అసలు… వాళ్ళని ఉరి ఎందుకు తీయాలి?

తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ ‘హంపీ నుంచి హరప్పా దాకా…’ ఒక శతాబ్దిలో వచ్చిన సుమారు రెండువందల స్వీయ చరిత్రలలో ఉత్తమోత్తమ రచన అన్న ప్రశంసలందుకుంది. అందులో ఆయన ఉత్తర భారతంలో తన పర్యటనల్లో ఓ అనుభవాన్ని వివరిస్తారు. ప్రదేశం సరిగ్గా గుర్తులేదు కానీ… ఓ చోట ఆయన కార్మిక సోదరులతో కలిసి కొన్నిరోజులు గడుపుతారు. ఆ నాళ్ళలో ఓ ఘటన… ఓ మహిళను ఆ కుటుంబ మిత్రుడొకడు పదేపదే అడుగుతూంటాడు.. ‘భాభీ తుమ్హారీ ఘడీ మే కితనే బజీ హై’. ప్రతీసారీ ఆమె ఒకటే సమాధానమిస్తూ ఉంటుంది… ‘ఏక్ హీ బజీ హై’ అని. ఈ సంభాషణ మొదట్లో రచయితకు అర్ధం కాదు. తర్వాత దాని అర్ధమూ, అంతరార్ధమూ తెలిసాక.. ఆయనంటాడు… వదినను తల్లిగా చూసే మన తెలుగు కుటుంబాల్లో ఇలాంటి సంభాషణలు సరసం కిందకు రావు, అసభ్యంగా పరిగణించబడతాయి అని.

సరసం విరసమవడానికి… భార్యా భర్తల మధ్యనైనా ఒక చిన్న సందర్భం చాలు. ఇక… ఓ యువతితో సరస సంభాషణ జరపాలంటే ఆ వ్యక్తికి ఎంత స్నేహం, మరెంత సాన్నిహిత్యం ఉండాలి? అప్పుడైనా… ఆ సెన్సిటివ్ మార్జిన్ ఎక్కడ ఆగుతుంది, దానికి ఏది పరిధి అన్నది తెలుసుకోడం ఏ ఇద్దరు వ్యక్తులకూ ఒకేలా ఉండదు. ఇక… సంస్కృతీ భేదాలుండే సందర్భాల్లో ఆ విభజన రేఖ మరింత వెడల్పుగా ఉంటుంది. నాగరికతలూ, స్థాయీ భేదాలూ కూడా ఆ రేఖను మరింత పెద్దది చేస్తాయి. మనకు నచ్చినా నచ్చకున్నా, మనకు తప్పైనది మరొకరికి ఒప్పయినా మనకు ఒప్పైనది మరొకరికి తప్పైనా…. ఆ స్థాయీ భేదాలు జీవిత వాస్తవం. అంతేకాదు… అలాంటి తేడాలున్న సమాజంలోనే అందరం కలిసి బతుకుతుండాల్సి రావడం పచ్చి నిజం.

నేనొక చదువు చదువుకుంటాను. నేనొక కుటుంబంలో జీవిస్తుంటాను. నేనొక బృందంలో స్నేహసంబంధాలు కలిగి ఉంటాను. వాటన్నిటి వల్లా నాకొక సంస్కారం ఏర్పడుతుంది. అది ‘ఎక్స్’కి ఒకలా… ‘వై’కి మరోలా… ‘జెడ్’కి ఇంకోలా ఉంటుంది. నాకూ ఆ ముగ్గురికీ అభిప్రాయ భేదాలూ, కలబోతలూ ఆయా సంస్కారాలను అనుసరించి ఏర్పడతాయి. మా నలుగురికీ దూరంగా… భౌతికంగా కొద్దిగానూ మానసికంగా చాలా ఎక్కువగానూ దూరంగా… ఉండే ప్రపంచంలో ఒక ‘ఎ’ ఉంటాడు. అతని పరిసరాలు, చదువు, సంస్కారం… అన్నీ వేరేగా ఉంటాయి. ఒకానొక ఆకస్మిక అనూహ్య సందర్భంలో మేం నలుగురం, ఆ ఒక్కడూ కలిసి ఒకచోట ఉండాల్సి వస్తుంది. అప్పుడు మా ఐదుగురి మధ్యా ఎలాంటి సంభాషణలు నడుస్తాయి? ఎలాంటి ఇంటరేక్షన్ జరుగుతుంది? నేనా వ్యక్తితో మేలమాడతాను. దాన్ని అతడు అపహాస్యంగా భావిస్తాడు, మండిపడతాడు. ఇంతలో… నేనన్న దానిలో తప్పేముందంటూ నా స్నేహితుల్లో ఒకడు అతన్ని నిలువరించవచ్చు. లేదూ… నేనలా అనకుండా ఉండాల్సిందంటూ మరొక స్నేహితుడు నన్ను వ్యతిరేకించవచ్చు. మరొకడు మా ఇద్దరికీ బుద్ధి లేదంటూ నిందించవచ్చు. ఇవన్నీ కాదు.. ‘ఎ’ బైటివాడు… మనం స్నేహితులం… కాబట్టి మనవాడికి మనం మద్దతు పలకాల్సిందే అని మూడోవాడు అనొచ్చు. చివరికి ఏమైనా జరగొచ్చు. మందిబలం మీద మేమందరం అతన్ని మరింత అపహాస్యం చేయవచ్చు. లేదా శారీరకంగా మా అందరికంటె బలవంతుడై ఉంటే అతను మా అందర్నీ తుక్కుతుక్కుగా కొట్టి ఉండవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయాన్యాయాలు నిర్ణయించాల్సింది ఎవరు? ఎలా? దేశమంతటికీ ఒకే చట్టం ఉంది. అది మాత్రం నిర్వికారంగా పని చేసుకుంటూ పోతుంది. సరే… దాని దృష్టిలో ఎవరు ఎలా పడతారన్న దాన్ని బట్టి అది చేసుకుపోయే పని ఆధారపడి ఉంటుంది. దాని కథ గురించి మనకు పెద్దగా తెలిసినదీ, తెలియాల్సినదీ ఏమీ లేదేమో లెండి… దాన్ని పక్కన పెడదాం.

ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్న చిన్నదానికి కురచ దుస్తులు వేసుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదనిపించవచ్చు. ఆమె రోడ్డున పడగానే… ఆ పక్కనే మోటర్ బైక్ మీద స్టైలిష్ గా కూచుని ఉన్న కుర్రాడు వేసే విజిల్ తన అందానికి మెచ్చుకోలుగా అనిపించవచ్చు. అదే దారిన పోతుండే మరో దానయ్యకు అవి చిత్ర విచిత్రంగా కనిపించవచ్చు. ఆ చూపులు ఆ అమ్మాయికి అనాగరికంగా అనిపించవచ్చు. ఈ మొత్తం ఘటనలో తప్పెవరిది? ఒప్పెవరిది? నాగరికత నడిబొడ్డున ఉన్నందున… దానికి విరుద్ధంగా ప్రవర్తించడం దానయ్యదే తప్పు కదా. అదే… పల్లెటూరిలో అలాంటి సీన్ చోటు చేసుకుంటే తప్పు ఆ అమ్మాయిదే అవుతుంది. (ఈ సోషల్ ఎటికెట్ లోకి ఐన్ స్టీన్ వచ్చేస్తున్నాడు. ఆగు బాసూ…)

ఏ ఒక్కరికీ భౌతిక హాని లేనంత వరకూ ఈ చర్చలు ఎలాగైనా చేసుకోవచ్చు. శారీరక దాడి, అత్యాచారం జరిగినప్పుడు మాత్రం బాధితురాలి వైపే సానుభూతి మొత్తం ఉంటుంది.అందులో తప్పేమీ లేదు కూడా. కానీ… నేరానికి పాల్పడిన వాళ్ళు కేవలం నేరస్తులుగా మిగిలిపోతారు. ఆ నేరానికి వారికి ప్రోద్బలం కలిగించిన పరిస్థితులు మాత్రం ఊసులోకి కూడా రావు. ఢిల్లీ కేసులో బాధితురాలు చనిపోయినందుకు… సాధారణ చేతన ఉన్న మనిషన్న ప్రతీ ఒక్క భారతీయుడూ ఆవేదన చెందాడు. సహజమే. ఐతే నిందితుల వైపు నుంచి ఆలోచించగలిగిన వారెందరు?

సన్నిహితులు ఆడితే సరసమైనది ముక్కూమొహం తెలీనివారి నోట విరసమే కాదు అసభ్యమూ అవుతుంది. క్లాస్ సిస్టంలో ఉండే పరస్పర అనుమానాలు కూడా తోడైతే అది మాటల దశ నుంచి చేతల దశ వరకూ వస్తుంది. దానికి మందు మత్తు కూడా కూడితే ఆ చేతలు హింసాత్మకమవుతాయి. ఉన్మాదం ప్రకోపించినప్పుడు ఆ హింస ప్రాణాలూ తీయిస్తుంది. కేవలం వ్యక్తుల నేర స్వభావమే దారుణానికి కారణమైతే ఇంత గింజుకోవలసిన అవసరం లేదు. కానీ… స్వభావరీత్యా నేరస్తులు కాని వ్యక్తులు… అజ్ఞానం నుంచి పుట్టిన అక్కసు వల్ల, విచక్షణ కోల్పోయిన దశలో నేరం చేస్తే ఏం చేయాలి? రేపిస్టులకు ఉరిశిక్ష విధించాల్సిందే అంటున్న వారు ఈ విషయం మీద కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది.

ఆ నిందితులందరూ అధోజగత్ సహోదరులే. పెద్దగా చదువుకున్న వారు కారు. పొట్ట పోసుకోడం కోసం రాజధాని చేరుకున్నవారు. వారిలో ఒకడు బస్సు డ్రైవరుగా పనిచేస్తుంటే మిగిలిన వారూ దాదాపు అలాంటి చిన్నచిన్న పనులు చేసుకు బతుకుతున్న వారే. మహానగరంలో మనుషుల తీరుతెన్నులను తమ కళ్ళతో చూస్తూ, తమకు తోచినట్టు మాత్రమే అర్ధం చేసుకోగలిగినవారు. ఎడతెగక ఏరులై పారుతూ దొరికే మద్యానికి బానిసలు. వెండితెర మీద సరసాల పేరిట అర్ధనగ్న సుందరీమణుల, పూర్తి దుస్తుల ‘మహా’నటుల అసభ్య ప్రేలాపనలకు, శృంగారం పేరిట విశృంఖల లైంగిక చేష్టలకూ ఎడిక్ట్ అయిపోయినవారు. ప్రేమ అంటే కుక్కల, పందుల పొర్లాట అనే భ్రమలు కలిగించే సినిమాల బాధితులు. సెలవు రోజు ఎంజాయ్ చేయడమంటే పూటుగా మందుకొట్టి నోటికొచ్చినట్టు అమ్మాయిలను ఏడిపించడమే అనిపించే సినీ కాలుష్యాలతో కుళ్ళిపోయినవారు. అసలే కోతి, ఆపైన కల్లు తాగింది అన్నట్టు… సమాజ కాలుష్యాలనే తింటూ తాగుతూ బతికినవారికి చేతికో బస్సు దొరికింది… పీకల నిండా పట్టించిన మందు మత్తెక్కించింది, ఆపై ఆడపిల్ల అసహాయ పరిస్థితిలో కనబడింది. వారు చేసింది నేరమే. దానికి ఉరి శిక్ష విధించినా సరిపోదు. నిజమే. కానీ… ఈ సమాజంలో వారొక్కరికే శిక్ష పడడం సమంజసమా?

తందూర్ కేసు గుర్తుందా… అదీ ఢిల్లీలో జరిగిన ఘటనే. ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడి భార్య ఆ అమ్మాయి. తన మిత్రుడొకరితో ఆమెకు సంబంధం ఉందేమోనని అనుమానం ఆ యువనేతకు. ఒకరోజు అతను ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి మందు కొడుతూ ఫోన్ లో ఆ రెండో వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. కోపం ఆపుకోలేక ఆమెను పొడిచి చంపేశాడు. తర్వాత శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు. ముక్కలుముక్కలుగా నరికి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి మిత్రుడి హోటల్లో తందూర్ లో కుక్కి కాల్చేశాడు. ఆ సమయానికి ఆ దారమ్మట పోతున్న పోలీస్ ఎవరో చూడడంతో ఆ ఘటన వెలుగు చూసింది. సుమారు యేడాది తర్వాత అతను లొంగిపోయాడు. ఐతే కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి అక్కణ్ణుంచి మరింత పైకి.. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాటి రాష్ట్రపతి దగ్గరకి చేరినట్టుంది. ఇదంతా జరిగి పదేళ్ళు దాటిపోయింది. నేరస్తుడు ఇంకా సభ్య సమాజంలోనే తిరుగుతున్నాడు.

కేరళలో సూర్యనెల్లి కేసు ఇంకా దారుణం. పధ్నాలుగేళ్ళ ఓ చిన్న పిల్లని బస్ కండక్టర్ ఒకడు కిడ్నాప్ చేసి రేప్ చేశాడు.తర్వాత ఓ ముఠాకి అమ్మేశాడు.ఆ ముఠాని నడుపుతున్నది రాజకీయ నాయకులూ, లాయర్లూనూ. నలభై రోజుల పాటు రోజుకో ఊరు తిప్పుతూ బ్రోకర్లకు అమ్మేసుకున్నారు. చివరికి ఆమె చేతిలో నాలుగు రూకలుంచి ఏదో ఊళ్ళో వదిలేశారు. అక్కణ్ణుంచి ఆమె నానా కష్టాలూ పడి స్వస్థలానికి చేరుకుంది. కేసు పెట్టారు. ప్రభుత్వం కూడా ఆమె అత్యాచారానికి గురైందని గుర్తించి… ఓ చిన్న ప్రభుత్వోద్యోగం ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఆ ప్యూన్ ఉద్యోగంలోనూ పదేపదే ట్రాన్స్ ఫర్లు.. ఎక్కడికెళ్ళినా చూపులతోనే వెలేసే సమాజం. పధ్నాలుగేళ్ళుగా అలాగే అవస్థలు పడుతోందా కుటుంబం. చావలేక, బతకలేక నరకయాతన అనుభవిస్తోందా అమ్మాయి. ఇంతా చేసి… నేరస్తులెవరో అందరికీ తెలిసినా… ఒక్కరికీ కనీస శిక్ష కూడా పడలేదు. ఇంకో వందేళ్ళ వరకూ వాళ్ళకు శిక్షలు పడతాయన్న గ్యారంటీ లేదు.

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో నిందితులందరూ వెంటనే లొంగిపోయిన వారే. మొదటి రోజైతే… మా నేరానికి మరణ శిక్షే సరైనది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారే. వాళ్ళని నిలువునా ఉరితీసేయండంటూ వారి కుటుంబ సభ్యులు మొహాలు దాచుకున్నారు. వారికి ఉన్న సంస్కారం ఈ పెద్దపెద్ద వాళ్ళకి లేదు. తమ అనుకున్న వాళ్ళు ఎంతటి నేరానికైనా పాల్పడనీ, ఎంతటి ఘోరమైనా చేసి ఉండనీ… వారిని శిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు. ఏదన్నా అంటే జరిగిందేదో జరిగిపోయింది… పరిహారం ఎంత కావాలీ అంటారు. అలాంటి నీచులని నడిరోడ్డున నిలబెట్టి ఉరి తీయాలి. అది జరగదు. ఈ నిర్భాగ్యులకు వ్యతిరేకంగా దేశమంతా ఆందోళనలు. ఈ క్షణంలోనే చంపేయాలంటూ డిమాండ్లు. చిత్రమేంటంటే… మామూలు మనుషుల గోల పక్కన పెడితే… లాయర్లు కూడా వారికి న్యాయ సహాయం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట. అసలు… ఆ అత్యాచారం జరిగిన మర్నాటి నుంచీ ఆందోళనలు జరిగిన రెండు వారాల్లోనూ దేశ రాజధానిలోనే నాలుగైదు అత్యాచార ఘటనలు జరిగాయి. వాటి గురించి స్పెసిఫిగ్గా మాట్లాడుతున్న వాడే లేడు. దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న ఘటనలను ఎక్కడికక్కడ స్థానిక మీడియా బైటకు తీస్తూనే ఉంది. గత నెల రోజులుగా ఏ పేపర్ చదివినా, ఏ టీవీ చూసినా రేప్ కేసులే. ఇప్పటికిప్పుడు కొత్త చట్టాలు చేసి నేరస్తులను ఉరి తీసేయాలని డిమాండ్ చేసేవారే అందరూనూ. ఇప్పటికే ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడమైనా సాధ్యమో కాదో ఆలోచించే వాడే కనిపించడం లేదు. న్యాయపరమైన సమస్యలు పక్కన పెడితే… చట్టాల అమలుకు అడ్డు పడుతున్న అతిరథ మహారథులందరూ బాగానే చెలామణీ అయిపోతుంటారు. వాళ్ళనేమీ చేయలేని మనం… మానసికంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బలహీనులైన నిందితుల విషయంలో జాలి చూపడం కాదు… కనీసం ఆలోచన కూడా చేయడానికి వెనుకాడుతున్నాం.

అసలు… వాళ్ళని ఉరి ఎందుకు తీయాలి?

Advertisements

17 Comments (+add yours?)

 1. M.V.Ramanarao
  Jan 10, 2013 @ 12:27:17

  మీ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగాను, అసమంజసంగాను ఉన్నావి.క్లుప్తంగా నా సమాధానాలు.
  1.స్త్రీల వస్త్రధారణలో విభిన్న అభిప్రాయాలు ,reactions ఉండవచ్చును.కాని అందులో జోక్యం కలిగించుకొనే అధికారం ఇతరులకు లేదు.
  .2.కొందరు పలుకుబడి,డబ్బు గల ఉన్నతవర్గాలకు చెందినవారు మానభంగం కేసుల్లో ఇరుక్కొన్నా చాలాకాలం కేసులునడిపిస్తూ తిరుగుతున్నారన్నది నిజమే.కాని బస్సు తో సహా అందులోఉన్న ప్రయాణికులను కూడా కాల్చి చంపేసిన యువకులను దళితులన్న కారణంగా మరణశిక్షతప్పించారు కదా.కాశ్మీరులో గొడవలు వస్తాయని భయంతో పార్లమెంటు పైదాడిలో ప్రముఖ టెర్రరిస్టు అఫ్జల్ గురుని,ముస్లిం అని ఇంకా ఉరితీయకుండా ఉన్నారు కదా.
  3.తీవ్రమైన నేరం చేసినవారిని తీవ్రంగా శిక్షించాలి .ఏ వర్గానికి,కులానికి చెందినా.
  4.మనదేశంలో న్యాయవిచారణలో ఉన్న తీవ్రమైన జాప్యాలు,లొసుగులవలననే నేరస్తులు దీర్ఘకాలం తప్పించుకొని తిరగగలుగుతున్నారు.న్యాయవిచారణ వ్యవస్థను బాగా సంస్కరించాలి.అది వేరే విషయం.
  5.ఇక ఢిల్లీ సంఘటనకి వస్తే ఆ అమ్మాయి చేసిన తప్పేమిటి.ఆమెను దారుణంగా రేప్ చేసే అధికారం వాళ్ళకుందా?అంతేకాదు,ఆమెను చిత్రహింసలు పెట్టి,నగ్నంగా పడేసారు.ఆమె గాయాలతో చివరకు మృతి చెందడానికి ఆ 6గురు కారకులు కదా.వాళ్ళు ఏవర్గానికి చెందినా,బీదవాళ్ళయినా తప్పక ఉరితీయవలసిందే.మనం victim తరపు నుంచి, ఆమె కుటుంబం వైపునుంచి కూడా ఆలోచించాలి.లేకపోతే మీ చిత్తశుద్ధిని శంకించవలసి వస్తుంది.
  6.మరొక చిత్రమైన వాదన.హత్యలు ,రేపులు చేసే వాళ్ళని ఉరితీస్తే ఆ నేరాలు తగ్గవు,అని. నిజమే,తగ్గకపోవచ్చును.కాని అలాంటి దుష్టులను శిక్షించాలి కదా.పెద్దనేరం చెసినవాడికి పెద్దశిక్షే వెయ్యాలి.”పరిత్రాణాయ సాధూనాం ,వినాశాయచ దుష్కృతాం ”అన్నాడు భగవానుడు.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jan 15, 2013 @ 12:47:18

   రమణారావుగారూ…
   కొద్దిరోజులుగా అంతరజాలానికి దూరంగా ఉన్నందున ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి.
   నా వ్యాఖ్యలు అభ్యంతరకరంగానూ, అసమంజసంగానూ ఉన్నాయనిపిస్తే… అది నా రాతలో లోపమే తప్ప మీరు చెబుతున్న పాయింట్లతో నేను విభేదించడం లేదు.
   1. స్త్రీల వస్త్రధారణ విషయంలో జోక్యం కలిగించుకునే అధికారం ఎవరికీ లేదు. నూరు శాతం ఏకీభవిస్తున్నాను.
   2. నేరం నిర్ధారణ అయినా… శిక్షలు పడకపోడానికి పలు కారణాలు. నేను పలుకుబడి, డబ్బు గురించి ప్రస్తావిస్తే…. మీరు కుల, మత కారణాలను వాడుకునే రాజకీయమైన నేర్పు లేదా నేర్పులేమి గురించి చెబుతున్నారు. ఏదో ఒక కారణం అడ్డం పెట్టి నేరస్తులకు శిక్షలు పడకుండా అడ్డుకుంటున్న సమాజం మనదీ… అన్నదే మౌలికాంశం. వెనుక ఉన్న అండదండలతో సంబంధం లేకుండా.. నేరానికి శిక్ష పడి… అమలైనప్పుడే దేశం భద్రంగా ఉంటుంది.
   3. తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి కుల వర్గాలతో సంబంధం లేకుండా శిక్ష పడాలి… ఏబ్జొల్యూట్లీ కరెక్ట్. కానీ సాధ్యమేనంటారా?
   4. న్యాయ విచారణ సంస్కరణలు… ఈ టపా నేరుగా దానికి సంబంధించినది కాదు. అయితే ఆ విషయంలో నాదీ మీ మాటే.
   5. ” దారుణంగా రేప్ చేసే అధికారం వాళ్ళకుందా?”… రేప్ అధికారం కాదు, అది ఎవరికీ ఉండదు. ఆఖరికి… భార్యకు ఇష్టం లేకపోతే భర్తయినా కూడా కనీసం చెయ్యి కూడా వేయకూడదు.
   “అంతేకాదు,ఆమెను చిత్రహింసలు పెట్టి,నగ్నంగా పడేసారు.” దురదృష్ఠవశాత్తూ… నిజమైన రేప్ కేసులన్నిటిలోనూ అమానుషమైన శారీరక హింస ఉంటుంది. కదులుతున్న బస్సులో నుంచి తోసేయడం ఢిల్లీ కేసులో USP. (ఈ మాట వాడకూడదు కానీ.. ప్రత్యామ్నాయ పదం తోచడం లేదు. ఇదే కాదు… ఇలాంటి కేసుల్లో పాశవికమైన అన్న పదం వాడడమూ నాకిష్టం ఉండదు… పశువులు ఇంత నీచానికి ఒడిగట్టవు కదా).
   “వాళ్ళు ఏవర్గానికి చెందినా,బీదవాళ్ళయినా తప్పక ఉరితీయవలసిందే.”… ఉరి కాదు… శిక్షించవలసిందే. ఎంత చెడ్డా మనది ప్రజాస్వామ్యం కదా. ఆ శిక్ష ఉరా, ఆమరణ ఖైదా, జీవితఖైదా(14ఏళ్ళా) అని తేల్చాల్సినది న్యాయమూర్తులు.
   “మనం victim తరపు నుంచి, ఆమె కుటుంబం వైపునుంచి కూడా ఆలోచించాలి.లేకపోతే మీ చిత్తశుద్ధిని శంకించవలసి వస్తుంది.”…. వారికి జరిగిన నష్టం విషయంలో రెండో ఆలోచనే లేదు.
   6. ఉరి తీస్తే నేరాలు తగ్గవు అన్నది తప్పుడు వాదన.. మీరు ఉటంకించిన గీతా వాక్యాన్ని కాదనే సాహసం చేయగలనా!

   Reply

 2. SIVARAMAPRASAD KAPPAGANTU
  Jan 10, 2013 @ 17:04:12

  “…ఈ సోషల్ ఎటికెట్ లోకి ఐన్ స్టీన్ వచ్చేస్తున్నాడు…” Good one.
  మీరు చెప్పే వాదన కొంతవరకూ సమంజసంగానే ఉన్నది. కాని ఈ గొడవంతా కూడా న్యాయస్థానాల్లో న్యాయం ఆలశ్యం అవటం వల్లే కదా. ఇలా ఆలశ్యo కావటానికి కారణం ఎవరు? లాయర్లు, ఎవరి క్లైంట్లను వాళ్ళు వెనకేసుకు వస్తూ వాదించటం ఒక ఎత్తైతే ఎలాగోలాగు వాళ్ళ వాళ్ళ క్లైంట్లకు శిక్ష నుంచి తప్పించి బయటకు తీసుకు వచ్చి మీసాలు మెలెయ్యటం గొప్పగా భావించబడుతున్నది. ఈ విషయం ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కొక్క కేసులో ఎన్నెన్ని వాయిదాలు, వెర్రి మొర్రి కారణాలతో వాయిదాలు. వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్న పరవాలేదు, ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదనే ఒక సాకు చూపించి, కేసులను దశాబ్దాలపాటు ఈడుస్తూ న్యాయ స్థానాలంటెనే హాస్యాస్పదం చేసిపారేశారు ఈ లాయర్లు. ఈ విషయం గురించి ఒక ఉద్యమం జరిగితే బాగుండును. లా కాలేజీల్లో వాళ్ళకు చదువు చెప్పేప్పుడు, కేసులు కావాలని పొదిగిస్తూ బతకటం ఎంతటి చండాలపు పనో ఆ విద్యార్ధులకు తెలియచెప్పే పాఠాలు ఉండాలి. కొత్తగా లా కాలేజీలనుండి వచ్చే వాళ్ళన్నా మంచి లాయర్లుగా ఉండి సమాజానికి సత్వరంగా న్యాయం అందించగల స్థాయికి ఈ లాయర్లు వచ్చిన రోజున మాత్రమే నేరాలు తగ్గే అవకాశం ఉన్నది. నేరం చేసినా సరే ఏమవుతుంది అన్న తెంపరితనం పెరిగిపోతుండబట్టే, సమాజంలో ఉరి శిక్ష అని డిమాండ్ చెయ్యవలసి వస్తున్నది. లాయర్లను, న్యాయ వాదులు అని తెలుగులో పత్రికల్లో వ్రాస్తూ ఉంటారు కాని, ఒక కేసులో ఒకరిపక్కే న్యాయం ఉండే అవకాశం ఉన్నది. మరి రెండుపక్కలా లాయర్లు ఉంటారు! ఇద్దరినీ న్యాయవాది అనటం ఎంత వరకు సబబు. లాయర్లకు ఉండవలసినది, చట్టం అంటే గౌరవం ఆ చట్టాన్ని అమలు చెయ్యాలన్న తపనే కాని, అందులో లొసుగులు పట్టుకోవటానికి వాళ్ళ సమయం అంతా వాడితే అది న్యాయవాద వృత్తి అని ఎలా అనగలం?!!

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jan 15, 2013 @ 12:47:47

   శివరామప్రసాద్ గారూ…
   కొద్దిరోజులుగా అంతరజాలానికి దూరంగా ఉన్నందున ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి.
   లాయర్ల తీరుతెన్నుల వల్ల కోర్టులు హాస్యాస్పదమైపోయాయి అన్న మాట అక్షర సత్యం. న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు మీ సూచనలు చాలా బాగున్నాయి. కానీ కొత్త లాయర్ల నుంచి అంతటి చిత్తశుద్ధి సాధ్యమేనంటారా? ఏ రంగంలోనైనా… విలువలు (చెడువైపే ఎక్కువగా) మారిపోతున్నాయి కదా.

   Reply

 3. SIVARAMAPRASAD KAPPAGANTU
  Jan 10, 2013 @ 17:07:53

  My point is that if a society can provide swift justice, such society lives in peace. When that is not there, such society has to live with criminals passon as Honourable Men and normal Citizens have to rub shoulders with these criminal elements.

  Reply

 4. Mauli
  Jan 10, 2013 @ 17:15:04

  @వారు చేసింది నేరమే. దానికి ఉరి శిక్ష విధించినా సరిపోదు. నిజమే. కానీ… ఈ సమాజంలో వారొక్కరికే శిక్ష పడడం సమంజసమా?

  Correct.

  Reply

 5. M.V.Ramanarao
  Jan 10, 2013 @ 21:32:18

  1.మన న్యాయవిచారణా చట్టాలను.పద్ధతులను మార్చి ,ఒకసం;లోగా నేరస్తులకు తగిన శిక్షపడేలా చూడాలి.
  2.నిందితుల కులం,వర్గం,హోదా ఏదైనా శిక్ష పడాలి.
  3.మిగతా కేసులకి మొన్న ఢిల్లీలో జరిగినదానికీ ముడిపెట్టవద్దు.కేవలం రేప్ మాత్రమేకాక ఆమెను చిత్రహింసలు పెట్టి చంపారు.victim ,ఆమె కుటుంబం వైపునుంచి కూడా ఆలోచించాలి.ఆ ఆరుగురినీ త్వరలోనే మరణశిక్ష అమలు జరపవలసిందే.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jan 15, 2013 @ 12:49:48

   రమణారావుగారూ…
   మీరిచ్చిన మూడు సూచనల్లో మొదటి రెంటితోనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మరణ శిక్ష విషయంలో మాత్రం… ఒక్కసారిగా చంపేస్తే… వారు అనుభవించే శిక్ష ఏముంటుంది సార్. ఒకట్రెండు గంటల మానసిక వేదన తప్ప. పైగా… ప్రాణాలు పోసే శక్తి లేని మనిషి… తోటివారి ప్రాణాలు తీయడం తగునా. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత లేదు. న్యాయం చాలా క్రూరమైనది. అది వ్యవహరించే తీరు సాధారణ బౌద్ధిక దృష్టికి అనూహ్యంగా ఉంటుంది.

   Reply

 6. the tree
  Jan 11, 2013 @ 20:32:10

  అన్నీ వాదాలు అందరికి, అన్నీ కోణాలు ఒక్కరికి కనిపించకపోవడానికి, మీరు చెప్పిన కారణాలే కదా,.చాలా వరకు సమాధానం,..కానీ పరిష్కరం ఎలా,….జవాబులేని ప్రశ్నలన్ని తర్కానికి బాగుంటాయ్,..చర్చలూ వాదాలు కొనసాగుతూనే వుంటాయ్,…వినండి, చూడండి, ఆలోచించండి,.నిద్రపోండి,.అంతే కదా మనం చేయగలం..

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jan 15, 2013 @ 12:50:21

   ట్రీ గారూ… కొద్దిరోజులుగా అంతరజాలానికి దూరంగా ఉన్నందున ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి.
   మీరన్నది నిజంనిజం… ఈరోజు గడిస్తే రేపటికి రెండు. అంతకు మించి ఈ సమాజంలో మార్పు వస్తుందన్న (వస్తే మంచిదే కానీ…) నమ్మకం నాకైతే లేదు.

   Reply

 7. bondalapati
  Mar 01, 2013 @ 23:27:58

  రేపిస్టులని ఉరి తీయాలనే వారు అదే పరిస్థితులలో పుట్టి పెరిగి, దాని ఫలితం గా అదే కారెక్టర్ కలిగి ఉండి, రేప్ జరిగిన పరిస్థితులలో వారు కూడా ఉండి ఉంటే, రేపిస్టులలానే ప్రవర్తించే వారు. ఇది తెలుసుకోవటానికి కొంచెం, “putting your feet in others shoes” కావాలి. రేపిస్టుల కారెక్టర్ కి కొంచెం అటూ ఇటూ గా ఉన్న సాధారణ మనుషులని మన చుట్టూ “లో క్లాస్” లో చాలా మందిని చూస్తూనే ఉంటాం . వారు మామూలు మనుషులు గానే చలామణి అవుతూఉంటారు. ఆ రఫ్ కారెక్టర్ అంశ కొంత మనలో కూడా ఉంటుంది.
  – మనం ఒక ఇంటెంట్ తో ఒక వ్యక్తిని అప్రోచ్ అవుతాం.
  -అవతలి వ్యక్తి దృష్టి లో అది ఘోరమైన తప్పు. కాబట్టీ ఆ వ్యక్తి వయొలెంట్ గా రియాక్ట్ అవ్వటం చేస్తాడు/ది.
  -మన లో ఎంత మంది అవతలి వ్యక్తి కోణం నుంచీ చూస్తారు? ఎదుటి వ్యక్తి చేసిన రిజెక్షన్ మనలోని ఇగో ని రెచ్చగొడుతుంది.
  -మన చేతల consequences గురించి పెద్ద గా ఆలోచించకుండా, కచ్చి గా ఎదుటి వ్యక్తి ని మరింత నష్ట పరిచే పనిని చేస్తాం.
  -ఎదుటి వ్యక్తి అసహాయుడై నపుడు మన లోని పసువు మరింత విజృంభిస్తాడు. కాలేజీల్లో జరిగే రాగింగ్ లో ఇది గమనించవచ్చు.
  -we loose control in a drunken brawl and reach a point of no return.
  -తరువాత చేసిన పని కి చింతిస్తాం.
  ఇదంతా very human. ఇది human కాక పోతే, రేపిస్టులు చేసినది మనకు అర్ధం కాను కూడా కాదు.
  చాలా మందికి అంతర్లీనం గా ఈ విషయాలు తెలుసు. మళ్ళీ జనాలు, రేపిస్టులని సమర్ధిస్తున్నాడని విరుధుకుపడి, కేసులూ గట్రా పెడతారేమోనని, సైలెంట్ గా ఉంటారు.

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Mar 02, 2013 @ 16:58:57

   బొందలపాటి గారూ… నా ఉద్దేశం అదే. పేద హీరో… గొప్ప హీరోయిన్ ని వెంటపడి వేధిస్తుంటే మనమే ఈలలేస్తూ సినిమా చూస్తాం. నిజ జీవితంలో మాత్రం బోలెడు కబుర్లు చెబుతాం. లోపలి మనిషికీ… బైటి మనిషికీ తేడా అదే కదా. అందరిలోనూ అలాంటి మనస్తత్వం ఎంతో కొంత ఉంటుంది. దాన్ని నియంత్రించుకునే సంస్కారం అలవడడానికి కొన్ని బాహ్య పరిస్థితులు దోహదం చేయాలి. అవి లేని వారు చేసే నేరాలను (ప్రత్యేక కేసులను వదిలేస్తే) అర్ధం చేసుకుంటే ఈ కేసులో ఉరి లాంటి డిమాండ్స్ వెనుక సవ్యత లేక అపసవ్యత అర్ధమవుతుంది.

   బై ద వే… పెర్ ఫ్యూమ్ అనే ఫ్రెంచ్ సినిమా గుర్తొస్తోంది.

   Reply

 8. Mauli
  Mar 01, 2013 @ 23:35:46

  మీరన్న ప్రతి అక్షరం నిజమే, కాని ఇప్పుడు ప్రత్యేకం గా ఎందుకు స్పందిస్తున్నారు?

  Reply

  • bondalapati
   Mar 02, 2013 @ 09:01:58

   చాలా రోజుల తరువాత కొంచెం సమయం దొరికి ఓ టపా రాశాను. ఆ టపా కి ఫణి గారు కామెంట్ రాశారు. ఆ కామెంట్ చూసి, ఆయన ఎలా ఉన్నారో చూద్దామని ఇటు వచ్చాను. ఈ టపా చదివిన తరువాత, ఇలా కామెంటాలనిపించింది. ఈ కామెంట్ వలన మీ మనో భావాలేమైనా గాయపడ్డాయా? బాబోయ్! ముందుగానే చెప్పేస్తున్నా..సారీ! 🙂

   Reply

 9. Mauli
  Mar 02, 2013 @ 15:45:04

  అంతే కదా 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: