ఆ చండాలుడికి….

…. చండాలిని(క?) ఎవరు… అన్న ధర్మసందేహం నన్ను వేధిస్తోంది.

అయ్యలారా ఆగ్రహించవలదు. ఎవరినీ లేదా ఏ కులాన్నీ కించపరచడం నా ఉద్దేశం కాదు. ఈ మధ్య ఒక చిన్న వార్త విన్నప్పటి నుంచీ ఈ శంక నన్ను కట్టి కుడుపుతోంది. శంకరాచార్యుడి గురించి రాబోతున్న సినిమాలో నాగార్జునను చండాలుడి పాత్రకు ఎంచుకున్నారట. ఆ నిర్దిష్ట ఘట్టానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారట. ఇదీ ఆ వార్త.

శంకరాచార్యుడి జీవితాన్ని .అప్పుడెప్పుడో వెండితెర మీద ఆవిష్కరించిన జీవీ అయ్యర్‌… యోగిగా మారిన భోగి అని వినికిడి. దాని నిజానిజాలు తెలీవు కానీ… ఎప్పుడో బాల్యంలో చూసిన ఆ సినిమా చాలా పద్ధతిగా తీసినట్టు లీలగా గుర్తు. అదే అయ్యర్‌ భగవద్గీతకూ చిత్ర రూపమిచ్చాడు. ఆ సినిమా వచ్చేనాటికి డిగ్రీ చదువుతున్నట్టు గుర్తు. గీతకు తనదైన వ్యాఖ్యానమిస్తూ… హిమాలయాల్లో ఆ సినిమాను చిత్రీకరించాడాయన. గీతలోని లోతు అంతగా తెలీకపోయినా… దానికి అయ్యర్ చేసిన వ్యాఖ్యానం అప్పట్లో బాగానే అర్ధమైనట్టు గుర్తు.

ఇన్నాళ్ళకు మళ్ళీ సుదర్శన భట్టాచార్య అన్న మహానుభావుడు శంకరుడి జీవితాన్ని తెరకెక్కిస్తారని విన్నప్పటి నుంచీ భయం పట్టుకుంది. అదే… జె.కె. భారవి అన్న పేరుతో పాపులర్‌ కదా ఆయనే…! అన్నమయ్య అనే కళాఖండంతో తెలుగుదేశాన్ని ఉర్రూతలూగించిన రచయిత. అంతకుముందెప్పుడో చిటికెల పందిరి అన్న సినిమాకు దర్శకుడిగా రంగం మీదెక్కి…. తర్వాత రచయితగా స్థిరపడ్డాడాయన. భారవి – రాఘవేంద్రరావు – నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ఆ సినిమా… నాకొక నైట్‌మేర్‌గా మిగిలిపోయింది.

విబుధజనుల వలన విన్న పరిమిత పరిజ్ఞానంలో అన్నమయ్య జీవితం సాత్విక ముద్ర అని మాత్రమే నాకు తెలుసు. అలాంటి అన్నమయ్యను నవరసాలూ పోషించేవాడిగా చూసిన ఆ రోజు నా జీవితంలోని దుర్దినాల్లో ఒకటి. ఆ సినిమాలో… బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్న కీర్తనను చిత్రీకరించిన తీరు… అబ్బబ్బో అయ్యబాబోయ్‌. ఇక అన్నమయ్య ఇద్దరు మరదళ్ళతో సరసాలు… దానికి వేంకటేశుడి జస్టిఫికేషన్… ఇంక నేను మాట్లాడలేను. మాస్ మసాలా హీరోలతో… గ్లామరస్‌ హీరోయిన్లతో బీభత్స భయానక ప్రధానమైన శృంగార చిత్రాలు తీసే దర్శకుడు అన్నమయ్యను చెరపట్టడం… కటకటా.

ఇన్నాళ్ళకు మళ్ళీ భారవి – రాఘవేంద్రరావు – నాగార్జున కాంబినేషన్. శంకరాచార్య పాత్రధారి ఎవరో నాకు తెలీదు.. అనవసరం కూడా. భారవి శంకరాచార్య సినిమా తీస్తున్నాడనగానే ఇంక దానిగురించి తెలుసుకోడం అనవసరమని దూరం జరిగిపోయాను. కానీ ఒకానొక దుర్ముహూర్తాన ఈ వార్త వినాల్సి వచ్చింది. ఆదిశంకరుడికి జ్ఞానోపదేశం కలిగించిన చండాలుడి పాత్రను నాగార్జున ధరిస్తాడట. (మనం భరించాలట) ఈ వార్త విన్నప్పటి నుంచీ నాలో రకరకాల ఆలోచనలు. అవధరించండి.

నా శరీరాన్ని తప్పుకోమంటున్నావా? నాలోని ఆత్మను తప్పుకోమంటున్నావా? అని కదా చండాలుడి ప్రశ్న. అలాంటి చండాలుడికి శారీరకమో… ఆత్మికమో అయిన జీవిత భాగస్వామి ఉండకూడదనేం లేదు కదా. చండాలుడైనంత మాత్రాన వాడు శంకరుడిలా యతో సన్యాసో కాదు కదా! ఆ చండాలుడికి ఏ చండాలినో భార్యగా ఉండదా? ఆ చండాలినీ దీపశిఖ (కాళిదాసా క్షమించు)తో సదరు చండాలుడు కాపురం చేయడా? అది మాత్రం… భార్యా భర్తలిద్దరూ రెండు శరీరాల్లో ఉండే ఒకే వ్యక్తి అన్న ‘అద్వైతం’ కాదా? ఆ అద్వైత భావనను… ఏ అత్తిపళ్ళో కిందేసుకుని మీదేసుకుని గానం చేయరా? ఆ గానాన్ని ఆర్షభూమిలోనే కాక అప్రాచ్య దేశాల్లో మాత్రం పాడుకోకూడదా? దానికి ఏ విదేశీ సంగీతవాయిద్యాల నేపథ్యంలో అశాస్త్రీయ ఫణితుల బాణీలో జతపరచకూడదా? (అంటే… అద్వైతం మనుషులకే కాదు… దేశాలకూ సంగీతాలకూ కూడా వర్తిస్తుందేమోనని…) ఇంతకీ… ఆ చండాలుడితో కాపురం చేసే ఆ చండాలిని ఎవరు? అన్నట్టు… చండాలుడికి అంత వైరాగ్యం కలగడానికి కారణం సదరు భార్యామణి ఏ చండికో అయి ఉండకూడదా.

అంటే… ఆ త్రయానికి వచ్చే ఆలోచనలు ఇంత ఉదాత్తంగా ఉంటాయేమోనని నా అనుమానం. పొరపాట్న శంకరుణ్ణో చండాలుణ్ణో సాత్విక భావోదయంతో చూపించేస్తారేమోననీ…. సునిశితమూ సుకుమారమూ అయిన వాక్యాలు రాసేస్తారేమోననీ… వాటిని గొంతులోనుంచి గాలిగస పోసుకుంటూ పలికేస్తారేమోననీ భయపడి చస్తున్నా.

ఆదిశంకరా… అమంగళం అప్రతిహతమగుగాక.

Advertisements

10 Comments (+add yours?)

 1. జలతారువెన్నెల
  Mar 07, 2013 @ 23:55:11

  :))))))))))))))))))
  మీ భయానికి అర్ధముంది.

  Reply

 2. ss
  Mar 08, 2013 @ 00:24:15

  yem chestam bharichali …..

  Reply

 3. Vidya Sagar
  Mar 08, 2013 @ 02:17:07

  చందాలముగా ఉండకూడదు అంటారు అంతేనా ?

  Reply

 4. తాడిగడప శ్యామలరావు
  Mar 08, 2013 @ 15:32:02

  ఒక సినిమా చూడటమూ, చూడకపోవటమూ; ఒక పాట వినటమూ వినకపోవటమూ; ఒక రచన చదవటమూ, చదవకపోవటమూ లాంటివి తప్పకుండా మన ఇష్టానికి సంబంధించినవే. ఎవరూ మనని బలవంతం చేయలేరు.

  కాని ఒక సినిమా నెలాగైనా తీసే హక్కూ, ఒక పాట నెలాగైనా పాడే హక్కూ, ఒక రచన నెలాగైనా బరికేసే హక్కూ లాంటివి మాత్రం కళాకారులమని చెప్పుకునే వారికి ఉంటుంది. దానికి మనం యేమీ చేయలేము.

  జనం మెచ్చితే యెలాంటెలాంటివీ కళాఖండాలుగా చెలామణీ అయిపోతాయి. దానికీ మనం యేమీ చేయలేము.

  ఒక్కొక కాలంలో ప్రజలకు కళల పట్ల మంచి అవగాహనా శ్రథ్థాభక్తులూ ఉంటే ఒక్కొక కాలంలో ప్రజలకు యేది సరయిన కళ అయినదీ యేది నకిలీకళావ్యవహారమూ అనే అవగాహన బొత్తిగా లోపించటమూ జరుగుతుంది. మనం యీ విషయంలో కృషి చేస్తే దిగజారుడు కళారూపాలకు జనం ఛీ కొట్టేలా చేయవచ్చును.

  విషయాన్ని ప్రస్తుతంలోకి తీసుకు వస్తే నేను నాగార్జునగారి అన్నమయ్య, రామదాసు సినిమాలు మెచ్చలేదు – చూడలేదు. మీ రన్నశంకరాచార్య సినిమా నేను చూసే అవకాశం తక్కువే.

  పొరబాటున ఆ మధ్య బాలకృష్ణ నటించిన పాండురంగడు చూసి ఝడుసుకున్నాను. ఇంటిల్లిపాదీ, ఇంటికి చేరుకోగానే పాత సినిమా పాండురంగమాహాత్మ్యం చూసి తేరుకున్నాం.

  నాకు యీ మధ్య వచ్చిన శ్రీరామరాజ్యం కూడా నచ్చలేదు. పాత లవకుశ చాలనిపించింది.

  అయినా పక్కా వ్యాపారసినిమాలు కళాపోషణ చేస్తాయని ఆశించటం మన అమాయకత్వమే!

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Mar 21, 2013 @ 22:03:46

   శ్యామలరావుగారూ… మీ వ్యాఖ్య స్పామ్‌లో చిక్కుకుపోయింది. ఆలస్యంగా చూసి… ఇప్పుడే తీశాను. క్షమించాలి. కవయా: నిరంకుశ: అన్నాడు కదండీ కాళిదాసో ఎవరో… ఈ సినీమాయావులు అంతకంటె మహా నిరంకుశులు. మీరన్నట్టు… చూడడం మానేయడం తప్ప మరేం చేయలేం. 🙂 రామరాజ్యం విషయంలో నేనేం మాట్లాడలేను. చూడలేదు మరి. 🙂

   Reply

 5. చందుతులసి
  Apr 02, 2013 @ 08:10:25

  ఐతే మాస్టారు మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి.

  త్వరలో వివేకానందుడి జీవితమును కూడా తెలుగు తెరపైకి తెచ్చెడి మహా ప్రయత్నమొకటి
  జరగబోవుచున్నది.
  ఈ “ఎండు” తెర ( నా కీ బోర్డ్డ్ లో వెండి అన్న అక్షరాలు రావట్లేదు…నిఝం ) కావ్యంలో
  మీ అభిమాన ( ! ) నాగార్జునుడు కాక వేంకటేషుడు నటిస్తాడట.

  ఇహ ఇప్పుడు మీరు కావలసినంత ఊహించుకోండి…అట్టి కావ్యము ఎలానుండబోతోందో.

  వివేకానందిణి ( క్షమించండి. నా జీవితంలో ఇటువంటి పదం ఒకటి రాయాల్సి వస్తుందని ఊహించలేదు ) గురించి కూడా….

  అన్నట్లు మీకు అట్టి సినిమాను నేనే స్వయంగా చూపించెదను. దానిని చూసి మీరు తరించే వేళ నేను మీ సమక్షములో యుండాలని నా కోరిక…తీరుస్తారా మాస్టారు. ప్లీజ్

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: