సితారోం సే ఆగే జహా ఔర్ భీ….

90వ దశకం. ఆంధ్ర ప్రభ వారపత్రిక చరమాంకం. ఆ పత్రిక చేసుకున్న పుణ్యం… వాకాటి పాండురంగారావు గారి వంటి మహానుభావుడి సంపాదకత్వంలో కన్ను మూయడం. ఆ చివరి రోజుల్లో ప్రభలో వాకాటి వారు చేసిన ప్రయోగాలెన్నో. సుమారు రెండేళ్ళపాటు ఆయన సంపాదకీయ వ్యాసాల శీర్షిక ‘మిత్ర వాక్యం’ చదివిన భాగ్యం దక్కింది. అలాగే ‘రామన్ కాలం’. ఆ కలెక్షన్లు కాలక్రమంలో ఏ గోదారిలోనో కలిసిపోయాయి.

వాకాటి వారు భాషా యోషకు చేసిన సేవలో ఒకటి…. ఆ ప్రత్యేక శీర్షిక. అంశం హిందుస్తానీ సంగీతం. ఆ రంగంలో ప్రముఖ విద్వాంసులను పరిచయం చేయడం… ఆ ధార గురించి కనీస ఆసక్తీ, మౌలిక అవగాహనా కలిగించడం ప్రధాన లక్ష్యాలు. హిందుస్తానీకి సన్నిహితమైన గజళ్ళూ, కథక్కూ అదనపు సొబగులు. ఆ వివరాలన్నిటినీ చిన్నచిన్న ముచ్చట్లుగా చెప్ప్పిన శైలి వర్ణనాతీతం. పెదనాన్న లాంటి మాస్టారు మనను పక్కన కూచోబెట్టుకుని ఇదిగో అప్పుడేమో ఇలా జరిగింది తెలుసా అన్నట్టు కర్ణపేయంగా, శ్రుతిసుభగంగా చెప్పుకుంటూ వెడుతుంటే… అలా నోళ్ళు తెరుచుకుని వినడమే. అసలు అలా జరిగిన మాట నిజమేనా అన్న సందేహం లేశమాత్రమైనా కలగదు. కానీ ఇలాంటి ప్రపంచం మన కాలం కంటె కొద్ది ముందే ఉండేదనీ, దాన్ని మనం కోల్పోయామనీ, చూడలేకపోయామనీ, వినలేకపోయామనీ ఒక బాధ తొలిచేస్తుంది. ఆ ముచ్చట్లు చెప్పిన పెదనాన్న డాక్టర్ సామల సదాశివ గారు. ఆ కబుర్ల శీర్షిక పేరు “మలయ మారుతాలు”.

సంగీతానికి భాషాలిపి సమకూరిస్తే ఇదే అయుంటుందేమో అనిపిస్తుంది. ఎంత సంక్లిష్ట విషయాన్నైనా సుకసుకాన అర్ధమయేలా చెప్పే ఆ శైలిని అమాంతం మోహించేయాలనిపిస్తుంది. సంగీతం గురించి, అందునా హిందుస్తానీ గురించి ఇంతందంగా చెప్పొచ్చా… తెలుగును ఇంత సొంపుగానూ రాయొచ్చా… అన్న నిషా కలుగుతుంది మాస్టారి ముచ్చట్లు చదువుతుంటే.

ఒక తవాయఫ్ గోహర్‌జాన్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గుడ్డిగవ్వకు దిగజార్చిన వైనంతో మొదలుపెట్టి…. క్రమక్రమంగా చిన్నచిన్న ఘటనలు చెప్పుకుంటూ వచ్చి… హిందుస్తానీ కళాకారుల జీవితాల్లోని ఘట్టాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తారు మాస్టారు. అల్లాబఖష్ కళ్ళు చూసి మరుసటి రోజు ఆయన పాడబోయే రాగమేంటో చెప్పేస్తాడు కరీంఖాన్. కరాచీ సంగీతజ్ఞుల్లో అగ్రగణ్యులైన తన ముగ్గురు కొడుకులనూ “ఓ గవాయి” బువా భాస్కర్ బఖ్లే దగ్గర పాడడం నేర్చుకొమ్మని పంపిస్తాడు గామణ్‌ఖాన్. శంభూ మహరాజ్ దగ్గర కథక్ నాట్యం నేర్చుకుంటున్న రీతా గంగూలీని తన దగ్గర గాత్రం నేర్చుకొమ్మని ప్రాథేయపడుతుంది “ఎవరికీ సుకసుకాన నేర్పని” సిద్ధేశ్వరీ దేవి. తాను మద్యం మత్తులో ఉందని భయపడుతున్న రేడియో అధికారులను చూసి “మత్తులో ఉన్నవాళ్ళంతా నన్ను హోష్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ గజల్ పాడేస్తుంది బేగం అఖ్తర్. తాను పాడే నాట్య గీతాలను హీరాబాయి బరోడేకర్ గాత్రంలో విని పరవశించిపోయేవాడు బాలగంధర్వ. కుమార గంధర్వకు విద్య నేర్పుతూ, భైరవీలో మధ్యమం శ్రుతిపక్వంగా రావడం కోసం మూడు రోజులు ఒకే రాగాన్ని సాధన చేస్తుంది అంజనీబాయి మాల్పేకర్.

సంగీత స్పర్ధల వల్ల తలెత్తే విభేదాలు, అవి దారితీసిన ఆజన్మాంత వైరాలు, మాట పట్టింపులతో విడిపోయి అనూహ్యంగా కలిసిపోయే కళాకారుల చిన్న పిల్లల మనస్తత్వాలు… ఎన్నెన్నో. తమ గాత్ర పద్ధతిని కాపీ కొట్టినందుకు మాట్లాడడం మానేసిన అల్లాదియాఖాన్ చివరి రోజుల్లో రాజీకి సిద్ధపడినా, పరలోకంలోనే కలుసుకుందామంటాడు కాపీమాస్టర్ రజ్జబలీ ఖాన్. తన శతృవు మోగూబాయికి నమస్కరించి, తన ముందుకు రావడానికి భయపడుతున్న ధోండూతాయిని అక్కున చేర్చుకుంటుంది “మూడీ” కేసర్‌బాయి. తాను వదిలిపెట్టాక బాలగంధర్వ కంపెనీ నాటకాలకు ఆదరణ తగ్గిందని ఓ బాయిజీ ఇంట విన్న తక్షణం తబలా సర్దుకుని నేరుగా గంధర్వ నాటకమాడుతున్న వేదిక ఎక్కేస్తాడు తబ్లా తిరఖ్‌వా.

భారతీయ సంస్థానాధీశులందరూ తాగి తందనాలాడుతూ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తాము నాశనమైపోయారు, దేశాన్ని నాశనం చేసేశారు… ఇదీ మన చరిత్ర పుస్తకాలు చెప్పే కథలను బట్టి పరిచయమయ్యే సంస్థానాల తీరు. ఆ చరిత్రంతా తప్పు అనీ, ఉద్దేశపూర్వకంగా వక్రీకరణలు జరిగాయనీ ఎన్నో నిరూపణలు లభిస్తున్నా, వాటన్నిటినీ పక్కకు నెట్టేసే, తొక్కిపట్టేశే సంస్కారం మన ప్రభుత్వ ప్రాయోజిత చరిత్ర సమాఖ్యది. ఏదేమైనా, సంస్థానాధీశుల పాలన గురించి, వారి కళాపోషణ గురించీ పరోక్షంగానైనా తెలిపే సాహిత్యం ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. ఆనాటి ఔత్తరాహ సంప్రదాయ సంగీత సాహిత్య నాట్య చరిత్రను విహంగవీక్షణంగా పరిచయం చేసే ఈ గ్రంథంలో కళాప్రియులైన సంస్థానాధీశుల ఔన్నత్య ప్రతీకలూ ఎన్నో.
కాముని పున్నమకు మూన్నాళ్ళ ముందు వారణాసి క్షేత్రంలో గంగానదిలో నావ మీద విద్యాధరీదేవి ఆలపించే గీతగోవిందం వినడానికి మద్యపానానికి దూరంగా ఉండిపోతాడు సుమేర్‌గఢ్ మహారాజు. లక్షల్లో సొమ్మిస్తామన్న వారిని కాదని బాలకృష్ణ బువా, అబ్దుల్ కరీంఖాన్ వంటివారు వదలబోని సంస్థానం ఇచల్‌కరంజీ అధీశుడు శ్రీమంత్ రసికత ఘనమైనది. స్వగ్రామంలో కరవు గురించి ఆవేదన చెందుతున్న అల్లాదియాఖాన్‌కు నేరుగా ఆర్ధిక సహాయం చేస్తే ఆయన ఆత్మాభిమానం దెబ్బ తింటుందని, మిత్రుల మధ్య కచేరీ పెట్టించి ఆరోజుల్లో 14వేలు చేతికిచ్చాడు కొళాపూర్ లోని సేఠ్ గోపాల్‌దాస్.

అలా ఎందరో హిందుస్తానీ విద్వాంసుల జీవితాల్లోని అపురూప ఘట్టాలను జలతారు జరీ పనితనంతో అల్లుకుంటూ వచ్చిన సదాశివ మాస్టారు అక్కడితో ఆగిపోలేదు. హిందుస్తానీ సంగీతం ఆవిర్భవించిన క్రమం, హిందుస్తానీ – కర్ణాటకల భేద సామ్యాలు, సొగసరి గజళ్ళ రచనా విధానం, సూఫీ తత్వం వంటి మరెన్నో సంగతులనూ సందర్భానుసారం చెబుతారు. ఆదిలాబాదు అడవులంత సతతహరితమైన ఆయన వాక్చిత్రాలు చదవడం ఒక మహానుభూతి.

Advertisements

2 Comments (+add yours?)

 1. కొత్తపాళీ
  May 29, 2012 @ 21:52:51

  అద్భుతంగా ఉన్నది మాస్టారూ. ఈ శీర్షిక పుస్తకంగా వేశారా?

  Reply

  • Phaneendra
   May 30, 2012 @ 11:47:52

   కొత్త పాళీ గారూ…. మలయ మారుతాలు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం వారు పుస్తకంగా ప్రచురించారు.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: