రావుగారూ… మమ్మల్నెందుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు?

”మంగళ్‌యాన్‌ ప్రాజెక్టుకు మహా అయితే 450 నుంచి 500 కోట్లు ఖర్చవుతుంది. దానికోసం భారతీయులు ఎందుకింత గింజుకుంటున్నారు? నిజానికి ఇవాళ భారతదేశం చరిత్రలోనే ఓ గొప్ప రోజు. దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో 5వేల కోట్లు ఖర్చు చేయడానికి భారతీయులకు ఎలాంటి సమస్యా ఉండదు. ఆ మొత్తంలో కేవలం పదోవంతును మాత్రమే ఈ అంగారక యాత్ర కోసం వెచ్చిస్తున్నాం. దానికి ఇంత గోల ఎందుకు?”

ఈ మాటలు మాట్లాడింది ఎవరో లాకాయి లూకాయి మనిషి అయితే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ ఈ ఆగ్రహం వెలిగ్రక్కింది ప్రొఫెసర్‌ యు,ఆర్‌.రావు. ప్రస్తుతం గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిజికల్ రిసెర్చ్‌ ల్యాబొరేటరీకి ఛైర్‌పెర్సన్‌. ఈ పద్మభూషణుడు స్వయంగా ఇస్రో మాజీ ఛైర్మన్‌ కూడా. తాను ఒకప్పుడు నాయకత్వం వహించిన సంస్థ మీద ప్రేమాభిమానాలతో… తమ సంస్థ తాజా ప్రయోగంపై విమర్శలకు తనదైన శైలిలో స్పందించారు. మంగళయాన్‌కు అమంగళం పలికేవారిని ఆడిపోసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు… మంగళయాన్‌ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారెవరు? వారి వ్యతిరేకతలపై యు.ఆర్‌,రావు వెలిబుచ్చిన ఆగ్రహం ఏమిటి? ఆ విమర్శల లక్ష్యం ఎవరు? ఆ విమర్శలు తగిలింది ఎవరికి? దానిపై ఆయన్ను తిరిగి ప్రశ్నించగలిగింది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి.

వాతావరణ వివరాల నుంచి టీవీ ప్రసారాల వరకూ ఎన్నో రకాల సేవలందిస్తున్న ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడుతోంది ఇస్రో. కేవలం మన దేశపు ఉపగ్రహాలనే కాక… విదేశీ ఉపగ్రహాలను సైతం రోదసిలోకి చేర్చే సేవలందిస్తూ వాణిజ్యపరంగానూ లాభదాయకంగా నిలుస్తోంది. అలాంటి మన ఇస్రో ప్రాజెక్టులంటే సగటు భారతీయుడు పొంగిపోతాడు. దేశాభివృద్ధితో ముడిపడి ఉన్నవిగా ఇలాంటి ప్రయోగాలను చూసి పల్లెటూరి రైతు నుంచి పార్లమెంట్‌ స్ట్రీట్‌లో పల్లీలమ్ముకునే వాళ్ళ వరకూ అందరూ గర్వపడతారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, ప్రయోగాలతో దేశానికేదో మేలు జరుగుతుందని ఆమ్‌ ఆద్మీ భావిస్తాడు. రాజకీయంగా ఏ పార్టీని అభిమానించే వారయినా… ఇస్రో ప్రాజెక్టులను వ్యతిరేకించరు… కనీసం బైటకు వ్యతిరేకంగా మాట్లాడరు. (బహుశా కొన్ని మినహాయింపులు ఉంటాయేమో కానీ నాకు అనుమానాలే తప్ప కాంక్రీట్‌గా తెలీవు). ఐ మీన్‌… లేమ్యాన్‌ఆఫ్‌ ఇండియా ఎవ్వడూ మంగళయాన్‌ను చూసి పొంగిపోతాడు… సాధారణ రాజకీయ పక్షాలు ఈ ప్రయోగాలను వ్యతిరేకించే సాహసం చేయవు. మరి… రావుగారి ఆగ్రహం ఎవరిమీద.

మంగళయాన్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం 2012 ఆగస్టు 3న ఆమోదించింది. అప్పటికే మార్స్‌ ఆర్బిటర్ గురించిన అధ్యయనాల కోసం 125 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే… ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగానికి ఆమోదముద్ర వేయకపోతే ఆ నూటపాతిక కోట్లూ రోదసీ వ్యర్ధాల్లో కలిసిపోయేదన్న మాట. సరే… మన్మోహన్‌ సర్కారు ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసేసింది. ఫలితంగా మరో 375కోట్ల వ్యయానికి దేశం సిద్ధమైంది. దేశం చేసే ప్రతిష్టాత్మక ప్రయోగాల కోసం ఆమాత్రం ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు. ప్రత్యేకించి… ఒక్కో రాష్ట్రమే లక్ష కోట్ల బడ్జెట్‌లు ప్రవేశపెట్టేసి… వాటిలో వేల కోట్లు కొట్టేస్తుంటే… ఈ ఐదొందల కోట్లతో వచ్చేదెంత, పోయేదెంత? ఎంతమాత్రం తప్పేం లేదు.

Mangal Yaan

కానీ… మంగళయాన్‌ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారు కొద్దిమంది ఉన్నారు. ప్రత్యేకించి… రోదసీ ప్రయోగాల రంగంలో విశేష ఖ్యాతి గడించిన వారు ఒకరిద్దరున్నారు. వాళ్ళేమన్నారో ఒక్కసారి చూద్దాం.

”ప్రతీ రాత్రీ డొక్కలోకి కాళ్ళు ముడుచుకుని పడుకునే 23కోట్ల మంది ప్రజలున్న దేశంలో… కనీస వైద్య సౌకర్యాలు, పరిశుభ్రమైన తాగునీరు, కనీస విసర్జన సౌకర్యాలూ లభించని దేశంలో… పేదవాడి ఆత్మగౌరవం పట్ల ఎలాంటి పట్టింపూ లేనితనాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోంది.” అన్నాడో పెద్దాయన. పేరు హర్ష మందేర్‌. మన దేశానికి ప్రస్తుతం మెదడూ, రక్తమూ, మాంసమూ, మజ్జా అన్నీ తనే అయిన సోనియా గాంధీ నాయకత్వంలోని నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌లో కొన్నాళ్ళ క్రితం వరకూ సభ్యుడు. సామాజిక కార్యకర్త. (ఎక్కడో ఏదో ఎర్రటి రంగు కనిపిస్తోంది… ఏమో) సరే.. దేశంలో ప్రతీ ప్రాజెక్టుకూ ఈ వాదనను అప్లై చేసి కబుర్లు చెప్పే జనాలకు ఈయన ప్రతినిథి అనుకుందాం.

”ఈ మిషన్‌ అత్యంత మతిమాలిన ప్రాజెక్ట్‌. (అట్టర్‌ నాన్‌సెన్స్‌). అంగారకుడి మీద జీవం అనేది లేనే లేదని నాసా (అమెరికన్ల ఇస్రో) ఏనాడో కచ్చితంగా తేల్చి చెప్పేసింది. ప్రజలను పిచ్చివాళ్ళను (fools) చేయడానికి, దేశాన్ని మోసం (fool) చేయడానికి ఒక పరిమితి అంటూ ఉండాలి.” — ఈ మాటలన్నది సైంటిఫిక్‌ కమ్యూనిటీకే చెందిన పెద్దమనిషి. డాక్టర్‌ మాధవన్‌ నాయర్‌. 2003 సెప్టెంబర్‌ నుంచి 2009 అక్టోబర్‌ వరకూ ఆరేళ్ళ పాటు ఇస్రో ఛైర్మన్. అంతేకాదు… యు.ఆర్‌.రావు తర్వాత కస్తూరి రంగన్‌ తర్వాత ఇస్రో పగ్గాలు అందుకున్నది ఆయనే. ఇప్పుడున్న ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ గారు మాధవన్‌ నాయర్‌ తర్వాతి వాడే.

”నేటి టెక్నాలజీ ప్రపంచంలో ఈ ప్రయోగం కనుగొనగలిగిన కొత్త విషయాలు పెద్దగా ఏమీ లేవు. ఇప్పటికే పూర్తయిపోయిన ప్రయోగాలను ఇస్రో రిక్రియేట్‌ చేయాల్సిన పనిలేదు” — ఈమాట నాసాలో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్త అమితాభ ఘోష్‌ చెప్పినది. మంగళయాన్‌ ప్రాజెక్టు అవసరం పెద్దగా లేదంటూ ఓ వ్యాసమే రాశాడాయన. మాధవన్‌ నాయర్‌ చెప్పిన విషయాన్నే కొంచెం సాఫ్ట్‌గా చెప్పినట్టున్నాడీయన, ఎంతైనా ప్రస్తుతానికి ‘బైటి’ మనిషి కదా.

మంగళయాన్‌ ప్రయోగ ప్రారంభం విజయవంతమవడాన్ని ఒప్పుకోలేని, ఒప్పుకోక తప్పని చైనా… ఛాన్స్‌ దొరికింది కదా అని… ఇలాంటి విమర్శలను నొక్కి వక్కాణించింది. చైనా ప్రభుత్వపు అధికారిక ఇంగ్లీషు టాబ్లాయిడ్‌ గ్లోబల్ టైమ్స్‌ ఇలా రాసింది. ‘మూడో వంతు జనాభాకు విద్యుత్తు కూడా అందించలేని దేశం… కేవలం కొన్ని అంగారకుడి చిత్రాల కోసం మిలియన్ల డాలర్ల డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అంటూ… భారతదేశంలోనూ, విదేశాల్లోనూ విమర్శకులు మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ను విమర్శిస్తున్నారు.” చైనా ఇంతకు మించి గొప్పగా ఎలా రాయగలదు లెండి. అసలింత సాఫ్ట్‌గా రాయడమే అనూహ్యం.

సరే.. మనం మళ్ళీ బ్యాక్‌ టు బేసిక్స్‌… ఉడుపి రామచంద్రరావుగారు… అదే యు.ఆర్‌. రావు గారి దగ్గరకు వద్దాం.

మంగళయాన్‌ ప్రాజెక్టును విమర్శించింది ఇస్రో ఛైర్మన్ల పరంపరలోని మాధవన్‌ నాయర్‌, మరో ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ నాసాలోని భారతీయ శాస్త్రవేత్త అమితాభ ఘోష్‌. ఓ ప్రముఖ(సోనియా టీమ్‌లో కొన్నాళ్ళున్నాడు కదా…) సామాజిక కార్యకర్త హర్ష మందేర్‌. వారి వాదనల్లో దేన్నీ తప్పు అనడానికో… అదే సమయంలో ఇస్రోయే ఒప్పు అనడానికో… సగటు భారతీయుడికి అంత తెలివి లేదు. మరి రావుగారూ… మీ ఉరుములు ఏ మంగళం మీద పడుతున్నాయి?

దీపావళి టపాసుల కోసం 5వేల కోట్లు ఖర్చవుతోందా? ఏమో. అంత పెద్ద శాస్త్రవేత్త చెబుతున్న మాటలు తప్పని అనుకోలేం. ఐతే ఆ ఐదువేల కోట్లూ ఎక్కడికి పోతున్నాయి? శివకాశీలో టపాసులు తయారు చేసే సంస్థలకే కదా! అంటే అది టర్నోవరే తప్ప ఏకపక్షమైన నష్టం కాదు కదా. పైగా.. వంద కోట్ల జనాభా మీద స్ప్రెడ్‌ అయి ఉన్న మొత్తమే తప్ప ఏ ఒక్క ఖజానా మీదనో నేరుగా పడుతున్న వ్యయం కాదు కదా. నేను… నా ఆదాయంలో నుంచి… దేశానికి కట్టాల్సిన పన్నులు టీడీఎస్‌ రూపంలో ముందే కట్టేశాక… నా సొంత ఖర్చులు, అవసరాలు, విలాసాలు ఎట్సెట్రా ఎట్సెట్రా కోసం దాచుకున్న డబ్బుల నుంచి… నాకు ఇష్టమైన టపాసులు కొనుక్కుని ఒక్క రాత్రి నా దేశపు ప్రజలందరితో కలిసి పండుగ చేసుకుంటే… దాన్ని మంగళయాన్‌ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చుతో పోల్చాల్సిన అవసరం ఏముంది…! మేమేమైనా మీ ప్రాజెక్టు గురించి పన్నెత్తు మాట అన్నామా? రావు గారూ… మమ్మల్నెందుకు ఇన్వాల్వ్‌ చేస్తున్నారు?

బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ సహా ప్రపంచంలోని ప్రతీ చిన్న దేశానికీ మన దేశం లోకువ. మన దేశంలో… మెజారిటీ ప్రజలైన హిందువులంటే లోకువ. వాళ్ళ పండుగలంటే లోకువ. అవునయ్యా… నా పండుగ రోజు నేను బాణాసంచా కాల్చేస్తాను. ఒక రోజు రోజంతా దేశాన్ని పొగలో ముంచెత్తేస్తాను. (దీపావళి రోజు దేశంలో కాలుష్యం పెరిగిపోయిందంటూ జాతీయ ఛానెళ్ళు చేసిన గోల చూశారా?) అయితే ఏంటి? సో వాట్‌ బ్యాంబూ?

ప్రపంచంలో ఏ దేశమూ బాణాసంచా కాల్చదు మరి. అక్కడ పొగలు రావు మరి. దాంతో కాలుష్యం జరగదు మరి. ఓజోన్‌ పొరకి అతిపెద్ద రంధ్రం పొడిచిన సీఎఫ్‌సీలు నా దేశంలో దీపావళి రోజు విడుదలైనవా? అంటార్కిటికాలో మంచుకొండలను కరిగించేస్తున్న రేడియేషన్‌ నా దేశపు దీపావళి పొగల నుంచి వచ్చిందా? వీర కమ్నిస్టు దేశం చైనా నుంచి మహా పెట్టుబడిదారీ దేశం అమెరికా వరకూ అన్ని దేశాలూ ఏదో ఒక సందర్భంలో (దీపావళి రోజు ఇండియాలో కంటె ఎక్కువ) బాణాసంచాను తగలేస్తున్న సందర్భాలు ఏ ఒక్క రావుగారి కంటికీ కనిపించవెందుకో? డిసెంబర్‌ 31నాడు ఈ భూగోళం 360 డిగ్రీల్లోనూ జరిగే వేడుకలకు అయ్యే ఖర్చెంత? ఆనాడు తగలబడే బాణాసంచా వల్ల కలిగే కాలుష్యమెంత? అని ఎవరైనా అడగ్గలరా? అడుగుతారా? ఒక్క భారతదేశమే కాదు… వర్ధమాన దేశాలన్నీ కలిసి ప్రపంచ పర్యావరణానికి కలిగిస్తున్న నష్టం… ఒక్క అగ్రరాజ్యం కలిగించే నష్టంలో సగమైనా లేదు. అయినా ఎంతకీ దీపావళి కాలుష్యం మీదనే కన్ను. లెక్చర్లు. హితబోధలు. ఆగ్రహావేశాలు. హెచ్చరికలు. బెదిరింపులు. మరి దాన్ని నా ధర్మం మీద దాడి అని నేను ఎందుకు అనుకోకూడదు?

ప్రస్తుతం గురించే చూసుకుందాం. రావుగారి ఉరుము ఉరిమి నా మంగలం మీద ఎందుకు పడుతోంది? మీ పొలిటికల్‌ ఫిలాసఫీ ఏంటో నాకు తెలీదు కానీ… రావు గారూ… నా ధర్మాన్నీ, నా పండుగనూ ఎందుకు ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు?

Advertisements

16 Comments (+add yours?)

 1. భమిడిపాటి ఫణిబాబు
  Nov 07, 2013 @ 07:21:56

  Excellent…

  Reply

 2. kastephale
  Nov 07, 2013 @ 09:06:01

  యాచకో యాచకః శత్రుః మరొకరికి పేరొస్తుందనో మరొకటో దుగ్ధ. చెత్త పధకాల పేరు చెప్పి లక్షలకోట్లు తినేస్తున్నదానికంటే లక్ష రెట్లు మేలు, నాలుగువందల కోట్లు ఒక పంటి కిందికిరావు మన పెద్దలకి.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Nov 08, 2013 @ 06:38:22

   అవును మాస్టారూ… మీరన్నది నిజం నిజం. కానీ వాళ్ళూ వాళ్ళూ తిట్టుకుంటూ మధ్యలోకి దీపావళిని లాగడమెందుకు? నిజానికి… పర్యావరణం పేరు చెప్పి దీపావళి పండుగను పూర్తిగా మటుమాయం చేయాలని అన్యమతాలు కుట్ర చేస్తున్నాయంటారు రైటిస్టులు. దానిగురించి మాట్లాడితే సెక్యులరిస్టులకు కోపాలొస్తాయి కూడాను.

   Reply

 3. bonagiri
  Nov 07, 2013 @ 09:56:45

  బాగా పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయంటారు కదండీ! అంతే అనుకోవాలి.
  ఇస్రోలో కూడ రాజకీయాలేనా?
  అసందర్భమేమో కాని, నాదో సందేహం.
  2004లో సునామీ అండమాన్‌ని తాకినప్పుడైనా, తమిళనాడు ప్రాంతాన్ని ఎందుకు హెచ్చరించలేకపోయారు?

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Nov 08, 2013 @ 06:42:04

   ఇస్రోలో రాజకీయాలకు కొదవేమీ ఉండదండీ. కాకపోతే శాస్త్రవేత్తల ప్రపంచం కదా… వారి స్థాయి మనబోటి మామూలు వాళ్ళకు అర్ధమవడం చాలా కష్టం. యాంత్రిక్స్‌ – దేవాస్‌ కుంభకోణం తెలుసు కదా. కింద కామెంటిన rpratapa బెంగళూరు ఇస్రోలో ఓ చిన్న ఎకడమిక్‌ ప్రాజెక్ట్‌ ఏదో చేశాడు. వాడికేదైనా తెలిస్తే చెప్పాలి.

   2004 సునామీ నాటికి మన వాతావరణ శాఖ అంతగా మోడర్నైజ్‌ అయినట్టు లేదండీ. ఆ తర్వాతే వాతావరణ శాఖలో తీవ్రమైన పెను తుపానులు… ఐమీన్‌ అప్‌గ్రేడేషన్స్‌ జరిగినట్టున్నాయి. ఆ శాఖ పనితీరు గురించి తెలిసినవారు చెప్పాలి.

   Reply

   • Veerendra
    Nov 14, 2013 @ 00:08:44

    ఫణీన్ద్ర గారు, మీరు మద్యలొ rpratapa గారిని యెన్డుకు ఇన్‌వాల్వ్ చేస్తున్నారు?

 4. anrd
  Nov 07, 2013 @ 11:14:29

  చాలా బాగా వ్రాసారండి.

  Reply

 5. rpratapa
  Nov 08, 2013 @ 00:47:40

  బొమ్మూరు బాంబు బాగా….. పేలింది!!

  Reply

 6. kastephale
  Nov 08, 2013 @ 06:57:15

  భరతదేశం లో అందరికి లోకువవరండీ, సనాతన మతస్థులేకదా.

  Reply

 7. చందుతులసి
  Dec 31, 2013 @ 23:24:40

  ఫణి సార్ బాగున్నారా…మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చందు

  Reply

 8. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jan 01, 2014 @ 22:05:07

  హాయ్‌ చందూ… తులసీ…. మీ దంపతులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: