రామాయణం రసాల సాలమూ… భారతం నారికేళ వనమూ…

నువ్వు నీ పని నిజాయితీగా చేసుకుంటూ పోతావు. నీకున్న కొద్ది జ్ఞానాన్నీ పదిమందికీ పంచాలనుకుంటావు. ఆ సమయంలో ఇంకోడు వస్తాడు. నీ పని ప్రదేశంలోనే చేరతాడు. వాడి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటాడు. అక్కడ నీ ప్రమేయం ఏమీ లేకుండానే, నీకు తెలిసో తెలీకో, నువ్వు అడ్డుపడతావ్.

ఇంక అక్కడ నుంచీ మొదలు సాధింపులు. నువ్వు ఏం మాట్లాడినా వెటకారమే. నువ్వు చెప్పే నాలుగు ముక్కలూ అపహాస్యం పాలే. నీ వేషభాషలు, నీ రంగురుచులూ అన్నీ నవ్వులపాలవుతూ ఉంటాయి. ఓటి మనుషులను భరించడానికి నువ్వు సిద్ధమయినా నిన్ను నిలువనీయరు. నీ ఉద్యోగం నిన్ను చేసుకోనీయరు. పోనీ పై అధికారులకు చెప్పుకుందామా అంటే ఇలాంటి కుయుక్తులను వారే ప్రోత్సహిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. కనుచూపు మేరలో ఆశాకిరణం ఒక్కటీ కనబడదు. నిర్వేదం, నిరాశ చుట్టుముడతాయి. ఏం చేయాలనుకున్నా బెడిసికొడుతూంటుంది.

ఆ నిరామయ స్థితిలో ఓ తెగింపు నిర్ణయం తీసుకుంటావు. ఎవడి కంటా కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోతావ్. అక్కడ… నువ్వెప్పుడూ ఊహించని పని చేతబడతావ్. అక్కడ విజయం సాధిస్తావ్. నీ అభిరుచిని నీ కొత్త వృత్తిలో ప్రవృత్తి చేసుకుంటావ్.

ఓ పుష్కర కాలం తర్వాత ఎవరో వస్తారు. మాస్టారూ… మీరా… ఇక్కడా… అంటారు. బాగోగులు వాకబు చేస్తారు. నీ అభిరుచుల గురించి తరచి తరచి అడుగుతారు. నీ మనసులోతుల్లో సెల వేసుకుపోయిన జ్ఞాపకాలను తడిమితడిమి చూస్తారు. అప్పుడయ్యా నీ ఆనందం.

*** *** ***

మూడు వరసల్లో వరసకు ఆరు చొప్పున పద్ధేనిమిది కొబ్బరి చెట్ల తోపు. అది మహాభారతం.
ఏడాకుల అరటి చెట్ల డజను… అది కృష్ణలీలల భాగవతమే.
ఇక రామాయణమో… అది బాల రసాల సాలముల మామిడి తోపు.

తరువాయి ప్రబంధాలదే.
బిల్వ వృక్షం ధూర్జటి హరవిలాసం,
ముళ్ళ చర్మమూ, తీపి హృదయమూ కలిగిన పండ్ల పనస చెట్టే ఆముక్త మాల్యద.
ముంత మామిడి చెట్టు కళాపూర్ణోదయం,
నీరెక్కి చేవెక్కిన నిమ్మ మనుచరిత్ర.
అదిగో, ఆ బొప్పాయి చెట్ల వరుస పారిజాతాపహరణమే.

పద్య సాహిత్యం అంతేనా… పూల మొక్కలు భక్తి శతకాలూ, కూరగాయల పాదులు నీతి శతకాలూనూ…
మల్లె పందిరి దాశరథీ శతకం కాగా నందివర్ధనాలు శ్రీకాళహస్తీశ్వరం. ఇక గన్నేరో.. అది నారసింహం.
కాకర పాదు వేణుగోపాల శతకం. దబ్బ – పొడుగు – ఎర్ర చిక్కుళ్ళు మూడూ భర్తృహరి సుభాషిత త్రిశతి. వంగ తోట సుమతి, మిరప పాదు వేమన పద్యాలే.
ద్విపదలు మొదలు గేయ వాఙ్మయమంతా చెరకు తోట.

అయ్యా.. ఇక కథా నవలాది వచన రచనంతా వరి పంట.
మరి డిటెక్టివ్/బూతు రచనలో… అది పొగాకు నారే మరి.

*** *** ***

ఓ పాతకాలపు తెలుగు పంతులు. ఆ బడిలో పిల్లలకు తెనుగు సాహిత్యపు చేవనంతా ఎక్కించాలన్న తాపత్రయం తప్ప మరేం లేని, తెలీని వాడు. ఆ బడికి కొత్తగా వచ్చిన ఇతర మాస్టార్ల వెక్కిరింపులు భరిస్తూంటాడు. పులి మీద పుట్రలా దిగబడ్డ హెడ్‌మాస్టారికి ఈయన తుమ్మినా తప్పే దగ్గినా తప్పే. ఏం చేయాలి.

ఒకానొక సందర్భంలో తీవ్ర మనోవేదనకు గురయి ఆ పంతులు గారు ఉద్యోగాన్ని ఈడ్చి విసిరికొడతాడు. ఉత్తరీయం దులపరించుకుని కట్టుబట్టలతో ఊరు విడిచిపెడతాడు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలీకపోడం ఆయన బోధనాశైలిని ఇష్టపడే (మన కథకుడి లాంటి) కొందరు విద్యార్థులకు తప్ప ఎవరికీ పట్టదు.

ఓ పుష్కర కాలం తర్వాత విచిత్ర పరిస్థితుల్లో ఆయన మన కథకుడికి ఓ పల్లెటూరిలో తారసపడతాడు. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడని తెలిసేసరికి కథకుడు ఆయన్ను పొలం దగ్గరే చెబుతాడు. సాహిత్యం అంటే ఎంతో అభిరుచీ, అభినివేశమూ ఉన్న మీరు ఇప్పుడీ పల్లెటూళ్ళో హాలిక వృత్తిలో మీ ఆత్మకు ఎలా సంతృప్తి కలిగించుకుంటున్నారు మాస్టారూ… అని అడుగుతాడు. అదిగో అప్పుడా మాస్టారు చెప్పిన సమాధానమే పై వర్ణన.

భూలక్ష్మీ ప్రసాదాన్ని ఒక్కోదాన్నీ ఒక్కో శారదా ప్రసాదంగా భావించుకుంటూ కొబ్బరి తోపులో భారతమూ, అరటితోటలో భాగవతమూ నెమరేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తుంటాడాయన. ఇప్పుడాయన సమస్యల్లా ఒక్కటే. వేలాదిగా సేకరించుకున్న పుస్తక సంపదను ఏ వారసుడికివ్వాలా అన్నదే. సరే… ఆ సమయానికి ఆ సమస్యకు పరిష్కారంగా మన కథకుడే వచ్చి నించున్నాడుగా. ఇక కథ సుఖాంతం.

*** *** ***

దామల్‌చెరువు అయ్యవారిగా పేరు గడించిన మధురాంతకం రాజారాం గారి కమ్మ తెమ్మెర ఈ కథ. “హాలికులు కుశలమా” అన్న ఆయన కథా సంపుటి చదవడం మొదలెట్టి నెల్లాళ్ళు దాటుతున్నా… ఎప్పుడూ ఈ కథ దగ్గరే బండి ఆగిపోతోంది. ఆయన కథా కథన శైలి గురించీ, విన్నాణ చాతురి గురించీ కొత్తగా చెప్పుకునేదేముంది. దగ్గరగా కూచోబెట్టుకుని జొన్నంబలి తాగిస్తూ ఆప్యాయంగా కబుర్లు చెప్పే తీరున సాగే మాస్టారికి దణ్ణం పెట్టుకోడం తప్ప ఏం చేయగలం.

Advertisements

14 Comments (+add yours?)

 1. Jahnavi
  Jul 20, 2012 @ 18:14:40

  adbhutam andi… inkaa ento cheppalani vundi… elaa cheppaalo teliyadam ledu… naaku aa pustakam chadavaalani vundi

  Reply

  • ఫణీన్ద్ర పురాణపణ్డ
   Jul 20, 2012 @ 19:25:53

   జాహ్నవి గారూ…
   ఆ పుస్తకం pdf file అంతరజాలంలో అందుబాటులో ఉంది. కొద్దిగా వెతికితే దొరికేస్తుంది. ప్రయత్నించండి. మాస్టారి కదళీపాకాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు.

   Reply

 2. మనోహర్
  Jul 20, 2012 @ 19:16:54

  chaalaa baaga undi kdha, nenu try cehstanu chadavadaniki

  Reply

 3. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jul 20, 2012 @ 19:56:14

  మనోహర్ గారూ…
  ఇదే కాదు… రాజారాం మాస్టారి ఏ కథ దొరికినా వదిలిపెట్టక చదవండి. ధన్యవాదాలు.

  Reply

 4. NS Murty
  Jul 20, 2012 @ 20:33:10

  Phaneendra garu,
  Your article is so teasing that I could not wait any more without reading it. I searched for the story, found and completed in one go. No surprise if eyes get wet. This is the link;
  http://ia600304.us.archive.org/2/items/halikulukushalam019993mbp/halikulukushalam019993mbp.pdf
  Thank you so much.
  with best regards

  Reply

 5. ఫణీన్ద్ర పురాణపణ్డ
  Jul 21, 2012 @ 13:18:43

  మూర్తిగారూ…
  మాస్టారి కథలు సుతిమెత్తగా ఉంటూనే గుండెను చెమ్మగిలజేస్తాయి. నేనెప్పుడో ఏడాది క్రితం డౌన్‌లోడ్ చేసుకున్నందున ఆ link ఇప్పుడు ఇవ్వలేకపోయాను. మీరిచ్చినందుకు ధన్యవాదాలు.

  Reply

 6. kastephale
  Jul 21, 2012 @ 15:48:41

  వీరిని వ్యక్తిగతంగా కలవడము, ఒక చోట సత్కారం చేసే భాగ్యం కలిగింది, నాకు. వీరి రచనలు చదివేను.పేరు మధురాంతకం కాని కధ మధురం.

  Reply

 7. chandhuthulasi
  Jul 22, 2012 @ 17:35:04

  సార్.. మీ పోస్ట్ చాలా బాగుంది. అన్నట్లు రాజారాం మాస్టారి వారసుడు నరేంద్ర గారి కథలు కూడా బావుంటాయి

  Reply

 8. chandhuthulasi
  Jul 24, 2012 @ 21:32:31

  అవును సార్. మీ పోస్ట్ నాకు నచ్చడానికి అదీ ఓ కారణం అయి ఉండవచ్చు. కాని…మా భావజాలానికి నచ్చే మహాప్రస్థానం, త్వమేవాహం….. లాంటివి ఏ చెట్టులో చూసుకోవాలో సెలవిచ్చారు కాదు.

  Reply

 9. కొత్తపాళీ
  Aug 06, 2012 @ 21:14:50

  బావుంది. తెలుగు కథకుల్లో రాజారాం మాస్టారిది సెపరేటు కుర్చీ. ఆ కుర్చీలో ఇంకెవరూ కూర్చోలేరు. నేను చదివినంతలో ఆయన కథలేవీ డమడమలాడించవు. ఉద్యమాలు రేపవు. నిజాయితీగా చెప్పుకోవాలంటే .. గొప్ప కథ చదివిన ఫీలింగ్ కూడా రాదు. కానీ అక్కడక్కడా మనసు థిల్లింత పడుతుంది. అప్పుడప్పుడూ కళ్ళు చెమ్మగిల్లుతై. ఒక్కోచోట, జీవ్తాన్ని ఏమి కాచి వడబోశారురా ఈయన అనిపిస్తుంది.

  Reply

 10. yandamoori
  Jun 08, 2014 @ 14:43:58

  Dear Pani,
  can i have your phone number please? i have a small request to be made. can you SMS your number to my 9246502662?

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: