అతను భారతీయ చిత్రకారుడిగా ప్రత్యేకత సాధించాలని నేను కోరుకున్నాను. ఐతే దాని కోసం గత (18వ) శతాబ్దపు చిత్రలేఖన పద్ధతులనూ, విధానాలనూ నేర్చుకోడం తప్పనిసరి అని నేననుకోలేదు, క్రీ.శ.14వ శతాబ్దపు తొలినాళ్ళలో నార్ఫోక్కి చెందిన మిసాల్ చిత్రకారులో, వించెస్టర్కు చెందిన ఫ్రెస్కో పయింటర్సో అద్భుత ప్రావీణ్యం సాధించిన రేఖీయ పద్ధతి చిత్రలేఖనాన్ని నేర్చుకోడానికి ఇప్పుడు నేను ఆసక్తి చూపను కదా. పైగా; భారతీయ చిత్రలేఖన శైలి తప్పకుండా ఫలానా విధంగానే ఉంటుందీ అని బెంగాలీ పునరుజ్జీవన కాలం నాటి చిత్రకారులు చెప్పినదే సరయిన విశ్లేషణ అని నేను ఏనాడూ సంతృప్తి చెందలేదు. వారి చిత్రలేఖనాలు అజంటా కంటె జపనీస్ పద్ధతికి దగ్గరగా ఉంటాయి. అదే సమయంలో అజంటా వర్ణచిత్రాలు చీనీ, జపనీయ పద్ధతుల కంటె ప్రాచీన గ్రీసు విధానాలకు దగ్గరగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఈ మధ్యనే బాలికల పాఠశాలల ఇనస్పెక్టర్ ఒకామె నాకు ఓ విషయం చెప్పింది. ఏదైనా విషయాన్ని గమనించే విధానంలో పాశ్చాత్య, ప్రాచ్య దృక్పథాల మధ్య హస్తి మశకాంతర భేదముంటుందట. ఓ విషయాన్ని పాస్చాత్యులు గుంద్రంగా చూస్తే, దాన్ని ప్రాచ్యులు హద్దులు కలిగిన తిన్నటి తలంగా చూస్తారట. ఐతే కళ విషయంలో ఇది సరి అని నేను అనుకోను. ఏ ఖండపు కళాఖండాల చరిత్ర ఏ కొంచెమైనా తెలిసిన వాళ్ళకి ఈ దృక్పథపు అసమంజసత ఇట్టే అర్ధమవుతుంది. బెంగాల్‌కు చెందిన ఆధునిక చిత్రకారులు ఈ పిడివాదాన్ని పట్టుకుని కూచుంటారనీ, ఇంత కురచగా ఆలోచిస్తారనీ నేను భావించలేను. వాళ్ళ ఇటీవలి చిత్రలేఖనాలు చూస్తే ఆ సంగతి స్పష్టమవుతుంది. కానీ వారు చిత్రలేఖనంలో ప్రభావశీలమైన నమూనాలను, మచ్చుకు అజంటా మొదతి గుహ గోడల మీదనున్న ఫ్రెస్కోల వంటి వాటిని, అనుసరించడం లేదా కనీసం గమనించడంలో విఫలమవడం అలాంటి వాదనలకు ఊతమిస్తుంది. బహుశా దానికి కారణం, 12వ శతాబ్దం నాటి బిహారీ సూక్ష్మ చిత్రకారుల నుంచి పరంపరాగతంగా వస్తూన్న స్థానిక చిత్రలేఖన సంప్రదాయాలను వారు అనుసరిస్తూండడమే అయుండవచ్చు. ఆ బిహారీ కళాకారులు తమ పొరుగునే ఉన్న నేపాలీ కళాకారుల్లా, వారంత ఎక్కువ కాకపోయినా కొంతమాత్రమైనా చైనా చిత్రకళా శైలి నుంచి అప్పటికే ప్రేరణ పొంది ఉండవచ్చు. బెంగాలీ చిత్రకళలో చీనా చాయలకు కారణం అది అయుండవచ్చు. కాకపోతే భారతీయ చిత్రకళా సంప్రదాయ పునరావిష్కర్తలుగానో, లేక వారి వారసులుగానో వారు గొప్పలు చెప్పుకోడానికి, లేదా వారి గురించి ప్రచారం చేయడానికీ, ఈ కళ ఏమాత్రం సాయపడబోదు. బెంగాలీ చిత్రకళ ఇంకా పాత రేఖీయమైన, సరళమైన శైలిలో ఉండగానే, ఇక్కడ నేనున్న కాలంలో రాజమండ్రి బజార్లో అమ్ముతుండే గాజు మీద చిత్రించిన బాలకృష్ణుడు తదితర దేవతల చిత్రలేఖనాలు చాలావరకూ అజంటా తరహాలో ఉండేవి. ప్రత్యేకించి మొదటి గుహలోని శంఖఫల జాతకం, అలాగే రెండో గుహలోని మరికొన్ని ఘట్టాల చిత్రకళా శైలిలో ఉండేవి.
అప్పటికి నా ఆలోచనలు పెద్ద స్పష్టంగా లేకపోయినా, పెద్ద మూర్ఖంగానూ ఉండేవి కావు. పైగా నిశితమైన ఊహాశక్తి ఉన్న రాం లాంటి కుర్రవాడు తాను చూసిన కొద్దిపాటి అస్పష్టమైన పాశ్చాత్య చిత్రకళను చూసి ఊరుకుని ఉండలేడనీ, దృస్యమానమైన ప్రకృతిని చిత్రించే స్థాయిలోనైనా దాన్ని నేర్చుకునేంతవరకూ కుదురుగా ఉండలేడనీ నేను అర్ధం చేసుకున్నాను. అప్పుడే అతను తన ఇచ్చ వచ్చినదాన్ని ఎంచుకోడం, నచ్చకపోతే తోసిపుచ్చడం చేయగలిగే స్థితికి చేరగలడని భావించాను. అతను మంచి చెడులు తెలిసిన భగవంతుడిలా ఉండాలి, పతనానికి ముందు యాడంలా మూర్ఖంగా ఉండకూడదు. అది అతనిపై చాలా పెద్ద బరువునే మోపుతుంది. కానీ దాన్ని తట్టుకోడానికి సరిపడినంత శక్తి అతనికి ఉండాలని కోరుకుంటున్నాను. తన సమస్యలు పరిష్కరించుకోడంలో అతనికి ఎంత సాయమైనా చేయడానికి సిద్ధపడ్డాను. అన్నింటి కంటె ముఖ్యంగా అతనికి కావలసినది… సమయం.
*** *** ***
ఈ కబుర్లన్నీ చెప్పిన పెద్దాయన పేరు ఆస్వాల్డ్ జెన్నింగ్స్ కూల్డ్రే. ఆయన చెప్పినది తన శిష్యుడు దామెర్ల రామారావు గురించి. ఆనాటి చిరు రాముడు విశ్వకళాభిరాముడయ్యాడన్న తేజోమయ కీర్తీ, గురు గర్వమూ దక్కాయి కూల్డ్రేకు.
1897లో సరిగ్గా ఇదే రోజు పుట్టిన రామారావు… తనదైన చిత్రకళా శైలితో ఐరోపా వరకూ విస్తరించిన కీర్తితో నిండుగా 28ఏళ్ళయినా నిండకుండానే దివిజపురికి చనినాడు.
ఇంతకీ రామారావును మనం ఎంత గుర్తు పెట్టుకున్నాం?
డబ్బు లెక్కల్లో చూసినా కోటి రూపాయలు విలువ చేసే కృష్ణలీలలు అన్న చిత్రలేఖనం చిరిగిపోతే పట్టించుకునే నాథుడు లేడు ఆయన పెట్టుకున్న గ్యాలరీలో. ఆ గ్యాలరీని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, దాన్ని పాలిటెక్నిక్ కాలేజీ యాజమాన్యానికి అప్పగించి చేతులు దులిపేసుకుంది. ఇప్పుడక్కడ గదులు తుడిచే చీపుళ్ళు కొనడానికి కూడా నిధుల్లేవట. అయ్యా…. అదీ సంగతి.
(రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వర్తమాన దుస్థితి గురించి రచన జూన్ 2012 సంచికలో ప్రచురించిన ప్రత్యేక వ్యాసం చూడండి.)
Jun 08, 2012 @ 18:38:24
కొట్టుకు చావడానికి సొమ్ము దోచుకోడానికి సమయం చాలటం లేదు సార్!!! 🙂
Jun 08, 2012 @ 18:54:56
మాస్టారూ… కళ అన్న పదమే బూతుగా మారిపోయిందిప్పుడు. ఈ దయనీయ పరిస్థితికి ఎవరిని నిందించాలో తెలీదు. 😦
Jun 08, 2012 @ 19:27:44
ఒక భారతీయ చిత్రకారుని గురించి తెలిపారు. చాలా సార్లు చదివాను మీ టపాని సరిగ్గా అర్ధం చేసుకోడానికి. బాగుందండి! ఇలాంటివి రాస్తూ ఉండండి!
Jun 08, 2012 @ 20:02:16
దామెర్ల రామారావు గురించి కేవల ప్రశంసలో జీవిత పరిచయమో కాకుండా ఆయన చిత్రలేఖనంలో ఎదిగిన తీరు, ఆనాటి చిత్రప్రపంచం తీరుతెన్నులు, అతని కళలోని విశేషాల గురించి స్వయంగా ఆయన గురువు రాసిన వ్యాసంలోని కొన్ని విషయాలను పరిచయం చేశానంతే. కొండను అద్దంలో చూపేందుకు చిన్న ప్రయత్నం. నచ్చినందుకు ధన్యవాదాలు.
Jun 09, 2012 @ 16:43:47
చిత్రకళ గురించి సాధికారికంగానూ, శిష్యుడైన దామెర్ల రామారావు గురించి ఆప్యాయంగానూ కూల్డ్రే రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది. దామెర్ల రామారావు ఎదిగిన క్రమం అర్థం చేసుకోడానికి ఇది ఉపకరిస్తుంది.
ఈ వ్యాసం మూలం (ఏ పత్రికలో ప్రచురితమైందీ..) గురించి ప్రస్తావించివుంటే బాగుండేదనిపించింది. తెలుగులోకి మీరే అనువదించారా?
‘రచన’లో దామెర్ల రామారావు గారి గురించి వచ్చిన రెండు వ్యాసాలూ చదివాను. వెంటనే మీరీ టపా రాయటం బాగుంది.
కూల్డ్రే చిత్రించిన దామెర్ల రూప చిత్రం, దామెర్ల ‘నందిపూజ’ పెయింటింగ్ చూడటం సంతోషం కలిగిస్తోంది. అభినందనలు & థాంక్యూ!
Jun 10, 2012 @ 11:44:49
వేణు గారూ…
దామెర్ల రామారావు జయంతి సందర్భంగా ఆయన గురించి నా బ్లాగులో రాయాలని రెండు మూడు నెలల నుంచే అనుకుంటూన్నాను. దామెర్ల వారి శిష్యుడు రాజాజీ మా నాన్న గారికి పెద్దన్న వంటి స్నేహితుడు. ఆయన రామారావు గారి గురించి రాసిన పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాద్దామనుకున్నాను, సమయానికి ఆ పుస్తకం నా దగ్గర నుంచి మా చెల్లెలు తీసుకుపోయింది.
కాకతాళీయంగా, దామెర్ల జయంతికి ఒక్క రోజు ముందు, జూన్ రచన సంచిక కొన్నాను, దామెర్ల గురించి నేను రాద్దామనుకున్న విశేషాలన్నీ, నా భావనల కంటె సాధికారంగా రాశారు దానిలో.
ఆ రెండు కారణాల వల్లా… నా రాతతీరు మార్చాల్సి వచ్చింది. సమయానికి, ఆస్వాల్డ్ కూల్డ్రే తన శిష్యుడి గురించి రాసిన ఒక వ్యాసం అంతరజాలంలో లభించింది. సుమారు 7 పేజీల ఆ సుదీర్ఘ వ్యాసంలోని ఓ రెండు పేరాలను మాత్రం ఎంచుకుని అనువదించాను, ఇది ఏ పత్రికలోనూ ప్రచురితం కాదు, మరెవరైనా అనువదించారేమో నాకు తెలీదు. “దామెర్ల రామారావు జ్ఞాపకాలు” అన్న ఆ వ్యాసాన్ని పూర్తిగా అనువదించాలనుకున్నా సమయాభావమూ, నిడివి సమస్యలతో పరిమితంగా రాశాను.
వీలును బట్టి రాజాజీ గారి పుస్తకాన్ని పరిచయం చేయాలని ఆశ.
నా అజ్ఞాన ప్రయత్నం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
Jun 14, 2012 @ 02:05:55
బహు చక్కని వ్యాసం. కూల్డ్రే గారి మాటల్లో తెలుసుకోవడం బాగుంది. ఆయన ఆర్ట్ గ్యాలరీ చుట్టూ ఎన్ని సార్లు తిరిగుంటానో లెక్కలేదు. అన్నట్టు ఆ రచన పత్రికలో పడిన వ్యాసం మీరే జత చేయరూ…
Jun 14, 2012 @ 12:08:50
రసజ్ఞ గారూ…
ధన్యవాదాలు. రచన పత్రిక ఆన్‌లైన్‌లోనూ ఉంది. తాజా సంచికలోనే ఆ వ్యాసం పడింది. ఆ లింక్ http://www.rachana.net/june_2012.html అక్కడ ఎటాచ్ చేసిన pdf లో 9, 10 పుటల్లో ఉందీ వ్యాసం.
Jun 14, 2012 @ 20:55:13
rajahmundry lo BEd chesetappudu art gallary ki vellamandi, adbhuthamaina vyakthi ramarao garu.
Jun 15, 2012 @ 11:51:17
Bhaskar garu…
Thank You for your response.