ఏడుపేమైనా ఆడవాళ్ళ పేటెంట్ రైటా!

ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదన్న వాడెవడో కానీ… వాణ్ణి పురుష దురహంకార సూకరం అనడం మాటేమో కానీ కచ్చితంగా మూర్ఖశిఖామణి అనాల్సిందే.

*** *** ***

“మావయ్య వచ్చి వెళ్ళాక నాన్న బాగా తేరుకున్నార్రా. ఆయన్ని పట్టుకున్ని ఏడ్చేశాక గుండె బరువు తగ్గింది. ఇన్నాళ్ళూ గుబులు పెట్టుకుని ఉండిపోయారు కదా. ఇప్పుడు కొంచెం తేటపడ్డారు.” పెదనాన్న చనిపోయిన సుమారు నెల రోజుల తర్వాత ఓ రోజు ఫోన్‌లో అమ్మ చెప్పింది.

నాన్నకి పెదనాన్నతో అనుబంధం బాగా ఎక్కువ. అంతే కాదు, ఐదారేళ్ళ క్రితం పెదనాన్న ఆరోగ్యం అనూహ్యంగా పాడైపోయినప్పటి నుంచీ ఆయన గురించి బెంగ పెట్టేసుకున్నారు. మొన్న ఓ శుభ కార్యం కోసం నాన్న హైదరాబాద్ వచ్చి, పెదనాన్నని చూడడానికి వెళ్ళారు. ఆ మర్నాడే పెదనాన్న పోయారని తమ్ముడి ఫోన్. వెంటనే అందరం అక్కడికి వెళ్ళిపోయాం. అంత్యక్రియలు ఐపోయేవరకూ నాన్న అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత ఊరెళ్ళిపోయినా చాలారోజులు ముభావంగానే ఉండిపోయారు. నోటి చివరి నుంచి తప్ప మాటలు వచ్చేవి కావు. ఒక రోజు నాన్నా వాళ్ళా ఊరి నుంచి, నాన్నకీ, పెదనాన్నకీ స్నేహితుడు ఐన ఒక మావయ్య వచ్చారు. ఇద్దరూ కలిసి వాళ్ళా ముగ్గురి అనుబంధాలనీ పంచుకున్నారు. ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశారు. అన్నాళ్ళూ ఉగ్గబట్టుకున్న బాధంతా కరిగి కన్నీరై వెలికి వచ్చేసింది. అదీ అమ్మ చెప్పిన మాటల వెనుక కథ.

*** *** ***

మా బావ ఒకడున్నాడు. అతనికీ నాన్నకీ ఏజ్ గ్యాప్ పదేళ్ళే కావడంతో వాళ్ళిద్దరికీ చనువెక్కువ. ఆలోచనా ధోరణులూ, సైద్ధాంతిక భావనల విషయంలో చిన్న చిన్న తేడాలున్నా వారిద్దరి స్నేహానికీ అవి ఏనాడూ అడ్డం కాలేదు. వాళ్ళిద్దరికీ కామన్ లక్షణం ఈ ఏడుపు. నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో ఒక అన్నయ్య పెళ్ళి జరిగింది. నాన్నా, బావా చాలా కాలం తర్వాత అక్కడ కలుసుకున్నారు. నాన్న ముందు నుంచీ అక్కడున్నారు. అప్పుడే వచ్చిన వారికి కాఫీలేవో ఇవ్వడానికి ఆడ పెళ్ళి వాళ్ళు మగ పెళ్ళి వాళ్ళ విడిదిలోకి అప్పుడే వచ్చారు. తీరా చూస్తే ఏముందీ… నాన్నా, బావా ఇద్దరూ ఏడుపులు మొదలెట్టేశారు…. ఒక్క ముక్క కూడా మాట్లాడుకోక ముందే. ఏం జరిగిందో అర్ధం కాక ఆడ పెళ్ళి వాళ్ళు ఒకటే కంగారు. ఎప్పటెప్పటివో ఏవేవో విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఇలా ఉన్నట్టుండి ఏడవడం వాళ్ళిద్దరికీ అలవాటే అని అత్తయ్య చెప్పాక సర్దుకున్నారు. కానీ పెళ్ళయ్యేంతవరకూ ఆశ్చర్యంగా చూస్తూనే ఉండిపోయారు.

*** *** ***

“డెడ్ మ్యాన్ వాకింగ్”… ఈ మధ్య ఆస్కార్ అవార్డుల సమయంలో స్టార్‌లోనో హెచ్‌బీవోలోనో చూసిన సినిమా. టీనేజ్ జంటని హత్య చేసిన నేరానికి ఒక వ్యక్తికి క్యాపిటల్ పనిష్మెంట్ పడుతుంది. తను నేరస్తుణ్ణి కాదని చెప్పిన అతని మాటలు నమ్మి ఒక నన్ అతని విముక్తి కోసం ప్రయత్నిస్తూంటుంది. ఆ క్రమంలో హతుల కుటుంబాల చీత్కారాలనూ ఎదుర్కొంటుంది. ఆమె ఎంత కష్టపడినా నేరస్తుడి శిక్ష తగ్గదు. చావు దగ్గర పడే సమయంలో ఆ వ్యక్తి… ఆ జంటలో ఒకరిని హత్య చేశానని ఒప్పుకుంటాడు. శిక్ష తప్పించలేని ఆ నన్.. అతనికి ఆధ్యాత్మిక సహాయం చేస్తుంది. కౄరమృగంలా బైటకి ప్రవర్తించే ఆ వ్యక్తిలోని మానవత్వాన్ని తట్టి లేపుతుంది. జైలు అధికారులు విషం ఇంజెక్షన్‌తో శిక్ష అమలు చేయడానికి రెండు క్షణాల ముందు ఆ నేరస్తుడు హతుల తల్లిదండ్రుల ముందు తన నేరాన్ని ఒప్పుకుని వారి క్షమాభిక్ష కోసం వేడుకుంటాడు. శిక్ష అమలు తర్వాత నేరస్తుడి అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడి వరకూ, ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగా…!

ఎంత శిక్షయినా సరిపోని ఆ మృగానికి వత్తాసు పలుకుతున్నావా అంటూ అంతవరకూ నన్‌ని విమర్శించిన హతురాలి తండ్రి… ఆ అంత్యక్రియలకు వస్తాడు. దూరంగా ఓ చెట్టు చాటు నుంచి చూస్తూ ఆ కార్యక్రమం అయేంత వరకూ అక్కడే ఉండిపోతాడు. కార్యక్రమం ఐపోయాక వెనుదిరిగిపోతున్న నన్ ఆయన్ని చూస్తుంది. ఆయన ఏం మాట్లాడకుండా అక్కణ్ణుంచి వెళ్ళిపోతాడు.

నేరస్తుడిగా, తప్పు తెలుసుకున్న వాడిగా షాన్ పెన్ అప్పటివరకూ గుండెని పిండేస్తుంటాడు. ఆ చివర ఈ మాస్టర్‌స్ట్రోక్. ఇక రెప్పల చెలియలికట్టలు దాటకుండా కన్నీటి సంద్రాలను నిలువరించుకోడం నావల్ల కాలేదు.

Advertisements

13 Comments (+add yours?)

 1. Zilebi
  Mar 12, 2012 @ 10:47:20

  ఓ మోస్తరు జన్మ హక్కే అనుకొండీ, అయినా మంచి పని చేసారు ఆ ఏడుపు ఏదో ఏడిచి.

  ఈ ఏడుపు ల వల్లే ఈ ‘ఆండోల్ల’ గుండె కాయ ‘డొల్ల’ ఐ గుండె కాయ జబ్బులు తక్కువ వీరికి అని ఆ మధ్య ఎక్కడో ఒక సారి చదివినట్టు గుర్తు.

  సర్వ రోగ నివారిణీ నయన ధారా వాహిని నమోస్తు నిత్యం పరిపాలయామం !!

  చీర్స్
  జిలేబి.

  Reply

 2. ఆ.సౌమ్య
  Mar 12, 2012 @ 12:58:43

  “ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదన్న వాడెవడో కానీ… వాణ్ణి పురుష దురహంకార సూకరం అనడం మాటేమో కానీ కచ్చితంగా మూర్ఖశిఖామణి అనాల్సిందే.”

  ముత్యాల్లాంటి మాటలు చెప్పారండీ. సుకుమారం, సున్నితత్వం లాంటివి ఏదో ఆడవాళ్ళ సొత్తు, మగవాళ్ళకి ఉండవు అన్నట్టు మాట్లాడతారు జనాలు. మూర్ఖులు నిజంగానే!

  Reply

 3. kastephale
  Mar 12, 2012 @ 13:21:39

  ఏడుపూ ఆరోగ్యానికి మంచిదే. గుండె బరువు దించుకోవాలి. లేకపోతే పగిలిపోతుంది.స్వానుభవం కూడా. మగవాళ్ళూ కరువు తీరా ఏడవాలి. ఇది ఆడవారి సొత్తు కాదు.

  Reply

 4. జ్యోతిర్మయి
  Mar 12, 2012 @ 16:56:15

  ఆడవాళ్ళు ఇలా…మగవాళ్ళు ఇలా…అన్న అభిప్రాయాలు ఎలా పుట్టాయో …ఒక చట్రంలో మనిషి ఎలా ఇమడగలడసలు? మంచి విషయం ప్రస్తావించారు..ఎవరికైనా అనుమానాలు ఉంటే మీ టపాతో తీరిపోయి ఉండాలి.

  Reply

 5. seenu
  Mar 13, 2012 @ 00:08:33

  when i saw “nanna” movie ..i ran away at climax so that i dont want people to see my tears

  Reply

 6. Phaneendra
  Mar 13, 2012 @ 10:49:33

  జ్యోతిర్మయి గారూ…
  ధన్యవాదాలు

  శీనూ
  దాచుకోడానికి అదేమయినా నేరమా? ఓ రకమయిన మెంటల్ కండిషనింగ్‌కి మనం అలవాటు పడిపోయాం. అంటే.

  Reply

 7. vanajavanamali
  Mar 14, 2012 @ 15:13:39

  స్పందనలు,మనోభావాలు ఆడ – మగ ఎవరికైనా ఒకటే! మగవాళ్ళు ఏడవకూడదు అని యెవరూ చెప్పలేదు. భీరత్వం అనుకుని అలా అన్వనయించుకుని ఉంటారు . హృదయభారాన్ని మోయడం చాలా కష్టం.

  బాగా చెప్పారు.

  అలాగే చిత్రం చూసినప్పుడు .. మీ కన్నీళ్లకి అర్ధం ఉంది. మనిషిలోని క్షమా గుణం ని తట్టి లేపేది పశ్చాతాపం.

  Reply

 8. Phaneendra
  Mar 14, 2012 @ 17:48:35

  వనజ గారూ
  అలాంటి నియమం ఏమీ లేదన్న మాట నిజమే. అదే సమయంలో మన హిపోక్రటిక్ సమాజంలో మగాడు ఏడవకూడదన్న భావన ప్రబలిపోయింది. అందుకే… అలాంటి నియమం ఉందీ అనేవాడు మగాడే అంటూ, వాణ్ణి మూర్ఖ శిఖామణి అన్నాను, ఇక పేటెంట్ అన్నది జోకే, సీరియస్‌గా తీసుకోకండి. హృదయానికీ, స్పందనలకీ లింగ వివక్ష ఏంటండీ. 🙂
  ధన్యవాదాలు.

  Reply

 9. కొత్తపాళీ
  Apr 02, 2012 @ 21:46:54

  Man or woman, it is cleansing to have a good cry now and then. BTW, recently, hollywood macho stars are not hesitating to cry. Just last year, both Brad Pitt and George Clooney shed copious tears on screen.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: