సద్గురు నుతి

ధనుర్మాసపు చిరు చలి గాలుల వేకువలోనుంచి ఓ కోయిల పంచమం పలికించే ప్రయత్నాలు చేస్తూంటుంది. పొగమంచు కింద గడ్డ కట్టిన కోనేటి నీటి దుప్పటి కప్పుకున్న స్వరాలు లయబద్ధంగా తాళాలు వేస్తూంటాయి. అదే సూచన త్యాగరాజ సంగీతారాధనా వసంతాగమనానికి. పుష్య బహుళ పంచమికి అటూ ఇటూ వింధ్య వాయువులన్నీ సరిగమపదనిలు పలుకుతూ ఉంటాయి. నాదోపాసకుడి ఘన పంచరత్నాలు తెలుగు తమిళ నాడులను పులకరింపజేస్తూంటాయి. ఈ సమయానికి తగు మాటలాడుకొమ్మని త్యాగరాజస్వామి వారి ఆనతి.

శివదత్తమైన భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక స్రవంతులు ప్రధాన స్రోతస్సులు. కర్ణాటక సంగీతానికి ఆద్యుడు పురందర దాసు అయితే… త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి. అపర సంగీత బ్రహ్మగా పేరు పొందిన త్యాగరాజ స్వామి లేని కర్ణాత సంగీతాన్ని ఊహించడమే అసాధ్యం. శారదాంబా స్తన యుగళమైన సంగీత సాహిత్యాల అమృత క్షీర ధారలను మాన్యులకూ సామాన్యులకూ సమంగా పంచిన వాగ్గేయకారుడు త్యాగరాజు. రామ భక్తి ప్రధానంగా సాగిన ఆయన కృతులు కర్ణాట సంగీతానికి శ్రుతిలయలు.

విద్యానగరంగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్య విధ్వంసంతో తెలుగు దేశం నుంచి తమిళ సీమకు ఎన్నో కుటుంబాలు తరలిపోయాయి. (నేటి కర్నూలు జిల్లా) కాకర్ల నుంచి తంజావూరు సమీపంలోని తిరువారూరుకు తరలిపోయిన ఓ బ్రాహ్మణ దంపతులు రామబ్రహ్మం, సీతమ్మ అలాంటివారే. వారికి 1767లో జన్మించిన తృతీయ సంతానానికి స్థానిక శివాలయంలో దైవమైన త్యాగరాజస్వామి పేరు పెట్టుకున్నారు. ఆ చిన్నారి జననం అనంతరం రామబ్రహ్మం కుటుంబం కావేరీ తీరాన గల తిరువయ్యారుకు మరలిపోయారు.

తిరువయ్యారు దేవాలయానికి వెళ్ళే దోవలో బాల త్యాగరాజు శరభోజీ మహారాజు ఆస్థాన విద్వాంసుడైన శొంఠి వెంకటరామయ్య తన శిష్యులకు బోధించే సంగీత పాఠాలను క్రమం తప్పకుండా శ్రద్ధగా వింటుండేవాడు. ఆ చిన్నారి ప్రతిభ గమనించిన వెంకటరామయ్య అతణ్ణి తన శిష్యుడిగా స్వీకరించాడు. భగవంతుడిని చేరడానికి సంగీతము వినా సన్మార్గము గలదే అన్న ప్రగాఢ విశ్వాసం బాల త్యాగయ్యలో ప్రోది చేసుకుంది. అదే సమయంలో రామకృష్ణానంద స్వామి అనే సాధువు ఆ బాలుడికి తారక మంత్రమైన రామ నామ దీక్షనిచ్చారు. రామ నామాన్ని కోటి సార్లు జపించిన త్యాగయ్యకు సాక్షాత్తూ శ్రీరాముడే దర్శనమిచ్చాడనీ… ఆ ఆనంద పారవశ్యంలో త్యాగయ్య రాముడిని తన గాన రసామృతంతో అర్చించాడనీ… నాటి నుంచీ త్యాగరాజు వాగ్గేయకారుడయ్యాడనీ ఓ కథనం. మరో కథనం ప్రకారం త్యాగరాజు భక్తి శ్రద్ధలకు ముగ్ధుడయిన నారదుడే స్వయంగా ఆయనకు సంగీతం నేర్పించాడట. ఏది ఏమయినా తెలుగులో వాగ్గేయకారుడిగా త్యాగరాజుది ఆచంద్రతారార్కం నిలిచి ఉండే చిరస్థాయి.

త్యాగరాజు రామ భక్తి అచంచలమైనది. తన సంగీతాన్ని మనుజేశ్వరాధములకు గాక శ్రీరామచంద్రమూర్తికే అంకితం చేసిన మహోదాత్తశీలి ఆయన. ఉదయం లేచినప్పటినుంచీ రాత్రి విశ్రమించేవరకూ త్యాగరాజు జీవితం ఆ రాముడితోనే. అందుకే త్యాగయ్య రామయ్యను ప్రార్థిస్తాడు, వేడుకుంటాడు, కష్టాలూ కన్నీళ్ళూ పంచిపెడతాడు, కొన్నిసార్లా రాముడికే ఫిర్యాదులూ చేస్తాడు. తన సోదరుడు ధనాశతో రాజాశ్రయానికి బలవంతపెట్టినపుడు నిధి చాల సుఖమా రాముని సన్నిధి సుఖమా అని రాముణ్ణే ప్రశ్నించిన అమాయకుడు త్యాగరాజు.

భక్తి వినా సన్మార్గము లేదని ప్రకటించిన త్యాగరాజ కృతులు ప్రధానంగా రామ నామ రసాయనాన్ని పంచిపెట్టాయి. ఐతే కృష్ణలీలలే ప్రధాన ఇతివృత్తంగా నౌకా చరితం, నారసిమ్హ కథ ఆధారంగా ప్రహ్లాద భక్తి విజయం అనే సంగీత రూపకాలనూ సృజించారు. కోవూరు సుందరేశ్వర స్వామి, త్రిపురసుందరీదేవి అమ్మవార్ల వైభవాన్ని కీర్తిస్తూ కీర్తనలు స్వరపరిచారు. కాంచీపురంలో కామాక్షీ వరదరాజులను సంగీతంతో సమర్చించారు. ఇంక తెలుగు వారి ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరుడి పాదపద్మాలను చేరుకోవాలన్న ఆతృతలో వేళ కాని వేళ స్వామి దరిని పాడిన తెర తీయగ రాదా… బహుళ జనాదరణ పొందిన కీర్తన.

త్యాగరాజు భౌతిక జీవన వివరాలను పరిశీలిస్తే ఆ సంగీత సార్వభౌముడు భవ బంధాల నుంచి విముక్తుడైన తీరు ఆశ్చర్యదాయకం. ఆయనకు 18వ యేట పార్వతితో వివాహమైంది. ఆమె అకాల మరణానంతరం ఆమె సోదరి కనకాంబను పెండ్లాడారు. వారి ఏకైక కుమార్తె సీతమ్మకు పుట్టిన ఒకే ఒక సంతానం నిస్సంతుగానే మరణించారు. దాంతో త్యాగరాజు కుటుంబం అస్తిత్వమే లేకుండా పోయింది. ఒక రకంగా…. ఆయన సంగీత పరివారం తప్ప ఆయన కుటుంబపుటునికి లేకుండా పోవడమూ… త్యాగరాజు వాగ్గేయకారత్వాన్ని అమరం చేయడానికి ఆయన కొలిచిన రాముడే చేసిన లీలేనేమో.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: