రామాయణం రాయడానికి వాల్మీకికి మూలం ఎవడు?

ఈమాట నవంబర్ సంచికలో ఏ కే రామానుజన్ గారి వ్యాసానికి కొలిచాల సురేశ్ గారి అనువాదం ( చాలా ఆలస్యంగా ) చదివాక నాక్కొన్ని సందేహాలు కలిగాయి. ప్రధాన సందేహం.. రామాయణానికి మూల రచయిత వాల్మీకి కాదనడానికి ఆధారం ఏమిటి అని. ఇతర రామాయణాల్లో కొన్ని ఘట్టాల్లో ఆయా కవి రచయితలు చేసిన స్వతంత్ర కల్పనల ఆధారంగా వేటికవే స్వతంత్ర రచనలు తప్ప వాల్మీకి గొప్పదనమేమీ లేదు అని నిరూపించడానికి కష్టపడవలసిన పని ఏమిటో అర్ధం కాలేదు. ( నవ్వకండి, సీరియస్‌గానే ) నా సందేహాల గురించి ఆ వ్యాస అనువాదకుడినే అడిగాను. అయితే… వాటికి మరి ఎవరయినా జవాబులు చెప్పగలరన్న ఆసక్తితో ఆ ప్రశ్నలను నా బ్లాగులో ప్రచురిస్తున్నాను, విజ్ఞులయిన పండితులు నా సందేహాలను తీర్చగలరని మనవి.

ఈ వ్యాసాన్ని చదవడానికి లింక్ ఇక్కడ

http://www.eemaata.com/em/issues/201111/1868.html

*** *** ***

సురేష్ గారూ…

మూల వ్యాసం చదవలేదు కానీ… స్వచ్చందంగా అనువదించిన మీరు ఆ రచయిత భావాలను ఆమోదిస్తున్నారని భావించి… నా సందేహాలు మిమ్మల్నే అడుగుతున్నాను. ఆలస్యంగా చదివి మరింత ఆలస్యంగా సందేహాలు అడుగుతున్నందుకు క్షమించగలరు.

ఒకటికి రెండు సార్లు చదవడానికి ప్రింట్ తీసుకుంటే మీ రచన 20 పుటలు వచ్చింది. దానిలో 3 పుటలు హనుమ పిట్ట కథ, 7 పుటలు వాల్మీకి ( మూలం అనకూడదు కదా మీ భావాన్ని బట్టి ), కంబ రామాయణాల్లో నుంచి ఒక ఘట్టపు వేర్వేరు చిత్రీకరణలు. మరో రెండు పుటలు వైదిక ధర్మాన్ని వ్యతిరేకించే జైనులు రాసుకున్న రామాయణాల ఉటంకింపులు, ఇంకో రెండు పుటలు కన్నడ జానపద కథ, తర్వాతి రెందు పుటల్లో థాయ్ రామాయణాల స్థూల పరిశీలన, చివరికి ఆయా రామాయణాల్లోని భేద సామ్యాలు.

అంతా బాగానే ఉంది. వాల్మీకి కథే మూల కథ కాదు అన్న విషయం ముందు ముందు గమనిస్తాం అని చెప్పారు కానీ… అనంతర వ్యాసంలో అలాంటి ప్రయత్నం ఎక్కడా కనబడలేదు.

వాల్మీకి రాసిన కథకూ, ఆయన తర్వాత రాసిన వారి కథలకూ మధ్య భేదాలున్నాయి అన్నారు. మూలం వాల్మీకి కాకపోతే ఆయనకు ముందు రాసిన కథనాలూ ఉండాలి కదా. ఇప్పటి వరకూ అలాంటివి ఎక్కడయినా దొరికాయా? వాటి రచయితలు ఎవరు? ఆయా రచనలకూ వాల్మీకానికీ ఉన్న భేదాలు ఏమిటి? అలాంటివి ఏమీ లేనపుడు వాల్మీకాన్ని మూల కథ కాదు అని అనడానికి ప్రాతిపదిక ఏమిటి?

నాకు తెలిసినంత వరకూ… దశరథ తనయుడు రాముడు జనక దుహిత సీతను పెండ్లాడడం, సవతి తల్లికి తండ్రి ఇచ్చిన వరం మేరకు అరణ్యాలకు వెళ్ళడం, అక్కడ సీతను రావణుడు అపహరించడం, వానర ( జాతి ) సాయంతో రాముడు యుద్ధం చేయడం, సీత అగ్నిప్రవేశం, రామ పట్టాభిషేకం…. మౌలికంగా ఇదీ రామాయణం, అంతేనా !

కంబన్, తులసీదాస్ తదితరులందరూ వాల్మీకి తరువాతి వారే అనడానికి మీకు ఏ అభ్యంతరమూ లేదని అర్ధమయింది. వారందరూ తమ తమ ప్రాంతీయ వాతావరణాలను బట్టి, స్థానిక ఆచార సంప్రదాయాలను బట్టి రామ కథలో మార్పు చేర్పులు చేశారు. మీరు ఉటంకించిన సందర్భాలు అలాంటివే కదా. అయితే మౌలికమయిన కథను వారు అతిక్రమించి వెళ్ళిన దాఖలాలు లేవే? భూమ్మీద ఉన్నంత కాలం మానవుడిగానే ప్రవర్తించినట్టు వాల్మీకి చిత్రించిన రాముడిని ఆయన గుణగణాలు ఆదర్శప్రాయమైనవిగా భావించి దైవాన్ని చేశాదు కంబన్ అని చెబుతున్నారు. తులసీ కూడా అలాగే చేశాడన్నారు. కానీ వారిద్దరూ వాల్మీకిని సైతం ( కవిగానయినా ) ఆరాధించిన వారే కదా. అంటే వారికి వాల్మీకమే మాతృక కాగలదు కదా. ఏమంటారు?

అన్నట్టు కంబ రామాయణానికి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారి తెలుగు అనువాద పద్యాలను ఉటంకించారు కదా. మీ సిద్ధాంతం ప్రకారం పూతలపట్టు వారి రచన స్వతంత్రం తప్ప కంబన్‌కి అనువాదం కాకూడదేమో!

జైన కథనాల విషయానికి వస్తే… వైదిక ధర్మాన్ని నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చిన జైనావలంబులు.. పరమ వైదికుడయిన వాల్మీకి కథను తమకు తగినట్టు మలచుకోడంలో విశేషం ఏముంది? అసలు వారు రామ కథను స్వీకరించడమే విశేషం. ఆ పని వారు చేయడానికి కారణం… అప్పటికే సమాజంలో విస్తృతాదరణ పొందిన గాధను వదులుకోలేకపోడమే అయి ఉండవచ్చని నా భావన. మీరేమంటారు?

ఇక జానపదుల పల్లీయుల మౌఖిక కథలు. అవీ సౌందర్యాలూ, రసపూరితాలూనూ. సీతమ్మకు అమిత ప్రాధాన్యతనివ్వడం అద్భుతం. కానీ అక్కడ కూడా వాల్మీకాన్ని అతిక్రమించిన ఘట్టం ఏదీ మీరు చూపలేదు. రవళుడి వృత్తాంతం ఆసక్తికరమే కానీ అది అసలు కథకు అనుబంధంగానే ఉంది తప్ప వ్యతిరిక్తంగా లేదు కదా.

థాయ్ రామాయణాల విషయంలోనూ అసలు కథకు చేర్చిన పిట్ట కథలనే చూపారు, దానికి చిన్న చిన్న మార్పులు చేసుకోడాన్నే ప్రస్తావించారు. అవి మూల కథకు భిన్నాలు ఎలా అవుతాయో చూపలేదు.

ఒక కథను ఒక రచయిత రాసిన తరువాత మరో రచయిత రాసేటప్పుడు కొత్త కల్పనలు చేస్తే… అది స్వతంత్ర రచన అయిపోతుందా? కథ ఎత్తుగడ దృశ్యాలు మారిస్తే రచన స్వతంత్రం అయిపోతుందా?

ఉత్తర రామాయణం వాల్మీకం కాదని సాధారణ భావన. పలు రామాయణాలు దాన్ని విస్తృతంగా రాసినా అవేవీ వాల్మీకాన్ని కాదనలేదు కదా. ఏదేమైనా పాత్రల ప్రవర్తన, కథా చిత్రణ గమనిస్తే ఉత్తర కథ వాల్మీకానికి భిన్నంగా ఉంటుందన్న మాట నిజమే.

వివిధ రామాయణాల పరిచయం చేసిన ఏ సందర్భంలోనూ మూలం వాల్మీకం కాదూ అని సహేతుకంగా నిరూపించలేకపోయిన మీరు… వడ్రంగి రంపం ఉదాహరణతో ముగించడం… రామాయణాన్ని అపహాస్యం చేయదలచుకోడమే. ఏ రెండు రామాయణాల్లోనూ ఒకే కథ లేదు అని చెప్పడానికి… ఆయా రచయితలు చేసిన చిన్న మార్పులను చూపిస్తే సరిపోతుందా? మూల కథను మార్చిన సందర్భాలు ఒక్కటయినా ప్రస్తావించకుండా… వాల్మీకం మూలం కాదనడం ఎంత అహంభావం? ( తల పొగరు అన్న అర్థంలో )

*** *** ***

ఈ వ్యాసాన్ని చరిత్ర పాఠ్యాంశంగా ఉంచి, వివాదాల అనంతరం తొలగించిందట ఢిల్లీ విశ్వవిద్యాలయం. దాని పూర్వాపరాల గురించి తెలీదు కానీ లెఫ్టిస్టు రైటిస్టు చరిత్రకారుల అభిప్రాయ భేదాలే కారణం అయి ఉంటాయని అనుకుంటున్నా. అయితే.. సాధారణ స్థాయి దాటని ఈ రచనను పాఠ్యాంశంగా ఉంచాల్సిన పనేమిటబ్బా అని ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. అదింకో సందేహం, 🙂

Advertisements

12 Comments (+add yours?)

 1. డా. పూర్ణప్రజ్ఞాభారతి
  Feb 19, 2012 @ 20:43:13

  వాల్మీకి తన రామాయణం ఆరంభంలోనే పురుషోత్తముని కథను నారదముని ద్వారా తెలుసుకుని దాన్ని గ్రంథస్థం చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. కాబట్టి అప్పటిదాకా రామాయణ గాథ మౌఖికమే అని తెలుస్తున్నది. కారణం సంస్కృతంలో ఏ ఇద్దరు కవులు కూడా ఒకే ఇతివృత్తాన్ని కావ్యంగా మలిచిన దాఖలాలు పెద్దగా లేవు. పైగా వాల్మీకీ అనంతర కవులు చాలామంది వాల్మీకే రామాయణ కర్తగా చెప్పుకొచ్చారు. కాబట్టి వాల్మీకి రాసిందే మూలం. మిగిలిన భారతీయ రామాయణాలు అన్నీ వాల్మీకిని అనుసరించినవే. ఆయా కవులే తమ కావ్యాల ఆరంభాలలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక జైన రామాయణ విషయానికి వస్తే జైన రామాయణమన్నది లేనే లేదు. వ్యాకరణవేత్తగా ప్రసిద్ధుడైన హేమచంద్రుడు త్రిషష్టిశలాక పురుష చరిత్ర అనే జైనేతిహాస కావ్యాన్ని రాశాడు. అందులో రామాయణ కథ ఏడవ పర్వం. అది రాముని కథ కనుక జైన రామాయణం అంటున్నాం. అంతేకాని అదో ప్రత్యేక కావ్యం కాదు. కాబట్టి అన్ని రామాయణాలకు మూలం వాల్మీకి కావ్యమే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం.

  Reply

  • Phaneendra
   Feb 20, 2012 @ 12:55:24

   భారతి గారూ…
   వాల్మీకికి నారదుడు ( బ్రహ్మ ఆదేశం మేరకు? ) రామాయణ గాథ చెప్పాడంటే దానర్థం అంతకు ముందు రాముడి జీవితం కథగా ప్రాచుర్యంలో ఉన్నట్టు అర్థం కాదేమో కదా. రామ రాజ్యం లోని ప్రజలకు రాముడి కథ తెలిసినా దాన్ని మౌఖిక ప్రచారంలో ఉన్న కథ అని భావించలేమేమో. గమనించగలరు. జైన రామాయణం విషయం నాకు కొత్తది. ధన్యవాదాలు.

   Reply

 2. తాడిగడప శ్యామలరావు
  Feb 20, 2012 @ 09:40:11

  భారతీయ తాత్విక చింతనను, దార్శనికదృక్పథాన్ని, ఆధ్యాత్మకవారసత్వాన్ని, సాంపర్దాయిక సాహిత్యాన్ని అవహేళనచేయటానికో, తక్కువగాచేసిచూపటానికో, తిరస్కరించి పారెయ్యటానికో, దూషించటానికో మరేదయినా యిటువంటి దుర్భావనలతో సమకూర్చబడిన గ్రంధాలూ, వ్యాసాలు వగైరాలను పిల్లల మనస్సులలో చొప్పించటానికి జరిగే ప్రయత్నాలను హర్షించటానికీ, ప్రోత్సహించటానికి మన దేశంలోని మేథావివర్గం అనబడే విచిత్రజీవసమూహం సర్వదా సిధ్ధంగా ఉంటుంది. అది ఆర్షజీవనవిధానుల భావోద్వేగాలను దెబ్బతీయటం అనే మహత్తర కార్యక్రమం కాబట్టి వారికి అతిప్రియమైన కార్యక్రమం. కాని ఇతర మతజీవనవిధానులు భావోద్వేగాలను దెబ్బతీయటం అనే దుష్చేష్టకు వారు యెన్నడూ పూనుకోరు, అట్లాంటివాటిని యెట్టిపరిస్థితులలోనూ సమర్థించరు. పైగా అలా పొరపాటున యెవరివల్లనైనా తర మతజీవనవిధానుల భావోద్వేగాలను దెబ్బతినటం అనేది జరిగితే మహాపచారం జరిగిందని చిందులు వేస్తారు. ఈ కుహనా మేథావివర్గం కోరిక అల్లా ఆర్షజీవనవిధానాన్ని వ్యతిరేకించటంవలన విదేశాల, విమతుల మన్ననలు పొంది కీర్తి సంపాదించుకోవటమే!

  అందుచేత పొరబాటునో గ్రహపాటునో ఒక మేథావివర్గపు కుట్రవల్లనో రామాయణాన్ని తత్కర్తృత్వాన్ని వివాదంచేసే వ్యాసం పాఠ్యగ్రంథంలో చేరితే సంతోషించిన వీరు – అదికాస్తా తొలగించబడే సరికి గంగవెఱ్ఱులెత్తిపోతున్నారు. ఆశ్చర్యం యేమీ లేదు.

  Reply

  • Phaneendra
   Feb 20, 2012 @ 13:01:50

   శ్యామలరావు గారూ…
   మీరన్నది అక్షర సత్యం. దుర్మతుల, కుహనా మేధావుల దుష్ప్రచారం నుంచి ఆర్ష భారతిని కాపాడుకోడమూ, వాస్తవ చరిత్రను ప్రచారంలోకి తేవడమూ అత్యంత కష్టసాధ్యమవుతోంది. ఏదేమయినా ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం కావలసిన అవసరం ఎంతయినా ఉంది. ప్రత్యేకించి, విదేశీ శంఖంలో పోస్తే తప్ప దేన్నీ తీర్థంగా భావించని “ఆధ్హునిక” భారతీయులను ఒప్పించాలంటే… విదేశీయులను ఇలాంటి దుష్ప్రచారాలు విశ్వసించకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయాలి. ధన్యవాదాలు.

   Reply

 3. తాడిగడప శ్యామలరావు
  Feb 20, 2012 @ 13:18:11

  భారతీయ ఆర్ష పురాణేతిహాసాలమీదా తాత్వికచింతనమీదా దాడి జరగటం అన్నది కొత్తగా పుట్టుకు వచ్చిన ఉపద్రవం యేమీ కాదు. ఇది బహుకాలంగా ఉన్నదే.

  జైనుల రామకథాకథనం ప్రసక్తి వచ్చింది కాబట్టి, భారతం విషయంకూడా పరిశీలిద్దాము. పావులూరి మల్లన అనే జైనకవి మహాభారతకథను ఆధారంచేసుకొని దానిని జైనీకరణంచేస్తూ ఒక కన్నడ భాషలో కావ్యం వ్రాసాడు. దాని పేరు నాకు యిప్పిడు గుర్తుకు రావటం లేదు – క్షమించండి. ఆ పుస్తకంలో పాండవులంతా జైనులు, మహాశ్వేత అనే జైన దేవత భక్తులు. అప్పుటికింకా తెలుగు, కన్నడభాషలు జమిలిగానడుస్తునే ఉన్నాయి. తెలుగువారికి కన్నడమూ, కన్నడిగులకు తెలుగూ బాగానే వచ్చిన రోజులు. ఈ జైనగ్రంధం ప్రభావం తెలుగువారిమీద పడుతుందని వైదికజ్ఞానాభిమాని అయిన రాజు రాజరాజనరేంద్రుడు కలవరపడ్డాడట. అదికూడా శ్రీమన్మహాభారతాన్ని ఆంధ్రీకరింపజేయడానికి ఆయన నన్నయభట్టారకుని వేడుకొనటానికి ఒక కారణంగా చెబుతారు.

  పళ్ళున్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయని సామెత. అలాగే జీవనఫలప్రసాదిని యైన ఆర్షజ్ఞానభాండాగారంపైనే కుమతుల దాడి జరుగుతున్నది.

  Reply

 4. M.V.Ramanarao
  Feb 20, 2012 @ 18:53:10

  ఓం నమశ్శివాయ-ఆర్యులారా,మీకీ సందేహం ఎందుకు వచ్చిందో తెలియదు.ఖురాను,బైబిలు దేవుడే వచించాడని ఆ మతస్థులు నమ్ముతారు.మన రామాయణం బ్రహ్మ ఆదేశం ప్రకారం వాల్మీకి మహర్షి రచించాడని ఉన్నది.అంతకు ముందే నారద మహర్షి వాల్మీకికి సంగ్రహంగా రామాయణ గాథ తెలియ జేసి వెళ్ళుతాడు.ఒక దినము క్రౌంచ పక్షుల మిథునంలో ఒకదానిని వేటగాడు బాణంతో కొట్టగా చూసి చలించి ‘మానిషాద ‘ అనే శ్లోకం వాల్మీకి నోట అప్రయత్నం గా వెలువడుతుంది.ఆ ఛందస్సు లోనే మహర్షి రామాయణాన్ని రచించాడట.సంగ్రహంగా తెలిసిన కథను బ్రహ్మదేవుని అనుగ్రహం వలన వివరంగా దర్శించి వ్రాశాదు.రామాయణం ఆదికావ్యమని ,వాల్మీకి ఆది కవి అని భారతీయ సంప్రదాయం.రామాయణాన్ని సంస్కృత శ్లోకాలు,వాటికి పండితుల తెలుగు వ్యాఖ్యలు,అర్థాలతో చదివి ఇది రాస్తున్నాను.తరవాత ఎందరో ఎన్నో భాషలలో వ్రాశారు కాని అవి ప్రామాణికం కావు.వాల్మీకి రామాయణమే ప్రామాణికం.
  మరొకవిషయం ,భారతీయులు ప్రాచీన కాలమునుంచి ఆగ్నేయ ఆసియా దేశాల్లో రాజ్యాలు స్థాపించ బట్టి కొన్ని మార్పులతో ఇప్పటికీ రామాయణం అక్కడ ప్రచారంలో ఉంది.జైనులు సహజంగానే రామాయణాన్ని వక్రీకరించి (distort) చేసి రాసారు.ఇంక ఆధునికుల్లో రామాయణమన్నా,హిందూ మతమన్నా ,భారతీయ సంస్కృతి అన్నా ద్వేషించే వారు కొందరు దూషిస్తూ వారికి ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉన్నారు.దేన్ని ఆమోదించాలి అన్న విషయం మీ విచక్షణకు ,విజ్ఞతకు వదలిపెట్టుతున్నాను.
  మరొక్కమాట.మన దేశంలోనే గాక ఇతరదేశాల్లో కూడా ప్రాచీన కాలంలో కావ్యాలు మౌఖికంగానే ప్రచారమౌతూ ఉండేవి.తర్వాతి కాలంలో గ్రంథస్తం అయేవి. మొట్టమొదట వాల్మీకి రామాయణాన్ని లవకుశుల చేత గానం చేయించాడట.రామకథను ఆరు కాండలుగా రచించి తర్వాత ఉత్తరకాండ రచించేడని ఉపోద్ఘాతంలోనే ఉన్నది.అందువలన ఉత్తరకాండ ప్రక్షిప్తం అని వాడుక వచ్చింది. ఆరుద్ర ఈ విషయాలన్నీ సమగ్రంగా చర్చించారు.

  Reply

  • Phaneendra
   Feb 20, 2012 @ 19:24:54

   రమణారావు గారూ…
   రామాయణమే ఆది కావ్యం. వాల్మీకియే ఆది కవి. ఆ విషయాన్ని నిరూపణకు అడిగే వారు మిగతా మతాల వారిని అడిగే ధైర్యం చేయలేరన్న మాట అక్షరసత్యం.

   Reply

 5. kiran
  Feb 21, 2012 @ 03:34:02

  ఇప్పుడు వాల్మీకి గారి కాపీ రైట్ ల మీద లొళ్ళి ఎందుకు.. కనీ, రాముడు సీతను నిప్పుల్లో దూకి పాతివ్రత్యం నిరూపించుకోమంటాడా ? లేక సీతే రాముడు అనుమానించాడని దూకుతుందా..

  నీకోసం కాదు.. నా పౌరుషాన్ని నిరూపించుకోడానికి యుద్ధం చేశాను అంటాడు రాముడు సీతతో.. అని చదివాను.. ఇది కూడా ఆ మ.భా. నే అన్నాడా ?

  ఎవరైన వాల్మీకి గారిని అడిగి చెప్తారా ? 😉 ..

  Reply

 6. kiran
  Feb 21, 2012 @ 03:36:49

  వేదాలు ఎవరు వ్రాశారు.. ఉపనిషత్ లు ఎవరు వ్యాఖ్యానించారు.. ?

  Reply

 7. Phaneendra
  Feb 21, 2012 @ 12:40:43

  కిరణ్ గారూ…

  నేనే నాకు అర్ధం కాని విషయాల మీద సందేహాలు అడుగుతున్నాను. మీరు ప్రశ్నకు ప్రశ్నే బదులు అన్న రీతిలో రెచ్చిపోతే ఎలా?

  వాల్మీకి కాపీరైట్‌ల మీద లొల్లి చేస్తున్నది ఎర్ర కళ్ళ బాబులూ, వారి తొవ్వన పోతున్న మహానుభావులే.

  అగ్నిప్రవేశ ఘట్టం మళ్ళీ చదివితే కానీ మీ ప్రశ్నలకు జవాబివ్వలేను.

  సీతతో “నా పౌరుషాన్ని నిరూపించుకోడానికే యుద్ధం చేశాను” అని అన్న మాట… నాకు గుర్తున్నంత వరకూ కరెక్టే. సీత మంచి కోసం లక్ష్మణుడూ, తానూ చెప్పిన మాటలు వినలేదన్న ఉక్రోషం… అన్నాళ్ళ వియోగం తర్వాత ఆమెను తొలిసారి కలిసినప్పుడు దాచుకోలేని రాముడు చాలానే పొడుపు మాటలాడాడు. వాటిలో ఇదీ ఒకటి.

  ఇక ఆ “మ.భా.” శీలాన్ని పరీక్షించడం మీరు కానియ్యండి.

  ముందు రామాయణం సంగతి తేలనియ్యండి. వాల్మీకి రాశాడని ఈ జాతి తరతరాలుగా భావిస్తున్న విషయం మీదనే “లొల్లి” చేస్తున్న పెద్దలు… దానికి లక్షల (దీన్ని ఒప్పుకోరుగా రొమిల్లా థాపర్ ప్రభృతులు) యేళ్ళు ముందరివీ… అపౌరుషేయాలూ, స్వయం ప్రకాశాలూ అని భావించే (“విశ్వసించే” కాదు) వేదాల, ఉపనిషత్తుల సంగతి తర్వాత తేలుద్దురు గాని.

  ధన్యవాదాలు.

  Reply

 8. తెలుగు భావాలు
  Feb 26, 2012 @ 17:43:34

  ఇటువంటి సందేహాలను తీర్చడానికి, 1945 నుండి శ్రీమద్రామాయణాన్ని ప్రచారం చేస్తున్న ‘పౌరాణిక సార్వభౌమ’ బిరుదాంకిత శ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు రచించిన ‘శ్రీ రామాయణ రహస్య దర్శిని’ పుస్తకాన్ని ప్రచురించారు.
  .
  ఆస్వాదించిన ప్రతి సారీ “అరే క్రితంసారి ఇలా ఉన్నట్టు ఙ్ఞప్తికి లేదే!” అనే భావన ఇప్పటికీ కలుగుతూనే ఉంటుంది. ‘ఆది గ్రంథం’ అని పిలువబడే వాల్మీకి విరచిత రామాయణ గొప్పతనం అది. నావద్ద వాల్మీకం, ఆధ్యాత్మికం (శివుడు పార్వతికి చెప్పినది) రెండూ ఉన్నాయి. హనుమద్ రామాయణం కోసం వెదుకుతున్నాను.
  .
  ఇటువంటి వాటిని రెండు పద్ధతులలో చదవొచ్చు. Harry Potter కథలా, లేకపోతే పూర్తి విశ్వాసంతో ఇతిహాసం అని నమ్మి. కథలాగా చదివినపుడు, సవా లక్ష అనుమానాలు కలుగుతాయి. నమ్మి ఇతిహాసంలా చదివితే, అటువంటి చొప్పదంటు ప్రశ్నలు తలెత్తవు; తలెత్తినా – ఇట్టే సమాధానాలూ దొరుకుతాయి.
  .
  నేను మా తండ్రిగారిని “నాన్నా” అని మొదటిసారి ఎప్పుడు పిలిచానో తెలిస్తే సంతోషిస్తాను. తెలియకపొతే, పెద్దగా నష్టమేమీ లేదు. నా దృష్టిలో ఈ టాపిక్కూ అంతే!
  .
  యది క్షుణ్ణం పూర్వైరితి జహతి రామస్య చరితమ్ |
  గుణైరేతావబ్ధిః జగతి పునరస్యో జయతి కః ||
  స్వమాత్మానం తత్తద్గుణ గరిమ గంభీర మధుర |
  స్ఫుర ద్వాగ్బ్రహ్మాణః కథముప కరిష్యన్తి కవయః || (మురారి మహాకవి)

  Reply

  • Phaneendra
   Feb 26, 2012 @ 18:39:01

   తెలుగు భావాలు గారూ…
   మంచి విషయాలు పంచుకున్నందుకు సంతోషం.
   ఆధ్యాత్మ రామాయణాన్ని మా తాతగారు బ్రహ్మశ్రీ పురాణపణ్డ రామమూర్తి గారు తెనిగించారు. ఇక వాల్మీకం శిరోధార్యమే. మా పెదనాన్న గారు ఉషశ్రీ గారు వాల్మీకం ఆధారంగా రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చారు, వాటిని తితిదే వారు ప్రచురించారు.
   గురువులు మల్లాది వారి గ్రంథాన్ని నేను చదవలేదు. త్వరలో చదివే ప్రయత్నం చేస్తాను.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: