సొగసు జూడ తరమా…!

పురందరదాసుతో ప్రారంభమైన కర్ణాటక సంగీత గోదావరి త్యాగరాజ సీమను సోకిన తరువాతనే ఒడ్డులొరసి ప్రవహించే ఉత్తుంగ మహానది అయింది. తెర చాటున దాగిన సంగీతం సవినయంగా సగర్వంగా ప్రజల దరిని చేరినది త్యాగరాజస్వామి చలవే. సంగీతం శాస్త్రీయ ఫణితిని కోల్పోకుండానే రాగం – తానం – పల్లవుల పరిమితులను అధిగమింపజేసినదీ ఈ మహానుభావుడే. సంగీతాన్నీ సాహిత్యాన్నీ రెంటినీ సమకూర్చే విద్వత్తనే వాగ్గేయకారత్వం అంటాం. దక్షిణ భారత సంప్రదాయ సంగీతానికి అలాంటి వాగ్గేయకార పరంపరలో అగ్రగణ్యుడు త్యాగరాజు. ఆయన శైలి ద్రాక్షాపాకం. సంగీతాభిమానులకు శ్రవణామృతం.

కర్ణాటక సంగీత కచేరీలు ప్రస్తుత రూపం సంతరించుకున్నది 20వ శతాబ్దం ప్రథమార్థంలో. కచేరీలలో వర్ణాలు, కృతులు, పల్లవులు,, పదాలు, జావళులు ఆలపించడం సర్వ సాధారణం. వాటితోపాతు కచేరీలలో రాగాలాపన, నెరవులు, స్వరకల్పనలకూ చోటిచ్చే సంప్రదాయానికి తెర తీసినది త్యాగరాజు. 19వ శతాబ్దం ఆఖరి వరకూ కచేరీలు రాగం – తానం – పల్లవుల ఆలాపన చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి. తోడి, భైరవి, శంకరాభరణం వంటి రాగాలకే పరిమితమై ఉండేవి. వీటికి పూర్తిగా భిన్నమైనవి భజనలు. భక్తే పరమావధిగా సాగే ఆ భజనల్లో సాహిత్యానికే తప్ప సంగీతానికి ప్రాధాన్యత తక్కువ. 16వ శతాబ్దం నుంచీ పల్లవి – అనుపల్లవి – చరణం ఉండే విధానం అమల్లోకి వచ్చింది. సంగీత సాహిత్యాలకు సమ ప్రాధాన్యతనిచ్చే విధానానికి మెరుగులు దిద్దినది సంగీత త్రయమే. కృతుల ఆకృతిని సంగతుల సంగమంతో బలోపేతం చేసినది త్యాగయ్యే. సాధారణంగా మధ్యమ కళలో ఉండే ఆయన రచనలు ఆధునిక సంగీత కచేరీల పద్ధతికి అతికినట్టు సరిపోతాయి. ఆయన కృతులు దాదాపు 60శాతం మధ్యమ కళలోనే ఉండి… పండితుల నుంచి పామరుల వరకూ అందరినీ రంజింపజేస్తాయి. పైగా ఈ కృతుల విస్తృతి చాలా ఎక్కువ. ఉంచ వృత్తి సమయంలో పాడే పాటలు సరళంగా ఉంటూ అందరినీ అతిత్వరగా ఆకట్టుకునేలా ఉంటే పంచరత్న కీర్తనలు బహుళ రాగతాళ మేళనలతో సంక్లిష్ట సంగీత పరికల్పనలతో పండిత జన రంజకంగా ఉంటాయి.

తనకు కొద్దికాలం ముందే వృద్ధి చెందిన కర్ణాటక సంగీత శాస్త్రాన్ని పరిపక్వ దశకు చేర్చిన ఘనత త్యాగయ్యదే. వెంకటాముఖి రచించిన చతుర్దండి ప్రకాశిక… 72 మేళకర్తల సమగ్ర విభజనతో పాటు 294 జన్య రాగాలకు లక్షణాలను నిర్దేశించింది. వాటన్నిటితోనూ త్యాగరాజు విస్తృతంగా ప్రయోగాలు చేసారు. స్వయంగా ఎన్నో రాగాలకు ప్రాణం పోశారు. ఆయన రాసిన వాటిలో లభ్యమైన 700కు పైబడిన కృతుల్లో 212 రాగాలను పొందుపరిచారు. అసలు ఒకే కృతిని 121 రాగాల్లో ఆలపించారు కూడా. కనీసం 66 రాగాల్లో మొదట కృతులను కూర్చినది త్యాగరాజే. ఆయన ఆఖరి కృతులుగా భావించే వాటిలోనూ వాగధీశ్వరి, గాన వారధి, మనోహరి అనే కొత్త రాగాలు మెరియడం గమనించవచ్చు. లక్షణాలు నిర్వచించడం వల్ల మాత్రమే ఉనికిలో ఉన్న పలు రాగాలకు కృతులు సమకూర్చి వాటిని అజరామరం చేసిన సంగీత మాంత్రికుడు త్యాగరాజు. ఒక సందర్భంలో ఒక కృతిని త్యాగయ్య దేవగాంధారంలో వరుసగా 6 రోజులు ఆలపించి, ఆ కృతితో పాటు రాగాన్నీ శ్రుతిపక్వం చేశారట. దాన్ని బట్టే ఆ వాగ్గేయకారుడి మనో ధర్మం ఎంతటి ఉచ్చస్థాయిదో అర్ధమవుతుంది.

త్యాగరాజుకు పూర్వం కొన్ని ప్రధాన రాగాలు మాత్రమే వ్యాప్తిలో ఉండేవి. ఆయన చేసిన ప్రయోగాల వల్ల నాటికి అంతగా ప్రాధాన్యత సంతరించుకోని రాగాల సొగసులనూ చవి చూడగల భాగ్యం సంగీత ప్రియులకు కలిగింది. ప్రధానంగా రామ ప్రియ, ధేనుక, కీరవాణి, చక్రవాకం వంటి మేళకర్త రాగాల్లో స్వామి అద్భుతమైన కృతులు కూర్చారు. చక్రవాకానికి తంజావూరు సంగతి అన్న పేరు వచ్చినది ఆ క్రమంలోనిదే. ఇంకా… నాగానందిని, ఝంకార ధ్వని, గాంగేయ భూషిణి, మానవతి, వాగధీశ్వరి వంటి వివాది మేళల్లోనూ రచనలు చేశారు,

త్యాగరాజుకు ముందు వరకూ రాగం ఆరోహణ, అవరోహణల్లో కనీసం 5 స్వరాలుండడం తప్పనిసరి. తాను ఆవిష్కరించిన రెండు రాగాల్లో ఆ సంఖ్యను మార్చారు, వివర్ధిని, నవరస కానడ అనే రాగాల్లో ఆరొహణలో 4 స్వరాలూ, అవరోహణలో 6 స్వరాలూ ఉంటాయి. ఆ స్ఫూర్తితోనే సన్నజాజుల రవళి బాలమురళి ఆరోహణ, అవరోహణలు రెంటిలోనూ నాలుగే స్వరాలుండే రాగాలు నిర్మించారు.

త్యాగరాజ స్వామి అద్భుత ప్రయోగాలు నేటికీ నిలవడానికి కారణం వాటి నిర్మాణ సౌష్టవాలు మాత్రమే కాదు, వాటికి బహుళ జనాదరణ కల్పించిన శిష్య పరంపర కూడా. వెంకట సుబ్బయ్యర్, శ్రీనివాస అయ్యంగార్, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి వారు సద్గురువుపై కృతులు రాసి ఆయన్ను అమరుణ్ణీ చేయదమే కాదు, ఆయన రీతులూ, ఫణితులకు ప్రచారం కల్పించారు. అందుకే త్యాగరాజు ప్రతిభ ఇతర సంగీత మార్గాలనూ ప్రబలంగా ఆకర్షించింది. హిందుస్తానీ కిరానా ఘరానాకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించి పెట్టిన ఉస్తాద్ కరీం ఖాన్… స్వామి ఖరహరప్రియలో కూర్చిన “రామ నీ సమానమెవరు” కృతి ఆలపించారు. స్వామి పూర్ణషడ్జంలో కూర్చిన “లావణ్య రామ” కృతి స్ఫూర్తితో విశ్వ కవి టాగోర్ “ఏ కి లాబణ్యె పూర్ణ ప్రాణ” అన్న బెంగాలీ మట్టు కట్టారు.

త్యాగరాజ కృతుల అపురూపత్వానికి కారణం… సంగీత సౌందర్య స్పృహతో కూడిన… విస్తృత ప్రయోగశీలతకు అనువైన… సృజనాత్మకత మిళితమైన… నిర్దుష్ట నిబంధనల పరిధిలో కూర్చిన కూర్పులే. ఓ స్వరకర్త సృజనాత్మకత అతడి స్వర సమ్మేళనంలో ప్రతిబింబిస్తుంది. ఓ గాయకుడి సృజనాత్మకత ఆ రాగాలాపనలోనూ స్వరకల్పనలోనూ వెల్లివిరుస్తుంది. ఆ రెండు లక్షణాలూ కలగలిసిన వాగ్గేయకారుడు కనుకనే త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతాన్ని అమృతతుల్యం చేయగలిగారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: