సైన్సు గుడ్లు మింగేస్తున్న టెక్నాలజీ చిలువ

చాలా కాలం క్రితం ఓ ఫెమినిస్టు కథ చదివాను… బహుశా ఓల్గాదేమో. కూతురి పద్ధతులు తల్లికి అర్ధం కావు. టేప్ రికార్డర్‌లో సంగీతం వినడంలో తన్మయురాలయిపోయిన కూతుర్ని పోనీ అదైనా నేర్చుకోమంటుంది. ఆ కూతురు నేను వినడాన్నే ఆస్వాదిస్తాను తప్ప నేర్చుకునే కంప నాకెందుకు అంటుంది.

తర్వాతి కథ ఇక్కడ అప్రస్తుతం. సైన్సు తెచ్చిపెట్టిన టెక్నాలజీలతొ జీవితాన్ని అనుభవించడం… మూల ప్రకృతిని వదిలేసి కేవలం వినియోగ మనస్తత్వంతో ఎగిరెగిరి పడడం… మొదలవుతున్న కాలమది. దాని విపరిణామాలు ఇప్పుడు ప్రతీ ఇంటా కనిపిస్తున్నాయి.

సైన్సు మౌలిక లక్ష్యం ఏమిటి? నాకు అర్ధమైనంత వరకూ… మానవుడికి కలిగిన సందేహాలకు ప్రకృతి లోనుంచి సమాధానాలు వెతకడం, వాటి ఆధారంగా మనిషి తన జీవితాన్ని మరింత మెరుగ్గా మలచుకోడం. కాసేపు భారతీయ శాస్త్ర జ్ఞానం, కార్యాచరణ వంతి విషయాలను పక్కన పెడదాం. ఆధునిక శాస్త్ర జ్ఞానం పాశ్చాత్య ప్రపంచంలో 18వ శతాబ్దంలో మొదలైందనుకుందాం. ఈ 200 పైబడిన యేళ్ళలో కనుగొన్న సత్యాలూ… వాటి ఆధారంగా చేసిన ఆవిష్కరణలూ ప్రపంచాన్ని ఎక్కడికో తీసుకుపోయాయి. నిజమే. కానీ… నిశితంగా గమనిస్తే జరుగుతున్నది ఏమిటి?

సహజావరణం నుంచి బైటపడిన మనిషి కొద్దికొద్దిగా వైజ్ఞానిక విషయాలు గ్రహిస్తున్న కొద్దీ జీవితాన్ని సుఖప్రదం చేసుకునే అవసరాల కోసం వాటిని వాడుకుంటూ వచ్చాడు. మౌలిక అవసరాలు తీరిన తర్వాత కూడా ఆ సైన్సునుంచి మరెంతో సాధించవచ్చంటూ విలాసాలపై దృష్టి సారించాడు, సరే అదీ సహనీయమే.

చిత్రమేమంటే ఆ టెక్నాలజీ సాయం సౌకర్యాలకూ విలాసాలకూ అలవాటై అక్కడితో ఆగలేదు. మనిషి ప్రవర్తననే మార్చిపడేసింది. అంతవరకూ మనం అన్న భావనలో ఉన్న మనిషి ఆ తర్వాత నుంచీ నేను, నేను మాత్రమే అన్న భావనలోకి పడిపోయాడు, ఒక్క మన దేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా అలాగే ఉంది.

ఈ మధ్య బాగా పాపులర్ అయిన జోకు ఒకటుంది. ఓ కుటుంబంలోని శాల్తీలు… ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్ అంటూ ఉంటారు. ఆ కుటుంబ పోషకుడు “ఐ పెయిడ్” అంటూ తల పట్టుక్కూచుంటాడు. తల్లి తండ్రుల కంటె ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లే పిల్లల ప్రాధాన్యతలుగా మారిపోతున్న పరిస్థితికి వ్యంగ్య దర్పణం అది.

సైన్సు కనుగొన్న విషయాలు ఎంత గొప్పవి అయినా సరే… వాటి ఆధారంగా టెక్నాలజీ కనుగొన్న పరికరాలు మానవాళికి చేస్తున్న నష్టంతో పోలిస్తే… అలాంటి సైన్సు మనకి అవసరమా అనిపిస్తాయి. అవి జీవితాన్ని వేగవంతం చేస్తున్న తీరు భయానకం.

ఆధునిక పరికరాల చుట్టూనే మనిషి పరుగులు. అవి కావాలి కానీ వాటి దుష్పరిణామాలు (తెలిస్తే) మాత్రం వద్దు.

కాళ్ళకు మట్టి అంటకూడదు, కాబట్టీ ఇల్లంతా సిమెంట్ గచ్చు చేయించాల్సిందే. మొక్కలుంటే దోమలొస్తాయ్. కాబట్టి నాటొద్దు. పైగా దోమలని చంపడానికి ఎలెక్ట్రిక్ బ్యాట్లుండాల్సిందే. వేసవిలో ఎండనీ, శీతాకాలంలో చలినీ భరించలేం. ఇంటికి ఏసీ పెట్టించాల్సిందే. వర్షాకాలంలో వానలు చిరాకు, చీదర. తడవకుండా ప్రయాణించాలంటే కారుండాల్సిందే. సెల్ ఫోన్ కావాలి. కానీ రేడియేషన్ వస్తుంది కాబట్టి సెల్ టవర్ నా ఇంటి మీద వద్దు. విద్యుత్తు నిరంతరంగా కావాలి కానీ సంప్రదాయ వనరుల స్థానే పరమాణు విద్యుత్ వద్దు. దాని ప్రమాదాలను నివారించలేం కదా. (పైగా మన దేశంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా భోపాల్ ఉండనే ఉందిగా.) కష్టపడి చేసే కళా రూపాలు చూడను. సాంకేతికత ఘనంగా ఉంటే చాలు… తెరపై చూపించే బూతు సినిమాలే ముద్దు, బియ్యం ధర 5 రూపాయలు పెరిగితే వ్యవస్థని నానా తిట్లూ తిట్టాల్సిందే. కొత్త మోడల్ ఫోన్ ఎంత ఖర్చయినా పర్వాలేదు… కొనేయాల్సిందే. అప్లికేషన్స్ ఏమున్నాయి? ఇంట్లో కంప్యూటరూ దానికి ఇంటర్నెట్టూ ఉండాల్సిందే. సినిమా రిలీజ్ అవగానే డౌన్‌లోడ్ చేసేసుకోవాలి కదా.

ఈ మధ్య మన దేశంలో పరిశోధనలు తగ్గిపోయాయంటూ ప్రధానమంత్రి సహా అందరూ గగ్గోలు పెడుతున్నారు, అసలు ప్రపంచమంతా ఈ విషయంలో మనని ఆదర్శంగా తీసుకుంటే బాగు. కేవలం కోర్ సైన్స్‌ల్లో తప్ప మిగతా రంగాల్లో ఇంతింత పరిశోధనల అవసరం ఏముందో నాకైతే అర్ధం కాదు.

చిన చేపను పెద చేపా… చిన మాయను పెను మాయా మింగేస్తున్నట్టూ సైన్సుని టెక్నాలజీ ఎంతగా డామినేట్ చేసేస్తోందో. కంప్యూటర్ల వినియోగం ఇంత విస్తృతంగా ఉండాల్సిన అవసరం ఏంటి? రోబోటిక్స్, కోర్ సైన్సెస్‌లో తప్ప మిగతా రంగాల్లో కంప్యూటర్ల వినియోగం దేనికి? ఎకౌంటింగ్ అవసరాలకీ సాఫ్ట్‌వేర్‌లే. కస్టమర్ కేర్‌కీ కంప్యూటర్‌లే. ఎందుకింత టెక్నాలజీ.

ఇంత టెక్నలాజికల్ అభివృద్ధి సాధించాక మన దేశంలో ముప్ఫై యేళ్ళ వాళ్ళ నుంచి అమెరికా లో ఐదేళ్ళ పిల్లల వరకూ అందరికీ మానసిక వ్యాధులే. ఎందుచేత? మనుషులతో సంబంధాలు వదిలేసుకుని యంత్రాలూ సాంకేతికతల మీదనే అధారపడిపోతున్నాం. అమ్మమ్మ పేరు తెలీదు కానీ కొత్త వీడియో గేంలో విలన్ పేరు తప్పకుండా తెలుస్తుంది. అదేదీ జపాన్ బొమ్మా… కొన్నాళ్ళా క్రితం తెగ హిట్ ఐపోయిన గేం…. గుడ్డు పొదిగించి పిల్లని చేసి బాగా ఆదరిస్తేనే పెరిగే కంప్యూటర్ కోడిపిల్ల ఆట… గుర్తుందా. మానవ సంబంధాల కోసం తపించిపోతున్న పసి మనసులకు నిదర్శనం. తర్వాత ఏమయింది? ఆ గేం పాతబడిపోయింది. మరిన్ని కొత్త కార్ రేసులూ మరింత వయొలెంట్ ఆయుధాలతో కాల్చుకునే గేములూ… ఇప్పుడా పిల్లలూ ముదిరిపోయారు. అడిగింది ఇవ్వకపోతే అమ్మయినా నాన్నయినా కాల్చేయడమే. ఇంత విపరీతాలకు మూలమేది?

తప్పు సైన్సుది కాదు… టెక్నాలజీది కాదు… అంటారా? 90 శాతం జనాభాకి స్వీయ విచక్షణ లేనప్పుడు… మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయగల సైన్సు ఏం చేయాలి? స్వీయ నియంత్రణ పాటించాల్సిన పని లేదా? టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తే వాటిని వాణిజ్య దృక్పధంతో క్షణాల్లో వ్యాపార వస్తువు చేసేయగల ఈ ప్రపంచంలో ఆ జాగ్రత్తలు తీసుకోవలసినది సైంటిస్టుల్లాంటి బుద్ధి జీవులే అని చిన్న ఆశ.

Advertisements

2 Comments (+add yours?)

 1. Sarath "kaalam'
  Feb 28, 2012 @ 23:00:06

  మారుతున్న కాలలో ఇమడలేకపోతున్నామా అనిపిస్తుంటుంది. ఏ టెక్నాలజీ అనుభవించని చిన్నప్పటి రోజులే బాగనిపిస్తున్నాయి. అందుకే బ్యాక్ టు బేసిక్స్ కి రిటైర్మెంటులో నయినా వెళ్ళాలని ఆశ.

  Reply

 2. Phaneendra
  Feb 29, 2012 @ 14:50:35

  శరత్ గారూ…
  ఆశించడం తప్ప ఏం చేయలేమేమో మనం. 😦

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: