రంగమ్మ కథ : గతీ – తర్కమూ – భౌతిక వాదమూ

“ఒసే దరిద్రపు మొహమా! వయ్యారంగా ఎంతసేపు ఊడుస్తావే? స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టి చావు!” రంగమ్మ గొంతు గాండ్రించింది.
“ఆ! వస్తన్నా. వస్తన్నా. ఐపోవచ్చింది.” చిన్నగా, సన్నగా సమాధానం.
“గంట నించీ అదే మాట చెప్పి చస్తన్నావు గదే … అటు ఆ పనీ అయి చావదు… ఇటు ఈ పనీ పూర్తి కాదు !” మళ్ళీ గాండ్రింపు.

రాంబాబుకి చిర్రెత్తింది. చదువుతున్న పుస్తకం విసిరికొట్టి.. రెండు చెవులు మూసుక్కూర్చున్నాడు. రాంబాబు అవస్థకి అతని భార్య ఇందిరకి నవ్వొచ్చింది. ఆవిడకిదంతా అలవాటయిపోయింది.
“ఈ రోజుల్లో పనిమనుషుల్ని ఇంత భయంకరంగా కోప్పడితే ఊరుకుంటారా?” అడిగాడు రాంబాబు.
“ఆ అమ్మాయి పనిమనిషి కాదు. రంగమ్మ గారికి పొలం చాలా ఉంది. వాళ్ళ పాలేరు కూతురు కుమారిని పనికి సాయంగా, తోడు కోసం తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి అన్ని పనులూ చేస్తుంది. రంగమ్మ గారికి కొద్దిగా కోపం.” అంది ఇందిర.
“కొద్దిగానా? చాలానే ఉంది!” అంటూ నవ్వాడు రాంబాబు.

కుమారి చీపురు పుల్లలా ఉంటుంది. ఇంటి పనులు చురుకుగా, చకచకా చేసేస్తుంది. తెల్లారక ముందే కసువు చిమ్మేస్తుంది. ముగ్గులు పెడుతుంది. స్నానానికి వేణ్ణీళ్ళ కోసం బాయిలర్ వెలిగిస్తుంది. అంట్లు తోముతుంది. వంట చేస్తుంది. బట్టలుతుకుతుంది. ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళకి తినడం, పడుకోవడం తప్ప పనేమీ లేకుండా మరమనిషిలా అన్ని పన్లూ తానే చేసేస్తుంది.

రాంబాబు అప్పుడప్పుడూ బ్యాంక్ నుండి మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడు. ఆ సమయంలో కూడా కుమారి కిటికీలు, గ్రిల్స్ శుభ్రం చేస్తూ కనపడేది. రాంబాబు ఆ అమ్మాయి కనీసం కూర్చునుండగా ఎప్పుడూ చూళ్ళేదు. ఆ అమ్మాయిని చూస్తూ జాలి పడుతూ తన వాటా మెట్లెక్కే వాడు. రాన్రాను రాంబాబుకి రంగమ్మ ఒక రాక్షసిగానూ, కుమారి ఆ రాక్షసి చేపట్టిన రామచిలకలా అనిపించసాగింది. మన సంఘంలో పనిమనిషి పేరున జరుగుతున్న మానవ హక్కుల అణచివేత గూర్చి ఇందిరకి ఉపన్యాసం చెప్పడం మొదలెట్టాడు. ఇందిర విసుక్కునేది.

“ఆ అమ్మాయీ ఏం తక్కువైందేమీ కాదు. ముంగిలా ఉండి సాధిస్తుంటుంది. ఈ పిల్ల అంతసేపూ పనిచేస్తున్నట్టు కనిపిస్తుందా… ప్రతీ పనీ రెండోసారి చేసుకోవలసిందే. తుడిచిన గదే తుడుస్తూ ఉంటుంది. కానీ ఎక్కడి దుమ్ము అక్కడే ఉంటుంది. కడిగిన గిన్నే కడుగుతూ ఉంటుంది. కానీ ఒక్క గిన్నె కూడా సరిగ్గా ఎప్పుడూ వదలదు. రోజూ బట్టలు ఉతికేస్తూనే ఉంటుంది. ఏవీ సరిగ్గా వదలవు. ఈ ముసలి వయసులో వాళ్ళ ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంత ముఖ్యం. ఈ కుమారికి అవేం పట్టవు. దాని సోకులూ షికార్లూ దానివే.

రంగమ్మ గారు ఊరికే అలా అరుస్తుంది గానీ.. ఆవిడది చాలా మంచి హృదయం. ఆ ముసలాళ్ళిద్దరూ తినేది పట్టెడు. కానీ వయసులో ఉన్న పిల్ల కడుపు నిండా తినకపోతే ఎలా అంటూ వంట చేయించి తినిపించేది. అవేవీ బైటకి కనబడవు. పాతకాలపు ముసలావిడ కదా… ఆ చాదస్తంతో నాలుగు కేకలు పెడుతూ ఉంటుంది. అవి మాత్రం వినబడతాయి. సంతకెళ్ళినప్పుడల్లా గాజులో దుద్దులో ఏదో ఒకటి కొనుక్కోమంటూ దాని చేతిలో పదో పరకో పెడుతూ ఉంటుందీవిడ. వాటితో ఇది సినిమాలకీ షికార్లకీ తిరుగుతూంటుంది. వస్తువైతే నాలుగు రోజులు నిలుస్తుంది కదా అని ఈవిడ రెండు అక్షింతలు వేస్తుంది. అదేమో దులపరించుకుని పోతుంది. ఈ రాజకీయాలేవైనా మీకు తెలుసా?”

కానీ రాంబాబు ఇందిర మాటలు నమ్మలేదు. ఆ కబుర్లన్నీ తనని కన్విన్స్ చేయడానికి ఇందిర చెబుతున్న కథలుగా అర్ధం చేసుకున్నాడు.

” పేదరికం అన్న ఒక్క బలహీనత కారణంగా కుమారి శ్రమని ఈ రంగమ్మ గారు దోపిడీ చేస్తున్నారు. ఫ్యూడల్ మనస్తత్వం కాబట్టే… పాలేరు కూతురిని పనిమనిషిగా తీసుకొచ్చారు. వాళ్ళకి బల్లమీద తిళ్ళూ… ఈమెకి వసారాలో బువ్వా… ఇది వర్గ వివక్షా, వర్ణ వివక్షా కాక మరేమిటి? అంత అందమైన పిల్లని పనిమనిషిగానా ట్రీట్ చేసేది? కుమారి మీద అభిమానం నిజంగానే ఉంటే ఆ పిల్లని చదివించవచ్చుగా. ఓ ఉద్యోగం వచ్చేదాకా పోషించవచ్చుగా. లేదంటే ఆ పిల్లకి పెళ్ళి చేయొచ్చుగా. ఈ పెటీ బూర్జువాలకి అంత మంచి ఆలోచనలెందుకు వస్తాయి?” ఆవేశంతో ఊగిపోయాడు.

ఆ రోజు ఆదివారం. కింద ఇంటికి ఉదయం నుండీ వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు. కొంతసేపటికి ఆటోలో కొందరు రైతు కూలీలు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆదివారం కావున అప్పటికి ఫిల్టర్ కాఫీ మూడోసారి తాగి.. హిందూ పేపర్ చదువుతూ.. అంతర్జాతీయ రాజకీయల పట్ల రాంబాబు తీవ్రంగా కలత చెందుచూ.. మధనపడుచుండగా.. ఇందిర హడావుడిగా వచ్చింది.

“రాంబాబు! నీకిది తెలుసా? కుమారి ఆ ఎదురు ఇస్త్రీ పెట్టె బండి వాడితో లేచిపోయింది. రంగమ్మ గారి బంగారు గొలుసు, ఇరవై వేల రూపాయలు క్యాష్ కూడా కనబడట్లేదుట! ఇన్నాళ్ళూ నంగిలా, ముంగిలా కనబడుతూ భలే నమ్మించింది. ఈ రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్ధమయి చావట్లేదమ్మా!” అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

రాంబాబుకి ఇందిర చెప్పేది అర్ధం కావటానికి రెండు క్షణాలు పట్టింది. క్రమంగా మనసంతా అదో రకం బాధతో నిండిపోయింది. తన ప్రేమ విఫలమైనప్పుడు కూడా రాంబాబుకి అంత బాధ కలగలేదు.

హడావుడిగా లుంగీ నుండి ప్యాంటు, షర్టులోకి మారిపోయి కింద పోర్షన్లోకి వెళ్ళాడు. అక్కడంతా కోలాహలంగా ఉంది. గుమ్మానికివతల దిగాలుగా, తప్పు చేసినవాళ్ళలా ఒక నడివయసు జంట నేల మీద కూర్చునుంది. బహుశా కుమారి తలిదండ్రులయ్యుంటారు.

రంగమ్మ హాలు మధ్యలో పడక్కుర్చీలో పడుకుని శోకాలు పెడుతుంది. చుట్టూతా చేరిన ఆడంగులు ఆవిడని ఓదారుస్తున్నారు.

“కన్నకూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నానమ్మా. ఏనాడూ ఏదీ తక్కువ చెయ్యలేదమ్మా. ఆఖరికి… దానికి ఎన్ని సమ్మంధాలు చూశానమ్మా. చివరకి నా కొంపకే ఎసరు పెట్టిందమ్మా. ఆఖరికి దొంగతనానికి దిగిందమ్మా!” అంటూ చప్పట్లు కొడుతూ.. నుదురు కొట్టుకుంటూ రంగమ్మ ఏడుస్తుంది.

“పిన్నిగారు! కొంచెం ఎంగిలి పడండి. పొద్దున్నుండి పచ్చి మంచినీళ్ళయినా ముట్టలేదు. అసలే మీరు బీపీ పేషంటు.” అంటూ ఎదురింటి శాస్త్రి భార్య రంగమ్మని బ్రతిమాలుతోంది.

అక్కడి వాతావరణం ఎవరో మనిషి చచ్చినట్లుంది. ఇంటి ఓనర్ పెరట్లో మామిడి చెట్టు కింద కుర్చీలో కూర్చునున్నాడు. ఆయన పక్కన కుర్చీ ఖాళాగా ఉంది. రాంబాబు ఆ కుర్చీలో కూలబడ్డాడు.
ఆయన ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయున్నాడు. కొద్ది సేపటికి గొణుగుతున్నట్లుగా అన్నాడు.

“ఈ రోజుల్లో సొంత పిల్లలే చిన్న మాటంటే పడడం లేదు… అది మాత్రం ఎందుకు పడుతుంది? అవకాశం చూసుకుని వెళ్ళిపోయింది”

రాంబాబు ఆశ్చర్యపోయాడు. నమ్మలేనట్లు ఆయన వైపు చూశాడు.

“సొంత మనిషి అనుకుని చనువుగా ఉన్నంత మాత్రాన ఎంత పడితే అంతచేటు మాటలు వాగేస్తుందీ మొద్దు. దీని మాటలన్నీ ఆ కుమారి తిట్లని అనుకుంటోందన్న సంగతి దీనికి ఎప్పటికి అర్ధం కావాలి? వయసు ముమ్మరంలో ఉన్న దానికి ముసలిదాని కష్టాలెందుకు కావాలి? సరే… దాన్నీ తప్పు పట్టలేం. ఇప్పుడు కాకపోతే మగతోడు ఎప్పుడు దానికి? ఆ అమ్మాయి పెళ్ళి బాధ్యత నాదేనని మా పాలేరుకి మాటిచ్చి పన్లో పెట్టుకున్నాను. నేను చూసిన సంబంధాలేవీ ఎందుకు నచ్చలేదా అని అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇదీ సంగతి అని కనిపెట్టలేకపోయాను. ఒక్కమాట చెబితే వాడితోనే పెళ్లి చేయకపోయామా? ఆ నగ ఎలాగూ దానికి పెళ్ళికానుగ్గా ఇద్ద్దామనే అట్టిపెట్టి ఉంచాం. చివరికేమైంది… దొంగ ముద్ర వేయించుకోవలసి వచ్చింది. ఇంక పాలేరు వెంకాయిగాడు తలెత్తుకుని బతగ్గలడా”

రాంబాబు అక్కడ ఇంకొద్దిసేపు కూర్చుని.. ఆయనతో యాంత్రికంగా నాలుగు సానుభూతి వచనాలు పలికి.. ఇంటి దారి పట్టాడు. అప్పటి దాకా రంగమ్మని ఓదార్చే పటాలంలో ఉన్న ఇందిర రాంబాబు వెనకాలే మెట్లెక్కింది. హాల్లో రంగమ్మ శోకాలు నాన్ స్టాప్ గా పెడుతూనే ఉంది.

నిదానంగా మేడ మెట్లె క్కాడు రాంబాబు. ఇంట్లోకి అడుగు పెట్టాడు. తలుపు దగ్గర కేశాడు. ఒక క్షణం ఆగాడు. శరచ్చంద్ర నవల్లో హీరోలా… తలుపు పట్టుకుని హు అని నిట్టూర్చాడు. ”ఆ అమ్మాయి ఇక్కణ్ణుంచి వెళ్ళిపోకుండా… ఈ రంగమ్మ గారికి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చేసుండాల్సింది. ఆ చాకలి వాడితో వెళ్ళిపోయిందే… వాడు సరైన వాడు కాకపోతే… దీన్ని ఏ హైదరాబాదులోనో బొంబాయిలోనో అమ్మేస్తే… అసలే అది చాలా అందమైన పిల్ల. దాని బతుకేమవుతుందో ఏమో. ఇక్కడ వాళ్ళ నాన్న సంగచ్చూడు… కనీసం రంగమ్మ గారి మొగుణ్ణయినా కన్విన్స్ చేసుకోలేకపోతున్నాడు.. ఇప్పుడు కుమారి ఎత్తుకుపోయిన డబ్బులు తను కట్టేస్తాడో… అంత బాకీ తీరే దాకా కట్టుచాకిరీ చేస్తాడో… ఏమో. అసలీ లంపెన్ వర్గాలకి గతితార్కిక భౌతికవాదం సరిగ్గా అర్ధమయితే… సమస్యలని మార్క్సిస్టు దృక్కోణంలోనుంచి అవగాహన చేసుకుని మరింత చక్కగా పరిష్కరించుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ఊబి నుంచి మరో ఊబిలోకి…”

” చాల్లెండి సంబడం… ఆ రంగమ్మ గారికిప్పుడు పనిచేసి పెట్టేందుకు అతీగతీ లేదు… ఆ కుమారి నాన్నకిప్పుడు రంగమ్మ గారి మొగుణ్ణి కన్విన్స్ చేసేందుకు తర్కం లేదు… మీకు సౌందర్యారాధన చేసేందుకు భౌతికవాదం మిగల్లేదు. బాధ పడింది చాలు కానీ… వంట పూర్తి చేసి చాలా సేపయింది. తినడానికి రండి. ఇంక మీకు పనేం లేదుగా.”

(యరమణ గారి స్ఫూర్తితో — ఆయన రంగమ్మ కథ కొద్ది మార్పులతో)

Advertisements

8 Comments (+add yours?)

 1. kastephale
  Oct 14, 2012 @ 20:40:43

  That is Greek this is Latin 🙂

  Reply

 2. the tree
  Oct 14, 2012 @ 22:09:52

  గతి, తార్కికము,బౌతిక వాదాన్ని వివరిస్తే బావుండేది, నాకూ అర్థమయ్యేది….

  Reply

 3. sree
  Oct 15, 2012 @ 06:01:24

  baavundi 🙂

  Reply

 4. Maddigunta Narasimharao
  Oct 15, 2012 @ 14:01:09

  దీనిలో ఉంది ఉపయోగిత వాదం, అవకాశవాదం, వారసత్వంగా వస్తున్న ఉదారవాదం. అవకాశవాదం ముందు ఎంతటి తార్కిక వాదం అయినా గతి తప్పిన తార్కిక వాదమే అవుతుంది

  Reply

 5. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Oct 15, 2012 @ 17:53:47

  ఉపయోగిత వాదం…? అంటే ఏంటండీ? అవకాశవాదం, ఉదారవాదం విన్నాను కానీ ఉపయోగిత వాదం గురించి ఎప్పుడూ వినలేదు.

  డాక్టర్ గారి కథని ట్విస్ట్ చేసి చూపించిన నా యాంగిల్ ని అవకాశవాదం అని మీరంటున్నారని అనుకుంటున్నాను.. కరెక్టేనా.

  అది నిజమే అయితే చిన్న వివరణ : దోపిడీకి ఒక కోణాన్ని ఆయన ప్రస్తావించారు, రెండో కోణాన్ని నేను ప్రస్తావించాను. అంతే.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: