూసా. నన్ను మరీ ఇబ్బంది పెట్టిన పదాలను ఎడిట్ చేశా. వేరే ఉద్దేశం ఎమీ లేదు, కావాలంటే మనం కలిసినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: