హిట్లర్‌కి గురువు కారల్ మార్క్సా?

దుష్టులకు దూరముగా ఉండమన్న నీతిని చిన్నతనంలో నేర్పిస్తారు. దుర్మార్గుల పేరు ఉచ్చరించడం కూడా పాపమని అంటారు. కానీ ఎవరు దుర్మార్గులో, వారు ఎందుకు దుర్మార్గులో కూడా తెలుసుకోవలసిన, తెలియచెయ్యవలసిన అవసరం అందరికీ ఉన్నది. రామాయణంలో వాల్మీకి కేవలం శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణించి ఊరుకోలేదు. సీత పాతివ్రత్యం తెలియజేస్తే సరిపోతుందనుకోలేదు. రావణాసురుడి గురించి కూడా వివరించాడు. సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం లేనిదే దుష్టులను దూరంగా ఉంచడం అసాధ్యం. ఎందుకు అన్న ప్రశ్నకు సహేతుకమైన సమాధానం ఇవ్వనిదే ఎవరినీ సన్మార్గంలో నడిపించలేము. అందుకే మతం మత్తు మందు అన్న కార్ల్ మార్క్స్ మనసులోని విషాన్ని తెలియజేసే ప్రయత్నం.

కార్ల్ మార్క్స్ తన రచనలలో ప్రపంచ కార్మికుల కోసం పోరాడాడు తప్ప నిజ జీవితంలో మత ద్వేషానికీ, జాతి ద్వేషానికీ, స్త్రీలను తక్కువగా చూడడానికీ అతీతుడు కాదు. “ఆన్ ది జ్యూయిష్ క్వొశ్చెన్” అన్న మార్క్స్ వ్యాస ద్వయమే హిట్లర్ యొక్క “మెయిన్ కాంఫ్”కి దారి తీసిందన్న బలమైన నమ్మకం అంతటా ఉన్నది. మార్క్స్ జాతి ఆధారమైన మూకుమ్మడి హత్యలను ఆదేశించలేదేమో కానీ యూదులంటే విపరీతమైన ద్వేషముండేది. “ఆన్ ది జ్యూయిష్ క్వొశ్చెన్” వ్యాసాలలో ముఖ్యాంశం యూదులకు రాక్షసత్వాన్ని ఆపాదించడమే. తాను నాస్తికుడినని ఎంత చెప్పుకున్నా మార్క్స్ క్రైస్తవంపై అభిమానాన్ని వ్యక్తపరిచాడు. జాతి పరంగానూ సమాన దృక్పథం మార్క్స్‌కి లేదు. తన అల్లుణ్ణి విమర్శిస్తూ “అతడికి నీగ్రోల లోపాలున్నాయి. నీగ్రోల వలెనే సిగ్గూ శరమూ లేవు. తనను తాను మూర్ఖుడిలా చేసుకుంటాడు” అని అన్నాడు. కూతురు పుట్టినప్పుడు “దురదృష్టవశాత్తూ అమ్మాయి…. మగ పిల్లాడైతే బాగుండేది” అని మిత్రుడికి ఉత్తరం రాశాడు. ఈ మత పక్షపాతమేల? ఈ జాతి ద్వేషమెందుకు? ఈ లింగ వివక్షకు కారణమేమిటి? మార్క్స్‌ని ఆరాధించే వారు జవాబు చెప్పగలరా?

జాతి మత లింగ వివక్షలను పక్కన పెట్టినా ప్రపంచ కార్మికుల కోసం తాడిత పీడిత ప్రజానీకం కోసం రచనలలో విరుచుకుపడ్డ కార్ల్ మార్క్స్ నిజ జీవితంలో వ్యక్తిగతంగా ధనాన్ని అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. జెన్నీ అనే డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ఓర్పున్న పతివ్రత. దుహ్ఖమయమైన జీవితమే ఆమెకు లభించింది. ఆమె బంధువులెవరైనా మరణించి ఆస్తి మార్క్స్ కుటుంబానికి కలిసి వస్తే మార్క్స్‌కి పండుగే. ఆ విషయాన్ని రాతపూర్వకంగానే అతను తెలియజేశాడు.

మార్క్స్ ఇంట్లో పని చెయ్యడానికి హెలెన్ డిమ్యూట్ అనే ఆమెను జెన్నీ తల్లి పంపించింది. ఆమె కుమారుడు మార్క్స్ అక్రమ సంతానమే అంటారు. ఆ పిల్లవాడిని (ఇంటి పనికి అడ్డు రాకుండానేమో) దత్తత ఇవ్వడం జరిగింది. డి.ఎన్.ఎ. టెస్టుల ద్వారా ఏనాటికైనా నిజ నిర్ధారణ జరగవచ్చు. హెలెన్‌ని ఒక వ్యక్తిలా కాక ఆస్తిలో భాగంగా చూశారన్న మాట వాస్తవం. మార్క్స్ ప్రియ మిత్రుడూ, కొంత వరకూ పోషకుడూ అయిన ఎంగెల్స్ తన కర్మాగారాలలో కార్మిక భద్రత కానీ, సంక్షేమం కానీ పట్టించుకోలేదన్నది కఠోర సత్యం.

విషయ పరిజ్ఞానంలో విసేషంగా కృషి చెయ్యడం ప్రతి ఒక్కరికీ అవసరం. మనం నడుస్తున్న దారి సరైనదని ఎంతగా తెలిసినా ఆ సంగతికి రుజువు దొరకడం ఆనందదాయకం. తప్పుదారిలో నడుస్తున్న వారికి…. ముఖ్యంగా మంచి మార్గం చూపించడానికి అభిలషణీయం. మానవత్వమే అసలైన ధర్మమని సనాతన హిందూ మతం చెప్తున్నది. మతం మత్తు మందు అన్న వాడు ఎటువంటి మత్తు పెట్టడానికి చూశాడో తెలుసుకోవాలి.

— పాలంకి సత్య (జాగృతి వార పత్రికలో)

Advertisements

9 Comments (+add yours?)

 1. the tree
  Aug 06, 2012 @ 19:59:59

  కొంచం లోతుల్లోకి వెళ్లినట్లున్నారు, మంచి ప్రయత్నం.
  హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
  ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

  Reply

 2. తాడేపల్లి
  Aug 06, 2012 @ 22:47:57

  బావుంది ఈ వ్యాసం. కొత్త విషయాలు తెలిశాయి. కానీ మార్క్సు స్వయంగా యూదుడంటారు కదా ! తన జాతికి వ్యతిరేకంగా తానే వ్రాస్తాడా ?

  Reply

 3. kastephale
  Aug 07, 2012 @ 04:20:35

  Interesting

  Reply

 4. ఫణీన్ద్ర పురాణపణ్డp
  Aug 07, 2012 @ 11:56:32

  thank you all. tadepalli garu, am not much aware of marx’s background.

  Reply

 5. SriRam
  Aug 07, 2012 @ 12:01:54

  మానవులలో ఉండే లోపాలు కారల్ మార్క్స్ లో కూడా కొన్ని ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఆయన మతం లో ఉండే మోరాలిటి/ విలువలు పూర్తిగా విశ్వసించాడు. ఆయన రాసిన పుస్తకాలన్ని అటు తిరిగి ఇటు తిరిగి మానవ విలువలు నిలబేట్టాలి, అందుకోసం మనుషులు ప్రయత్నించాలి, భావి తరాల కొరకు త్యాగాలు చేయాలి అనేది ప్రతిపాదించాడు. యురోప్ లో క్రైస్తవం ప్రభావం వలన ఆయన్ కోర్ సిద్దాంతం వచ్చి పూర్తిగా క్రైస్తవ మత విలువల పైన ఆధారపడి ఉంది. ఆయన అనాలిసిస్, సిద్దాంతం తప్పించి వ్యక్తిగతం గా విప్లవకారుడు కాడు. విలువలు/మొరాలిటి గురించి మాట్లాడే వాడు ఎప్పుడు విప్లవకారులు కారు, కాలేరు. మన సమాజం లో ప్రస్తుతం ఉండే దురాగతాలన్నిటికి మూలం మత విలువలలోనే ఉంది. మార్క్స్ గారు ఇది అర్థం చేసుకోకుండా ఆ మత విలువలనే కమ్యునిజం పేరు తో అందించారు. కొత్త కాన్సేప్ట్ వైపు కొన్ని రోజులు ప్రజలు ఆకర్షితులైనా, దానిలోపల ఉండే పాత మత విలువల వలన అది విఫలం చెందింది. చాలా రోజుల క్రితం హిట్లర్ పైన ఫేడేరిక్ నీషే ప్రభావం ఉందని చదివాను.

  Reply

 6. ఫణీన్ద్ర పురాణపణ్డp
  Aug 07, 2012 @ 17:22:20

  sriram…. thanks for adding some more info.

  Reply

 7. veenalahari
  Aug 09, 2012 @ 21:10:24

  దీపం తన కిందే చీకటి దాచుకున్నట్లు కొందరి గొప్ప వ్యక్తుల జీవితాలు కూడా అంతే కాబోలు మీ ఆర్టికల్ మరో గొప్ప వ్యక్తి చీకటి కోణం తెలియజేసింది.

  Reply

 8. bondalapati
  Aug 25, 2012 @ 12:33:31

  వ్యాసంలోనివి వాస్తవమైన విషయాలు అని దాదాపు నమ్మేశాను, చివరి మూడు పదాలూ చూసేదాకా. అవి చూసిన తరువాత, “ఆధారాలు ఉన్నాయా?”, అని అడగాలనిపిస్తోంది. (కమ్మీ భాయీలు సంఘీయుల/జాతీయవాదుల/రైట్ వింగర్ల గురించీ, అలానే జా.వాలూ, సంఘీయులూ కమ్మీ ల గురించీ చెప్పే వాటిని పూర్తిగా నమ్మకపోవటం మనలోని సత్యాన్వేషికి మంచిది. )
  తా.క. ఒకప్పుడు నేనూ సంఘీయుడినే!

  Reply

 9. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Aug 26, 2012 @ 12:55:26

  ఆధారాలు దొరికే సూచనలు వ్యాసంలో ఉన్నాయిగా… వాటిని వెదికి చూస్తే సరి. 🙂 నిజానికి ఆ పని నేనే చేయాలనుకున్నా కానీ కుదరలేదు. వారిని గురించి వీరినీ, వీరిని గురించి వారినీ ఏకపక్షంగా నమ్మలేమన్న మీరన్న మాటలతో ఏకీభవిస్తాను. కాకపోతే… వ్యాస రచయిత గురించి నాకు తెలుసు… ఆమె నాకు పరిచయం తక్కువ ఉన్న బంధువు. ఆమె ఏ వాదీ కాదు, వ్యాసంలోని సందర్భాన్ని బట్టి జాగృతికి పంపినట్టున్నారు. ఈ వ్యాసాన్ని ప్రజాశక్తి లోనో, విశాలాంధ్ర లోనో ప్రచురించరు కదా. 🙂

  తా.క.: నేను ఇప్పటికీ కమ్మీల మీద కొంత గౌరవమూ, మరికొంత సానుభూతీ, ఉన్న…. సంఘీయుణ్ణే.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: