అరుణమూ కాషాయమూ భాయీ భాయీ?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (ఆగస్ట్‌ 3) నాడు నేపాల్‌ వెడుతున్నారు. హిమాలయ సానువుల్లోని ఈ చిన్న దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటించడం 17ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి. అంతకంటె విశేషం… నేపాల్‌ పార్లమెంటులో ప్రసంగించనున్న మొట్టమొదటి విదేశీ నేత కూడా మోదీయే. తర్వాత సోమవారం పశుపతినాథుణ్ణి దర్శనం చేసుకుంటారు. ప్రధాని నేపాల్ పర్యటన వల్ల ఆ దేశానికి ఉపయోగం ఉంటుందేమో తప్ప భారత్‌కు నిర్దిష్టమైన ప్రయోజనం ఏమీ ఉండదు. కాకపోతే చైనాను ఎదుర్కొనే క్రమంలో ఇలాంటి చిన్నదేశాల అవసరం బాగానే ఉండవచ్చు. అది వేరే కథ. ఈ మోదీ నేపాల్ పర్యటన గురించి టెలిగ్రాఫ్‌ పత్రిక ఓ ఆసక్తికరమైన కథనం వెలువరించింది.

ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన హిందుత్వవాది నరేంద్ర మోదీ కోసం నేపాల్‌లో ఓ అనూహ్య స్నేహ హస్తం ఎదురు చూస్తోందట. నేపాలీ మావోయిస్టుల అరుణ పతాకం… కాషాయ పతాకాన్ని కౌగలించుకోడానికి తహతహలాడుతోందట. మోదీ పర్యటన నేపథ్యంలో టెలిగ్రాఫ్‌ పత్రిక నేపాల్ మావోయిస్టు నాయకుడు, నేపాల్ మాజీ ప్రధానమంత్రి బాబూరామ్‌ భట్టరాయ్‌తో మాట్లాడింది. మోదీ సంఘ్‌ నేపథ్యం గురించి, హిందుత్వ విధానాల గురించీ మాకు స్పష్టంగా తెలుసు. ఐతే మేం ఆయనను నవతరానికి చెందిన అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నాయకుడిగానే చూస్తున్నాం అన్నారు భట్టరాయ్‌. మోడీ చాలా చురుకైన వాడు, శక్తివంతుడు. మన పనితీరును మార్చేయగల సామర్థ్యం ఉందాయనకు. మోడీ తన పార్టీలో మిగతా అందరినీ దాటుకుంటూ ఎదిగిన తీరు అతనిలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. అతన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చూస్తున్నానన్నారు బాబూరామ్‌ భట్టరాయ్‌.

చిత్రమేమంటే.. మోడీ వివాదాస్పద గతం గురించి, రాజకీయ నేపథ్యం గురించీ పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదన్నట్టే భావించారాయన. ఆ అంశాలపై చర్చను పక్కకు నెట్టి… దక్షిణాసియాకు ప్రతినిథిగా బలమైన నాయకుడిగా మోడీ ఎదిగే అవకాశాల గురించి భట్టరాయ్‌ అంచనా వేస్తున్నారు. దక్షిణాసియా రాజకీయాల్లో మోదీ ఓ కొత్త శకానికి ప్రతీక అన్నారాయన. నేపాలీ మావోయిస్టులు కొత్త రాజకీయాలు, కొంగొత్త ఆశయాలు, సరికొత్త పనివిధానాలను ప్రతిబింబిస్తున్నారని భట్టరాయ్‌ వివరించారు. అందువల్లే… మోడీ ఏ విషయాన్నయినా ఏ విధంగా ముందుకు తీసుకువెడతారోనని ఆసక్తి చూపిస్తున్నారు భట్టరాయ్‌. నేపాల్ మావోయిస్టు నాయకుడు తమ సైద్ధాంతిక భావజాలానికి పూర్తి విరుద్ధమైన భావజాలం కలిగిన మోదీపై పూర్తి విశ్వాసం ఉంచడాన్ని నేపాలీలు వైరుధ్యంగా పరిగణించడం లేదు.

మరోవైపు నేపాలీ రాజకుటుంబమైతే మోడీ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొంతకాలంగా నేపాల్‌లో పక్కకు పెట్టివేయబడుతున్న రాజకుటుంబీకులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నేపాల్‌ను (మెల్లగానే అయినా) గణతంత్ర రాజ్యంగా మారుస్తున్న ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న రాజవంశీకులు… ఆ విధానాన్ని తప్పించుకోవాలని భావిస్తున్న రాజవంశీకులు… ఇండియాలో హిందుత్వ ప్రభుత్వం రావడంతో ఆశలు పెంచుకుంటున్నారు. తమ దేశంలో హిందూ రాజరికాన్ని మళ్ళీ తెచ్చేందుకు భారతదేశం తప్పక సహకరిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు.

అసలా ఆలోచన ఎలా ఆచరణసాధ్యమవుతుందని రాజవంశీకులు అనుకున్నారో తెలీదు కానీ భట్టరాయ్‌ అండ్‌ కో మాత్రం దాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నారు. అలాంటి ఆలోచనలను ప్రోత్సహించవద్దంటూ అప్పుడే మోదీకి సూచించారు కూడా. నేపాల్‌లో రాజరికాన్ని పునరుద్ధరించే ఏ చర్యయినా అరాచకానికి దారితీస్తుంది.. దానివల్ల ఇన్నాళ్ళ ప్రజోద్యమాల ఫలితంగా చేకూరిన లబ్ధి నశించిపోతుంది… నేపాలీ ప్రజల సంక్షేమానికి అవరోధంగా మారుతుంది… అలాంటి పరిస్థితి భారత్‌ స్వీయ అవసరాలకు కూడా విఘాతకరం కాగలదని మోడీ అర్ధం చేసుకుంటారు… ఫెడరల్‌ రిపబ్లిక్‌గా ఏర్పడే క్రమంలో నేపాల్‌కు ప్రాదేశికంగా అవాంతరాలు కలిగే ఎలాంటి చర్యలకూ మోదీ పాల్పడబోరు…. అని భట్టరాయ్‌ చెప్పారు.

భారత్‌తో మైత్రి విషయంలో నేపాలీ మావోయిస్టులు అసంతృప్తికి లోనై మరోసారి ఆయుధాలు పట్టుకుంటారా అని ప్రశ్నించినప్పుడు భట్టరాయ్‌ నవ్వేశారు. తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నేపాల్‌లో సాయుధ పోరాటాన్ని అణచివేసినట్టు… బహుళ పార్టీల ప్రజాస్వామ్య విధానానికి తెర తీసినట్టూ భట్టరాయ్‌ వివరించారు. దాన్నుంచి తాము మళ్ళీ సాయుధ పోరాటం దశకు వెనక్కి మళ్ళుతామన్న అనుమానాలు వద్దన్నారు సామాజిక, రాజకీయ సంస్కరణల అమలు నుంచి వెనక్కు మళ్ళి తుపాకీ గొట్టాలకు మళ్ళే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

నేపాలీ మావోయిస్టుల ఈ వైఖరికి భారతీయ మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఎలా స్పందిస్తారో మరి.

Leave a comment