సంకల్ప బలం ఎలియాస్ స్టీఫెన్ హాకింగ్

“అత్యంత అరుదైన ఈ వ్యాధి నిన్ను రెండేళ్ళలో చంపేస్తుంది” అని రెండు పదులు దాటిన ఆ యువకుడికి వైద్యులు చెప్పి ఐదు దశాబ్దాలు దాటింది. పాతికేళ్ళ వయసు చూడలేడనుకున్న స్టీఫెన్ హాకింగ్ నేడు డెబ్భయ్యో పడిలో పడ్డాడు. అది వైద్య రంగానికి సవాల్ కాదు… ఆ యువకుడి సంకల్ప బలం… భౌతిక శాస్త్రానికి అంది వచ్చిన వరం.

మోటార్ న్యూరాన్ వ్యాధితో వొళ్ళంతా చచ్చుబడిపోయిన దశలో హాకింగ్ శరీరంలో పని చేసిన, చేస్తున్న భాగం ఒకే ఒక్కటి… మెదడు. ప్రాయోగిక భౌతిక శాస్త్రంలో (థియొరిటికల్ ఫిజిక్స్) ఐన్‌స్టీన్ తర్వాత అంత గొప్పగా హాకింగ్ నిలబడడానికి కారణం ఆ మెదడే. కాస్మాలజీ, క్వాంటం గ్రావిటీ అంశాల్లో… ప్రత్యేకించి కృష్ణ బిలాల విషయంలో హాకింగ్ పరిశోధనలు అమూల్యాలు.

ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కృష్ణబిలాలు రోదసిలో తమను సమీపించే ప్రతీ పదార్ధాన్నీ మింగేస్తాయి. బ్లాక్‌హోల్‌లో ప్రవేశించిన కాంతి కనీసం ఒక్క రవ్వైనా బైటపడలేదు. పరిమాణంతో సంబంధం లేకుండా వాటి స్వభావం ఎప్పుడైనా ఒక్కలాగే ఉంటుంది.

ఐన్‌స్టీన్ సిద్ధాంతానికి కొనసాగింపుగా రాబర్ట్ పెన్‌రోజ్‌తో కలిసి పరిశోధనలు చేశాడు హాకింగ్. సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా సంక్లిష్ట గణిత నమూనా రూపొందించాడు. దానితోనే 1970లో సింగ్యులారిటీ థీరం నిరూపించాడు. స్థల కాల తలంలో గ్రావిటేషనల్ సింగ్యులారిటీ ఉంటుందని చెబుతుందా సిద్ధాంతం. సాధారణంగా ప్రత్యేక దృష్టాంతంగా మాత్రమే ఉంటుందని భావించే సింగ్యులారిటీ… స్వతంత్రంగానూ మనికిలో ఉంటుందని వివరించాడు హాకింగ్. అనంతర కాలంలో… కృష్ణబిలాలకు ద్రవ్యరాశి, విద్యుదావేశం, యాంగ్యులర్ మొమెంటం అనే మూడు లక్షణాలుంటాయని ప్రతిపాదించిన జాన్ వీలర్ “నో హెయిర్ థీరం”కి గణిత నిరూపణ అందించాడు.

సృష్టి ఆవిర్భావానికి మూలమని భావిస్తున్న బిగ్‌బ్యాంగ్ సమయంలోనే ప్రాథమిక స్థాయి బ్లాక్‌హోల్స్ ఏర్పడ్డాయని హాకింగ్ సూచించాడు. బ్లాక్‌హోల్ మెకానిక్స్‌కి నాలుగు నియమాలనూ ప్రతిపాదించాడు. 1974లో…. కృష్ణబిలాలు పరమాణు ఉపకణాలను సృష్టించి, ప్రసారం చేస్తాయని గణించాడు. కృష్ణబిలాల నుంచి కూడా రేడియేషన్ వెలువడుతుందనీ, ఆ కణాలు తమలోని శక్తి అంతా వెలువరించేసి ఆవిరైపోతాయనీ చెప్పే ఈ పరిశోధన… సంచలనమే. ఈ సిద్ధాంతం విషయంలోనే తన సహచర శాస్త్రవేత్తతో బెట్ కూడా కట్టి… తర్వాత కాలంలో… తన పరిశీలనల్లో కొన్ని తప్పులున్నాయని ఒప్పుకున్నాడు కూడా.

తొలుత బిగ్‌బ్యాంగ్ సింగ్యులారిటీని అంగీకరించిన హాకింగ్, అనంతరం… స్థల కాల తలంలో విశ్వానికి హద్దులు లేవని వివరించే నమూనా రూపొందించాడు. విశ్వాం క్లోజ్డ్‌గా ఉన్నప్పుడే అలా ఉంటుందని ముందు భావించినా… క్లోజ్డ్‌గా లేనప్పుడు కూడా దానికి హద్దులుండవని పరిశీలించాడు.

తాజాగా 2006లో… సెర్న్‌లో చేసిన పరిశీలనల ఆధారంగా టాప్ డౌన్ కాస్మాలజీ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విశ్వం, ఆవిర్భావ సమయంలో ఒకే దశలో లేదనీ… అందువల్ల నిర్దిష్ట ప్రాథమిక దశను ఊహించి దాని ప్రస్తుత రూపాన్ని సూత్రీకరించే ప్రయత్నాలు తగవనీ చెప్పుకొచ్చాడు. అంతే కాదు… మన ఈ విశ్వానికి ఆవల మరెన్నో విశ్వాలూ ఉండగల సంభావ్యత ఉందనీ ప్రతిపాదించాడు.

తన ప్రఖ్యాత రచన “ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం”లో… అత్యంత మౌలికమైన ప్రకృతి సూత్రాలను కనుగొన్నప్పుడే శాస్త్రవేత్తలు భగవంతుడి మనసులో ఉన్నదేంటో కనుగొనగలరని చెప్పిన హాకింగ్… విశ్వాన్ని సృష్టించినది దేవుడు కాదని 2010 సెప్టెంబర్‌లో స్పష్టంగా ప్రకటించాడు. మౌలిక కణాలు అన్నిటి స్వభావాన్నీ వివరించే సరికొత్త “ఎం-థియరీ”… విశ్వం పుట్టుక కారణాలనూ చెప్పగలదని ఆ భావన. అప్పుడు శాస్త్రానికి దైవం అవసరం ఉండబోదన్నది హాకింగ్ తాజా వివరణ.

తాను ప్రతిపాదించిన సిద్ధాంతం తప్పు అని కనుగొని… దానికి తనే మరో రూపం ఇవ్వడం హాకింగ్‌కు పరిపాటే. పరమాణు ఉపకణాల గురించి తాజాగా జరుగుతున్న పరిశోధనలపై ఆయన భావనలేంటో తెలవాల్సి ఉంది. న్యూట్రినోలు కాంతి వేగాన్ని అధిగమించగలుగుతుండడంపై హాకింగ్ ఏమంటాడో వేచి చూడాల్సిందే.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: